సాక్షి, హైదరాబాద్: ధరణి పోర్టల్ ద్వారా రైతులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యకు ప్రభుత్వం చెక్ పెట్టింది. సేత్వార్ నమోదులో జరిగిన పొరపాట్లను సవరించి ఒక సర్వే నంబర్‌లోని భూముల హెచ్చుతగ్గులను నమోదు చేసేందుకు అవకాశం కలి్పంచింది. ఈ మేరకు ధరణి పోర్టల్‌లో అందుబాటులోకి వచ్చి న కొత్త ఆప్షన్లపై భూపరిపాలన ప్రధాన కమిషనర్ (సీసీఎల్‌ఏ) నవీన్ మిట్టల్ జిల్లా కలెక్టర్లకు గురువారం సమాచారం పంపారు.
వాస్తవానికి, ధరణి పోర్టల్‌లో సర్వే నంబర్లలోని భూములను నమోదు చేసే విషయంలో కొన్నిచోట్ల పొరపాట్లు జరిగాయి. కొన్ని సర్వే నంబర్లలో ఉన్న వాస్తవ భూమి విస్తీర్ణంలో హెచ్చుతగ్గులు నమోదయ్యాయి. దీంతో ఆ భూమి నమోదైన మేరకు మాత్రమే రైతులకు పాసు పుస్తకాలు ఇవ్వడంతోపాటు క్రయవిక్రయ లావాదేవీలకు ధరణి పోర్టల్ అనుమతినిచ్చి ంది. తద్వారా ఆ భూమిలో ఏళ్లుగా కబ్జాలో ఉండి సాగు చేసుకుంటున్న రైతులకు పాసు పుస్తకాలు రాకపోయినా ఏమీ చేయలేని పరిస్థితి ఉండేది.
ఇప్పుడు సేత్వార్ నమోదు, సవరణలకు ధరణి పోర్టల్‌లో అవకాశం ఇవ్వడంతో ఈ సమస్యకు చెక్ పడుతుందని రెవెన్యూ వర్గాలు భావిస్తున్నాయి. అదేవిధంగా వ్యవసాయేతర భూములను ఒకరి కంటే ఎక్కువ మంది అమ్మేందుకు, కొనేందుకు అవకాశముంది. కానీ, ధరణి పోర్టల్ ద్వారా వ్యవసాయ భూముల క్రయవిక్రయాలు ఇప్పటివరకు ఒక్కరి పేరు మీదనే జరిగేవి. దాన్ని మార్చడం ద్వారా ఒకరి కంటే ఎక్కువ మంది భూమి అమ్మేందుకు, భూమి కొనేందుకు అవకాశం కలగనుంది.
ఇక, భూసేకరణ సమయంలో గత మూడేళ్ల కాలంలో జరిగిన లావా దేవీల సగటు విలువను లెక్కించి పరిహారాన్ని రైతుకు చెల్లిస్తారు. దీనికి అవసరమైన మార్కెట్ విలువ సర్టిఫికెట్‌ను ధరణి పోర్టల్ ద్వారా ఇచ్చే ఆప్షన్‌ను కూడా అందుబాటులోకి తెచ్చారు. అదే విధంగా ఏజెన్సీ ప్రాంతాల్లో భూములను మార్ట్‌గేజ్ (తనఖా) చేసుకునేందుకు అడుగుతున్న కుల ధ్రువీకరణ పత్రం అవసరం లే కుండా మార్పులు చేశారు. సదరు భూ యజమాని ఎస్టీ అని సంబంధిత తహసీల్దార్ నమోదు చేస్తే సరిపోయేలా మార్పు చేశారు.
టీఎం 33 మాడ్యూల్‌లో..
ధరణి పోర్టల్‌లో రైతులు ఎక్కువగా ఉపయోగించుకునే టీఎం33 మాడ్యూల్‌ను తాజా మార్పుల్లో మరింత సులభతరం చేశారు. ఉదాహరణకు గతంలో టీఎం 33 ద్వారా పేరు మార్పు చేయాలనుకుంటే ఆ పేరుతోపాటు ఇతర వివరాలన్నింటినీ నమోదు చేయాల్సి వచ్చేది. ఆ క్రమంలోనే ఇతర వివరాల నమోదులో పొరపాట్లు దొర్లి కొత్త సమస్యలు వచ్చేవి.
అలా కాకుండా ఇప్పుడు టీఎం33 మాడ్యూల్ ద్వారా పేరు, లింగం, ఆధార్, కుల కేటగిరీల్లో ఏది అవసరమైతే దాన్ని మాత్రమే సరిదిద్దుకునేలా, ఇతర వివరాలను నమోదు చేయాల్సిన అవసరం లేకుండా మార్పులు చేశారు. పాసుపుస్తకాల దిద్దుబాటు క్రమంలో కలెక్టర్లు వెనక్కు పంపిన దరఖాస్తుల వివరాలకు సంబంధించిన రిపోర్టు అందుబాటులో ఉండేది కాదు.
ఇప్పుడు ఎక్సెల్ ఫార్మాట్‌లో ఆ రిపోర్టు అందుబాటులో ఉండేలా ధరణి పోర్టల్‌లో మార్పులు చేయడం గమనార్హం. అదేవిధంగా గ్రామ పహాణీలు కలెక్టర్‌తోపాటు సీసీఎల్‌ఏ లాగిన్‌లో కూడా అందుబాటులో ఉండేలా మార్పులు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment