వచ్చినవన్నీ ఉచిత దరఖాస్తులే
* క్రమబద్ధీకరణకు కదలని జనం
* సొమ్ము చెల్లించే కేటగిరీలో కానరాని హడావుడి
* హైదరాబాద్ మినహా మిగిలిన జిల్లాల్లో అంతంత మాత్రమే
* 125గజాల్లోపు స్థలాలకు దరఖాస్తుల వెల్లువ
* మీ సేవ కేంద్రాల పోర్టల్‌లోనూ దరఖాస్తు నమూనా
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రభుత్వ భూముల క్రమబద్ధీకరణ ప్రక్రియకు ఆశించిన మేరకు స్పందన కనిపించడం లేదు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ భూముల్లో నివాసాలేర్పరచుకున్న వారికి ఆయా స్థలాలను క్రమబద్ధీకరించాలని ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు గత నెల 31న రెవెన్యూ శాఖ 58, 59 ఉత్తర్వులను జారీచేసింది. అవి జారీ అయిన 20రోజుల్లోగా దరఖాస్తులు చేసుకోవాలని పేర్కొంది.ఈ ప్రకారం 125గజాల్లోపు స్థలాల్లో నివాసముంటున్న పేదలకు ఆయా స్థలాలను ఉచితంగాను, ఆపై 250 గజాల్లోపు వారికి 50శాతం రిజిస్ట్రేషన్ ధర, 500గజాల్లోపు స్థలాలను 75శాతం, ఆపైన నిర్మాణాలున్న స్థలాలను 100శాతం రిజిస్ట్రేషన్ ధర చెల్లింపుతో క్రమబద్ధీకరించాలని నిర్ణయించారు. భూపరిపాలన విభాగం కూడా ఈనెల 8న ఇందుకు సంబంధించి క్షేత్రస్థాయిలో రెవెన్యూ అధికారులకు మార్గదర్శకాలను విడుదల చేసింది.మండల రెవెన్యూ కార్యాలయాలకు వచ్చిన దరఖాస్తులను రెవెన్యూ డివిజినల్ అధికారి(ఆర్డీవో) నేతృత్వంలో ఏర్పాటయ్యే కమిటీ పరిశీలించి నిర్ణయం తీసుకోవాలని పేర్కొన్నారు.ఈ ప్రక్రియంతా 90 రోజుల్లోగా పూర్తి కావాలని కూడా ప్రభుత్వం స్పష్టం చేసింది.
జిల్లాల్లో కానరాని హడావుడి..
క్రమబద్ధీకరణ ఉత్తర్వులు వెలువడి 10 రోజులైనా.. రాష్ట్రవ్యాప్తంగా పెద్దగా స్పందన రాలేదు. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల నుంచి మినహా మిగిలిన అన్ని జిల్లాల నుంచి ఈ ప్రక్రియ పట్ల అటు అధికారులు గానీ, ఇటు స్థానికులు గానీ పెద్దగా ఆసక్తి కనబర్చలేదని సమాచారం. హైదరాబాద్, జీహెచ్‌ఎంసీ పరిధిలోని రంగారెడ్డి జిల్లాలో మాత్రం దరఖాస్తుల కోసం కొందరు తహసీల్దారు కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణ లు చేశారు.
హైదరాబాద్‌లో పెరిగిన తాకిడి..
మరో వైపు గురువారం సాయంత్రం నుంచి జీహెచ్‌ఎంసీ పరిధిలోని అన్ని రెవెన్యూ కార్యాలయాలకు జనం తాకిడి పెరిగింది. గురు, శుక్రవారాల్లో జీహెచ్‌ఎంసీ పరిధిలోని అన్ని మండల రెవెన్యూ కార్యాలయాల్లోనూ క్రమబద్ధీకరణ దరఖాస్తుల స్వీకరణ ప్రారంభించారు. హెల్ప్‌డెస్క్‌లను ఏర్పాటు చేశారు. శుక్రవారం మా త్రం ప్రతీ మండలంలో కనిష్టంగా 100, గరి ష్టంగా 600 వరకు దరఖాస్తులు వచ్చినట్లు రెవెన్యూ అధికారులు చెబుతున్నారు. శనివారం నుంచి పెద్దసంఖ్యలో రావచ్చని భావిస్తున్నారు.
అన్నీ.. ‘ఉచితం’ కేటగిరీలోనే...
క్రమబద్ధీకరణకు సంబంధించి జీహెచ్‌ఎంసీ పరిధిలోని మండల రెవెన్యూ కార్యాలయాలకు వచ్చిన దరఖాస్తుల్లో ‘ఉచితం’ కేటగిరీ దరఖాస్తులే అధికంగా వచ్చాయి. బాలానగర్ మండలంలో మొత్తం 517 దరఖాస్తులు రాగా, ఇందులో 516 ఉచిత కేట గిరీకి చెందినవే. ఒకే ఒక్క దరఖాస్తు అదీ 250 గజాల్లోపు స్థలానికి సంబంధించినదని అధికారులు తెలిపారు. శనివారం నుంచీ అదనపు కౌంటర్లు ఏర్పాటు చేయాలని కూడా అధికారులు నిర్ణయించారు.
‘మీ సేవ’ పోర్టల్‌లో దరఖాస్తు నమూనా..
క్రమబద్ధీకరణ దరఖాస్తు నమూనాను మీసేవ వెబ్ పోర్టల్‌లోనూ ఉంచాలని అధికారులు నిర్ణయించారు. శనివారం నుంచి మీసేవ కేంద్రాల ద్వారా దరఖాస్తులను పొందవచ్చని సీసీఎల్‌ఏ అధికారులు తెలిపారు. కాగా ఈ ప్రక్రియపై ఆశించిన స్పందన రాకపోవడంతో విసృ్తత ప్రచారం చేపట్టాలని అధికారులు భావిస్తున్నారు.