తూర్పు కార్పొరేషన్‌లో కుంభకోణం
Published Sat, Dec 21 2013 11:24 PM | Last Updated on Sat, Sep 2 2017 1:50 AM
న్యూఢిల్లీ: తూర్పు ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్‌లో భారీ కుంభకోణం వెలుగుచూసింది. గత 19 నెలలుగా రూ.25 కోట్లమేర అక్రమాలు జరిగిన విషయం బట్టబయలైంది. కార్పొరేషన్ వినియోగిస్తున్న ట్రక్కులు, లోడర్ల కోసం రూ.63.10 లీటర్ చొప్పున గత 19 నెలలుగా డీజిల్‌ను కొనుగోలు చేసినట్లు రికార్డులు చెబుతున్నాయి. అయితే ఇది మార్కెట్ ధరకంటే రూ.10.04 ఎక్కువ. అందులో కొన్ని ట్రక్కులు తిరగకపోయినా కూడా రోజుకు 50 లీటర్లు కొనుగోలు చేసినట్లు లెక్కలు చెబుతున్నాయి. దీంతో ఈ అక్రమాలకు బాధ్యులైన ఇద్దరు అధికారులకు వ్యతిరేకంగా చర్యలు తీసుకోవాల్సిందిగా కార్పొరేషన్ ఆదేశాలు జారీ చేసింది.
ఉత్తర ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్‌తో పోలిస్తే తూర్పు ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ కేవలం డీజిల్‌పైనే రూ.2.06 కోట్లు అధనంగా ఖర్చు చేసింది. నిజానికి మార్కెట్ ధరకంటే రూ.10.04 ఎక్కవ వెచ్చించి తూర్పు ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ నేరుగా చమురు కంపెనీల నుంచే డీజిల్‌ను కొనుగోలు చేస్తున్నట్లు పత్రాలు చూపుతున్నాయి.
ఈ విషయమై స్టాండింగ్ కమిటీ చైర్మన్ మెహక్ సింగ్ మాట్లాడుతూ... వాహనాల అద్దె విషయంలో కూడా అవకతకవకలు చోటుచేసుకున్నట్లు తెలిసింది. రూ.212 అద్దెను అదనంగా చెల్లిస్తున్నట్లు కూడా రికార్డుల్లో ఉంది. కార్పొరేషన్ పరిధిలోని వివిధ ప్రాంతాల నుంచి చెత్తను సేకరించి, ఘాజీపూర్ డంప్ యార్డుకు తరలించేందుకు ఈ ట్రక్కులను, లోడర్లను వినియోగిస్తారు. నిబంధనల ప్రకారం రీడింగ్‌లో నమోదైన కిలోమీటర్ల ప్రకారం ఇంధనాన్ని నింపుకోవాల్సి ఉంటుంది. అయితే అన్ని వాహనాలకు గంపగుత్తగా ప్రతిరోజూ 50 లీటర్ల డిజిల్‌ను నింపినట్లు రికార్డుల్లో పేర్కొన్నారు. ఇక వాహనాల అద్దె విషయంలో ఇంజనీర్-ఇన్ చీఫ్ మాత్రమే నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ జూనియర్ ఇంజనీర్లు, సూపరింటెండెంట్ ఇంజనీర్లు కూడా చొరవ తీసుకొని బిల్లులను చెల్లించారు. ఇది కార్పొరేషన్ నిబంధనలను ఉల్లంఘించడమే. వాహనాల విడిభాగాల విషయంలోనూ అక్రమాలు జరిగినట్లు తెలుస్తోంది. కొనుగోలు చేసిన విడిభాగాల నాణ్యత కూడా నాసిరకంగా ఉన్నట్లు స్పష్టమైంది.
చిత్రమేమిటంటే కొనుగోలు చేసిన విడిభాగాలను వాహనాలకు ఇంకా బిగించనేలేదు. ఇప్పటికీ మరమ్మతులకు నోచుకోకుండానే వాహనాలు తిరుగుతున్నాయి. అయినప్పటికీ మరమ్మతుల కోసం రూ.30 కోట్లు ఖర్చు చేసినట్లు లెక్కలు చూపుతున్నారు. ఇలా అన్ని అక్రమాల విలువ రూ. 25 కోట్లపైనే ఉంటుందని అంచనా వేస్తున్నామ’న్నారు.ఇదిలాఉండగా అక్రమాలకు పాల్పడిన ఇద్దరు అధికారులపై కార్పొరేషన్ చర్యలకు ఉపక్రమించిందని, వారిపై భారీ జరిమానా విధించే యోచనలో కమిషనర్ ఉన్నట్లు సమాచారం. ఈ అక్రమాల విషయాన్ని కమిషనర్ కుమారస్వామి కూడా అంగీకరించారు.
‘కార్పొరేషన్ అధికారులు తక్కువ ధరకే ఇంధనాన్ని కొనుగోలు చేసినట్లు రుజువైతే వారిపై చర్యలు తప్పవు. మిగతా కార్పొరేషన్లతో పోలిస్తే తూర్పు ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ పరిధి చాలా తక్కువ. దీంతో ఇంధన వినియోగం కూడా తక్కువగా ఉండాలి. కానీ దీనికి భిన్నంగా మిగతా కార్పొరేషన్ల కంటే ఇంధన ఖర్చు ఎక్కువగా ఉండడం అక్రమాలు జరిగాయన్న ఆరోపణలకు మరింత బలం చేకూరుస్తుయ’న్నారు. ఆరోపణలు నిజమని తేలితే అక్రమాలకు పాల్పడినవారిపై కచ్చితంగా చర్యలు తీసుకుంటామన్నారు. మిగతా విషయాల్లో కూడా ఏవైనా అక్రమాలు జరిగాయా అనే కోణాల్లో కూడా దర్యాప్తు జరిపేందుకు సంబంధిత విభాగాలకు ఆదేశాలు జారి చేస్తామని కమిషనర్ చెప్పారు.
Advertisement
Advertisement