అసైన్డ్ భూములను ఏం చేద్దాం?
అసైన్డ్ భూములను ఏం చేద్దాం?
Published Fri, Jul 28 2017 3:30 AM | Last Updated on Tue, Sep 5 2017 5:01 PM
అన్యాక్రాంతమైన భూములపై సర్కారు తర్జనభర్జన
- రాష్ట్రంలో 98 వేల ఎకరాలు పరాధీనం
- పరిశీలనలో గుర్తించిన టాస్క్‌ఫోర్స్ కమిటీ
- క్రమబద్ధీకరించాలన్న దిశగా ప్రభుత్వ యోచన
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో అసైన్డ్ భూముల అన్యాక్రాంతంపై ప్రభుత్వం దృష్టి సారించింది. అయితే వాటిని చట్టం ప్రకారం తిరిగి స్వాధీనం చేసుకోవాలా లేక చట్టాలను సవరించి పొజిషన్‌లో ఉన్నవారికే క్రమబద్ధీకరించాలా అని తర్జనభర్జన పడుతోంది.
98 వేల ఎకరాలు పరాధీనం
రాష్ట్రంలో ఇప్పటివరకు అసైన్ చేసిన భూముల్లో సుమారు 98 వేల ఎకరాల మేర పరాధీనమైనట్టు తేలింది. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 22 లక్షల ఎకరాలకు పైగా భూములను పేదలకు అసైన్ చేశారు. కానీ అందులో 14.28 లక్షల ఎకరాలను మాత్రమే పంపిణీ చేశారు. ఈ 14 లక్షల పైచిలుకు ఎకరాల్లో 98 వేల ఎకరాలకుపైగా అన్యాక్రాంతమయ్యాయని.. ఒకరికి అసైన్ చేస్తే ఇతరులెవరో అనుభవిస్తున్నారని వెల్లడైంది. సీనియర్ ఐఏఎస్ అధికారి ఎస్.కె.సిన్హా నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన టాస్క్‌ఫోర్స్ కమిటీ.. జిల్లా కలెక్టర్ల నుంచి సమాచారం తీసుకుని ప్రభుత్వానికి నివేదించినట్టు తెలుస్తోంది.
పలు ఇబ్బందులు కూడా..!
పీవోటీ చట్టం ప్రకారం అసైన్డ్ భూమి అన్యాక్రాంతమైతే దానిని ప్రభుత్వం బేషరతుగా స్వాధీనం చేసుకోవచ్చు. అయితే ఇందులో కొన్ని సమస్యలు ఉన్నాయని రెవెన్యూ వర్గాలు పేర్కొంటున్నాయి. రిజిస్ట్రేషన్ పత్రాలు సహా పక్కా సాక్ష్యాలు లేకుండా ఆ భూములను స్వాధీనం చేసుకోవడం కుదరదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అంటే అసైన్ భూమిలో ఎవరున్నా.. ఆ భూమి ఎవరి పేరు మీద రిజిస్టరై ఉంది, ఆ వ్యక్తి అనుభవంలో ఉన్నాడా? అనే దానిపై రెవెన్యూ యంత్రాం గం సాక్ష్యాలను సేకరించాల్సి ఉంటుంది. కానీ అలా చేస్తే జాప్యమయ్యే అవకాశాలు ఉన్నాయి. రంగారెడ్డి జిల్లాలోని 77 వేల ఎకరాల్లో పీవోటీ ఉల్లంఘనలు కనిపిస్తుంటే ఇప్పటివరకు 4,135 కేసులు నమోదు చేసి.. 3,705 ఎకరాలను స్వాధీనం చేసుకోగలిగారు.
క్రమబద్ధీకరిస్తే భారీగా ఆదాయం
ఈ అంశంలో ప్రభుత్వం వద్దకు మరో ప్రతిపాదన వచ్చింది. ఎలాగూ ప్రభుత్వ భూములక్రమబద్ధీకరణ ఎప్పటి నుంచో కొనసాగుతున్నందునా ... అసైన్డ్ భూములనూ క్రమబద్ధీకరించాలని, తద్వారా ప్రభుత్వానికి పెద్ద ఎత్తున ఆదాయం వస్తుందని సూచనలు అందాయి. దీనికి ప్రభుత్వం అంగీకరిస్తే.. పీవోటీ చట్టాన్ని సవరించాల్సి ఉంటుంది. ఇక క్రమబద్ధీకరిస్తే.. మార్కెట్ విలువలో ఎంత శాతం వరకు రుసుము కింద తీసుకోవాలనే దానిపైనా చర్చలు జరుగుతున్నాయి. అన్యాక్రాంతమైన భూమి ఉన్న ప్రాంతాన్ని బట్టి ఈ రుసుములో మార్పులు చేయాలని... ఎన్నేళ్లుగా ఆ భూమి అనుభవిస్తున్నారు, ఆ భూమిలో ఏం చేస్తున్నారన్న అంశాలను కూడా పరిగణనలోకి తీసుకుని.. భారీ జరిమానాతో క్రమబద్ధీకరించుకునే అవకాశం ఇవ్వవచ్చని రెవెన్యూ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్నది ఇంకా తేలలేదు.
వేల కోట్ల విలువైన భూములు
అన్యాక్రాంతమైన అసైన్డ్ భూముల విలువ వేల కోట్ల రూపాయలు ఉంటుందని అం చనా. రంగారెడ్డి జిల్లాలో వేల ఎకరాలకుపైగా ఇతరుల చేతుల్లో ఉన్నట్లు టాస్క్‌ఫోర్స్ నివేది కలో తేలింది. ఈ జిల్లాలో ఇప్పటివరకు 87,064 వేల ఎకరాల మేర అసైన్ చేయగా.. 9,885 ఎకరాల్లో మాత్రమే అసలైన పట్టాదారులు ఉన్నారు. మిగతా 77,179 ఎకరాల్లో పీవోటీ చట్టం ఉల్లంఘనలు ఉన్నట్లు అంచనా. ఇందులో కనీసం 20 వేలకుపైగా ఎకరాల్లో ఇతరులు పాగా వేశారని చెబుతున్నారు. ముఖ్యంగా సరూర్‌నగర్, బాలాపూర్, మహేశ్వరం, రాజేంద్రనగర్, షాద్‌నగర్, చేవెళ్ల, శంషాబాద్, ఇబ్రహీంపట్నం, కుత్బుల్లాపూర్, ఉప్పల్, మేడ్చల్ లాంటి డిమాండ్ ఉన్న చోట్ల పెద్ద ఎత్తున ఈ భూములు చేతులు మారినట్టు అధికారులు గుర్తించారు.
అన్యాక్రాంతమైన భూములు 98 వేల ఎకరాలు
పీవోటీ చట్టం ఉల్లంఘన 77 వేల ఎకరాలు
పీవోటీ ఉల్లంఘనులపై నమోదైన కేసులు 4,135
స్వాధీనం చేసుకున్నవి 3,705 ఎకరాలు
Advertisement