Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

ప్రధాన వార్తలు

Farmers threatened in the name of setting up solar power plants Nandyal1
మీ భూములు.. మా వ్యాపారం

సాక్షి ప్రతినిధి కర్నూలు: ‘‘మీ భూములు బ్యాంకుల్లో తనఖా పెట్టి మేం లోన్లు తీసుకుంటాం. మీ పొలాలతో మేం వ్యాపారం చేసుకుంటాం..!’’ అంటూ నంద్యాల జిల్లా బన­గా­నపల్లె నియోజకవర్గం అవుకు మండలంలో సోలార్‌ విద్యుత్తు ప్లాంటు ఏర్పాటు పేరుతో రైతులను బెదిరించి సారవంతమైన భూములను గుంజుకుంటు­న్నారు. లీజు ముసుగులో 30 ఏళ్ల పాటు పంట భూము­లను తీసుకుని శాశ్వతంగా సొంతం చేసుకునే కుట్రలకు తెర తీశారు. లీజు చెల్లింపులకు సంబంధించి మధ్యలో ఏ సమస్య తలెత్తినా ప్రభుత్వ పూచీకత్తు ఉండదని.. రైతులే స్వయంగా ఢిల్లీకి వెళ్లి పరిష్కరించుకోవాల్సి ఉంటుందని ఒప్పదంలో నిబంధన విధించారు. మంత్రి బీసీ జనార్దనరెడ్డి కనుసన్నల్లో నయానా భయాన సాగుతున్న ఈ భూముల సేకరణతో అన్నదాతలు హడలెత్తిపోతున్నారు. తాతల కాలం నుంచి తమకు బువ్వ పెడుతున్న భూములను అప్పగించి కూలీలుగా మారలేమని ఆక్రోశిస్తున్నారు. గడువు ముగిసినా.. కంపెనీ కనికరిస్తేనే!అవుకు మండలంలో ‘హీరో’ సోలార్‌ కంపెనీ 1,252 ఎకరాల భూమిని సేకరిస్తుండగా లీజు రిజిస్ట్రేషన్లు శరవేగంగా జరుగుతున్నాయి. 29 ఏళ్ల 11 నెలల పాటు లీజు అగ్రిమెంట్‌ రిజిస్ట్రేషన్‌ చేస్తున్నారు. గడువు ముగిసిన తర్వాత లీజు పొడిగించాలని కంపెనీ భావిస్తే రైతులు కచ్చితంగా ఒప్పుకోవాల్సిందే. వ్యవసాయం చేసుకుంటా.. పిల్లల పెళ్లి, ఇంటి ఖర్చుల కోసం పొలం విక్రయిస్తామంటే కుదరదు. ఇదే పొలాన్ని బ్యాంకులో తాకట్టు పెట్టి కంపెనీ రుణాలు తీసుకుంటుంది. ఇక లీజు చెల్లించకపోవడం, రెండేళ్లకోసారి పెంచకపోవడం లాంటి ఎలాంటి సమస్యలు తలెత్తినా ఆర్బిట్రేషన్‌ కోసం రైతులు ఢిల్లీకి వెళ్లాల్సిందే. నంద్యాల, విజయవాడకు వెళ్తామంటే కుదరదు. అంటే భవిష్యత్తులో సమస్యలు ఉత్పన్నమైతే రైతులు పరిష్కరించుకోలేని విధంగా చేసే కుట్ర ఇది!!శాశ్వతంగా దూరం చేసే కుట్ర..నంద్యాల జిల్లా అవుకు మండలంలో హీరో సోలార్‌ ప్యూచర్‌ ఎనర్జీస్‌ కంపెనీ 300 మెగావాట్ల సామర్థ్యంతో సోలార్‌ ప్లాంటు ఏర్పాటు చేస్తోంది. ఇందుకోసం అవుకు, సింగనపల్లె పరిధిలో 1,252 ఎకరాలను ‘క్లీన్‌ రెన్యువబుల్‌ ఎనర్జీ ప్రైవేటు లిమిటెడ్‌’ పేరుతో లీజుకు తీసుకుంటున్నారు. అగ్రిమెంట్‌ నిబంధనలు పరిశీలిస్తే రైతులు తమ అవసరాల కోసం పొలం విక్రయించకుండానే శాశ్వతంగా భూములను దూరం చేసే కుట్ర జరుగుతున్నట్లు స్పష్టమవుతోంది.⇒ ఇవీ నిబంధనలు..⇒ రైతులు తమ భూమిని 29 ఏళ్ల 11 నెలలు లీజుకు ఇస్తున్నట్లు ఏటీఎల్‌ (అగ్రిమెంట్‌ లీజు) సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో రిజిస్టర్‌ చేయాలి. ⇒ లీజు గడువు ముగిసిన తర్వాత కంపెనీ లీజు పొడిగించుకోవాలని భావిస్తే రైతులకు ఇష్టం లేకపోయినా కచ్చితంగా ఒప్పుకుని తీరాల్సిందే.⇒ లీజుకింద ఏడాదికి రూ.40 వేలు ఇస్తారు. రెండేళ్లకోసారి ఐదు శాతం పెరుగుతుంది.⇒ భవిష్యత్తులో ఏదైనా సమస్యలు వస్తే ఆర్బిట్రేషన్‌ కోసం రైతులు ఢిల్లీకి వెళ్లాల్సిందే.⇒ భూమిని కంపెనీ థర్డ్‌ పార్టీకి (మరొకరికి) లీజుకు ఇవ్వవచ్చు.రైతన్నల పొలాలకు దారేది?రాయలసీమలో సోలార్‌ విద్యుదుత్పత్తి కోసం కంపెనీలు ఇప్పటి వరకూ బీడు భూములను కొనుగోలు చేస్తున్నాయి. అయితే ఇప్పుడు లీజు పేరుతో వ్యవసాయ భూములను హస్తగతం చేసుకుంటున్నారు. సోలార్‌ కంపెనీ ఏర్పాటుతో మొత్తం భూములను చదును చేస్తారు. దీంతో సాగునీటి కాలువలు, పొలాల హద్దులు చెరిగిపోతాయి. కంపెనీ చుట్టుపక్కల పొలాలకు సాగునీటి వనరులు ఉండవు. దారులు కూడా మూసుకుపోతాయి. ఎవరైనా రైతు తన పొలం ఇచ్చేందుకు నిరాకరించి వ్యవసాయం చేసుకోవాలని ప్రయత్నిస్తే ఆ పొలానికి దారి లేకుండా చేస్తున్నారు. ‘చుట్టూ సోలార్‌ కోసం అందరూ పొలాలిస్తుంటే మీరొక్కరే ఎలా వ్యవసాయం చేస్తారు? దారి, నీళ్లు లేకుండా పొలంలోకి ఎలా వెళతారు..?’ అని కంపెనీ ప్రతినిధులు, మంత్రి బీసీ జనార్దనరెడ్డి అనుచరులు బెదిరిస్తున్నట్లు రైతులు వాపోతున్నారు. మంత్రికి, కంపెనీకి వ్యతిరేకంగా నోరు విప్పేందుకు జంకుతున్నారు. భూములు లేకుంటే స్థానిక గొర్రెల కాపరులు మేత కోసం అల్లాడాల్సిందే. లెవలింగ్‌ పేరుతో పొలం గట్లను చదును చూస్తే రైతులకు దారి ఉండదు.కంపెనీ చేతుల్లోకి..వ్యవసాయ భూములను పరిశ్రమల కోసం లీజుకు ఇస్తే వ్యవసాయేతర భూమి కిందకు మారుతుంది. అప్పుడు రైతులు ఆస్తి పన్ను, ఆదాయపు పన్ను చెల్లించాలి. ఈ విషయాలను రైతులకు వివరించకుండా కంపెనీ దాగుడు మూతలు ఆడుతోంది. రైతుల నుంచి లీజుకు తీసుకున్న భూములనే బ్యాంకులో తనఖా పెట్టి రుణాలు తీసుకోవాలని హీరో కంపెనీ భావిస్తోంది. ఒకవేళ నష్టాలొచ్చి దివాళా తీస్తే ఆ రుణాలను ఎవరు చెల్లించాలి? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఆర్బిట్రేషన్‌ కోసం రైతులు ఢిల్లీకి వెళ్లగలరా? ఇక లీజు తర్వాత ఆ భూములు సాగు యోగ్యత కోల్పోతాయి. అందులోని సోలార్‌ మెటీరియల్‌ ఎవరు తొలగించాలి? ఎక్కడ పడేయాలి? ఆ ఖర్చు సంగతేమిటి? అనే వివరాలేవీ ఎంవోయూలో లేవు. రైతులకు దీనిపై అవగాహన కల్పించడం లేదు. లీజు ముగిసిందని రైతులు తమ పిల్లల పెళ్లిళ్లు, ఇతర అవసరాల కోసం పొలం విక్రయించుకోవాలంటే కుదరదు. కంపెనీ లీజు పొడిగించాలనుకుంటే రైతు ఒప్పుకుని తీరాల్సిందే! అంటే రైతుకు 30 ఏళ్ల తర్వాత కూడా తన భూమిపై హక్కు ఉండదని స్పష్టమవుతోంది.సాగు భూముల్లో సోలార్‌..!సోలార్‌ ప్లాంటు ఏర్పాటు చేస్తున్న ప్రాంతానికి సమీపంలో అవుకు రిజర్వాయర్‌ ఉంది. ఎస్‌ఆర్‌బీసీ 13వ బ్లాక్‌ నుంచి పొలాలకు నీరు అందుతుంది. ఇక్కడ మిరప, మొక్కజొన్న, జొన్న, వరి, ఉద్యాన పంటలు సాగు చేస్తారు. మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డికి నిజంగానే చిత్తశుద్ధి ఉంటే పొలాలకు రిజర్వాయర్‌ నుంచి పూర్తిగా సాగునీటి వసతి కల్పించాలని రైతులు డిమాండ్‌ చేస్తున్నారు. లీజు అగ్రిమెంట్‌లో లొసుగులపై రైతుల తరఫున కంపెనీని ప్రశ్నించాలని సూచిస్తున్నారు. అలా కాకుండా కంపెనీకి వత్తాసు పలుకుతూ రైతులకు మంత్రి అన్యాయం చేస్తున్నారని మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో అవుకు, శింగనపల్లె రైతులను మంత్రి అనుచరుడు ఉగ్రనరసింహారెడ్డి బుజ్జగిస్తుండగా శింగనపల్లెలో భూములు ఉన్న చెన్నంపల్లె రైతులతో బిజ్జం పార్థసారథిరెడ్డి సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే 600 ఎకరాలకు సంబంధించి రైతులతో సంప్రదింపులు పూర్తయ్యాయి. 80 ఎకరాలకు లీజు అగ్రిమెంట్లు పూర్తయ్యాయి. భూములను బలవంతంగా లాక్కుంటున్నారని రైతులు వాపోతున్నారు.భూములు మావి.. లోన్లు మీకా?: కోట శంకర్‌రెడ్డి, రైతు శింగనపల్లె లీజుకు తీసుకున్న మా భూములు బ్యాంకులో తాకట్టు పెట్టి లోన్‌ తీసుకుని ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తారట. 30 ఏళ్ల లీజు అంటే సగం జీవితం అయిపోతుంది. మా పిల్లలకు భూములు ఎక్కడ ఉన్నాయో కూడా తెలియదు. మా పొలాలు లీజుకు ఇవ్వాలంటూ ఒత్తిడి తెస్తున్నారు. భూములిచ్చి కూలికి వెళ్లాలా?సోలార్‌ ప్యానెళ్లు ఏర్పాటు చేస్తామని హీరో కంపెనీ మా ఊరిలో భూములు లీజుకు తీసుకుంటోంది. నాకు 2.20 ఎకరాలు ఉంది. పొలం అడిగితే ఇవ్వబోమని చెప్పా. తాతల కాలం నుంచి వ్యవసాయం చేస్తూ రైతుగా బతుకుతున్నాం. భూములిచ్చి కూలి పనికి వెళ్లాలా? సోలార్‌ ప్లాంటుతో భూములు చదును చేస్తే మా పొలాలకు నీళ్లు ఎలా? దారి ఎలా? రైతులను బాధ పెట్టొద్దు.– లోకిరెడ్డి శ్రీనివాసరెడ్డి, రైతు, శింగనపల్లె

