సాక్షి, హైదరాబాద్: ధరణి పోర్టల్ పునర్నిర్మాణంలో భాగంగా రోడ్‌మ్యాప్ రూపొందించేందుకు జిల్లాల కలెక్టర్లతో సమావేశం కావాలని ధరణి కమిటీ నిర్ణయించింది. బుధవారం ఉదయం 10 గంటలకు సచివాలయంలోగానీ, భూపరిపాలన ప్రధాన కమిషనర్ (సీసీఎల్‌ఏ) కార్యాలయంలోగానీ ఐదు జిల్లాల కలెక్టర్లతో ఈ భేటీ నిర్వహించనుంది. ఈ మేరకు ఐదుగురు జిల్లా కలెక్టర్లను హైదరాబాద్‌కు పిలిపించేందుకు అనుమతి కోరుతూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్)కి లేఖ రాసింది.
సోమవారం ధరణి కమిటీ సభ్యులు ఎం.కోదండరెడ్డి, ఎం.సునీల్‌కుమార్, రేమండ్ పీటర్, నవీన్ మిట్టల్, మధుసూదన్‌లతోపాటు సీఎంఆర్‌వో పీడీ వి.లచ్చిరెడ్డి తదితరులు సీసీఎల్‌ఏ కార్యాలయంలో భేటీ అయ్యారు. దాదాపు మూడు గంటల పాటు జరిగిన ఈ సమావేశంలో ధరణి వర్క్‌ఫ్లో గురించి చర్చించారు. పోర్టల్‌కు వస్తున్న దరఖాస్తులు, వాటి పరిష్కార క్రమంలో తీసుకుంటున్న చర్యల గురించి సీసీఎల్‌ఏ యంత్రాంగం కమిటీ సభ్యులకు వివరించింది.
ఈ సందర్భంగా క్షేత్రస్థాయి పరిస్థితులను తెలుసుకునేందుకు జిల్లా కలెక్టర్ల అనుభవాలను, దరఖాస్తులు పరిష్కరిస్తున్న తీరు, నిజామాబాద్ భూభారతి ప్రాజెక్టుకు సంబంధించిన అంశాలను తెలుసుకోవాలని కమిటీ నిర్ణయించింది. ఈ మేరకు కలెక్టర్లతో సమావేశం కావాలని, ఆ తర్వాత రోడ్‌మ్యాప్‌కు ఓ రూపం ఇవ్వాలని తీర్మానించింది.
త్వరలో మధ్యంతర నివేదికలు
ధరణిపై రాష్ట్ర ప్రభుత్వానికి పూర్తిస్థాయి నివేదిక ఇచ్చేందుకు సమయం పట్టవచ్చన్న అంచనాల నేపథ్యంలో.. ప్రజలకు అవసరమైన అంశాలపైనా సమావేశంలో చర్చించారు. ఆయా అంశాలపై త్వరలోనే మధ్యంతర నివేదికలు ఇవ్వాలని నిర్ణయించారు.
ఇక భూములకు సంబంధించిన డేటా కోసం రెవెన్యూ, రిజిస్ట్రేషన్లు, వ్యవసాయ శాఖల వద్ద ఉన్న వివరాలను సమగ్రంగా పరిశీలించి.. ఈ మూడింటి డేటాను క్రోడీకరించడం ద్వారా సమస్యల పరిష్కారానికి ఉన్న అవకాశాలపై చర్చించారు. ఈ సమావేశంలో భాగంగా సీపీఐతోపాటు పలు పౌరసంఘాల ప్రతినిధులతో కూడా చర్చించారు. క్షేత్రస్థాయిలో రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
విదేశీ కంపెనీని మారుస్తాం: కోదండరెడ్డి
సీసీఎల్‌ఏ కార్యాలయంలో కమిటీ భేటీ అనంతరం కోదండరెడ్డి, సునీల్‌కుమార్, రేమండ్ పీటర్ మీడియాతో మాట్లాడారు. ధరణి పోర్టల్ కారణంగా లక్షల మంది రైతులు ఇబ్బందులు పడుతున్నారని, ఇప్పటికే తమకు వేలాది ఫిర్యాదులు అందాయని కోదండరెడ్డి చెప్పారు. ధరణి పోర్టల్ నిర్వహణను ఓ విదేశీ కంపెనీకి ఇవ్వడం పొరపాటని సీఎం రేవంత్‌రెడ్డి గుర్తించారని.. అయితే ఈ పోర్టల్ నిర్వహణను వేరే కంపెనీకి అప్పగించాలా? కేంద్ర పరిధిలోని సంస్థకు అప్పగించాలా అన్న దానిపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటారని చెప్పారు.
తమ కమిటీ ప్రతి అంశాన్ని పరిశీలిస్తుందని, వక్ఫ్, ఎండోమెంట్, భూదాన్, ప్రభుత్వ, సీలింగ్, అసైన్డ్ భూములన్నింటిపై అధ్యయనం చేస్తుందని వివరించారు. కాగా.. వ్యవసాయ, రిజిస్ట్రేషన్లు, రెవెన్యూ అధికారులతో త్వరలోనే సంయుక్త సమావేశం ఏర్పాటు చేస్తామని రిటైర్డ్ ఐఏఎస్ అధికారి రేమండ్ పీటర్ చెప్పారు. ధరణి పోర్టల్ ద్వారా మెరుగైన భూపరిపాలన అందించేందుకు అవసరమైన మార్పులను మాత్రమే తమ కమిటీ సూచిస్తుందన్నారు.
సమస్యల పరిష్కారానికి మార్పులు సూచిస్తాం: సునీల్
ధరణి కమిటీ సమస్యలను పరిష్కరించేది కాదని, సమస్యల పరిష్కారానికి అవసరమైన మార్పులు, చేర్పులు, సలహాలు అందిస్తుందని కమిటీ సభ్యుడు, భూచట్టాల నిపుణుడు ఎం.సునీల్ కుమార్ చెప్పారు. ధరణి పోర్టల్‌లో ఎదురవుతున్న సమస్యల మూలాలను పరిశీలిస్తున్నామని, ఆర్వోఆర్ చట్టం–2020లో మార్పులు అవసరమా కాదా అన్నది కూడా పరిగణనలోకి తీసుకుంటామని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment