Loans Grant
-
కేసీసీ హోల్డర్లకు రుణాలివ్వండి
న్యూఢిల్లీ: గ్రామీణ ప్రాంతాల ప్రజల ఆదాయాలకు ఊతమిచ్చే దిశగా కిసాన్ క్రెడిట్ కార్డు (కేసీసీ) హోల్డర్లకు రుణాల లభ్యతలో ఇబ్బందులు లేకుండా, సజావుగా ఉండేలా చూడాలని ప్రభుత్వ రంగ బ్యాంకులకు (పీఎస్బీ) కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సూచించారు. అలాగే ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు (ఆర్ఆర్బీ) టెక్నాలజీని మెరుగుపర్చుకునేందుకు తోడ్పాటు కూడా అందించాలని పేర్కొన్నారు. గురువారం పీఎస్‌బీల సీఈవోలతో భేటీలో ఆమె ఈ మేరకు సూచనలు చేశారు. ఈ సమావేశంలో కేసీసీ స్కీమును సమీక్షించడంతో పాటు మత్స్య, పాడి పరిశ్రమకు సంస్థాగత రుణాల లభ్యత తదితర అంశాలపై చర్చించినట్లు కేంద్ర మత్స్య, పశు సంవర్ధక, డైరీ శాఖ మంత్రి పర్షోత్తం రూపాలా తెలిపారు. మరోవైపు, డిజిటలీకరణలో ఆర్ఆర్బీలకు స్పాన్సర్ బ్యాంక్ తగు సహకారం అందించాలని నిర్ణయించినట్లు ఆర్థిక శాఖ సహాయ మంత్రి భగవత్ కె కరాడ్ వివరించారు. -
పెళ్లి చేసుకోవడానికి, పిల్లలను కనడానికి లక్షల్లో రుణాలు!
Special Loans To Urge Couples To Have Babies: చైనా ఈశాన్య ప్రాంతంలోని జిలిన్ ప్రావిన్స్ వివాహం చేసుకోవడానికి, పిల్లలను కనడాన్ని ప్రోత్సహిస్తూ ప్రత్యేక రుణాలను అందజేస్తోంది. అంతే కాదు దాదాపు రూ.23 లక్షలు వరకు రుణాలు ఇచ్చేలా అక్కడి ప్రభుత్వం బ్యాంకులకు మద్దతు ఇచ్చింది. అంతేకాదు పిల్లల సంఖ్యనుబట్టి తక్కువ వడ్డీతో కూడిన రుణాలు పొందే వెసులుబాటు కూడా కల్పించింది. అయితే కొంతమంది జనాభా శాస్త్రవేత్తలు జిలిన్ ప్రావిన్స్‌లో జనాభా ఇప్పటికే తగ్గిపోవచ్చని అంచనా వేశారు. (చదవండి: ఒక్క అంకె తప్పుగా ఇవ్వడంతో ఆ మహిళకు 4,500 మిస్డ్ కాల్స్!) దీంతో జిలిన్ ప్రావిన్స్ జనాభా పెరుదలను ప్రోత్సహించే చర్యలు చేపట్టింది. అంతేకాదు ఆ చర్యల్లో భాగంగా ఇతర ప్రావిన్స్‌ల నుండి జంటలు నివాసం పొందేందుకు అనుమతిచ్చింది. అయితే ఇలా అనుమతి పొందడాన్ని అక్కడ హుకౌ అని పిలుస్తారు. పైగా వారికి పిల్లలు ఉంటే వారు పబ్లిక్ సేవలు పొందేలా నమోదు చేసుకోవడం వంటి వెసులుబాటు కల్పించింది. ఈ మేరకు ఇద్దరు లేదా ముగ్గురు పిల్లలు ఉన్న జంటలు చిన్న వ్యాపారాన్ని ఏర్పాటు చేసుకుంటే వారికి పన్ను రాయితీలు కూడా కల్పిస్తోంది. అయితే జిలిన్ ప్రావిన్స్ చైనా"రస్ట్ బెల్ట్" ప్రాంతంలోని భాగం. ఈ ప్రాంతం వ్యవసాయ పరంగా బాగా ప్రసిద్ధి చెందింది. అయితే ఈ ప్రావిన్స్ గత కొన్ని సంవత్సరాలుగా అధ్వానమైన జనాభా క్షీణత, ఆర్థికవృద్ధిలో మందగమనాన్ని చవి చూసింది. అంతేకాదు ఇతర ప్రావిన్సుల మాదిరిగానే, జిలిన్ కూడా ప్రసూతి, పితృత్వ సెలవులను పొడిగించింది. అయితే ఈ ఏడాది ప్రారంభంలో జియాంగ్జీలోని ఆగ్నేయ ప్రావిన్స్‌లోని బ్యాంక్ ఆఫ్ చైనా బ్రాంచ్ బిడ్డను కలిగి ఉన్న జంటలను లక్ష్యంగా చేసుకుని రుణాలను ప్రోత్సహించడంపై విస్తృత విమర్శలను ఎదుర్కొంది. ఆ తర్వాత బ్యాంకు ఉత్పత్తికి తగ్గ డిమాండ్ లేదని భావించి ప్రారంభించకూడదని నిర్ణయించుకున్నట్లు స్థానిక మీడియాకి తెలిపింది. (చదవండి: చైనా సైబర్‌స్పేస్ చివరి యుద్ధం!...ఇంటర్నెట్ క్లీన్ అప్!!) -
యూపీఏలో ‘ఫోన్కో లోన్’
న్యూఢిల్లీ: ఇష్టమొచ్చినట్లుగా రుణాలు మంజూరుచేసి గత యూపీఏ ప్రభుత్వం భారత ఆర్థిక వ్యవస్థను ప్రమాదకర స్థితిలోకి నెట్టిందని ప్రధాని మోదీ ధ్వజమెత్తారు. నిరర్థక ఆస్తుల పాపం మన్మోహన్ ప్రభుత్వానిదే అని మండిపడ్డారు. నామ్‌దార్(గాంధీ కుటుంబాన్ని ఉద్దేశించి)లు ఫోన్లు చేసిన వెంటనే, వారి సన్నిహిత వ్యాపారులకు భారీగా రుణాలు మంజూరయ్యాయని ఆరోపించారు. ఇలా ‘ఫోన్కొక లోన్’ చొప్పున యూపీఏ హయాంలో భారీ కుంభకోణం జరిగిందని, దీంతో మొండిబకాయిలు పెరిగాయన్నారు. రుణ ఎగవేతదారుల నుంచి ప్రతి పైసా వసూలు చేస్తామని హామీనిచ్చారు. యూపీఏ ప్రభుత్వం ల్యాండ్‌మైన్‌పై ఉంచిన ఆర్థిక వ్యవస్థను కుదుటపరిచేందుకు పలు చర్యలు తీసుకున్నామని తెలిపారు. ఢిల్లీలో శనివారం ఇండియా పోస్ట్ పేమెంట్స్æ బ్యాంక్(ఐపీపీబీ)ని ప్రారంభించాక మోదీ మాట్లాడారు. సుమారు రూ.1.75 లక్షల కోట్ల నిర్థరక ఆస్తులుగా మిగిలిపోయిన రుణాల్లో ఏదీæ ఎన్డీయే హయాంలో మంజూరు కాలేదని తెలిపారు. బ్యాంకులను దోచుకున్నారు.. తిరిగిరాని మొండిబకాయిలను యూపీఏ ప్రభుత్వం దాచిపెట్టిందని, తామొచ్చి వాటిని గుర్తించి రుణ ఎగవేతదారులపై కఠిన చర్యలు తీసుకునేందుకు చట్టాలు చేశామన్నారు. నిరర్థక ఆస్తులను యూపీఏ రూ.2.5 లక్షల కోట్లుగా ప్రకటించి దేశాన్ని మోసం చేసిందని, వాటి విలువ రూ.9 లక్షల కోట్లని తెలిపారు. 2008–14 కాలంలో బ్యాంకు రుణాలు రూ.52 లక్షల కోట్లకు పెరిగాయని, అంతకుముందు ఈ రుణాలు రూ.18 లక్షల కోట్లేనన్నారు. ‘నిబంధనలు పాటించకుండా రుణాలిచ్చారు. రుణాల పునర్ వ్యవస్థీకరణ పేరిట మరిన్ని రుణాలిచ్చారు. నామ్దార్ల నుంచి వచ్చిన ఒక్క ఫోన్‌కాల్‌తో వారి సన్నిహిత వ్యాపారవేత్తలు భారీగా రుణాలు పొందారు. బ్యాంకుల ఉన్నతాధికారులను నియమించేది నామ్దార్లే కాబట్టి, వారి మాటకు తిరుగేలేద’ అని మోదీ అన్నారు. ఎమ్మెల్యే అయ్యాకే ఖాతా తెరిచా.. ఎమ్మెల్యే అయ్యే వరకు తనకు క్రియాశీల బ్యాంకు ఖాతా లేదని మోదీ అన్నారు. చిన్నతనంలో బ్యాంకులో వేసేందుకు తగినంత నగదు లేకపోవడమే అందుకు కారణమన్నారు. పాఠశాల రోజుల్లో విద్యార్థులకు దేనా బ్యాంకు ఖాతా ఇచ్చిందని, కానీ తన వద్ద నగదు లేకపోవడంతో ఆ ఖాతాను ఖాళీగా ఉంచినట్లు గుర్తుచేసుకున్నారు. చివరకు 32 ఏళ్ల తరువాత బ్యాంకు అధికారులు తన వద్దకు వచ్చి ఖాతాను మూసేసేందుకు సంతకం తీసుకున్నారని చెప్పారు. ఎమ్మెల్యే అయ్యాక జీతం తీసుకునేందుకు ఖాతాను తెరిచానన్నారు. ముంగిట్లోకి బ్యాంకింగ్ న్యూఢిల్లీ: సుమారు 1.55 లక్షల తపాలా శాఖలు, 3 లక్షల మంది పోస్ట్‌మెన్, గ్రామీణ్ డాక్ సేవక్‌లతో బ్యాంకింగ్ సేవలను ప్రతి ఇంటికీ, ఆర్థిక సమ్మిళిత వృద్ధికి తోడ్పడటానికి ప్రారంభించినదే ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్(ఐపీపీబీ). ఈ బ్యాంకు సేవలు ఇతర సాధారణ బ్యాంకుల మాదిరిగానే ఉన్నా కార్యకలాపాలు తక్కువ స్థాయిలో ఉంటాయి. ఐపీపీబీలో ముందస్తు రుణాలు(అడ్వాన్స్డ్ లోన్స్), క్రెడిట్ కార్డుల వంటి సేవలు లేవు. రూ.1 లక్ష వరకున్న డిపాజిట్లనే అంగీకరిస్తారు. ఐపీపీబీ విశేషాలు.. ► ఇతర బ్యాంకుల మాదిరిగానే విదేశాల నుంచి నగదు బదిలీ, మొబైల్ చెల్లింపులు, ట్రాన్స్ఫర్స్, ఏటీఎం, డెబిట్ కార్డులు, నెట్ బ్యాంకింగ్, థర్డ్‌పార్టీ ఫండ్ ట్రాన్స్ఫర్స్ తదితర సేవలు అందిస్తాయి. ► డిపాజిట్లపై 4 శాతం వడ్డీ చెల్లిస్తారు. ► వినియోగదారుడి ఇంటి వద్దకే వచ్చి పోస్ట్‌మన్ సేవింగ్స్, కరెంట్ ఖాతాలను తెరుస్తాడు. ► రుణాలు, బీమా వంటి థర్డ్‌పార్టీ సేవలందించేందుకు పంజాబ్ నేషనల్ బ్యాంక్, బజాజ్ అలియాన్జ్ జీవిత బీమా కంపెనీతో ఒప్పందం కుదుర్చుకుంది. ► రూ.1 లక్ష మించే డిపాజిట్లను ఆటోమేటిక్‌గా పొదుపు ఖాతాలుగా మార్చుతారు. ► కౌంటర్ సేవలు, మైక్రో ఏటీఎంలు, మొబైల్ బ్యాంకింగ్ యాప్, మెసేజింగ్, ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్ సేవలు అందుబాటులో ఉంటాయి. ► ఆధార్ సాయంతోనే ఖాతాలు తెరుస్తారు. ఖాతాదారుడి గుర్తింపు ధ్రువీకరణ, చెల్లింపులు, లావాదేవీలకు క్యూఆర్ కోడ్, బయోమెట్రిక్స్‌ను ఉపయోగిస్తారు. ► లావాదేవీలు నిర్వహించేందుకు గ్రామీణ్ డాక్ సేవక్‌లకు స్మార్ట్ఫోన్లు, బయోమెట్రిక్ పరికరాలను సమకూరుస్తారు. ► ఈ బ్యాంకులో వంద శాతం వాటా ప్రభుత్వానిదే. ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్, పేటీఎం పేమెంట్స్ బ్యాంక్‌లతో పోటీపడేలా ఐపీపీబీ మూలధన వ్యయాన్ని కేంద్రం ఇటీవలే 80 శాతం పెంచింది. ► ఐపీపీబీ సేవలు తొలుత 650 తపాలా శాఖలు, 3,250 యాక్సెస్ పాయింట్లలో ప్రారంభమయ్యాయి. ఈ ఏడాదిచివరికల్లా దేశంలోని అన్ని శాఖలకు విస్తరిస్తారు. ► గ్రామీణ ప్రాంతాల్లో 1.30 లక్షల యాక్సెస్ పాయింట్లు నెలకొల్పనున్నారు. ► 17 కోట్ల పోస్టల్ సేవింగ్స్ ఖాతాలను ఐపీపీబీ ఖాతాలతో అనుసంధానం చేయడానికి అనుమతి ఉంది. -
బీసీ రుణాలకు బ్యాంకర్ల తిరకాసు
నిబంధనల పేరిట కొర్రీలు రుణం మంజూరైనా అందని డీడీ ఫెడరేషన్లకు 25 దరఖాస్తులే నేటితో ముగియనున్న గడువు బీసీ కార్పొరేషన్ రుణాల మంజూరీలో బ్యాంకర్ల నిబంధనలు లబ్దిదారులను ఇబ్బందులకు గురిచేస్తున్నారుు. చాలా చోట్ల బ్యాంకర్లు వ్యక్తిగత, ఫెడరేషన్ రుణాలకు సంబంధించిన కాన్సెంట్ , డీడీలు ఇవ్వడానికి నిబంధనల సాకుతో కొర్రీలు పెడుతున్నారని ఆరోపణలు వస్తున్నాయి. బీసీ కార్పొరేషన్ ద్వారా ప్రభుత్వం వ్యక్తిగత రుణాలతో పాటు వివిధ కుల ఫెడరేషన్లకు సబ్సిడీ రుణాలు మంజూరు చేసింది. వీటికి బ్యాంక్ కాన్సెంట్ తప్పనిసరి కావడంతో దరఖాస్తుదారులు కేటాయించిన బ్యాంక్‌ల చుట్టూ తిరుగుతున్నారు. కరీంనగర్ సిటీ : బెజ్జంకి మండల కేంద్రానికి చెందిన దొంతరవేని శ్రీనివాస్ డెయిరీ యూనిట్ కోసం బీసీ కార్పొరేషన్లో రూ.60వేల రుణానికి దరఖాస్తు చేసుకున్నారు. బ్యాంక్ కాన్సెంట్‌తో పాటు అవసరమైన సర్టిఫికెట్లను అందచేశాడు. రుణం మంజూరైనట్లు కలెక్టర్ పేరిట ఆర్సీ నెం.377/2014-15, తేదీ : 29/12/2014తో ప్రొసీడింగ్ జారీ అయింది. మూడు నెలల క్రితం శ్రీనివాస్‌కు సంబంధించిన నాన్ ఆపరేటింగ్ ఖాతాలో ప్రభుత్వం రూ.30 వేల సబ్సిడీని జమ చేసింది. దీనికి సంబంధిత బ్యాంక్ మేనేజర్ మోకాలొడ్డారు. హర్యానా గేదెనే కొనుగోలు చేయాలని, అక్కడికి వెళ్లి కొటేషన్ తెస్తేనే డీడీ ఇస్తానని షరతు విధించాడు. హర్యానాకు చెందిన ఒక్కో గేదె విలువనే సుమారుగా రూ.65 వేలు ఉంటుంది. అక్కడికి వెళ్లి గేదెను కొనుగోలు చేసి తీసుకురావడానికి మరో రూ.50 వేలు ఖర్చవుతుంది. అంటే రూ.60 వేల యూనిట్‌కు రూ.1.15 లక్షలు వెచ్చించాల్సిన పరిస్థితి. ఇదే విషయాన్ని శ్రీనివాస్ మేనేజర్‌ను కలిసి విన్నవిస్తే నిబంధనలు అలానే ఉన్నాయని, హర్యానా గేదె అరుుతేనే డబ్బులిస్తామని తెగేసి చెప్పారు. తాను స్థానికంగా కొనుగోలు