Former minister Kakani Govardhan Reddy arrested in illegal case2
అక్రమ కేసులో మాజీ మంత్రి కాకాణి అరెస్టు

సాక్షి ప్రతినిధి, నెల్లూరు: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ రెడ్‌బుక్‌ పాలన రోజురోజుకూ శ్రుతిమించుతోంది. వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలే లక్ష్యంగా సర్కారు పెద్దల బరితెగింపు హద్దులు మీరుతోంది. ప్రశ్నించే వారే ఉండకూడదని హూంకరిస్తూ నిత్యం తప్పుడు కేసులతో చెలరేగిపోతోంది. ఈ క్రమంలో మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డిని నెల్లూరు పోలీసులు కక్షపూరితంగా అరెస్ట్‌ చేశారు. కేరళ రాష్ట్రంలో ఆయన్ను అదుపులోకి తీసుకుని ఆదివారం రాత్రి నగరానికి తీసుకువచ్చారు. ఇచ్చిన హామీలు అమలు చేయలేక.. వాటిని ప్రజలకు గుర్తు చేస్తున్న నేతలపై కూటమి ప్రభుత్వం కళ్లెర్ర చేస్తోందనేందుకు కాకాణి అరెస్టే నిదర్శనం. ఆయనకు ఏమాత్రం సంబంధం లేని సిల్లీ కేసులో ప్రభుత్వ పెద్దలు పట్టుబట్టి మరీ అరెస్ట్‌ చేయించడం దుర్మార్గం. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పోలీసులను అడ్డుపెట్టుకుని తప్పుడు కేసులు.. అరెస్టులు.. వేధింపులతో ఈ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోంది. రెడ్‌బుక్‌ కుట్రలతో ఇప్పటికే పదుల సంఖ్యలో ముఖ్య నేతలపై తప్పుడు కేసులు బనాయించారు. ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వ వైఫల్యాలను, అవినీతి, అక్రమాలను ఎప్పటికప్పుడు నిలదీస్తుండటం వల్లే కాకాణిపై తప్పుడు కేసు పెట్టారు. ఇందులో భాగంగా పొదలకూరు మండలం తాటిపర్తి రుస్తుం మైన్స్‌లో అక్రమ మైనింగ్‌ జరిగిందని ఈ ఏడాది ఫిబ్రవరిలో మైనింగ్‌ శాఖ ఇన్‌చార్జ్‌ డీడీ బాలాజీ నాయక్‌ పొదలకూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అక్రమ మైనింగ్‌లో కాకాణి అనుచరుల ప్రమేయం ఉందని, ఆయన వారికి సహకరించారంటూ 120(బి), 447, 427, 379, 290, 506, 109 ఆర్‌/డబ్ల్యూ 34 ఐపీసీ, సెక్షన్‌ 3 పీడీపీపీఎ, సెక్షన్‌ 3 అండ్‌ 5 ఆఫ్‌ ఈఎస్‌ యాక్ట్‌ అండ్‌ సెక్షన్‌ 21(1), 21(4) ఆఫ్‌ ఎంఎండీఆర్‌ యాక్ట్‌ కింద పోలీసులు నాన్‌ బెయిలబుల్‌ కేసు నమోదు చేశారు. ఈ కేసులో మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డికి సంబంధం లేకపోయినా.. పట్టుబట్టి, టార్గెట్‌ చేసి ఏ4గా చేర్చారు. తొలుత ఈ కేసులో బలం లేదని ఏ1తో పాటు మరో ఇద్దరికి హైకోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. దీంతో కేసును మరింత పటిష్టం చేసి కాకాణిని జైలుకు పంపే కుట్రలో భాగంగా అట్రాసిటీ సెక్షన్‌లు జత చేశారు. కాకాణి ప్రస్తుతం కేరళ రాష్ట్రంలో ఉండగా నెల్లూరు పోలీసులు ఆదివారం మధ్యాహ్నం ఆయన్ను అదుపులోకి తీసుకుని నెల్లూరు డీటీసీకి తరలించారు. సమాచారం అందుకున్న మాజీ మంత్రి డాక్టర్‌ పి.అనిల్‌కుమార్‌ యాదవ్, వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలు డైకస్‌ రోడ్డులోని కాకాణి గృహానికి తరలి వస్తున్నారు. అధికార దుర్వినియోగానికి పరాకాష్ట గత ప్రభుత్వ హయాంలో రుస్తుం మైన్స్‌లో అక్రమ మైనింగ్‌ జరుగుతోందంటూ అప్పటి టీడీపీ నేత, ప్రస్తుత సర్వేపల్లి శాసనసభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ఫిర్యాదు చేశారు. దీంతో మైనింగ్‌ శాఖ జాయింట్‌ ఇన్‌స్పెక్షన్‌ చేసింది. ఆ మైన్‌లో క్వార్ట్‌జ్, పల్స్‌పర్, మిక్స్‌డ్‌ మైకా 1050 మెట్రిక్‌ టన్నులు నిల్వ ఉందని, అక్కడ అక్రమ మైనింగే జరగలేదని నివేదిక ఇచ్చింది. ప్రభుత్వం మారడంతో స్థానిక ఎమ్మెల్యే, కూటమి పెద్దలు కాకాణిని టార్గెట్‌ చేసి, అక్రమంగా మైనింగ్‌ జరిగిందంటూ బాలాజీ నాయక్‌ ద్వారా పోలీసులకు ఫిర్యాదు చేయించారు. వాస్తవంగా ఆ మైన్‌లో జాయింట్‌ ఇన్‌స్పెక్షన్‌ చేసి నివేదిక ఇచ్చిన వారిలో ప్రస్తుతం ఫిర్యాదు చేసిన మైనింగ్‌ శాఖ ఇన్‌చార్జ్‌ డీడీ కూడా ఉండడం విశేషం. అధికార దుర్వినియోగం జరిగిందనేందుకు ఇంత కంటే నిదర్శనం అవసరమా?

Rasi Phalalu: Daily Horoscope On 26-05-2025 In Telugu3
ఈ రాశి వారికి ఆకస్మిక ధనలాభం.. శుభవార్తలు

గ్రహం అనుగ్రహం: శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు వైశాఖ మాసం, తిథి: బ.చతుర్దశి ఉ.11.19 వరకు, తదుపరి అమావాస్య, నక్షత్రం: భరణి ఉ.7.40 వరకు, తదుపరి కృత్తిక, వర్జ్యం: రా.6.51 నుండి 8.21 వరకు, దుర్ముహూర్తం: ప.12.21 నుండి 1.13 వరకు, తదుపరి ప.2.56 నుండి 3.48 వరకు,అమృతఘడియలు: రా.3.45 నుండి 5.16 వరకు.సూర్యోదయం : 5.29సూర్యాస్తమయం : 6.24రాహుకాలం : ఉ.7.30 నుండి 9.00 వరకుయమగండం : ఉ.10.30 నుండి 12.00 వరకు మేషం.. నూతన ఉద్యోగయోగం. వ్యవహారాలలో విజయం. శుభవార్తలు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. దైవదర్శనాలు. వ్యాపార, ఉద్యోగాలలో నూతనోత్సాహం.వృషభం.. మిత్రులతో మాటపట్టింపులు. కొత్త రుణయత్నాలు. ఆకస్మిక ప్రయాణాలు. వ్యాపారాలు నిరాశ కలిగిస్తాయి. ఉద్యోగులకు అదనపు బాధ్యతలు. ఆధ్యాత్మిక చింతన.మిథునం... కొత్త పనులు చేపడతారు. సంఘంలో గౌరవం. విలువైన వస్తువులు సేకరిస్తారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపార , ఉద్యోగాలలో పురోగతి.కర్కాటకం... కొత్త కార్యక్రమాలు చేపడతారు. బంధువులతో వివాదాల పరిష్కారం. శుభవార్తలు. ఆకస్మిక ధనలాభం. ఆలయాల సందర్శనం. వృత్తి, వ్యాపారాలలో అనుకూలత.సింహం... వ్యవహారాలు నిరాశ కలిగిస్తాయి. ఆర్థిక పరిస్థితి మందగిస్తుంది. ఆకస్మిక ప్రయాణాలు. ఆరోగ్య భంగం. కుటుంబసభ్యులతో కలహాలు. వృత్తి, వ్యాపారాలు సాదాసీదాగా ఉంటాయి.కన్య.... ఆర్థిక పరిస్థితి నిరాశ కలిగిస్తుంది. దూరప్రయాణాలు. ఒప్పందాల్లో ఆటంకాలు. వ్యాపార, ఉద్యోగాలలో చికాకులు. శ్రమకు ఫలితం అంతగా ఉండదు.తుల.... కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. సన్నిహితులతో వివాదాల పరిష్కారం. వృత్తి, వ్యాపారాలు సాఫీగా సాగుతాయి.వృశ్చికం... కొత్త విషయాలు తెలుసుకుంటారు. పరిస్థితులు అనుకూలిస్తాయి. పాత సంఘటనలు గుర్తుకు వస్తాయి. వాహన, కుటుంబసౌఖ్యం. వృత్తి,వ్యాపారాలలో ముందడుగు.ధనుస్సు..... పనుల్లో స్వల్ప ఆటంకాలు. వృథా ఖర్చులు. అదనపు బాధ్యతలు. ఇంటాబయటా ఒత్తిడులు. వ్యాపారాలు నిరాశ కలిగిస్తాయి. ఉద్యోగులకు ఒడిదుడుకులు. దూరప్రయాణాలు.మకరం...... రుణఒత్తిడులు. పనులలో కొద్దిపాటి ఆటంకాలు. అనుకోని‡ప్రయాణాలు. శ్రమాధిక్యం. ఆరోగ్యభంగం. వ్యాపారాలు అంతంత మాత్రంగా ఉంటాయి. ఉద్యోగులకు పనిభారం.కుంభం... వ్యవహారాలలో విజయం. శుభకార్యాలలో పాల్గొంటారు. పాతబాకీలు వసూలు. చిన్ననాటి మిత్రులను కలుస్తారు. వృత్తి, వ్యాపారాలు ఆశాజనకంగా ఉంటాయి.మీనం... బంధువులతో మాటపట్టింపులు. రుణయత్నాలు. తీర్థయాత్రలు. అనారోగ్యం. కుటుంబంలో సమస్యలు. వ్యాపార, ఉద్యోగాలలో చికాకులు.

Huge Troubles To Kazipet Mini Coach Factory4
‘కాజీపేట’కు రెడ్‌సిగ్నల్‌!

అది ప్రధాని మోదీ 2023 జూలై 8న స్వయంగా శంకుస్థాపన చేసిన రైల్వే ప్రాజెక్టు. కానీ విచిత్రంగా రైల్వే బోర్డు మాత్రం ఇప్పటివరకు ఆ ప్రాజెక్టుకు అనుమతి ఇవ్వలేదు. ఫలితంగా ప్రాజెక్టు నిర్మాణ పనులు మూడొంతులు పూర్తయినా ఆధునిక యంత్రాల కోసం దిగుమతి ఆర్డర్‌ ఇవ్వలేని పరిస్థితి నెలకొంది. వెరసి.. మరికొద్ది నెలల్లో ఉత్పత్తి ప్రారంభం కావాల్సిన యూనిట్‌ ఇప్పట్లో అందుబాటులోకి వచ్చేలా కనిపించట్లేదు. ఇదీ కాజీపేట రైల్వే మాన్యుఫాక్చరింగ్‌ యూనిట్‌ (మినీ కోచ్‌ ఫ్యాక్టరీ) దుస్థితి.సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ ప్రజల దశాబ్దాల కలల ప్రాజెక్టు అయిన కాజీపేట కోచ్‌ ఫ్యాక్టరీపై ఏళ్ల తరబడి నాన్చుతూ వచ్చిన కేంద్రం చివరకు దానికి పచ్చజెండా ఊపింది. తొలుత రైల్వే వ్యాగన్‌ ఓవర్‌ హాలింగ్‌ వర్క్‌షాపుగా మంజూరైన ప్రాజెక్టును కోచ్‌ తయారీ యూనిట్‌గా అప్‌గ్రేడ్‌ చేసింది. ఇందులో ఎలక్ట్రిక్‌ మెమూ యూనిట్లు (ఈఎంయూ), సరుకు రవాణా వ్యాగన్లు తయారవుతాయని ప్రకటించింది. దేశవ్యాప్తంగా వందేభారత్‌ రైళ్లను వేగంగా పట్టాలెక్కించే ఉద్దేశంతో వీలైనన్ని ప్రాంతాల్లో ఆ కోచ్‌లను తయారు చేయాలని నిర్ణయించి కాజీపేట యూనిట్‌ను కూడా అందుకు అనుగుణంగా ఉపయోగించుకోవాలని ఆ తర్వాత నిర్ణయించింది. భవిష్యత్తులో కాజీపేట యూనిట్‌లోనూ వందేభారత్‌ కోచ్‌ల తయారీకి వీలుగా మౌలిక వసతులు సిద్ధం చేయాలనుకుంది. దీనికి సంబంధించిన ఆధునిక యంత్రాలను జపాన్‌కు చెందిన టైకిషా కంపెనీ నుంచి దిగుమతి చేసుకోనున్నట్లు ప్రకటించింది.ఇంతవరకు బాగానే ఉన్నా ఆ తర్వాతే పరిస్థితి తలకిందులైంది. ప్రధాని శంకుస్థాపన చేసిన తర్వాత.. ఈ యూనిట్‌ నిర్మాణ బాధ్యతను రైల్‌ వికాస్‌ నిగమ్‌ లిమిటెడ్‌ (ఆర్‌వీఎన్‌ఎల్‌)కు రైల్వేశాఖ అప్పగించింది. ఈ యూనిట్‌ను ఓవర్‌హాలింగ్‌ వర్క్‌షాప్‌గా ప్రతిపాదించినప్పుడే ఆర్‌వీఎన్‌ఎల్‌ టెండర్లు పిలవగా పవర్‌మెక్‌–టైకిషాలతో కూడిన జాయింట్‌ వెంచర్‌ దీన్ని దక్కించుకుంది. తొలుత రూ. 269 కోట్ల యూనిట్‌ వ్యయాన్ని ఆ తర్వాత రూ. 362 కోట్లకు పెంచిన కేంద్రం.. మినీ కోచ్‌ ఫ్యాక్టరీగా అప్‌గ్రేడ్‌ చేశాక దాన్ని రూ. 530 కోట్లకు పెంచింది. అనంతరం ప్రధాని మోదీ ఈ యూనిట్‌ పనులకు శంకుస్థాపన చేశారు. ఇప్పటికే మూడొంతుల పనులు పూర్తవగా వచ్చే మార్చికల్లా యూనిట్‌ పూర్తిగా సిద్ధం కానుంది. వీలైతే ఈ ఏడాది చివరికల్లా సిద్ధం చేసే వీలుందని అధికారులు చెబుతున్నారు. ఓవైపు షెడ్లు సిద్ధమవుతున్న నేపథ్యంలో నిర్మాణ సంస్థతో ఉన్న ఒప్పందం మేరకు జపాన్‌కు చెందిన టైకిషా కంపెనీ నుంచి అత్యాధునిక పరికరాలు, యంత్రాలను దిగుమతి చేసుకోవాల్సి ఉంది. ఆ మేరకు అనుమతి కోరుతూ ఆర్‌వీఎన్‌ఎల్‌ ఇటీవల రైల్వే బోర్డు అనుమతి కోరగా బోర్డు అనూహ్యంగా షాక్‌ ఇచ్చింది. కొర్రీలతో బ్రేకులు! కాజీపేటలో రైల్వే మాన్యుఫాక్చరింగ్‌ యూనిట్‌కు అనుమతే ఇవ్వలేదని రైల్వే బోర్డు స్పష్టం చేసింది. పెంచిన అంచనా వ్యయానికి తాము అనుమతి ఇవ్వనిదే యంత్రాలు ఎలా కొంటారని ఎదురు ప్రశ్నించింది. పైగా అన్ని షెడ్లు, యంత్రాలు ఎందుకో చెప్పడంతోపాటు జపాన్‌ నుంచి కొనాల్సిన అవసరం ఏమిటో లిఖితపూర్వకంగా తెలియజేయాలని ఆదేశించింది. దీంతో ఆర్‌వీఎల్‌ఎల్‌ అధికారులు ఒక్కో దానికి సమాధానం ఇస్తూ వచ్చారు. ఇంతలో ఈ వ్యవహారాలు చూసే రైల్వే బోర్డు ఉన్నతాధికారి బదిలీ కావడంతో కథ మళ్లీ మొదటికొచ్చింది. పాత అధికారి స్థానంలో వచ్చిన కొత్త అధికారి మరిన్ని కొర్రీలు పెడుతున్నారు. ఆ యూనిట్‌ లేఅవుట్‌ పంపాలని.. దాన్ని చూశాక మరిన్ని సందేహాలు తీర్చాలంటూ ఐదారు రోజుల క్రితం అడిగారు. ఈ నేపథ్యంలో ఆ యూనిట్లో ఉత్పత్తి ఎప్పుడు మొదలవుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. రైల్వే బోర్డు తీరు చూస్తే ఇప్పట్లో ఉత్పత్తి మొదలయ్యే సూచనలు కనిపించడం లేదు. ప్రధాని శంకుస్థాపన చేసిన ఓ ప్రాజెక్టు విషయంలో రైల్వే బోర్డు ఇలా వ్యవహరిస్తుండటం స్థానిక అధికారులనే అయోమయానికి గురిచేస్తోంది.

Pakistan Mass Destruction Weapons Mention In US Threat Report5
భారత్‌తో మనుగడకే ప్రమాదం

ఇస్లామాబాద్‌: భారత్‌ వల్ల తన అస్తిత్వమే ప్రమాదంలో పడిందని పాకిస్తాన్‌ భయపడుతోంది. సైనికపరంగా పైచేయిగా ఉన్న భారత్‌ను నిలువరించేందుకు తనకున్న ఏకైక మార్గం అణ్వస్త్రాలే అని భావిస్తోంది. అందుకే, తన వద్ద ఉన్న అణ్వ్రస్తాలను ఆధునీకరించుకునే పనిలో పడింది. ఇందుకోసం సైనిక, ఆర్థిక పరమైన సాయం అందిస్తోంది’..ఈ విషయాలు ఆదివారం అమెరికా రక్షణ నిఘా విభాగం(యూఎస్‌డీఐఏ) వరల్డ్‌ త్రెట్‌ అసెస్‌మెంట్‌ పేరుతో విడుదల చేసిన నివేదికలో ఉన్నాయి. రాబోయే సంవత్సరాల్లో పొరుగు దేశాలతో సరిహద్దుల్లో ఘర్షణలను ఎదుర్కోవడం పాకిస్తాన్‌ మిలటరీ ప్రధాన లక్ష్యాల్లో ఒకటని నివేదిక పేర్కొంది. ఇందులో భాగంగానే అణ్వస్త్రాల నవీకరణ కొనసాగించాలని నిర్ణయించుకుంది. ఈ ఆయుధ సంపత్తిని భద్రంగా కాపాడుకోవడం, కమాండ్‌ కంట్రోల్‌ వంటి వాటిపైనా పాక్‌ మిలటరీ దృష్టి పెట్టిందని తెలిపింది. సామూహిక జన హననాని(డబ్ల్యూఎండీ)కి అవసరమయ్యే ఆయుధ సామగ్రిని విదేశీ ఉత్పత్తి సంస్థలు, దళారుల ద్వారా సేకరించడం ఆర్మీ తప్పనిసరని భావిస్తోంది. డబ్ల్యూఎండీ తయారీ, అభివృద్ధిలో వాడే సామగ్రి, సాంకేతికతను ప్రధానంగా చైనా నుంచి పొందుతోంది. ఇందులో కొన్నిటిని హాంకాంగ్, సింగపూర్, తుర్కియే, యూఏఈల ద్వారా తెప్పించుకుంటోందని యూఎస్‌డీఐఏ నివేదిక తెలిపింది. ‘పాక్‌కు ప్రధాన ఆయుధ సరఫరాదారు చైనా కొనసాగుతున్నప్పటికీ, పాక్‌లో వివిధ ప్రాజెక్టుల కోసం పనిచేసే చైనీయులపై ఉగ్రవాదులు దాడులకు పాల్పడుతున్న ఘటనలు రెండు దేశాలకు ఇబ్బందికరంగా మారాయి. రెండు మిత్ర దేశాల మధ్య ఇవి ఉద్రిక్తతలకు కారణమవుతున్నాయి’అని పేర్కొంది. నివేదికలో భారత్‌ గురించి ఏముంది? జమ్మూకశీ్మర్‌లోని పహల్గాంలో ఏప్రిల్‌లో జరిగిన ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్‌ పాకిస్తాన్‌లోని ఉగ్రవాదుల స్థావరాలే లక్ష్యంగా క్షిపణులను ప్రయోగించిన విషయాన్ని కూడా యూఎస్‌డీఐఏ తన నివేదికలో ప్రస్తావించింది. ‘మే 7 నుంచి 10వ తేదీ వరకు క్షిపణి, డ్రోన్, ఆర్టిలరీ కాల్పులు చోటు చేసుకున్నాయి. 10వ తేదీన రెండు దేశాల సైన్యాలు పూర్తి స్థాయి కాల్పుల విరమణకు అంగీకరించాయి’అని పేర్కొంది. ‘చైనా పలుకుబడికి చెక్‌ పెట్టేందుకు భారత్‌ కూడా వ్యూహాత్మకంగా హిందూ మహా సముద్ర తీర, ద్వీప దేశాలతో ద్వైపాక్షిక రక్షణ భాగస్వామ్యాలను పెంచుకుంటోంది’అని నివేదిక తెలిపింది. భారత్‌–చైనా సరిహద్దుల్లో ఉద్రిక్తతల ప్రస్తావన సైతం ఇందులో ఉంది. ‘తూర్పు లద్దాఖ్‌లోని వివాదాస్పద వాస్తవా«దీన రేఖ వెంబడి చిట్టచివరి రెండు ఘర్షణాత్మక ప్రాంతాల నుంచి ఇరు దేశాలు సైన్యాలను ఉపసంహరించుకున్నప్పటికీ సరిహద్దు విభజన వివాదం అపరిష్కృతంగానే ఉండిపోయింది’అని పేర్కొంది. మిలటరీ ఆధునీకరణ, ఇతర దేశాలపై ఆధారపడటాన్ని తగ్గించుకునే క్రమంలో దేశీయ రక్షణ పరిశ్రమను బలోపేతమయ్యేలా భారత్‌ ‘మేడ్‌ ఇన్‌ ఇండియా’కార్యక్రమాన్ని కొనసాగించే అవకాశముంది.

Allu Aravind on Pawan Kalyans comments6
ఆ నలుగురిలో నేను లేను

సాక్షి, హైదరాబాద్‌: ‘రెండ్రోజుల నుంచి ఆ నలుగురు.. ఆ నలుగురు అని వినిపిస్తోంది. ఆ నలుగురుకి నాకు సంబంధం లేదు. ఆ నలుగురిలో నేను లేను. పదిహేనేళ్ల క్రితం ఆ నలుగురు అని మొదలైంది. ఆ తర్వాత ఆ నలుగురు కాస్తా పదైంది. అది ఎవరూ పట్టించుకోవడం లేదు. ఓ పది మంది దగ్గర థియేటర్లు ఉన్నాయి. ఆ నలుగురి వ్యాపారంలో నేను లేను. కోవిడ్‌ టైమ్‌ నుంచే నేను బయటకు వచ్చాను. తెలుగు రాష్ట్రాల్లో 1,500 థియేటర్లు ఉన్నాయి. కానీ.. తెలంగాణలో నాకున్నది ఒకే ఒక్క థియేటర్‌. ఆంధ్రప్రదేశ్‌లో కూడా అన్నింటినీ వదిలేసుకుంటూ వస్తున్నాను. ప్రస్తుతం 15లోపు థియేటర్లు మాత్రమే నా దగ్గర ఉన్నాయి. వీటి లీజులు అయిపోయిన తర్వాత రెన్యువల్‌ చేయొద్దని నా సిబ్బందితో చెప్పాను. పాత అలవాటు ప్రకారం ఆ నలుగురిలో నా ఫొటోను వాడుకుంటున్నారు. నన్ను విమర్శిస్తున్నారు. దయచేసి మీడియా మిత్రులు ఆ నలుగురు న్యూస్‌లో నన్ను కలపకండి. నేను వాళ్లలో లేను. వారితో వ్యాపారంలో లేను’అని ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్‌ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. ప్రస్తుతం థియేటర్లు, ఎగ్జిబిటర్లు, నిర్మాతల సెక్టార్స్‌లో థియేటర్ల రెవెన్యూ షేరింగ్, థియేటర్స్‌లో అద్దె చెల్లింపులు వంటి అంశాల నేపథ్యంలో తెలుగు చిత్ర పరిశ్రమలో విభిన్నమైన పరిణామాలు చోటుచేసుకుంటున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ విషయంపై ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్‌ స్పందించారు. ఈ సందర్భంగా ఆదివారం ఆయన మాట్లాడుతూ.. ‘జూన్‌ 1 నుంచి తెలుగు రాష్ట్రాల్లో థియేటర్స్‌ను మూసివేస్తారనే అంశంపై ఆంధ్రప్రదేశ్‌ సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్‌ స్పందించిన విధానం చాలా సమంజసంగా ఉందని నాకనిపించింది. ఇక ఈ థియేటర్స్‌ క్లోజ్‌ అంశానికి సంబంధించి ఇటీవల జరిగిన సమావేశాలకు నేను కావాలని, ఇష్టం లేకనే వెళ్లలేదు. అలాగే నా గీతా డిస్ట్రిబ్యూషన్‌ సంబంధించిన వ్యక్తులు కానీ, నాతో అసోసియేట్‌ అయిన వ్యక్తులు కానీ ఈ మీటింగ్‌కు వెళ్లొద్దని చెప్పాను. థియేటర్స్‌కు చాలా కష్టాలు ఉన్నప్పుడు ఇండస్ట్రీ పెద్దలతో మాట్లాడి, సమస్యలను సామరస్యంగా పరిష్కరించుకోవాలి. కానీ కొందరు ఏకపక్షంగా తీసుకున్న నిర్ణయంపై నాకు చిరాకు కలిగి వెళ్లలేదు. థియేటర్లు మూసివేస్తున్నాం అనడం సరైంది కాదు. పవన్‌కళ్యాణ్‌ సినిమా విడుదల సమయంలో థియేటర్లు మూసివేస్తామని చెప్పడం దుస్సాహసం. గతంలో అశ్వనీదత్‌ సినిమా విషయంలో పవన్‌ను కలిశాం. అప్పుడు ఆయన ఫిల్మ్‌ చాంబర్‌ తరపున వెళ్లి ఏపీ సీఎం చంద్రబాబును కలవండన్నట్టు హింట్‌ ఇచ్చారు. అయితే మన వాళ్లు పట్టించుకోలేదు. ఆ విషయాన్ని విస్మరించారు. అధికారికంగా అందరం కలవాలి. కానీ కలవలేదు. ఎవరో ఇటీవల మనది ప్రభుత్వానికి సంబంధం లేని రంగం అని అంటుంటే విన్నాను. ప్రభుత్వానికి సంబంధం లేని పరిశ్రమ అయితే గత చీఫ్‌ మినిస్టర్‌ను సినీ పరిశ్రమలోని పెద్దపెద్ద వాళ్లంతా వెళ్లి ఎందుకు కలిశారు? ఏ వ్యాపారం అయినా సవ్యంగా చేసుకోవాలంటే ప్రభుత్వ సహకారం లేకుండా జరగదు. ఇప్పుడు ప్రభుత్వాన్ని వెళ్లి కలవకపోవడం సరికాదు. మనకు కష్టం వస్తే తప్ప మనం ప్రభుత్వం దగ్గరికి వెళ్లమా? నిజంగానే సింగిల్‌ స్క్రీన్‌ థియేటర్లకు సమస్యలు ఉన్నాయి. సమస్యలు ఉన్నప్పుడు మాట్లాడుకోవాలి తప్ప.. ఇలా థియేటర్స్‌ మూసివేస్తున్నామని చెప్పడం సరికాదు’అని అరవింద్‌ వ్యాఖ్యానించారు. పవన్‌ వ్యాఖ్యల్ని అరవింద్‌ ఖండించారంటున్న నెటిజన్లు ‘ప్రైవేట్‌ పెట్టుబడితో మేం సినిమాలు చేస్తే గవర్నమెంట్‌ కంట్రోల్‌ చేస్తానంటాదేంటి’అని గత ప్రభుత్వ హయాంలో పవన్‌కళ్యాణ్‌ చేసిన వ్యాఖ్యలను పరోక్షంగా ప్రస్తావిస్తూ.. ‘ఏ వ్యాపారమైనా సవ్యంగా చేసుకోవాలంటే ప్రభుత్వ సహకారం లేకుండా జరగదు. అటువంటిది ప్రభుత్వంతో సంబంధం ఏంటి. మాది ప్రైవేట్‌ వ్యాపారం అనడం సరికాదు. ప్రభుత్వంతో సంబంధం ఉంటుంది. ప్రభుత్వం కో–ఆపరేషన్‌ కావాలి’అంటు అరవింద్‌ తాజాగా చేసిన వ్యాఖ్యల్ని నెటిజన్లు ప్రముఖంగా చర్చించుకుంటున్నారు. గత ప్రభుత్వ హయాంలో పవన్‌కళ్యాణ్‌ చేసిన వ్యాఖ్యల్ని అల్లు అరవింద్‌ పరోక్షంగా ఖండించినట్టు ఉన్నాయని నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు. అప్పట్లో పవన్‌కళ్యాణ్‌ చేసిన వ్యాఖ్యలకు.. తాజాగా అరవింద్‌ చేసిన వ్యాఖ్యల వీడియో క్లిప్‌ను జతచేసి సోషల్‌ మీడియా వేదికలపై వైరల్‌ చేస్తున్నారు.

BJP Notice To Gonda chief Amar Kishore Kashyap Over His Viral Video7
పెద్ద సారూ.. పార్టీ ఆఫీసులో ఇదేం పని.. వీడియో వైరల్‌

లక్నో: బీజేపీ సీనియర్‌ నేత ఒకరు పార్టీకి చెందిన మహిళతో అసభ్యకరంగా ప్రవర్తించిన ఘటన తీవ్ర కలకలం సృష్టించింది. మహిళా కార్యకర్తను రాత్రి వేళ పార్టీ కార్యాలయంలోకి తీసుకెళ్లడం ఆమెతో అనుచితంగా ప్రవర్తించిన వీడియో బయటకు వచ్చింది. ఈ వీడియో సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతుండటంతో సదరు నేత స్పందిస్తూ.. దీని వెనుక రాజకీయ కారణాలున్నాయని చెప్పడం గమనార్హం. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది.వివరాల ప్రకారం.. ఏప్రిల్‌ 12న రాత్రి 9.30 గంటల సమయంలో గోండా జిల్లా బీజీపీ అధ్యక్షుడు అమర్ కిషోర్ కశ్యప్, ఒక మహిళా కార్యకర్తతో కలిసి కారులో పార్టీ కార్యాలయానికి చేరుకున్నాడు. మెట్ల వద్ద ఆమెను కౌగిలించుకున్నాడు. ఆ తర్వాత ఆ మహిళతో కలిసి పై అంతస్తులోని గదిలోకి వెళ్లాడు. బీజేపీ పార్టీ కార్యాలయంలోని సీసీటీవీలో ఇది రికార్డ్‌ అయ్యింది. దీంతో ఈ వీడియో క్లిప్‌ తాజాగా వైరల్‌ అయ్యింది. ఈ నేపథ్యంలో బామ్ బామ్‌ మహిళా కార్యకర్తతో అసభ్యకరంగా ప్రవర్తించడంపై విమర్శలు వెల్లువెత్తాయి.#Gonda: बमबम पर आरोप, पार्टी ने जारी किया नोटिस! क्या पद गंवाएंगे भाजपा जिलाध्यक्ष अमर किशोर कश्यप ? @deepaq_singh @Bhupendraupbjp pic.twitter.com/yKU2OFXYpz— GONDA POST (@gondapost) May 25, 2025మరోవైపు ఈ వైరల్‌ వీడియోపై బీజేపీ నేత అమర్ కిషోర్ కశ్యప్ స్పందించారు. ఈ వీడియోలో ఉన్నది తానేనని ఒప్పుకున్నారు. పార్టీ జిల్లా అధ్యక్షుడిగా నేను కొనసాగడం ఇష్టం లేని వ్యక్తులు పన్నిన కుట్ర ఇది. కొంతమంది నా ప్రతిష్టను దెబ్బతీసేందుకు నిరంతరం ప్రయత్నిస్తున్నారు. ఇది ఏప్రిల్ 12 తేదీన జరిగింది. ఆ రోజు మహిళా కార్యకర్త అకస్మాత్తుగా అనారోగ్యానికి గురైంది. దీంతో పార్టీ కార్యాలయంలో విశ్రాంతి తీసుకోవాలని సూచించాను. మానవతా దృక్పథంతో ఆ మహిళకు సహాయం చేశానని చెప్పుకొచ్చారు. అయితే, తనపై కుట్రతో ఇలా చేస్తున్నారని ఆరోపించారు. ‘ఈ వీడియో వైరల్‌ వెనుక రాజకీయ కారణాలు ఉన్నాయి’ అని చెప్పుకొచ్చారు. Gonda BJP Chief Responds to Viral Video: “She Was Unwell, Needed Rest” pic.twitter.com/pVY9o8OKoT— The Times Patriot (@thetimespatriot) May 25, 2025ఈ వీడియో బయటకు వచ్చిన నేపథ్యంలో అమర్ కిషోర్‌కు పార్టీ హైకమాండ్‌ నోటీసులు జారీ చేసింది. ఏడు రోజుల్లో దీనిపై వివరణ ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొంది. అనంతరం, బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గోవింద్ నారాయణ్ శుక్లా స్పందిస్తూ..‘సోషల్ మీడియాలోని వీడియో పార్టీ ప్రతిష్టను దెబ్బతీసే విధంగా ఉంది. పార్టీ నేతలకు క్రమశిక్షణ అవసరం. ఈ ఘటనపై నోటీసులు ఇవ్వడం జరిగింది. అనుచితంగా ప్రవర్తించినట్టు తేలితే కఠినమైన క్రమశిక్షణా చర్యలు ఉంటాయని హెచ్చరించారు.

Sakshi Special Story About Futures and Options Trading 8
ఎఫ్‌అండ్‌వో.. ఓ డేంజర్‌ ‘గేమ్‌’!

