సాక్షి, హైదరాబాద్: చెల్లింపు కేటగిరీలో భూముల క్రమబద్ధీకరణ రిజిస్ట్రేషన్ల ప్రక్రియ గందరగోళంగా మారింది. శాఖల మధ్య సమన్వయం కొరవడింది. రిజిస్ట్రేషన్ల నిమిత్తం అవసరమైన కన్వేయన్స్ డీడ్‌లను మాన్యువల్‌గానే జారీ చేయాలని ప్రభుత్వం గత నెల 27న ఆదేశాలు జారీ చేసినా, భూపరిపాలన విభాగం అధికారులు మాత్రం ససేమిరా అంటున్నారు. తాము కొనుగోలు చేసిన సాఫ్ట్‌వేర్ ద్వారా ఆన్‌లైన్‌లో జారీ అయిన కన్వేయన్స్ డీడ్‌లనే రిజిస్ట్రేషన్లకు వినియోగించాలని అన్ని జిల్లాల కలెక్టర్లను, తహసీల్దార్లను సీసీఎల్‌ఏ తాజాగా ఆదేశించినట్లు తెలిసింది.
ఒకే అంశంపై సర్కారు ఒకరకంగా, సీసీఎల్‌ఏ మరో విధంగా ఆదేశాలివ్వడంతో ఏ ఆదేశాలను అమలు చేయాలో పాలుపోక జిల్లా కలెక్టర్లు, ఆర్డీవోలు, తహసీల్దార్లు తల పట్టుకుంటున్నారు. కన్వేయన్స్ డీడ్‌లోని వివరాలను అవసరమైనట్లు మార్పు చేసేందుకు సీసీఎల్‌ఏ అవకాశం ఇవ్వకపోవడంతో ఆన్‌లైన్ ప్రక్రియ ద్వారా మరింత జాప్యం జరుగుతోందని వాపోతున్నారు. జీవో 59 కింద కన్వీయన్స్ డీడ్‌లను రిజిస్ట్రేషన్ చేసే విషయమై తమ శాఖ ఉన్నతాధికారుల నుంచి స్పష్టమైన నిబంధనలు ఏవీ అందలేదని సబ్ రిజిస్ట్రార్లు చెబుతున్నారు.
కబ్జా అయిన ప్రభుత్వస్థలాలను తిరిగి స్వాధీనం చేసుకోలేని పరిస్థితుల్లో ఆయా స్థలాలను క్రమబద్ధీకరించాలని 2014 డిసెంబరులోనే సర్కారు ఉత్తర్వులు జారీ చేసింది. ఏడాదిన్నర కిందే చెల్లింపు కేటగిరీ కింద 50వేల దరఖాస్తులు సర్కారుకు వచ్చినా నేటికీ ఒక్క దరఖాస్తుకు మోక్షం కలిగించలేదంటే పరిస్థితి ఏమిటో అర్థం చేసుకోవచ్చు.
రిజిస్ట్రేషన్లలో గందరగోళం
Published Fri, May 6 2016 1:12 AM | Last Updated on Sun, Sep 3 2017 11:28 PM
Advertisement