చేస్తే రెండు గేదెలు వస్తాయని, రూ.60 వేల తో హర్యానాకు వెళ్లి గేదెను ఎలా కొనుగోలు చేయాలో తెలియక శ్రీనివాస్ అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తూనే ఉన్నాడు. ఫెడరేషన్లకు దరఖాస్తులేవీ.. బ్యాంకర్ల కఠిన వైఖరి కారణంగా వెనుకబడిన తరగతుల సమాఖ్య (ఫెడరేషన్) రుణాలకు దరఖాస్తులు రావడం లేదు. ఈ నెల 15వరకు దరఖాస్తుకు గడువున్నా, సోమవారం వరకు 25 దరఖాస్తులే వచ్చాయి. జిల్లావ్యాప్తంగా 498 యూనిట్లు మంజూరు కాగా, చాలా ఫెడరేషన్లకు కనీసం ఒక్క దరఖాస్తు కూడా రాలేదు. రజక, నాయూబ్రాహ్మణ, వడ్డెర, సగర(ఉప్పర), వాల్మీకి బోయ, కృష్ణబలిజ/పూసల, భట్రాజ, కుమ్మరి/శాలివాహన, మేదర, విశ్వబ్రాహ్మణ సహకార సంస్థలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. పదిహేను మంది సభ్యులతో గ్రూపు ఏర్పడితే ఆ గ్రూపునకు రూ.7.50 లక్షల రుణం అందచేస్తారు. ఇందులో 50 శాతం సబ్సిడీ అంటే రూ.3.75 లక్షల అందచేస్తారు. ఈ లెక్కన ఒక్కో సభ్యునికి రూ.25 వేలు రుణం, రూ.25 వేలు సబ్సిడీ వస్తుంది. 2014-15 సంవత్సరానికి రజక సమాఖ్యకు 128 యూనిట్లు, నాయూబ్రాహ్మణులకు 188, వడ్డెరలకు 15, భట్రాజులకు 32, మేదరులకు 35, వాల్మీకిబోయలకు 30, కుమ్మరి శాలివాహనులకు 10, కృష్ణబలిజ/పూసలకు 25, విశ్వబ్రాహ్మణులకు 25, సగర/ఉప్పరలకు 10 మొత్తం 498 యూనిట్లు జిల్లాకు మంజూరయ్యాయి. వీటికోసం ప్రభుత్వం రూ.18.67 కోట్లు విడుదల చేసింది. జిల్లాలోని అన్ని ప్రధాన బ్యాంక్‌లకు ఈ యూనిట్ల లక్ష్యం విధించారు. అయితే చాలా చోట్ల బ్యాంకర్లు కాన్సెంట్ ఇవ్వకపోవడంతోనే కనీస దరఖాస్తులు కూడా రావడం లేదని అధికారులు చెబుతున్నారు. శుక్రవారంతో గడువు ముగియనుండడంతో ఆశించిన స్థారుులో దరఖాస్తులు వచ్చే అవకాశం లేదని చెబుతున్నారు. జిల్లా ఉన్నతాధికారులు బ్యాంక్ అధికారులతో చర్చించి, ఆర్థిక వెనుకబాటును తొలగించేందుకు ప్రభుత్వం అందచేస్తున్న రుణాలు పొందేలా చూడాలని లబ్దిదారులు వేడుకుంటున్నారు. మైనారిటీ రుణాలకు నేడే గడువు మైనారిటీ కార్పొరేషన్ ద్వారా స్వయం ఉపాధి పథకాల కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడానికి శుక్రవారంతో గడువు ముగుస్తుందని ఈడీ ఎంఏ.హమీద్ తెలిపారు. బ్యాంక్ కాన్సెంట్ పొందిన దరఖాస్తులను సంబంధిత మున్సిపాలిటీ, నగరపంచాయతీ కమిషనర్లు, ఎంపీడీఓల లాగిన్ ద్వారా ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. వివరాలకు 0878-2233150 నెంబర్లో సంప్రదించాలన్నారు.