ప్రసాద్‌ (55) ఓ ప్రైవేటు ఉద్యోగి. ఇటీవలి మార్కెట్‌ దిద్దుబాటుకు ముందు ఎఫ్‌అండ్‌వో (ఫ్యూచర్స్‌ అండ్‌ ఆప్షన్స్‌) మార్కెట్లోకి అడుగుపెట్టాడు. ఒక ప్రైవేటు సంస్థ సిఫారసులతో ట్రేడ్‌ చేయగా.. ఒక్కరోజులోనే రూ. లక్షన్నర లాభం కళ్లజూడడంతో రెట్టించిన ఉత్సాహంతో ట్రేడింగ్‌ చేశాడు. పది రోజుల తర్వాత అకౌంట్‌ చూసుకుంటే అప్పటి వరకు వచ్చిన లాభాన్నంతా మళ్లీ మార్కెట్టే పట్టుకుపోయిందని అర్థమైంది. అంతేకాదు, అదనంగా రూ.2 లక్షల పెట్టుబడి కూడా కరిగిపోయింది. అయినా సరే పోయినచోటే వెతుక్కోవాలనే తపనతో.. ప్రసాద్‌ పొద్దస్తమానం ఎఫ్‌అండ్‌వో ఆలోచనలతో బతికేస్తున్నాడు. ఎఫ్‌అండ్‌వో మార్కెట్‌ విషయంలో రిటైల్‌ ఇన్వెస్టర్ల పరిణతి లేమికి మచ్చుకు ఇదొక్క ఉదాహరణ మాత్రమే! సెబీ అధ్యయనం ప్రకారం 2023–24 ఆర్థిక సంవత్సరంలో ఎఫ్‌అండ్‌వో విభాగంలో ప్రతి 10 మంది ట్రేడర్లకు గాను లాభం పొందింది ఒక్కరే. 91.1 శాతం మంది (73 లక్షల మంది సుమారు) ఎఫ్‌అండ్‌వోలో నష్టాలు పోగేసుకోవాల్సి వచ్చింది. ఇక మిగిలిన 8.9 శాతం మందిలో రూ. లక్షపైన లాభం సొంతం చేసుకున్నది కూడా కేవలం ఒక్క శాతమే ఉన్నారు. 75 శాతానికి పైగా ఎఫ్‌అండ్‌వో ట్రేడర్లు 2023–24లో తమ ఆదాయం రూ.5 లక్షల్లోపే అని వెల్లడించడం వీరంతా తక్కువ ఆదాయ వర్గాలకు చెందిన వారన్నది స్పష్టం చేస్తోంది. అంతేకాదు వీరంతా అంతకు ముందు రెండు ఆర్థిక సంవత్సరాల్లోనూ చేతులు కాల్చుకున్నట్టు సెబీ గణాంకాల ఆధారంగా తెలుస్తోంది. అందుకే ఎఫ్‌అండ్‌వో చిన్న ఇన్వెస్టర్లు, రిటైల్‌ ఇన్వెస్టర్ల ‘గేమ్‌’ కానే కాదని నిపుణులు తరచూ చెప్పేది. ఇనిస్టిట్యూషనల్‌ ట్రేడర్లతో పోటీపడే సామర్థ్యాలు, వసతులు, నైపుణ్యాలు రిటైల్‌ ఇన్వెస్టర్లకు లేకపోవడంతో ఎఫ్‌అండ్‌వోలో నెగ్గలేని పరిస్థితి. సమగ్రమైన అవగాహన, తగినంత పెట్టుబడి, ట్రేడింగ్‌ వ్యూహాలు, టెక్నాలజీ, వసతులతోనే ఎఫ్‌అండ్‌వోలో తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడం సరైనదన్న సూచన నిపుణుల నుంచి వస్తోంది. వేగంగా లాభాలు అసాధ్యం! కరోనా విపత్తు తర్వాత ఈక్విటీల్లో రిటైల్‌ ఇన్వెస్టర్ల సంఖ్య గణనీయంగా పెరిగిపోయింది. 2019లో 3.93 కోట్ల డీమ్యాట్‌ ఖాతాలు ఉంటే అవి ప్రస్తుతం 19.24 కోట్లకు పెరగడం దీనికి నిదర్శనం. కొత్త ఇన్వెస్టర్లలో ప్రధానంగా కనిపించే సమస్య.. లాభాల ఆకాంక్షలు ఎక్కువ, పెట్టుబడి తక్కువ. కొద్ది పెట్టుబడితోనే భారీగా సంపాదించేయొచ్చన్న అత్యాశ వారిని ఎఫ్‌అండ్‌వో మార్కెట్‌వైపు ఆకర్షిస్తోంది. ‘‘డెరివేటివ్‌లు (ఎఫ్‌అండ్‌వో) అన్నవి హెడ్జింగ్, ఆర్బిట్రేజ్, యాక్టివ్‌ ట్రేడింగ్‌ కోసం రూపొందించినవి. కానీ, ప్రస్తుత రిటైల్‌ ఇన్వెస్టర్ల భాగస్వామ్యాన్ని పరిశీలిస్తే స్పెక్యులేటివ్‌ ట్రేడింగ్‌వైపే మొగ్గు కనిపిస్తోంది’’ అని కోటక్‌ సెక్యూరిటీస్‌ డెరివేటివ్స్‌ రీసెర్చ్‌ హెడ్‌ సహజ్‌ అగర్వాల్‌ తెలిపారు. ‘ఎంత చెట్టుకు అంత గాలి’ అన్నట్టు.. ఎఫ్‌అండ్‌వోలో రిటైల్‌ ఇన్వెస్టర్లు ఎంత ఎక్కువ రిస్క్‌ తీసుకుంటే పెట్టుబడి అంత వేగంగా తుడిచిపెట్టుకుపోయే ప్రమాదం ఉంటుంది. ఇవేమీ అర్థం చేసుకోకుండా దీన్నొక ఆదాయ మార్గంగా చూస్తుండడం మరింత రిస్‌్కను ఆహ్వానించడమే అవుతుంది. రుణంతో మరింత రిస్క్‌ ఎఫ్‌అండ్‌వో మార్కెట్లో మార్జిన్‌ ఫండింగ్, వ్యక్తిగత రుణాలతో ట్రేడింగ్‌కు సైతం రిటైల్‌ ఇన్వెస్టర్లు వెనుకాడడం లేదు. ట్రేడ్‌లతో నష్టపోయి.. తమవద్ద పెట్టుబడి సరిపోక రుణ సదుపాయంతో పొజిషన్లు తీసుకుంటున్నారు. లాభంతో తీర్చేయొచ్చన్న అంచనాలతో మరింత రిస్క్‌ తీసుకుంటున్నారు. నష్టం వస్తే పరిస్థితి ఏంటన్న ఆలోచన కూడా కనిపించడం లేదు. ఇన్వెస్టర్లలో ప్రవర్తనా పరమైన బలహీనతలు సైతం అధిక నష్టాలకు దారితీస్తున్నట్టు నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఒక ట్రేడ్‌లో నష్టం రాగా, తదుపరి ట్రేడ్‌లో లాభం వస్తుందన్న అతివిశ్వాసం పనికిరాదంటున్నారు. ‘‘ఆప్షన్‌ ధరల తీరు, నమూనాలు, డెరివేటివ్‌లను సరిగ్గా అర్థం చేసుకోకుండా.. యూట్యూబ్‌ ఛానళ్లను చూడడం, సోషల్‌ మీడియా గురువులను అనుసరించడం లేదంటే వాట్సాప్‌ గ్రూప్‌లలో చేరడం ద్వారా ఎఫ్‌అండ్‌వోలో లాభాలు సంపాదించేయగలమన్నది తప్పుడు అవగాహనే అవుతుంది’’ అని ప్రైమ్‌ వెల్త్‌కు చెందిన సరి్టఫైడ్‌ ఫైనాన్షియల్‌ ప్లానర్‌ (సీఎఫ్‌పీ) అలోక్‌ దూబే పేర్కొన్నారు. చాలా మంది రిటైల్‌ ఇన్వెస్టర్లలో సరైన విజ్ఞానం, క్రమశిక్షణ ఉండడం లేదన్నారు. ఇవి లేకుండా ఎఫ్‌అండ్‌వో ట్రేడింగ్‌ గ్యాంబ్లింగే అవుతుందని హెచ్చరించారు. పెద్ద సవాలు.. ఎఫ్‌అండ్‌వో ట్రేడింగ్‌ అన్నది ఎంతో సంక్లిష్టమైనదని నిపుణుల విశ్లేషణ. మార్కెట్, స్టాక్స్‌ కదలికలు దేశీ, అంతర్జాతీయ పరిణామాల ఆధారంగా ఉంటాయి. కనుక ఒక స్టాక్‌ పెరుగుతుందా? పడుతుందా? అని ఊహించడం అసాధ్యం. ఈ సవాళ్లను అధిగమించేందుకు సరైన వ్యూహాలు ఉండాలి. ట్రేడ్స్‌ ఎంపికకు స్పష్టమైన, నిర్మాణాత్మకమైన విధానం లేకుండా ఎఫ్‌అండ్‌వో మార్కెట్లోకి అడుగు పెట్టడం ఎక్కువ మంది ఇన్వెస్టర్లు చేస్తున్న తప్పిదమని కోటక్‌ సెక్యూరిటీస్‌ డెరివేటివ్స్‌ హెడ్‌ సహజ్‌ అగర్వాల్‌ తెలిపారు. అసలు ఎఫ్‌అండ్‌వో మార్కెట్‌ ఎలా పనిచేస్తుందో ముందుగా అర్థం చేసుకోవాలని సూచించారు. క్యాష్‌ మార్కెట్‌ లేదా ఎఫ్‌అండ్‌వో లేదా కమోడిటీలు ఇలా ఏ విభాగమైనప్పటికీ కాల పరీక్షలకు నిలిచిన చక్కని వ్యూహాలు అవసమరని.. అవి లేకుండా ట్రేడింగ్‌ చేయడం అవకాశమే కానీ, నైపుణ్యం కాబోదన్నారు. ‘‘ఎఫ్‌అండ్‌వో వారం, నెలవారీ సిరీస్‌లలో రోజులు గడుస్తూ, ఎక్స్‌పైరీ సమీపిస్తున్న క్రమంలో అనుకున్న దిశలో దాని చలనం లేకపోతే, అప్పుడు ఆప్షన్ల విలువ వేగంగా తగ్గిపోతుంటుంది. ఏదైనా ఒక వ్యూహం ఫలించి మంచి లాభం వచ్చినప్పటికీ.. అదే వ్యూహం ప్రతి రోజూ ఫలితమిస్తుందని గ్యారంటీ లేదు’’ అని అగర్వాల్‌ వివరించారు. ఫిన్‌ఫ్లుయెన్సర్స్‌ మాయలోపడితే అంతే.. బజాజ్‌ బ్రోకింగ్‌ రీసెర్చ్‌ ప్రకారం.. ఎఫ్‌అండ్‌వోలోకి ఎక్కువ మంది రిటైల్‌ ఇన్వెస్టర్లు అడుగు పెట్టడం వెనుక ఆర్థిక ప్రభావశీలురు (ఫిన్‌ఫ్లూయెర్స్‌) పరోక్ష ప్రోద్బలం, సోషల్‌ మీడియా ప్రభావం ఎక్కువగా ఉంటోంది. ఎఫ్‌అండ్‌వోలో తాము పెద్ద మొత్తంలో సంపాదించామంటూ యూట్యూబ్, ఎక్స్‌ ప్లాట్‌ఫామ్, ఇన్‌స్టా్రగామ్‌లపై కనిపించే ఎన్నో వీడియోలు ఇన్వెస్టర్లను తప్పుదోవ పట్టిస్తున్నాయి. పులిని చూసి నక్క వాత పెట్టుకున్న చందంగా.. అప్పటి వరకు ఎఫ్‌అండ్‌వో మొహం చూడని వారు సైతం ట్రేడింగ్‌కు ఆసక్తి చూపిస్తున్నారు. ఆర్థిక ప్రభావశీలురులో రాబడులను ఎక్కువ చేసి చూపించడంపై ఉన్న శ్రద్ధ అదే సమయంలో రిస్‌్కలు, ట్రేడింగ్‌ స్ట్రాటజీలను వెల్లడించడంపై ఉండదు. దీంతో ఎఫ్‌అండ్‌వో ట్రేడింగ్‌ ధనవంతులు కావడానికి సులభ మార్గం అన్న తప్పుడు అభిప్రాయానికి దారితీస్తోంది. అందుకే ఫిన్‌ఫ్లుయెన్సర్స్‌ తీరును నియంత్రించేందుకు సెబీ ఎన్నో కఠిన నిబంధనలను తీసుకువచ్చింది. ఇన్‌స్టిట్యూటషనల్‌ ఇన్వెస్టర్లదేపైచేయి ఎఫ్‌అండ్‌వో మార్కెట్లో మెజారిటీ రిటైల్‌ ఇన్వెస్టర్ల పెట్టుబడి.. అతి కొద్ది మంది బడా ఇన్వెస్టర్లు, ఇనిస్టిట్యూషనల్‌ ఇన్వెస్టర్లకు సమర్పయామిగా మారుతోంది. ‘‘ఎఫ్‌అండ్‌వో విభాగంలో రిటైల్‌ ఇన్వెస్టర్లతో పోల్చుకుంటే ఇన్‌స్టిట్యూషనల్‌ ట్రేడర్లకు స్పష్టమైన అనుకూలతలు ఉన్నాయి. గొప్ప టెక్నాలజీ వసతులు, ట్రేడ్‌లపై తక్కువ చార్జీలు, క్రమశిక్షణతో కూడిన విధానాలు వారి సొంతం’’ అని రెలిగేర్‌ బ్రోకింగ్‌ రిటైల్‌ రీసెర్చ్‌ సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ రవిసింగ్‌ వివరించారు. 2023–24లో ప్రొప్రయిటరీ ట్రేడర్లు (బ్యాంక్‌లు, ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంక్‌లు, బ్రోకరేజీలు తదితర) రూ.33,000 కోట్లు, విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్‌పీఐలు) రూ.28,000 కోట్ల చొప్పున ఎఫ్‌అండ్‌వో మార్కెట్లో లాభాలు పోగేసుకున్నారు. రిటైల్‌ ట్రేడర్లు ఉమ్మడిగా రూ.61,000 కోట్లు నష్టపోయారు. లావాదేవీల చార్జీలు దీనికి అదనం. ‘‘అతి విశ్వాసం, పాక్షిక వాదం తదితర ప్రవర్తనా లోపాలకు ఇనిస్టిట్యూషనల్‌ ఇన్వెస్టర్లు దూరంగా ఉంటారు. రిటైల్‌ ఇన్వెస్టర్లను ఉచ్చులోకి లాగేవి ఇవే. అత్యాధునిక టూల్స్, వ్యయాల పరంగా సానుకూలత, సహేతుక నిర్ణయాలు ఇనిస్టిట్యూషనల్‌ ఇన్వెస్టర్లకు ఎఫ్‌అండ్‌వో మార్కెట్లో అనుకూలిస్తున్నాయి’’ అని రవిసింగ్‌ తెలిపారు. ఇనిస్టిట్యూషనల్‌ ఇన్వెస్టర్లకు ఆల్గోరిథమ్‌ ట్రేడింగ్‌ (ఎప్పుడు ఏ ధరలో కొనుగోలు, విక్రయాలు చేయాలన్న కోడింగ్‌ సాఫ్ట్‌వేర్‌) అత్యంత అనుకూలించే అంశం. ప్రొప్రయిటరీ ట్రేడర్లలో 96 శాతం మందికి లాభాలు ఈ మార్గంలోనే వస్తున్నట్టు రవిసింగ్‌ తెలిపారు. భావోద్వేగాలతో సంబంధం లేకుండా ధరల గమనం ఆధారంగా వేగంగా కొనుగోలు, అమ్మకాల లావాదేవీలను ఆల్గోరిథమ్‌ ట్రేడింగ్‌ సాఫ్ట్‌వేర్‌ పూర్తి చేస్తాయి. రిటైల్‌ ఇన్వెస్టర్లలో 13 శాతం మందే ఆల్గోరిథమ్‌ ట్రేడింగ్‌ వినియోగిస్తున్నారు. ‘‘ఇనిసిట్యూషనల్‌ ఇన్వెస్టర్లు ఎప్పటికప్పుడు తాజా మార్కెట్‌ సమాచారాన్ని మైక్రో సెకన్లలోనే తెలుసుకోగలరు. ఆప్షన్లతో హెడ్జ్‌ చేసుకోగలరు. వోలటాలిటీ స్ప్రెడ్స్‌ (తటస్థ ఆప్షన్‌ విధానం), నేరుగా మార్కెట్‌ యాక్సెస్, తక్కువ చార్జీలు వారికి అనుకూలం. రిటైల్‌ ట్రేడర్లు కొంచెం ఆలస్యంగా వచ్చే డేటాపై ఆధారపడుతుంటారు. ట్రేడ్‌వారీ చార్జీలు వీరికి ఎక్కువ. అంచనాలు తప్పడం, సోషల్‌ మీడియా టిప్స్‌ వారికి ప్రతికూలం’’ అని రవిసింగ్‌ వివరించారు. రిటైల్‌ ఇన్వెస్టర్ల తప్పటడుగులు → ఫ్యూచర్స్, ఆప్షన్లు ఎలా పనిచేస్తాయో కూడా తెలియకుండా ఎఫ్‌అండ్‌వోలోకి పెట్టుబడితో అడుగుపెట్టడం. → మార్కెట్‌ సంకేతాలను, కాంట్రాక్టుల సంక్లిష్టతలను తప్పుగా అర్థం చేసుకోవడం. → మార్జిన్‌ ఫండింగ్‌తో ట్రేడ్లు చేయడం. → నష్టాన్ని పరిమితం చేసుకునేందుకు స్టాప్‌లాస్‌ ఆర్డర్లను వినియోగించుకోకపోవడం. → స్పష్టమైన ప్రణాళిక లేకుండా అత్యాశ, భయాల ఆధారంగా నిర్ణయాలు తీసుకోవడం. → నష్టాన్ని భర్తీ చేసుకునేందుకు మరిన్ని ట్రేడ్లు చేయడం. → తరచూ ట్రేడ్లు చేయడం ద్వారా చార్జీల రూపంలో అధికంగా నష్టపోవడం. → ప్రతికూల పరిణామాల్లోనూ ట్రేడ్లు కొనసాగించడం. → ఎలాంటి వ్యూహాలు లేకుండా మార్కెట్‌లో వచ్చే సమాచారం ఆధారంగా స్వీయ అంచనాలతో ట్రేడ్లు చేయడం. ప్రయోజనాలు వేరు.. ఎఫ్‌అండ్‌వో అన్నది నిజమైన స్టాక్స్‌ కాకుండా డిజిటల్‌ కాంట్రాక్టులు. కనుక 10–20 శాతం మార్జిన్‌తోనే 100 శాతం విలువైన ఫ్యూచర్‌ కాంట్రాక్ట్‌ను సొంతం చేసుకోవచ్చు. ఆప్షన్లు అయితే ఇంకా తక్కువ పెట్టుబడికే వస్తాయి. మార్కెట్‌ పతనాల్లో స్టాక్స్‌ హోల్డింగ్స్‌ విలువను కాపాడుకునేందుకు ఎఫ్‌అండ్‌వోను హెడ్జింగ్‌ టూల్‌ కింద బడా ఇన్వెస్టర్లు ఉపయోగించుకుంటారు. మెజారిటీ రిటైల్‌ ఇన్వెస్టర్లకు ఈ హెడ్జింగ్‌ స్ట్రాటజీలు తెలియవు. పైగా వారి పెట్టుబడి హెడ్జ్‌ చేసుకునే స్థాయిలోనూ ఉండదు. మ్యూచువల్‌ ఫండ్స్‌ పథకాల తరఫున ఫండ్‌ మేనేజర్లు ఈ హెడ్జింగ్‌ టూల్స్‌ను వినియోగించుకునేందుకు అనుమతి ఉంది. సెబీ ఇటీవలే అనుమతించిన స్పెషలైజ్డ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ఫండ్స్‌ (సిఫ్‌) అనే కొత్త మ్యూచువల్‌ ఫండ్స్‌ విభాగంలో అయితే ఫండ్‌ మేనేజర్లు తమ నిర్వహణ ఆస్తుల్లో గరిష్టంగా 20 శాతం వరకు ఎఫ్‌అండ్‌వో ఎక్స్‌పోజర్‌ తీసుకునేందుకు అనుమతి ఉంది. కనుక రిస్క్‌ ఉన్నా అధిక రాబడి కోరుకునే వారు సిఫ్‌లను పరిశీలించొచ్చు. ఇందులో కనీసం రూ.10 లక్షలు ఇన్వెస్ట్‌ చేసుకోవాల్సి ఉంటుంది. ఏమిటి మార్గం..? ‘‘భావోద్వేగాలతో కూడిన నిర్ణయాలు, అపరిమిత ట్రేడింగ్, స్టాప్‌లాస్‌లను నిర్లక్ష్యం చేయడం, సరైన ప్రణాళిక లేకపోవడం పెట్టుబడిని వేగంగా హరించేస్తుంది. విజయవంతమైన ట్రేడింగ్‌ అంటే సానుకూల పరిస్థితుల్లో లాభాలు ఆర్జించడమే కాదు. క్రమశిక్షణతో ప్రతికూలతలను అధిగమించి పెట్టుబడిని కాపాడుకోవడం కూడా’’ అని సహజ్‌ అగర్వాల్‌ తెలిపారు. → డెరివేటివ్‌లకు సంబంధించి సాంకేతిక సంక్లిష్టతలను అర్థం చేసుకోవడంపై ఇన్వెస్టర్లు దృష్టి సారించాలి. మార్జిన్‌ అవసరాలు, అస్థిరతలు, ఆప్షన్‌ ధరల తీరుతెన్నులను అర్థం చేసుకోవాలి. టెక్నికల్‌ అంశాలు తెలియాలి. – సంప్రదాయ స్టాక్స్‌లో పెట్టుబడులతో పోలి్చనప్పుడు ఎఫ్‌అండ్‌వోలో పెట్టుబడులపై ప్రాథమి క అవగాహన ఒక్కటే సరిపోదు. తగినంత వి జ్ఞానం కోసం గట్టిగా కృషి చేయాల్సిందే. వేగంగా లాభాలు సంపాదించాలన్న కాంక్షతో చాలా మంది రిటైల్‌ ట్రేడర్లు దీన్ని విస్మరిస్తుంటారు. – దశాబ్దాల అనుభవం, అత్యాధునిక టెక్నాలజీ టూల్స్, పెట్టుబడి బలంతో ఉన్న ఇనిస్టిట్యూషనల్‌ ఇన్వెస్టర్లతో పోటీపడాలంటే రిటైల్‌ ఇన్వెస్టర్లు సైతం తగిన విధంగా సన్నద్ధం అవ్వాలి. – స్పెక్యులేటివ్‌ ధోరణిని వీడి క్రమశిక్షణతో కూడిన వ్యూహాలు, హెడ్జింగ్‌ స్ట్రాటజీలపై దృష్టి పెట్టాలి. – ఆర్థిక ప్రభావశీలురు, తప్పుదోవ పట్టించే కంటెంట్‌కు దూరంగా ఉండాలి. ట్రేడింగ్, సాంకేతిక అంశాలపై విఖ్యాత ఇన్వెస్టర్లు రాసిన పుస్తకాలను చదవి అపోహలు తొలగించుకోవాలి. ‘‘ ఇన్వెస్టింగ్, ట్రేడింగ్‌ రెండూ విరుద్ధమైనవి. పెట్టుబడులకు సహనం, దీర్ఘకాల దృష్టి అవసరం. ట్రేడింగ్‌లో రిస్‌్కతో కూడిన తక్షణ వ్యూహాత్మక చర్య అవసరం. అవగాహన కలిగిన రిటైల్‌ ఇన్వెస్టర్లు సైతం తమ స్వల్పకాల, దీర్ఘకాల లక్ష్యాల కోసం సంప్రదాయ మ్యూచువల్‌ ఫండ్స్, స్టాక్స్‌కు పరిమితం కావడం మంచిది. ఈ విషయంలోనూ నిపుణుల మార్గదర్శనం అవసరమే’’ అని సహజ్‌ అగర్వాల్‌ సూచించారు. – సాక్షి, బిజినెస్‌ డెస్క్‌

