ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంకును ప్రారంభిస్తున్న మోదీ, టెలికాం మంత్రి మనోజ్
న్యూఢిల్లీ: ఇష్టమొచ్చినట్లుగా రుణాలు మంజూరుచేసి గత యూపీఏ ప్రభుత్వం భారత ఆర్థిక వ్యవస్థను ప్రమాదకర స్థితిలోకి నెట్టిందని ప్రధాని మోదీ ధ్వజమెత్తారు. నిరర్థక ఆస్తుల పాపం మన్మోహన్ ప్రభుత్వానిదే అని మండిపడ్డారు. నామ్‌దార్(గాంధీ కుటుంబాన్ని ఉద్దేశించి)లు ఫోన్‌లు చేసిన వెంటనే, వారి సన్నిహిత వ్యాపారులకు భారీగా రుణాలు మంజూరయ్యాయని ఆరోపించారు. ఇలా ‘ఫోన్‌కొక లోన్’ చొప్పున యూపీఏ హయాంలో భారీ కుంభకోణం జరిగిందని, దీంతో మొండిబకాయిలు పెరిగాయన్నారు. రుణ ఎగవేతదారుల నుంచి ప్రతి పైసా వసూలు చేస్తామని హామీనిచ్చారు. యూపీఏ ప్రభుత్వం ల్యాండ్‌మైన్‌పై ఉంచిన ఆర్థిక వ్యవస్థను కుదుటపరిచేందుకు పలు చర్యలు తీసుకున్నామని తెలిపారు. ఢిల్లీలో శనివారం ఇండియా పోస్ట్ పేమెంట్స్æ బ్యాంక్(ఐపీపీబీ)ని ప్రారంభించాక మోదీ మాట్లాడారు. సుమారు రూ.1.75 లక్షల కోట్ల నిర్థరక ఆస్తులుగా మిగిలిపోయిన రుణాల్లో ఏదీæ ఎన్డీయే హయాంలో మంజూరు కాలేదని తెలిపారు.
బ్యాంకులను దోచుకున్నారు..
తిరిగిరాని మొండిబకాయిలను యూపీఏ ప్రభుత్వం దాచిపెట్టిందని, తామొచ్చి వాటిని గుర్తించి రుణ ఎగవేతదారులపై కఠిన చర్యలు తీసుకునేందుకు చట్టాలు చేశామన్నారు. నిరర్థక ఆస్తులను యూపీఏ రూ.2.5 లక్షల కోట్లుగా ప్రకటించి దేశాన్ని మోసం చేసిందని, వాటి విలువ రూ.9 లక్షల కోట్లని తెలిపారు. 2008–14 కాలంలో బ్యాంకు రుణాలు రూ.52 లక్షల కోట్లకు పెరిగాయని, అంతకుముందు ఈ రుణాలు రూ.18 లక్షల కోట్లేనన్నారు. ‘నిబంధనలు పాటించకుండా రుణాలిచ్చారు. రుణాల పునర్ వ్యవస్థీకరణ పేరిట మరిన్ని రుణాలిచ్చారు. నామ్‌దార్‌ల నుంచి వచ్చిన ఒక్క ఫోన్‌కాల్‌తో వారి సన్నిహిత వ్యాపారవేత్తలు భారీగా రుణాలు పొందారు. బ్యాంకుల ఉన్నతాధికారులను నియమించేది నామ్‌దార్‌లే కాబట్టి, వారి మాటకు తిరుగేలేద’ అని మోదీ అన్నారు.
ఎమ్మెల్యే అయ్యాకే ఖాతా తెరిచా..
ఎమ్మెల్యే అయ్యే వరకు తనకు క్రియాశీల బ్యాంకు ఖాతా లేదని మోదీ అన్నారు. చిన్నతనంలో బ్యాంకులో వేసేందుకు తగినంత నగదు లేకపోవడమే అందుకు కారణమన్నారు. పాఠశాల రోజుల్లో విద్యార్థులకు దేనా బ్యాంకు ఖాతా ఇచ్చిందని, కానీ తన వద్ద నగదు లేకపోవడంతో ఆ ఖాతాను ఖాళీగా ఉంచినట్లు గుర్తుచేసుకున్నారు. చివరకు 32 ఏళ్ల తరువాత బ్యాంకు అధికారులు తన వద్దకు వచ్చి ఖాతాను మూసేసేందుకు సంతకం తీసుకున్నారని చెప్పారు. ఎమ్మెల్యే అయ్యాక జీతం తీసుకునేందుకు ఖాతాను తెరిచానన్నారు.
ముంగిట్లోకి బ్యాంకింగ్
న్యూఢిల్లీ: సుమారు 1.55 లక్షల తపాలా శాఖలు, 3 లక్షల మంది పోస్ట్‌మెన్, గ్రామీణ్ డాక్ సేవక్‌లతో బ్యాంకింగ్ సేవలను ప్రతి ఇంటికీ, ఆర్థిక సమ్మిళిత వృద్ధికి తోడ్పడటానికి ప్రారంభించినదే ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్(ఐపీపీబీ). ఈ బ్యాంకు సేవలు ఇతర సాధారణ బ్యాంకుల మాదిరిగానే ఉన్నా కార్యకలాపాలు తక్కువ స్థాయిలో ఉంటాయి. ఐపీపీబీలో ముందస్తు రుణాలు(అడ్వాన్స్‌డ్ లోన్స్), క్రెడిట్ కార్డుల వంటి సేవలు లేవు. రూ.1 లక్ష వరకున్న డిపాజిట్లనే అంగీకరిస్తారు.
ఐపీపీబీ విశేషాలు..
► ఇతర బ్యాంకుల మాదిరిగానే విదేశాల నుంచి నగదు బదిలీ, మొబైల్ చెల్లింపులు, ట్రాన్స్‌ఫర్స్, ఏటీఎం, డెబిట్ కార్డులు, నెట్ బ్యాంకింగ్, థర్డ్‌పార్టీ ఫండ్ ట్రాన్స్‌ఫర్స్ తదితర సేవలు అందిస్తాయి.
► డిపాజిట్లపై 4 శాతం వడ్డీ చెల్లిస్తారు.
► వినియోగదారుడి ఇంటి వద్దకే వచ్చి పోస్ట్‌మన్ సేవింగ్స్, కరెంట్ ఖాతాలను తెరుస్తాడు.
► రుణాలు, బీమా వంటి థర్డ్‌పార్టీ సేవలందించేందుకు పంజాబ్ నేషనల్ బ్యాంక్, బజాజ్ అలియాన్జ్ జీవిత బీమా కంపెనీతో ఒప్పందం కుదుర్చుకుంది.
► రూ.1 లక్ష మించే డిపాజిట్లను ఆటోమేటిక్‌గా పొదుపు ఖాతాలుగా మార్చుతారు.
► కౌంటర్ సేవలు, మైక్రో ఏటీఎంలు, మొబైల్ బ్యాంకింగ్ యాప్, మెసేజింగ్, ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్ సేవలు అందుబాటులో ఉంటాయి.
► ఆధార్ సాయంతోనే ఖాతాలు తెరుస్తారు. ఖాతాదారుడి గుర్తింపు ధ్రువీకరణ, చెల్లింపులు, లావాదేవీలకు క్యూఆర్ కోడ్, బయోమెట్రిక్స్‌ను ఉపయోగిస్తారు.
► లావాదేవీలు నిర్వహించేందుకు గ్రామీణ్ డాక్ సేవక్‌లకు స్మార్ట్‌ఫోన్‌లు, బయోమెట్రిక్ పరికరాలను సమకూరుస్తారు.
► ఈ బ్యాంకులో వంద శాతం వాటా ప్రభుత్వానిదే. ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్, పేటీఎం పేమెంట్స్ బ్యాంక్‌లతో పోటీపడేలా ఐపీపీబీ మూలధన వ్యయాన్ని కేంద్రం ఇటీవలే 80 శాతం పెంచింది.
► ఐపీపీబీ సేవలు తొలుత 650 తపాలా శాఖలు, 3,250 యాక్సెస్ పాయింట్లలో ప్రారంభమయ్యాయి. ఈ ఏడాదిచివరికల్లా దేశంలోని అన్ని శాఖలకు విస్తరిస్తారు.
► గ్రామీణ ప్రాంతాల్లో 1.30 లక్షల యాక్సెస్ పాయింట్లు నెలకొల్పనున్నారు.
► 17 కోట్ల పోస్టల్ సేవింగ్స్ ఖాతాలను ఐపీపీబీ ఖాతాలతో అనుసంధానం చేయడానికి అనుమతి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment