
సాక్షి, హైదరాబాద్: ధరణి పోర్టల్ ద్వారా వ్యవసాయ భూములకు సంబంధించిన సమస్యల పరిష్కారంలో కీలక మార్పులు రానున్నాయి. ఇకపై పోర్టల్ ద్వారా వచ్చిన దరఖాస్తులను ఆమోదించినా, తిరస్కరించినా అందుకు తగిన కారణాలను కలెక్టర్లు విధిగా తెలియజేసేలా సాఫ్ట్‌వేర్‌లో మార్పులు చేసేందుకు భూపరిపాలన ప్రధాన కమిషనర్ (సీసీఎల్‌ఏ) నవీన్ మిత్తల్ కసరత్తు చేస్తున్నారు. రైతుల భూములపై తీసుకొనే నిర్ణయాలకు గల కారణాలు పబ్లిక్ డొమైన్‌లో కనిపించేలా మార్పులు చేస్తున్నారు.
అదే జరిగితే దరఖాస్తు తిరస్కరణకు గల కారణం రైతుకు తెలుస్తుందని, మరోసారి అలా తిరస్కారానికి గురికాకుండా అవసరమైన పత్రాలు సమకూర్చుకొనేందుకు, రికార్డులను రెవెన్యూ యంత్రాంగానికి సమర్పించి మళ్లీ దరఖాస్తు చేసుకోవడం ద్వారా సమస్యకు పరిష్కారం పొందేందుకు రైతుకు వీలు కలుగుతుందని, ఈ కోణంలోనే సీసీఎల్‌ఏ స్థాయిలో కసరత్తు జరుగుతోందని తెలుస్తోంది.
ఇప్పటివరకు కారణమేంటో తెలియక..
ప్రస్తుతం ధరణి పోర్టల్ ద్వారా నమోదవుతున్న అర్జీలు ఎక్కడ ఉన్నాయో కూడా తెలియని పరిస్థితి నెలకొంది. దరఖాస్తు ఎక్కడకు వెళ్లింది... ప్రస్తుతం ఎక్కడ ఉంది? ఏ స్థాయిలో నిర్ణయం తీసుకుంటున్నారు? ఏం నిర్ణయం తీసుకున్నారు? ఎందుకు తీసుకున్నారు? వంటి వివరాలేవీ రైతులకు తెలియట్లేదు. దరఖాస్తును ఆమోదించారో లేదో కూడా తెలియని దుస్థితి. రోజులు, నెలలు, సంవత్సరాల తరబడి వేచి చూశాక సదరు రైతు ఫోన్‌కు దరఖాస్తును కలెక్టర్ తిరస్కరించారనో లేదా ఆమోదించారనో మాత్రమే సందేశం వస్తోంది.
ఆ సందేశం వచ్చే వరకు తమ దరఖాస్తు ఏమైందంటూ తహసీల్దార్, ఆర్డీవో, కలెక్టరేట్‌ల చుట్టూ రైతులు ప్రదక్షిణలు చేయాల్సిన పరిస్థితి ఉంటోంది. ఒకవేళ దరఖాస్తును తిరస్కరిస్తే అందుకుగల కారణమేంటో కూడా తెలియట్లేదు. కారణం కోసం ఏ స్థాయిలోని కార్యాలయానికి వెళ్లినా తమకు తెలియదంటే తమకు తెలియదంటూ దాటవేయడం పరిపాటిగా మారిపోయింది. దీంతో రైతులు తమ వినతులను ఉపసంహరించుకోవడమో లేక దళారులను ఆశ్రయించడమో జరుగుతోంది. ఈ పరిస్థితుల్లో రైతులకు తమ దరఖాస్తులపై స్పష్టతనిచ్చే దిశగా సీసీఎల్‌ఏ కసరత్తు జరుగుతోంది.
త్వరలో మరో 10 మాడ్యూల్స్
ధరణి పోర్టల్ ద్వారా ఎదురయ్యే సమస్యల పరిష్కారం కోసం 10వరకు కొత్త మాడ్యూల్స్ కూడా త్వరలోనే అందుబాటులోకి రానున్నాయి. ధరణి పోర్టల్ అందుబాటులోకి రాకముందే ‘నాలా’ కేటగిరీలోకి మారినా వ్యవసాయ కేటగిరీలోనే నమోదైన భూములు, వారసత్వ హక్కులు కల్పించాల్సిన భూములు, సంస్థల పేరిట పట్టా హక్కులు కల్పించాల్సిన భూముల విషయంలో కొత్త మాడ్యూల్స్ అందుబాటులోకి వస్తున్నాయని సీసీఎల్‌ఏ వర్గాలు చెబుతున్నాయి. అలాగే మరికొన్ని సమస్యలకు కూడా త్వరలోనే ఫుల్‌స్టాప్ పడనుందని అంటున్నాయి.