Hyderabad and Chennai win big in their last league matches9
ఆఖర్లో అదరహో

‘ప్లే ఆఫ్స్‌’ రేసు నుంచి తప్పుకున్న జట్లు... తమ ఆఖరి లీగ్‌ మ్యాచ్‌ల్లో దంచికొట్టాయి. గుజరాత్‌ టైటాన్స్‌తో పోరులో చెన్నై దుమ్మురేపి 230 పరుగులు చేస్తే... కోల్‌కతా నైట్‌రైడర్స్‌పై సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ 278 పరుగులతో విరుచుకుపడింది. అంచనాల ఒత్తిడి లేకపోవడంతో స్వేచ్ఛగా ఆడిన ఈ రెండు జట్లు విజయాలతో సీజన్‌ను ముగించాయి. గుజరాత్‌తో పోరులో చెన్నై బ్యాటర్లు కాన్వే, బ్రెవిస్‌ హాఫ్‌ సెంచరీలతో విజృంభిస్తే... నైట్‌ రైడర్స్‌ బౌలర్లను క్లాసెన్, హెడ్‌ చీల్చి చెండాడారు. సీజన్‌ ఆరంభ పోరులో రాజస్తాన్‌ రాయల్స్‌పై 286 పరుగులు చేసి అదరగొట్టిన ఆరెంజ్‌ ఆర్మీ... తమ ఆఖరి మ్యాచ్‌లో మరోసారి మూడొందలకు చేరువైంది. అభిషేక్‌ శర్మ, హెడ్‌ మెరుపులతో భారీ స్కోరుకు పునాది వేస్తే... క్లాసెన్‌ దాన్ని మరో స్థాయికి తీసుకెళ్లాడు. మధ్యలో నిలకడలేమితో పరాజయాలు మూటగట్టుకున్న ఆరెంజ్‌ ఆర్మీ... చివరి మూడు మ్యాచ్‌ల్లోనూ విజయాలు సాధించి పాయింట్ల పట్టికలో ఆరో స్థానానికి ఎగబాకింది. న్యూఢిల్లీ: విధ్వంసకర ఆటతీరుతో ఐపీఎల్‌లో భారీ స్కోర్లకు కేరాఫ్‌ అడ్రస్‌గా మారిన సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ తమ స్థాయికి తగ్గ ప్రదర్శనతో సీజన్‌కు వీడ్కోలు పలికింది. ఆదివారం జరిగిన పోరులో సన్‌రైజర్స్‌ 110 పరుగుల తేడాతో డిఫెండింగ్‌ చాంపియన్‌ కోల్‌కతా నైట్‌రైడర్స్‌ (కేకేఆర్‌)పై విజయం సాధించింది. మొదట సన్‌రైజర్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 278 పరుగులు చేసింది. ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ హెన్రిచ్‌ క్లాసెన్‌ (39 బంతుల్లో 105 నాటౌట్‌; 7 ఫోర్లు, 9 సిక్స్‌లు) అజేయ శతకంతో కదంతొక్కగా... ట్రావిస్‌ హెడ్‌ (40 బంతుల్లో 76; 6 ఫోర్లు, 6 సిక్స్‌లు) దంచికొట్టాడు. బంతి తన పరిధిలో ఉంటే చాలు దానిపై ఆకలిగొన్న సింహంలా విరుచుకుపడిన క్లాసెన్‌ 37 బంతుల్లోనే సెంచరీ పూర్తిచేసుకున్నాడు. అభిషేక్‌ శర్మ (16 బంతుల్లో 32; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు), కూడా రాణించాడు. లక్ష్యఛేదనలో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ 18.4 ఓవర్లలో 168 పరుగులకు ఆలౌటైంది. దంచుడే... దంచుడు మొదట బ్యాటింగ్‌కు దిగిన సన్‌రైజర్స్‌ తొలి ఓవర్‌లో 2 పరుగులకే పరిమితమైంది. ఆ తర్వాతి నుంచి వెనుదిరిగి చూసుకోని రైజర్స్‌... ఫోర్లు, సిక్స్‌లతో మైదానాన్ని మోతెక్కించింది. రెండో ఓవర్‌లో హెడ్‌ సిక్స్‌తో ఖాతా తెరవగా... అభిషేక్‌ రెండు ఫోర్లు బాదాడు. మూడో ఓవర్‌లో 6, 4, 2, 6 బాదిన హెడ్‌... నాలుగో ఓవర్‌లో మరో మూడు ఫోర్లు కొట్టాడు. నోర్జే ఓవర్‌లో అభిషేక్‌ 2 ఫోర్లతో చెలరేగడంతో పవర్‌ప్లే ముగిసేసరికి రైజర్స్‌ 79 పరుగులు చేసింది. నరైన్‌ ఓవర్‌లో రెండు సిక్స్‌లు కొట్టిన అభిషేక్‌... మరో షాట్‌ ఆడే ప్రయత్నంలో ఔట్‌ కాగా... క్లాసెన్‌ రాకతో విధ్వంసం మరో స్థాయికి చేరింది. ఒకవైపు హెడ్, మరోవైపు క్లాసెన్‌ బౌలర్‌తో సంబంధం లేకుండా భారీ షాట్లతో విరుచుకుపడటంతో... 10 ఓవర్లు ముగిసేసరికి ఆరెంజ్‌ ఆర్మీ 139/1తో నలిచింది. ఈ క్రమంలో హెడ్‌ 26 బంతుల్లో అర్ధశతకం పూర్తి చేసుకోగా... హర్షిత్‌ ఓవర్‌లో 4, 6, ,6తో క్లాసెన్‌ 17 బంతుల్లోనే హాఫ్‌సెంచరీ అందుకున్నాడు. హెడ్‌ను ఔట్‌ చేయడం ద్వారా నరైన్‌ ఈ జోడీని విడదీయగా ... ఇషాన్‌ కిషన్‌ వేగంగా ఆడలేకపోయాడు. నరైన్‌ ఓవర్‌లో 2 సిక్స్‌లు కొట్టిన క్లాసెన్‌... వరుణ్‌కు అదే శిక్ష వేసి సెంచరీకి సమీపించాడు. రసెల్‌ ఓవర్‌లో 6, 4 కొట్టిన క్లాసెన్‌... అరోరా బౌలింగ్‌లో రెండు పరుగులు తీసి 37 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. స్కోరు వివరాలు సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఇన్నింగ్స్‌: అభిషేక్‌ (సి) రింకూ (బి) నరైన్‌ 32; హెడ్‌ (సి) రసెల్‌ (బి) నరైన్‌ 76; క్లాసెన్‌ (నాటౌట్‌) 105; ఇషాన్‌ కిషన్‌ (సి) నోర్జే (బి) వైభవ్‌ 29; అనికేత్‌ (నాటౌట్‌) 12; ఎక్స్‌ట్రాలు 24; మొత్తం (20 ఓవర్లలో 3 వికెట్లకు) 278. వికెట్ల పతనం: 1–92, 2–175, 3–158. బౌలింగ్‌: వైభవ్‌ అరోరా 4–0–39–1; నోర్జే 4–0–60–0; హర్షిత్‌ రాణా 3–0–40–0; నరైన్‌ 4–0–42–2; వరుణ్‌ చక్రవర్తి 3–0–54–0; రసెల్‌ 2–0–34–0. కోల్‌కతా నైట్‌రైడర్స్‌ ఇన్నింగ్స్‌: డికాక్‌ (సి) మనోహర్‌ (బి) మలింగ 9; నరైన్‌ (బి) ఉనాద్కట్‌ 31; రహానే (సి) అభిషేక్‌ (బి) ఉనాద్కట్‌ 15; రఘువంశీ (సి) నితీశ్‌ (బి) మలింగ 14; రింకూ (సి) నితీశ్‌ (బి) హర్ష్ దూబే 9; రసెల్‌ (ఎల్బీ) (బి) హర్ష్ దూబే 0; మనీశ్‌ పాండే (సి) మనోహర్‌ (బి) ఉనాద్కట్‌ 37; రమణ్‌దీప్‌ (బి) హర్ష్ దూబే 13; హర్షిత్‌ (సి అండ్‌ బి) మలింగ 34; వైభవ్‌ అరోరా (రనౌట్‌) 0; నోర్జే (నాటౌట్‌) 0; ఎక్స్‌ట్రాలు 6; మొత్తం (18.4 ఓవర్లలో ఆలౌట్‌) 168. వికెట్ల పతనం: 1–37, 2–55, 3–61, 4–70, 5–70, 6–95, 7–110, 8–162, 9–162, 10–168. బౌలింగ్‌: కమిన్స్‌ 2–0–25–0; ఉనాద్కట్‌ 4–0–24–3; హర్షల్‌ 2–0–21–0; ఇషాన్‌ మలింగ 3.4–0– 31–3; హర్ష్ దూబే 4–0–34–3; నితీశ్‌ రెడ్డి 1–0–6–0; అభిషేక్‌ 2–0–25–0. 278/3 ఐపీఎల్‌లో ఇది మూడో అత్యధిక స్కోరు. తొలి రెండు స్థానాల్లోనూ సన్‌రైజర్స్‌ జట్టే ఉంది. 2024లో బెంగళూరుపై 287/5 స్కోరు చేసిన హైదరాబాద్‌... ఈ ఏడాది తమ తొలి మ్యాచ్‌లో రాజస్తాన్‌పై 286/5 పరుగులు చేసింది. 37 సెంచరీకి క్లాసెన్‌ తీసుకున్న బంతులు. ఐపీఎల్‌లో ఇది మూడో వేగవంతమైన శతకం. క్రిస్‌ గేల్‌ (30 బంతుల్లో), వైభవ్‌ సూర్యవంశీ (35 బంతుల్లో), యూసుఫ్‌ పఠాన్‌ (37 బంతుల్లో) తొలి మూడు స్థానాల్లో ఉన్నారు. అహ్మదాబాద్‌: ఐపీఎల్‌ 18వ సీజన్‌ను చెన్నై సూపర్‌ కింగ్స్‌ జట్టు విజయంతో ముగించింది. పాయింట్ల పట్టికలో చివరిదైన పదో స్థానంలో నిలిచిన ధోనీ బృందం... ఆదివారం తమ చివరి లీగ్‌ మ్యాచ్‌లో 83 పరుగుల తేడాతో గుజరాత్‌ టైటాన్స్‌పై గెలుపొందింది. మొదట చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 230 పరుగులు చేసింది. ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ డెవాల్డ్‌ బ్రెవిస్‌ (23 బంతుల్లో 57; 4 ఫోర్లు, 5 సిక్స్‌లు), కాన్వే (35 బంతుల్లో 52; 6 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్ధశతకాలతో ఆకట్టుకున్నారు. ఆయుశ్‌ మాత్రే (17 బంతుల్లో 34; 3 ఫోర్లు, 3 సిక్స్‌లు), ఉర్విల్‌ పటేల్‌ (19 బంతుల్లో 37; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) ధాటిగా ఆడారు. అర్షద్‌ ఖాన్‌ వెసిన రెండో ఓవర్‌లో ఆయుశ్‌ చెలరేగి వరుసగా 2, 6, 6, 4, 4, 6తో 28 పరుగులు రాబట్టాడు. క్రీజులో అడుగుపెట్టిన ప్రతీ బ్యాటర్‌ దంచికొట్టడమే పనిగా పెట్టుకోవడంతో చెన్నై భారీ స్కోరు చేయగలిగింది. అనంతరం లక్ష్యఛేదనలో గుజరాత్‌ 18.3 ఓవర్లలో 147 పరుగులకు ఆలౌటైంది. భారత టెస్టు జట్టులో చోటు దక్కించుకున్న సాయి సుదర్శన్‌ (28 బంతుల్లో 41; 6 ఫోర్లు) టాప్‌ స్కోరర్‌ కాగా... మిగిలిన వాళ్లు ఆకట్టుకోలేకపోయారు. చెన్నై బౌలర్లలో అన్షుల్‌ కంబోజ్, నూర్‌ అహ్మద్‌ చెరో 3 వికెట్లు తీశారు. ఈ మ్యాచ్‌తో ధోని ఐపీఎల్‌కు వీడ్కోలు పలుకుతాడని జోరుగా చర్చ సాగగా... మహీ తనకు అలవాటైన రీతిలో ‘వేచి చూద్దాం’ అని ముక్తాయించాడు. సంక్షిప్త స్కోర్లుచెన్నై సూపర్‌ కింగ్స్‌ ఇన్నింగ్స్‌: 230/5 (20 ఓవర్లలో) (ఆయుశ్‌ 34; కాన్వే 52; ఉర్విల్‌ 37; బ్రెవిస్‌ 57, ప్రసిధ్‌ కృష్ణ 2/22) గుజరాత్‌ టైటాన్స్‌: 147 ఆలౌట్‌ (18.3 ఓవర్లలో) (సాయి సుదర్శన్‌ 41; అర్షద్‌ ఖాన్‌ 20, అన్షుల్‌ కంబోజ్‌ 3/13, నూర్‌ అహ్మద్‌ 3/21, జడేజా 2/17).ఐపీఎల్‌లో నేడుముంబై X పంజాబ్‌వేదిక: జైపూర్‌ రాత్రి 7: 30 గంటల నుంచి స్టార్‌ స్పోర్ట్స్, జియో హాట్‌స్టార్‌లో

woman ends life Cherlapalli Railway Station  10
Hyderabad: అత్తగారింటికి వెళ్తూ అనంతలోకాలకు..

సికింద్రాబాద్‌: కన్నపిల్లల కళ్ల ముందే ఓ తల్లి రైలు బోగీ నుంచి ప్రమాదవశాత్తు జారిపడి మృతి చెందిన ఘటన ఆదివారం ఘట్‌కేసర్‌ రైల్వే స్టేషన్‌లో విషాదాన్ని నింపింది. రైల్వే హెడ్‌ కానిస్టేబుల్‌ నారాయణ తెలిపిన వివరాల ప్రకారం.. ఏపీలోని అనకాపల్లి జిల్లా దొండపూడి గ్రామానికి చెందిన మట్ట వెంకటేశ్, శ్వేత (33) దంపతులు. నగరంలో ప్రైవేటు ఉద్యోగం చేస్తున్న వెంకటేశ్‌ తన భార్య శ్వేత, ఇరువురు పిల్లలతో కలిసి లింగంపల్లిలో నివాసం ఉంటున్నారు. వేసవి సెలవులు పూర్తవుతున్న క్రమంలో కొద్ది రోజులు శ్వేత తన ఇద్దరు పిల్లలతో దొండపూడిలో గడిపి రావాలనుకుంది. ఇందుకోసం భర్త వెంకటేశ్‌ ఆన్‌లైన్‌ టికెట్‌ కొనుగోలు చేశాడు. ఉదయం భార్య, పిల్లలను లింగంపల్లి రైల్వేస్టేషన్‌ తీసుకువచి్చన వెంకటేశ్‌ జన్మభూమి ఎక్స్‌ప్రెస్‌ రైలు ఎక్కించి డీ3 బోగీలోని సీట్లలో కూర్చోబెట్టాడు. సీట్‌ నంబర్‌ సరిగా ప్రింట్‌ కాకపోవడంతో.. రైలు బయలుదేరిన కొద్ది సేపటి తర్వాత శ్వేత కూర్చున్న సీట్లు తమవని వేరే ప్రయాణికులు వచ్చారు. తన వద్ద ఉన్న టికెట్‌ను మరోసారి సరిచూసుకోగా తన బోగీ డీ8గా గుర్తించింది శ్వేత. రైలులో రద్దీ ఎక్కువగా ఉండడంతో 3వ నంబరు బోగీ నుంచి 8వ నంబర్‌ బోగీ వరకు బోగీల మార్గం నుంచి వెళ్లడం సాధ్యం కాలేదు. చర్లపల్లి రైల్వేస్టేషన్‌లో రైలు నిలపగానే డీ3 బోగీ దిగిన ఆమె తన పిల్లలు, లగేజీతో 8వ నంబర్‌ బోగీ వద్దకు చేరుకుంది. అప్పటికే రైలు కదలడం ప్రారంభమైంది. రైలు బోగీ, ప్లాట్‌ఫాం మధ్య నలిగి.. పిల్లలను, లగేజీని హుటాహుటిన బోగీలోకి ఎక్కించి తాను ఎక్కేందుకు ఉపక్రమిస్తున్న సమయంలోనే రైలు వేగం పుంజుకుంది. దీంతో కాలుజారి కిందపడిన శ్వేత బోగీకి ప్లాట్‌ఫామ్‌ మధ్యలో ఇరుక్కుపోయి తీవ్ర గాయాలపాలై పట్టాల పక్కన పడిపోయింది. ప్రమాదాన్ని గుర్తించిన ప్రయాణికులు, పోలీసులు ఆమెను రక్షించే ప్రయత్నం చేస్తుండగానే అప్పటికే మృతి చెందింది. సమాచారం అందుకుని ఘటన స్థలానికి చేరుకున్న భర్త వెంకటేశ్‌ కన్నీరుమున్నీరుగా విలపించాడు. ఆన్‌లైన్‌ టికెట్‌లో ప్రింట్‌ సరిగా పడని కారణంతోనే తన భార్య రైలు ప్రమాదానికి బలైందన్నాడు. శ్వేత మృతదేహానికి గాంధీ మార్చురీలో పోస్టుమార్టం నిర్వహించారు.

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

Advertisement

వీడియోలు

Advertisement