సాక్షి, హైదరాబాద్: సుకేతన్, మాన్‌సింగ్, సుదర్శన్‌రెడ్డిలే కాదు.. రాష్ట్రంలోని అనేక మంది రైతులు ధరణి పోర్టల్ వల్ల పడరాని పాట్లు పడుతున్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకు వచ్చిన ధరణి సమస్యల నిలయంగా మారింది. తమ వ్యవసాయ భూములను రిజిస్ట్రేషన్లు చేయిం చుకునే క్రమంలో రైతులు అనేక ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తోంది. పోర్టల్ ప్రారంభమై 5 నెలలు గడుస్తున్నా ఇప్పటివరకు సాంకేతిక సమ స్యలు పరిష్కారం కాకపోవడం, ఒక సమస్య పరిష్కారానికి వెళితే ఇంకో సమస్య తలెత్తుతుం డటంతో రైతులు తహసీల్దార్ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సి వస్తోంది.
స్లాట్ బుకింగ్ చేసుకునే సమయంలో కూడా సమస్యలు వస్తున్నా అధికారులు పట్టించుకోక పోవడం, ఒకవేళ స్లాట్ బుక్ చేసుకొని సమయానికి వెళ్లలేక రద్దు చేసుకోవాలన్నా... వీలు లేకపోవడం ధరణి పోర్టల్ నిర్వహణలో నిర్లక్ష్యానికి పరాకాష్టగా నిలుస్తోంది. ఇక వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ల క్రమంలో జరగాల్సిన మ్యుటేషన్లు కూడా పూర్తి కావడం లేదు. జీపీఏలు, కంపెనీలు, ఫర్మ్‌ల పేరిట పాస్‌పుస్తకాలు, ఎన్నారై భూముల పాస్ పుస్తకాలు, ఈసీలు, పౌతీ లాంటి సమస్యలూ పెండింగ్‌లోనే ఉంటున్నాయి. పాస్‌పుస్తకాల్లో తప్పులు దొర్లితే వాటిని సవరిం చుకునే అవకాశం కూడా లేకపోవడం గమనార్హం.
సవరణ కోసం మీసేవ కేంద్రాలకు వెళితే ఆప్షన్ రాలేదని చెప్పడం, తహసీల్దార్లను ఆశ్రయిస్తే తమ చేతుల్లో ఏమీ లేదని చేతులెత్తేయడం, కలెక్టర్లను కలిస్తే ఏమీ మాట్లాడకపోవడంతో.. అసలు ఏం చేయాలో అర్థం కాక రైతులు తలలు పట్టుకుంటున్నారు. ఈ సమస్యలన్నింటినీ పరిష్కరించాల్సిన భూపరిపాలన ప్రధాన కమిషనర్ (సీసీఎల్‌ఏ) కార్యాలయం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తోంది. ‘తాంబూలాలిచ్చాం తన్నుకు చావండి’అనే రీతిలో ఆప్షన్లు ఇచ్చినట్టే ఇచ్చి పూర్తిస్థాయిలో సమస్యలను పరిష్కరించకపోవడంతో రెవెన్యూ వర్గాలకు కూడా తలనొప్పులు ఎదురవుతున్నాయి.
చెప్పుకుంటే చాంతాడంత...
ఆదిలాబాద్ అర్బన్ మండలంలోని 1,700 ఎకరాల వ్యవసాయ భూములు ధరణి పోర్టల్‌లో అటవీ భూములుగా నమోదయ్యాయి. ఇందులో ప్రభుత్వ, ప్రైవేటు పట్టా భూములున్నాయి. గతంలో వక్ఫ్ బోర్డు భూములుగా నమోదయిన ఈ భూముల సమస్య పరిష్కారమవుతుందని భావిస్తే మళ్లీ అటవీ భూములుగా నమోదు కావడంతో స్థానికులు ఆందోళనకు గురవుతున్నారు. ఈ సమస్యను ధరణి సెంట్రల్ సర్వర్ ద్వారానే పరిష్కరించాల్సి ఉంటుందని రెవెన్యూ అధికారులు చెపుతున్నారు. ఇదే విషయాన్ని జిల్లా కలెక్టర్ ద్వారా సీసీఎల్‌ఏకు నివేదించారు. కానీ, సమస్య ఇప్పటికీ పరిష్కారం కాలేదు. నల్లగొండ జిల్లా మాడ్గులపల్లి మండలం చిరుమర్తి రెవెన్యూ శివారు పోరెడ్డిగూడెం గ్రామ పరిధిలో మూసీ కాల్వల నిర్మాణానికి 40 ఏళ్ల కిందట భూసేకరణ చేశారు.
వాస్తవానికి అవార్డు కాపీ ప్రకారం ఒక సర్వే నెంబరులో ఎంత భూమి ఉన్నా... భూసేకరణ జరిపినంత మేరకే నిషేధిత భూముల జాబితాలో చేర్చాలి. కానీ, ఇక్కడ సంబంధిత సర్వే నెంబర్లను పూర్తిగా నిషేధిత జాబితాలో చేర్చారు. అంతేకాదు పక్క సర్వే నెంబర్లు కూడా పొరపాటున 22(ఏ)లో చేరాయి. దీంతో అక్కడి రైతులకు క్రయవిక్రయాలకు ఆస్కారం లేకుండా పోయింది. మీసేవకు వెళితే ఎడిట్ ఆప్షన్ లేదంటున్నారు. ఎమ్మార్వోను కలిస్తే తన చేతిలో ఏమీ లేదంటున్నారు. కలెక్టర్ దగ్గరకు వెళ్లినా ఫలితం లేకుండా పోయింది. ఇప్పుడక్కడి రైతులకు దిక్కుతోచడం లేదు. ఈ గ్రామంలోని దాదాపు 80 సర్వే నెంబర్లలో ఉన్న 500 ఎకరాల పరిస్థితి ఇదే. ఇక ఏజెన్సీ పరిధిలోని భూములకు సంబంధించి వారసత్వ రిజిస్ట్రేషన్లు, మార్టిగేజ్ కావడం లేదు. డిజిటల్ సంతకాలు పూర్తయినా డిజిటల్ పాస్ పుస్తకం రాని భూముల రిజిస్ట్రేషన్లు జరగడం లేదు. గతంలో వ్యవసాయ భూమిని నాలా కన్వర్షన్ చేసుకోకుండా ఇళ్లు నిర్మించుకున్న వారు ఇప్పుడు కన్వర్షన్‌కు వెళితే ధరణిలో ఆప్షన్ లేకుండా పోయింది.
ఏయే సమస్యలు వస్తున్నాయంటే...
పాత మ్యుటేషన్లు: ధరణి అమల్లోకి రాకముందు రిజిస్ట్రేషన్ జరిగిన వ్యవసాయ భూముల మ్యుటేషన్లు అవుతున్నాయి. కానీ, పోర్టల్‌లో కనిపించిన సర్వే నెంబర్ల భూములకు మాత్రమే అవుతున్నాయి. ఒక సర్వే నెంబర్‌లో కొంత పార్ట్–బీ భూమి ఉన్నా, బై సర్వే నెంబర్లలో తేడాలున్నా సదరు సర్వే నెంబర్ మొత్తమే ధరణిలో కనిపించడం లేదు.
జీపీఏలు: పట్టాదారు వచ్చే అవసరం లేకుండానే తన భూమిని విక్రయించి, రిజిస్ట్రేషన్ చేసే అధికారాన్ని మరో వ్యక్తికి ఇచ్చే ప్రక్రియను జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ (జీపీఏ) అంటారు. కానీ, ధరణిలో విచిత్రం ఏమిటంటే జీపీఏ తీసుకుని వెళితే ఆ భూమిని రిజిస్ట్రేషన్ చేయలేరు. పట్టాదారు వస్తేనే లావాదేవీ జరిగే విధంగా ఆప్షన్ ఇచ్చారు.
ఈసీలు: భూమికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకునే ఈసీలు ధరణి పోర్టల్‌లో రెవెన్యూ అధికారులకు ఇబ్బందిగా మారాయి. ఈసీలు సిటిజన్ లాగిన్‌లో వస్తున్నాయి కానీ అధికారుల లాగిన్‌లో రావడం లేదు. ఈసీలే కాదు పహాణీలు, పాసు పుస్తకాలు ఏవీ తహశీల్దార్ లాగిన్‌లో కనిపించవు. దీంతో సిటిజన్ లాగిన్‌లోకి వెళ్లి తహశీల్దార్లు ఆ వివరాలు పరిశీలిస్తున్నారు.
కంపెనీలు, ఫర్మ్‌ల రిజిస్ట్రేషన్: కంపెనీలు, ఫర్మ్‌ల పేరిట ఉన్న భూముల రిజిస్ట్రేషన్ జరుగుతోంది... పాస్ పుస్తకాలు వస్తున్నాయి. కానీ ఆ తర్వాతి లావాదేవీలకు మాత్రం ధరణిలో అవకాశం లేదు. నాలా కన్వర్షన్ చేసుకోవాలన్నా, విక్రయించాలన్నా ఇన్‌వాలీడ్ పాస్‌బుక్ అని చూపిస్తోంది.
పౌతి: భూ యజమాని చనిపోయిన పక్షంలో వారి వారసుల పేరిట భూమిని బదలాయించే పౌతీ ప్రక్రియలోనూ సమస్యలు వస్తున్నాయి. ధరణి అమల్లోకి రాకముందు చనిపోయిన యజమానుల వారసులకు పౌతీ జరగడం లేదు. ధరణి వచ్చిన తర్వాత కొత్త పాస్ పుస్తకం వచ్చిన వాటికి మాత్రమే జరుగుతోంది. మరో విశేషమేమిటంటే... అసైన్డ్ భూముల పౌతీ అసలే జరగడం లేదు.
పేరు, తప్పుల సవరణ: పాస్‌బుక్‌లో పేర్లు, ఇతర వివరాల్లో తప్పులు వస్తే సరిచేసుకునే ఆప్షన్ ఇచ్చారు. కానీ, సదరు వివరాలు నమోదు చేస్తే ఆ వివరాలు ఎక్కడకు పోతున్నాయో, ఏమవుతున్నాయో తహశీల్దార్లకు కూడా అర్థం కావడం లేదు. ఇక, విస్తీర్ణం, సర్వే నెంబర్లలో పొరపాట్ల సవరణకు ఇంతవరకు ఆప్షన్ ఇవ్వలేదు. ఆధార్ అనుసంధానం ఆప్షన్ ఇచ్చారు కానీ, ధరణిలో కనిపించిన సర్వే నెంబర్లకు మాత్రమే జరుగుతోంది.
స్లాట్ రద్దు: ధరణిలో ఒకసారి స్లాట్ బుక్ అయితే రద్దు కావడం లేదు. రద్దు చేస్తామని, ఫీజు కూడా తిరిగి చెల్లిస్తామని జీవో ఇచ్చారు కానీ, ఇంతవరకు అలాంటిది జరగలేదు. ఇక, ఎన్నారై పాస్‌పుస్తకాల జారీకి, కోర్టు ఉత్తర్వుల అమలుకు ఆప్షన్ ఇవ్వలేదు. సాదాబైనామాల విషయంలో 13బీ, 13సీ ఇచ్చిన భూములకు కూడా ఆప్షన్ రాలేదు. బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుని తిరిగి చెల్లిస్తే సదరు భూముల మార్టిగేజ్ రద్దు జరుగుతోంది. కానీ, రీకన్వెయెన్స్ అయిన తర్వాత మరో లావాదేవీకి అవకాశం లేకుండా పోతోంది. ఈ సమస్యలన్నింటిపై సీసీఎల్‌ఏ వర్గాలు దృష్టి పెట్టి సమస్యలను వెంటనే పరిష్కరించడం ద్వారా రైతులకు ఇబ్బంది కలగకుండా చూడాలని అటు రైతు సంఘాలు, ఇటు రెవెన్యూ వర్గాలు కోరుతున్నాయి. మరి ఇప్పుడైనా ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో వేచి చూడాల్సిందే.
ధరణి... వెతల కహానీ
Published Wed, Apr 7 2021 1:48 AM | Last Updated on Wed, Apr 7 2021 2:57 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment