సాక్షి, హైదరాబాద్: ధరణి పోర్టల్ కష్టాలు తీరడం లేదు. ఈ పోర్టల్ ద్వారా ఎదురవుతున్న సమస్యలు కొనసాగుతూనే ఉన్నాయి. భూపరిపాలన ప్రధాన కమిషనర్ (సీసీఎల్‌ఏ)గా సీనియర్ ఐఏఎస్ అధికారి నవీన్‌మిత్తల్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత ముఖ్య సమస్యల పరిష్కారానికి ఉపక్రమించినప్పటికీ, ఈ క్రమంలో వస్తున్న తీవ్ర సాంకేతిక సమస్యలు అడుగు ముందుకు పడనీయడం లేదని సమాచారం.
ఈ కారణంగానే విస్తీర్ణం, పేరు మార్పు లాంటి సమస్యల పరిష్కారం ఆలస్యమవుతోంది. ధరణి పోర్టల్ ద్వారా రైతులు ఎదుర్కొంటున్న 10 సమస్యలకు సంబంధించిన మార్పులు జరిగినప్పటికీ, సాంకేతిక అవరోధాల కారణంగా బుధవారం నాటికి స్పెషల్ పవర్ ఆఫ్ అటార్నీ (ఎస్‌పీఏ) ఆప్షన్ మాత్రమే అందుబాటులోకి వచ్చిందని రెవెన్యూ వర్గాల ద్వారా తెలుస్తోంది.
విదేశాల్లో ఉంటున్న పట్టాదారులు తమ భూమి విక్రయానికి గాను ఇక్కడకు రావాల్సిన అవసరం లేకుండా, తాము ఉంటున్న దేశం నుంచే అదీకృత డాక్యుమెంట్ పంపి ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసేందుకు వీలుగా ఉన్న ఈ ఆప్షన్ మాత్రమే అందుబాటులోకి వచ్చింది. మిగిలిన సమస్యలు కూడా దాదాపు పూర్తయినట్టేనని, ఒకట్రెండు రోజుల్లో అన్నీ అందుబాటులోకి వస్తా యని సీసీఎల్‌ఏ వర్గాలు చెపుతున్నాయి.
వేలసంఖ్యలో పెండింగ్‌లో టీఎం 33 దరఖాస్తులు
ధరణి పోర్టల్‌లోకి రైతుల వివరాల నమోదు సమయంలో వచ్చి న చిక్కులను తొలగించేందుకు గాను టీఎం (టెక్నికల్ మాడ్యూల్) 33 కింద దరఖాస్తులు తీసుకుంటున్నారు. పట్టాదారు పేరు, భూమి విస్తీర్ణం, స్వభా వం, మిస్సింగ్ సర్వే నంబర్ల లాంటి సమస్యల సవరణ కోసం ఈ మాడ్యూల్‌ను అందుబాటులోకి తీసుకువచ్చారు. పట్టాదారు బయోమెట్రిక్‌తో మీసేవా కేంద్రం ద్వారా తగిన ఆధారాలు పొందుపరిచి ఈ మాడ్యూ ల్ కింద రైతులు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. సదరు దరఖాస్తులను జిల్లా కలెక్టర్ పరిశీలించి నిర్ణయం తీసుకుంటారు.
ఈ క్రమంలోనే తీవ్ర జాప్యం జరుగుతుండడం రైతులను ఇబ్బందులకు గురిచేస్తోంది. ఈ మాడ్యూల్ కింద దరఖాస్తు చేసుకున్న వారి సమస్యల పరిష్కారంలో రాజకీయ జోక్యం కూడా ఎక్కువగా ఉంటోందన్న విమర్శలు ఉన్నాయి. ఈ కారణంగానే స్థానిక అధికారులు (తహసీల్దార్లు) నిష్పక్షపాతంగా నివేదికలు పంపడం లేదని, ఈ నివేదికల ఆధారంగా కలెక్టర్లు దరఖాస్తులను తిరస్కరిస్తున్నారని తెలుస్తోంది. ఒకవేళ కలెక్టర్లు ఆమోదించినా సీసీఎల్‌ఏ కార్యాలయంలో క్లియర్ చేయాల్సి ఉండడం కూడా జాప్యానికి కారణమవుతోంది.
ఈ దరఖాస్తుల పరిష్కారానికి సీసీఎల్‌ఏ నవీన్ మిత్తల్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నా, ఇంకా వేల సంఖ్యలో దరఖాస్తులు సీసీఎల్‌ఏ కార్యాలయ స్థాయి లో పెండింగ్‌లో ఉండడం గమనార్హం. తహసీల్దార్లు, జిల్లాల కలెక్టర్లు నివేదికలు పంపేందుకే నెలలు గడుస్తోందని, ఆ తర్వాత సీసీఎల్‌ఏ కార్యాలయానికి వెళ్లిందీ లేనిదీ తెలియడం లేదని, ఒకవేళ సీసీఎల్‌ఏ కార్యాలయానికి వెళ్లినా తదుపరి సమా చారం కోసం నెలల తరబడి వేచి చూడాల్సి వస్తోందని రైతులు వాపోతున్నారు. టీఎం–33 దరఖాస్తులను వీలున్నంత త్వరగా పరిష్కరించాలని, తమ దరఖాస్తు ఏ దశలో ఉందో తెలుసుకునే అవకాశం కల్పించాలని వారు కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment