భూముల క్రమబద్ధీకరణలో ప్రతిష్టంభన
సాక్షి, హైదరాబాద్: భూముల క్రమబద్ధీకరణ ప్రక్రియలో ప్రతిష్టంభన ఏర్పడింది. చెల్లింపు కేటగిరీలో వాయిదాల పద్ధతే ఇందుకు కారణమైంది. తొలి వాయిదా సొమ్ము చెల్లించాలంటూ భూపరిపాలన విభాగం జారీచేసిన నోటీసులతో లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు. ఉచిత కేటగిరీ నుంచి చెల్లింపు కేటగిరీకి మారిన దరఖాస్తుదారులకు, క్రమబద్ధీకరణ నిమిత్తం వాయిదా సొమ్ము చెల్లించాలంటూ వారం రోజులుగా రెవెన్యూశాఖ నోటీసులు పంపుతోంది. దీనిప్రకారం ఈనెల 10తో తొలి వాయిదా గడువు ముగిసింది. గడువు దాటాక వచ్చిన నోటీసులను చూసి లబ్ధిదారులు నివ్వెరపోతున్నారు.
దీనిపై మండల రెవెన్యూ కార్యాలయాలకు వెళితే.. అవి సీసీఎల్‌ఏ కార్యాలయం నుంచే వచ్చాయని, తాము చేయగలిగిందేమీ లేదని చెబుతున్నారు. వాయిదా సొమ్ము ఇప్పుడు చెల్లిస్తామంటే.. గడువు ముగిసినందున నిబంధనలు ఒప్పుకోవంటూ వాపసు పంపుతున్నారు. ఉన్నతాధికారుల ఆదేశాలను కాదని గడువు తర్వాత సొమ్ము స్వీకరిస్తే ఎలాంటి ఇబ్బందులొస్తాయోనని క్షేత్రస్థాయి అధికారులు జంకుతున్నారు.
క్రమబద్ధీకరణకు చెల్లింపులు ఇలా..
ప్రభుత్వ భూముల్లో నివాసముంటున్న వారికి ఆయా స్థలాలను చెల్లింపు కేటగిరీలో క్రమబద్ధీకరించేందుకు గత డిసెంబరులో ప్రభుత్వం జీవో నెంబరు 59 జారీచేసిన సంగతి తెలిసిందే. చెల్లింపు కేటగిరీలో తొలుత 29,281 దరఖాస్తులు రాగా, ఉచిత కేటగిరీలో వచ్చిన 16,915 దరఖాస్తులను కూడా పరిశీలన అనంతరం చెల్లింపు కేటగిరీలోకి మార్చారు. దీంతో చెల్లింపు కేటగిరీలో దరఖాస్తుల సంఖ్య 46,196కు చేరింది.
సొమ్ము చెల్లింపునకు వాయిదాల సదుపాయాన్ని ప్రభుత్వం కల్పించింది. తాజాగా సవరించిన షెడ్యూలు ప్రకారం.. చెల్లింపు కేటగిరీలో గత ఏప్రిల్ 15 లోగా చెల్లించాల్సిన రెండవ వాయిదా గడువును ఆగస్టు 31వరకు పెంచారు. మార్పిడి దరఖాస్తు దారులకు ఈ నెల 10లోగా మొదటి వాయిదా, రెండో వాయిదాను 31లోగా చెల్లించేందుకు అవకాశం కల్పించారు. జూన్ 30తో ముగిసిన మూడో వాయిదా గడువును సెప్టెంబరు 30 వరకు, సెప్టెంబరు 30తో ముగియనున్న నాలుగో ఇన్‌స్టాల్‌మెంట్ గడువును నవంబరు 15 వరకు పొడిగించారు. చివరి వాయిదా గడువును మాత్రం యథావిధిగా (డిసెంబరు 31) ఉంచినట్లు సవరణ షెడ్యూల్లో పేర్కొన్నారు.
సీసీఎల్‌ఏ నుంచే ఈ గందరగోళం
భూముల క్రమబద్ధీకరణ ప్రక్రియలో భాగంగా ఉచిత కేటగిరీ నుంచి చెల్లింపు కేటగిరీకి మార్చిన దరఖాస్తుదారులకు నోటీసులు ఇవ్వాలని క్షేత్రస్థాయి అధికారులను భూపరిపాలన విభాగం (సీసీఎల్‌ఏ) ఇటీవల ఆదేశించింది. అయితే వాయిదాల గడువును, నోటీసు న మూనాను సీసీఎల్‌ఏ అధికారులే రూపొందించారు.
సీసీఎల్‌ఏ ఈనెల ప్రారంభంలో ఆన్‌లైన్‌లో జారీచేసిన నోటీసులనే మండల రెవెన్యూ అధికారులు డౌన్‌లోడ్ చేసి తమ పరిధిలోని లబ్ధిదారులకు పోస్టు ద్వారా పంపారు. అవి లబ్ధిదారులకు చేరేసరికి వాయిదా గడువు కాస్తా ముగిసింది. దీంతో ఇటు లబ్ధిదారుల్లోనూ, అటు అధికారుల్లోనూ ఏం చేయాలో పాలుపోని పరిస్థితి. కనీసం రెండో వాయిదా గడువు (ఆగస్టు 31)లోగా మొదటి వాయిదా సొమ్మును కూడా స్వీకరించేందుకు అనుమతించాలని లబ్ధిదారులు కోరుతున్నారు.