నిబంధనల పేరిట కొర్రీలు
రుణం మంజూరైనా అందని డీడీ
ఫెడరేషన్లకు 25 దరఖాస్తులే
నేటితో ముగియనున్న గడువు
బీసీ కార్పొరేషన్ రుణాల మంజూరీలో బ్యాంకర్ల నిబంధనలు లబ్దిదారులను ఇబ్బందులకు గురిచేస్తున్నారుు. చాలా చోట్ల బ్యాంకర్లు వ్యక్తిగత, ఫెడరేషన్ రుణాలకు సంబంధించిన కాన్సెంట్ , డీడీలు ఇవ్వడానికి నిబంధనల సాకుతో కొర్రీలు పెడుతున్నారని ఆరోపణలు వస్తున్నాయి. బీసీ కార్పొరేషన్ ద్వారా ప్రభుత్వం వ్యక్తిగత రుణాలతో పాటు వివిధ కుల ఫెడరేషన్లకు సబ్సిడీ రుణాలు మంజూరు చేసింది. వీటికి బ్యాంక్ కాన్సెంట్ తప్పనిసరి కావడంతో దరఖాస్తుదారులు కేటాయించిన బ్యాంక్‌ల చుట్టూ తిరుగుతున్నారు.
కరీంనగర్ సిటీ : బెజ్జంకి మండల కేంద్రానికి చెందిన దొంతరవేని శ్రీనివాస్ డెయిరీ యూనిట్ కోసం బీసీ కార్పొరేషన్‌లో రూ.60వేల రుణానికి దరఖాస్తు చేసుకున్నారు. బ్యాంక్ కాన్సెంట్‌తో పాటు అవసరమైన సర్టిఫికెట్లను అందచేశాడు. రుణం మంజూరైనట్లు కలెక్టర్ పేరిట ఆర్‌సీ నెం.377/2014-15, తేదీ : 29/12/2014తో ప్రొసీడింగ్ జారీ అయింది.
మూడు నెలల క్రితం శ్రీనివాస్‌కు సంబంధించిన నాన్ ఆపరేటింగ్ ఖాతాలో ప్రభుత్వం రూ.30 వేల సబ్సిడీని జమ చేసింది. దీనికి సంబంధిత బ్యాంక్ మేనేజర్ మోకాలొడ్డారు. హర్యానా గేదెనే కొనుగోలు చేయాలని, అక్కడికి వెళ్లి కొటేషన్ తెస్తేనే డీడీ ఇస్తానని షరతు విధించాడు.
హర్యానాకు చెందిన ఒక్కో గేదె విలువనే సుమారుగా రూ.65 వేలు ఉంటుంది. అక్కడికి వెళ్లి గేదెను కొనుగోలు చేసి తీసుకురావడానికి మరో రూ.50 వేలు ఖర్చవుతుంది. అంటే రూ.60 వేల యూనిట్‌కు రూ.1.15 లక్షలు వెచ్చించాల్సిన పరిస్థితి. ఇదే విషయాన్ని శ్రీనివాస్ మేనేజర్‌ను కలిసి విన్నవిస్తే నిబంధనలు అలానే ఉన్నాయని, హర్యానా గేదె అరుుతేనే డబ్బులిస్తామని తెగేసి చెప్పారు. తాను స్థానికంగా కొనుగోలు చేస్తే రెండు గేదెలు వస్తాయని, రూ.60 వేల తో హర్యానాకు వెళ్లి గేదెను ఎలా కొనుగోలు చేయాలో తెలియక శ్రీనివాస్ అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తూనే ఉన్నాడు.
ఫెడరేషన్లకు దరఖాస్తులేవీ..
బ్యాంకర్ల కఠిన వైఖరి కారణంగా వెనుకబడిన తరగతుల సమాఖ్య (ఫెడరేషన్) రుణాలకు దరఖాస్తులు రావడం లేదు. ఈ నెల 15వరకు దరఖాస్తుకు గడువున్నా, సోమవారం వరకు 25 దరఖాస్తులే వచ్చాయి. జిల్లావ్యాప్తంగా 498 యూనిట్లు మంజూరు కాగా, చాలా ఫెడరేషన్‌లకు కనీసం ఒక్క దరఖాస్తు కూడా రాలేదు.
రజక, నాయూబ్రాహ్మణ, వడ్డెర, సగర(ఉప్పర), వాల్మీకి బోయ, కృష్ణబలిజ/పూసల, భట్రాజ, కుమ్మరి/శాలివాహన, మేదర, విశ్వబ్రాహ్మణ సహకార సంస్థలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. పదిహేను మంది సభ్యులతో గ్రూపు ఏర్పడితే ఆ గ్రూపునకు రూ.7.50 లక్షల రుణం అందచేస్తారు. ఇందులో 50 శాతం సబ్సిడీ అంటే రూ.3.75 లక్షల అందచేస్తారు. ఈ లెక్కన ఒక్కో సభ్యునికి రూ.25 వేలు రుణం, రూ.25 వేలు సబ్సిడీ వస్తుంది.
2014-15 సంవత్సరానికి రజక సమాఖ్యకు 128 యూనిట్లు, నాయూబ్రాహ్మణులకు 188, వడ్డెరలకు 15, భట్రాజులకు 32, మేదరులకు 35, వాల్మీకిబోయలకు 30, కుమ్మరి శాలివాహనులకు 10, కృష్ణబలిజ/పూసలకు 25, విశ్వబ్రాహ్మణులకు 25, సగర/ఉప్పరలకు 10 మొత్తం 498 యూనిట్లు జిల్లాకు మంజూరయ్యాయి. వీటికోసం ప్రభుత్వం రూ.18.67 కోట్లు విడుదల చేసింది. జిల్లాలోని అన్ని ప్రధాన బ్యాంక్‌లకు ఈ యూనిట్ల లక్ష్యం విధించారు.
అయితే చాలా చోట్ల బ్యాంకర్లు కాన్సెంట్ ఇవ్వకపోవడంతోనే కనీస దరఖాస్తులు కూడా రావడం లేదని అధికారులు చెబుతున్నారు. శుక్రవారంతో గడువు ముగియనుండడంతో ఆశించిన స్థారుులో దరఖాస్తులు వచ్చే అవకాశం లేదని చెబుతున్నారు. జిల్లా ఉన్నతాధికారులు బ్యాంక్ అధికారులతో చర్చించి, ఆర్థిక వెనుకబాటును తొలగించేందుకు ప్రభుత్వం అందచేస్తున్న రుణాలు పొందేలా చూడాలని లబ్దిదారులు వేడుకుంటున్నారు.
మైనారిటీ రుణాలకు నేడే గడువు
మైనారిటీ కార్పొరేషన్ ద్వారా స్వయం ఉపాధి పథకాల కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి శుక్రవారంతో గడువు ముగుస్తుందని ఈడీ ఎంఏ.హమీద్ తెలిపారు. బ్యాంక్ కాన్సెంట్ పొందిన దరఖాస్తులను సంబంధిత మున్సిపాలిటీ, నగరపంచాయతీ కమిషనర్లు, ఎంపీడీఓల లాగిన్ ద్వారా ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. వివరాలకు 0878-2233150 నెంబర్‌లో సంప్రదించాలన్నారు.
బీసీ రుణాలకు బ్యాంకర్ల తిరకాసు
Published Fri, May 15 2015 12:11 AM | Last Updated on Sun, Sep 3 2017 2:02 AM
Advertisement