land regularization process
-
‘క్రమబద్ధీకరణ’ గడువు పెంపుపై తర్జన భర్జన
సాక్షి, హైదరాబాద్: చెల్లింపు కేటగిరిలో భూముల క్రమబద్ధీకరణ ప్రక్రియకు మరోమారు గడువు పెంచే విషయమై రెవెన్యూ శాఖ ఉన్నతాధికారులు తర్జన భర్జన పడుతున్నారు. ఏడాదిన్నరగా ఈ ప్రక్రియ కొనసాగుతుండటం, పలుమార్లు గడువు పెంచినా వివిధ స్థాయిల్లో దరఖాస్తులు పెండింగ్‌లో ఉండిపోవడంతో అంతా గందరగోళంగా తయారైంది. భూముల క్రమబద్ధీకరణకు సంబంధించి 2014 డిసెంబర్లో జీవో 59 విడుదల చేసిన సర్కారు.. 90 రోజుల్లోనే ఈ ప్రక్రియను ముగించాలని స్పష్టం చేసింది. అయితే ఆ బాధ్యతలను నెత్తికెత్తుకున్న భూపరిపాలన విభాగంలో కమిషనర్లు తరచుగా మారుతుండటంతో సిబ్బందికి మార్గనిర్దేశం చేసేవారు కరువయ్యారు. ఎట్టకేలకు గత నెల మొదటి వారం నుంచి పూర్తి సొమ్ము చెల్లించిన కొన్ని దరఖాస్తులను క్లియర్ చేసిన తహసీల్దార్లు ఆయా భూములను లబ్ధిదారుల పేరిట రిజిస్ట్రేషన్లు చేశారు. మరోవైపు వాయిదాల పద్ధతిలో సొమ్ము చెల్లిస్తున్న వారు మరికొన్ని వాయిదాలు చెల్లించాల్సి రావడం, కొన్ని దరఖాస్తుల్లో పేర్కొన్న భూమి పాక్షిక కమర్షియల్/పాక్షిక రెసిడెన్షియల్ కేటగిరీలో ఉండటం క్షేత్రస్థాయి అధికారులకు తలనొప్పిగా మారింది. గడువు పొడిగించలేం..: భూముల క్రమబద్ధీకరణ ఏడాదిన్నరగా సాగుతున్నందున మరోమారు గడువు పొడిగించడం సమంజసం కాదని రెవెన్యూ శాఖ ఉన్నతాధికారులు కిందిస్థాయి సిబ్బందికి సూచనలు చేసినట్లు తెలిసింది. ఇంకోవైపు గడువు ముగిసినందున తాము చెల్లించిన సొమ్మును తిరిగి ఇమ్మని కొందరు దరఖాస్తుదారులు తహసీల్దార్లను డిమాండ్ చేస్తున్నారు. క్రమబద్ధీకరణను త్వరితగతిన ముగించేందుకు గడువు పెంచాలని ఆయా జిల్లాల కలెక్టర్లు సీసీఎల్ఏకు లేఖ రాశారు. సాదా బైనామాల రిజిస్ట్రేషన్లు, యూఎల్సీ ఖాళీ స్థలాల క్రమబద్ధీకరణ, కొత్త జిల్లాల ఏర్పాటు వంటి వాటితో సీసీఎల్ఏ బిజీగా ఉండటంతో గడువు పెంపుపై ఇప్పట్లో క్లారిటీ వచ్చే అవకాశం లేదని రెవెన్యూ సిబ్బంది చెబుతున్నారు. -
భూముల క్రమబద్ధీకరణలో ప్రతిష్టంభన
సాక్షి, హైదరాబాద్: భూముల క్రమబద్ధీకరణ ప్రక్రియలో ప్రతిష్టంభన ఏర్పడింది. చెల్లింపు కేటగిరీలో వాయిదాల పద్ధతే ఇందుకు కారణమైంది. తొలి వాయిదా సొమ్ము చెల్లించాలంటూ భూపరిపాలన విభాగం జారీచేసిన నోటీసులతో లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు. ఉచిత కేటగిరీ నుంచి చెల్లింపు కేటగిరీకి మారిన దరఖాస్తుదారులకు, క్రమబద్ధీకరణ నిమిత్తం వాయిదా సొమ్ము చెల్లించాలంటూ వారం రోజులుగా రెవెన్యూశాఖ నోటీసులు పంపుతోంది. దీనిప్రకారం ఈనెల 10తో తొలి వాయిదా గడువు ముగిసింది. గడువు దాటాక వచ్చిన నోటీసులను చూసి లబ్ధిదారులు నివ్వెరపోతున్నారు. దీనిపై మండల రెవెన్యూ కార్యాలయాలకు వెళితే.. అవి సీసీఎల్ఏ కార్యాలయం నుంచే వచ్చాయని, తాము చేయగలిగిందేమీ లేదని చెబుతున్నారు. వాయిదా సొమ్ము ఇప్పుడు చెల్లిస్తామంటే.. గడువు ముగిసినందున నిబంధనలు ఒప్పుకోవంటూ వాపసు పంపుతున్నారు. ఉన్నతాధికారుల ఆదేశాలను కాదని గడువు తర్వాత సొమ్ము స్వీకరిస్తే ఎలాంటి ఇబ్బందులొస్తాయోనని క్షేత్రస్థాయి అధికారులు జంకుతున్నారు. క్రమబద్ధీకరణకు చెల్లింపులు ఇలా.. ప్రభుత్వ భూముల్లో నివాసముంటున్న వారికి ఆయా స్థలాలను చెల్లింపు కేటగిరీలో క్రమబద్ధీకరించేందుకు గత డిసెంబరులో ప్రభుత్వం జీవో నెంబరు 59 జారీచేసిన సంగతి తెలిసిందే. చెల్లింపు కేటగిరీలో తొలుత 29,281 దరఖాస్తులు రాగా, ఉచిత కేటగిరీలో వచ్చిన 16,915 దరఖాస్తులను కూడా పరిశీలన అనంతరం చెల్లింపు కేటగిరీలోకి మార్చారు. దీంతో చెల్లింపు కేటగిరీలో దరఖాస్తుల సంఖ్య 46,196కు చేరింది. సొమ్ము చెల్లింపునకు వాయిదాల సదుపాయాన్ని ప్రభుత్వం కల్పించింది. తాజాగా సవరించిన షెడ్యూలు ప్రకారం.. చెల్లింపు కేటగిరీలో గత ఏప్రిల్ 15 లోగా చెల్లించాల్సిన రెండవ వాయిదా గడువును ఆగస్టు 31వరకు పెంచారు. మార్పిడి దరఖాస్తు దారులకు ఈ నెల 10లోగా మొదటి వాయిదా, రెండో వాయిదాను 31లోగా చెల్లించేందుకు అవకాశం కల్పించారు. జూన్ 30తో ముగిసిన మూడో వాయిదా గడువును సెప్టెంబరు 30 వరకు, సెప్టెంబరు 30తో ముగియనున్న నాలుగో ఇన్స్టాల్మెంట్ గడువును నవంబరు 15 వరకు పొడిగించారు. చివరి వాయిదా గడువును మాత్రం యథావిధిగా (డిసెంబరు 31) ఉంచినట్లు సవరణ షెడ్యూల్లో పేర్కొన్నారు. సీసీఎల్ఏ నుంచే ఈ గందరగోళం భూముల క్రమబద్ధీకరణ ప్రక్రియలో భాగంగా ఉచిత కేటగిరీ నుంచి చెల్లింపు కేటగిరీకి మార్చిన దరఖాస్తుదారులకు నోటీసులు ఇవ్వాలని క్షేత్రస్థాయి అధికారులను భూపరిపాలన విభాగం (సీసీఎల్ఏ) ఇటీవల ఆదేశించింది. అయితే వాయిదాల గడువును, నోటీసు న మూనాను సీసీఎల్ఏ అధికారులే రూపొందించారు. సీసీఎల్ఏ ఈనెల ప్రారంభంలో ఆన్లైన్లో జారీచేసిన నోటీసులనే మండల రెవెన్యూ అధికారులు డౌన్లోడ్ చేసి తమ పరిధిలోని లబ్ధిదారులకు పోస్టు ద్వారా పంపారు. అవి లబ్ధిదారులకు చేరేసరికి వాయిదా గడువు కాస్తా ముగిసింది. దీంతో ఇటు లబ్ధిదారుల్లోనూ, అటు అధికారుల్లోనూ ఏం చేయాలో పాలుపోని పరిస్థితి. కనీసం రెండో వాయిదా గడువు (ఆగస్టు 31)లోగా మొదటి వాయిదా సొమ్మును కూడా స్వీకరించేందుకు అనుమతించాలని లబ్ధిదారులు కోరుతున్నారు. -
వచ్చినవన్నీ ఉచిత దరఖాస్తులే
* క్రమబద్ధీకరణకు కదలని జనం * సొమ్ము చెల్లించే కేటగిరీలో కానరాని హడావుడి * హైదరాబాద్ మినహా మిగిలిన జిల్లాల్లో అంతంత మాత్రమే * 125గజాల్లోపు స్థలాలకు దరఖాస్తుల వెల్లువ * మీ సేవ కేంద్రాల పోర్టల్లోనూ దరఖాస్తు నమూనా సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రభుత్వ భూముల క్రమబద్ధీకరణ ప్రక్రియకు ఆశించిన మేరకు స్పందన కనిపించడం లేదు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ భూముల్లో నివాసాలేర్పరచుకున్న వారికి ఆయా స్థలాలను క్రమబద్ధీకరించాలని ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు గత నెల 31న రెవెన్యూ శాఖ 58, 59 ఉత్తర్వులను జారీచేసింది. అవి జారీ అయిన 20రోజుల్లోగా దరఖాస్తులు చేసుకోవాలని పేర్కొంది.ఈ ప్రకారం 125గజాల్లోపు స్థలాల్లో నివాసముంటున్న పేదలకు ఆయా స్థలాలను ఉచితంగాను, ఆపై 250 గజాల్లోపు వారికి 50శాతం రిజిస్ట్రేషన్ ధర, 500గజాల్లోపు స్థలాలను 75శాతం, ఆపైన నిర్మాణాలున్న స్థలాలను 100శాతం రిజిస్ట్రేషన్ ధర చెల్లింపుతో క్రమబద్ధీకరించాలని నిర్ణయించారు. భూపరిపాలన విభాగం కూడా ఈనెల 8న ఇందుకు సంబంధించి క్షేత్రస్థాయిలో రెవెన్యూ అధికారులకు మార్గదర్శకాలను విడుదల చేసింది.మండల రెవెన్యూ కార్యాలయాలకు వచ్చిన దరఖాస్తులను రెవెన్యూ డివిజినల్ అధికారి(ఆర్డీవో) నేతృత్వంలో ఏర్పాటయ్యే కమిటీ పరిశీలించి నిర్ణయం తీసుకోవాలని పేర్కొన్నారు.ఈ ప్రక్రియంతా 90 రోజుల్లోగా పూర్తి కావాలని కూడా ప్రభుత్వం స్పష్టం చేసింది. జిల్లాల్లో కానరాని హడావుడి.. క్రమబద్ధీకరణ ఉత్తర్వులు వెలువడి 10 రోజులైనా.. రాష్ట్రవ్యాప్తంగా పెద్దగా స్పందన రాలేదు. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల నుంచి మినహా మిగిలిన అన్ని జిల్లాల నుంచి ఈ ప్రక్రియ పట్ల అటు అధికారులు గానీ, ఇటు స్థానికులు గానీ పెద్దగా ఆసక్తి కనబర్చలేదని సమాచారం. హైదరాబాద్, జీహెచ్ఎంసీ పరిధిలోని రంగారెడ్డి జిల్లాలో మాత్రం దరఖాస్తుల కోసం కొందరు తహసీల్దారు కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణ లు చేశారు. హైదరాబాద్‌లో పెరిగిన తాకిడి.. మరో వైపు గురువారం సాయంత్రం నుంచి జీహెచ్ఎంసీ పరిధిలోని అన్ని రెవెన్యూ కార్యాలయాలకు జనం తాకిడి పెరిగింది. గురు, శుక్రవారాల్లో జీహెచ్ఎంసీ పరిధిలోని అన్ని మండల రెవెన్యూ కార్యాలయాల్లోనూ క్రమబద్ధీకరణ దరఖాస్తుల స్వీకరణ ప్రారంభించారు. హెల్ప్‌డెస్క్‌లను ఏర్పాటు చేశారు. శుక్రవారం మా త్రం ప్రతీ మండలంలో కనిష్టంగా 100, గరి ష్టంగా 600 వరకు దరఖాస్తులు వచ్చినట్లు రెవెన్యూ అధికారులు చెబుతున్నారు. శనివారం నుంచి పెద్దసంఖ్యలో రావచ్చని భావిస్తున్నారు. అన్నీ.. ‘ఉచితం’ కేటగిరీలోనే... క్రమబద్ధీకరణకు సంబంధించి జీహెచ్ఎంసీ పరిధిలోని మండల రెవెన్యూ కార్యాలయాలకు వచ్చిన దరఖాస్తుల్లో ‘ఉచితం’ కేటగిరీ దరఖాస్తులే అధికంగా వచ్చాయి. బాలానగర్ మండలంలో మొత్తం 517 దరఖాస్తులు రాగా, ఇందులో 516 ఉచిత కేట గిరీకి చెందినవే. ఒకే ఒక్క దరఖాస్తు అదీ 250 గజాల్లోపు స్థలానికి సంబంధించినదని అధికారులు తెలిపారు. శనివారం నుంచీ అదనపు కౌంటర్లు ఏర్పాటు చేయాలని కూడా అధికారులు నిర్ణయించారు. ‘మీ సేవ’ పోర్టల్‌లో దరఖాస్తు నమూనా.. క్రమబద్ధీకరణ దరఖాస్తు నమూనాను మీసేవ వెబ్ పోర్టల్లోనూ ఉంచాలని అధికారులు నిర్ణయించారు. శనివారం నుంచి మీసేవ కేంద్రాల ద్వారా దరఖాస్తులను పొందవచ్చని సీసీఎల్ఏ అధికారులు తెలిపారు. కాగా ఈ ప్రక్రియపై ఆశించిన స్పందన రాకపోవడంతో విసృ్తత ప్రచారం చేపట్టాలని అధికారులు భావిస్తున్నారు.