ఎనీవేర్ దెబ్బ..!
ఇద్దరు సబ్ రిజిస్ట్రార్లపై సస్పెన్షన్ వేటు
ఒకరి అరెస్టు
సిటీ బ్యూరో: ఎనీవేర్ దందాలో మరో ఇద్దరు సబ్ రిజిస్ట్రార్లపై సస్పెన్షన్ వేటు పడింది. ఇప్పటికే కూకట్‌పల్లి సబ్ రిజిస్ట్రార్ సస్పెన్షన్ గురై క్రిమినల్ కేసు నమోదు కాగా, తాజాగా ఎల్‌బీనగర్ సబ్ రిజిస్ట్రార్‌గా పనిచేసి ప్రస్తుతం మేడ్చల్ జిల్లా రిజిస్ట్రేషన్ కార్యాలయంలో జాయింట్ సబ్ రిజిస్ట్రార్‌గా ఉన్న రమేష్ చంద్రారెడ్డి, బాలానగర్ సబ్ రిజిస్ట్రార్ మహ్మద్ యూసుఫ్‌లు సస్పెండ్ అయ్యారు. మరోవైపు రమేష్ చంద్రారెడ్డిపై క్రిమినల్ కేసులు పెట్టిన ఎల్బీనగర్ పోలీసులు మంగళవారం ఆయనను అరెస్టు చేశారు.
రమేష్ చంద్రారెడ్డి అక్రమాలు ఇలా...
నాగోలు: ప్రస్తుతం మేడ్చల్ జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయంలో జాయింట్ సబ్‌రిజిస్ట్రార్‌గా పని చేస్తున్న రమేష్ చంద్రారెడ్డి రెండేళ్ల క్రితం ఎల్‌బీనగర్ సబ్‌రిజిస్ట్రార్‌గా పని చేశారు. ఆ సమయంలో ఎల్‌బీనగర్ డాక్టర్స్ కాలనీకి చెందిన మూడు డాక్యుమెంట్లను, సౌత్ ఇండియా రీసెర్చ్ ఇనిస్టిట్యూట్‌కు చెందిన జి. సుబ్బరాజు, సామ కన్‌స్ట్రక్షన్స్ సామ నర్సింహ్మారెడ్డి స్థలాలను ప్రభుత్వం లెక్కప్రకారం గజం ధర రూ. 35 వేలు ఉండగా, రూ. 13 వేలకు తగ్గించి రిజిస్ట్రేషన్ చేశారు. దీంతో స్టాంపు డ్యూటీ కింద ప్రభుత్వానికి రావాల్సిన రూ.1.45 కోట్ల ఆదాయానికి గండిపడింది. ఈ విషయంపై రంగారెడ్డి జిల్లా డిస్ట్రిక్ రిజిస్ట్రార్ టి.సుబ్బరావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న ఎల్‌బీనగర్ పోలీసులు ప్రత్యేక దర్యాప్తు చేపట్టారు. అక్రమాలకు పాల్పడినట్టు తేలడంతో రమేష్ చంద్రారెడ్డిని మంగళవారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్టు ఎల్‌బీనగర్ డీసీపీ ఎం.వెంకటేశ్వర్‌రావు తెలిపారు.
యూసుఫ్ అక్రమాలు ఇలా...
నగర శివారులోని రంగారెడ్డి జిల్లా మదీనగూడ (సర్వే నెం. 162,163) ప్రాంతంలో బీహెచ్‌ఈఎల్ ఎగ్జిక్యూటివ్ హౌసింగ్ సొసైటీ.. ‘మానస బీహెచ్‌ఈఎల్ ఎగ్జిక్యూటివ్ టవర్స్’ను నిర్మించింది. నిబంధనల ప్రకారం సదరు ప్లాట్లను రంగారెడ్డి జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ చేయాల్సి ఉంది, ఎనీవేర్ వెసులుబాటుతో పాత రంగారెడ్డి జిల్లా పరిధిలోని బాలానగర్ సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో 2016లో రిజిస్ట్రేషన్ చేశారు. మరోవైపు కోఆపరేటివ్ సొసైటీలకు మాత్రమే జీవో నెం.472 ద్వారా స్టాంప్‌డ్యూటీ మినహాయింపు వర్తిస్తుంది. బీహెచ్‌ఈఎల్ ఎగ్జిక్యూటివ్ హౌసింగ్ సొసైటీకి కో–ఆపరేటవ్ స్టేటస్ లేదు. అయినా నిబంధనలకు విరుద్ధంగా బాలానగర్ సబ్ రిజిస్ట్రార్ స్టాంప్‌డ్యూటీ మినహాయింపు ఇచ్చారు. 90 దస్తావేజులు రిజిస్ట్రేషన్ చేయడంతో సుమారు .రూ.కోటిన్నర మేర రిజిస్ట్రేషన్ల శాఖ ఆదాయానికి గండిపడింది. దీంతో మరో రెండు మూడు ఆరోపణలు రావడంతో యూసుఫ్‌పై సస్పెన్షన్ వేటు వేశారు.