జీవో 59 పై ఎట్టకేలకు కదలిక
* చెల్లింపు కేటగిరీలో భూముల క్రమబద్ధీకరణకు సర్కారు సన్నద్ధం
* క్రమబద్ధీకరణ ప్రక్రియకు గడువు పెంపు!
* 46 వేల దరఖాస్తులకు కలగనున్న మోక్షం
సాక్షి, హైదరాబాద్ : చెల్లింపు కేటగిరీలో భూముల క్రమబద్ధీకరణ ప్రక్రియను కొనసాగించేందుకు సర్కారు సన్నద్ధమైంది. ప్రభుత్వ భూముల్లో నివాసముంటున్న వారికి ఆయా స్థలాలను చెల్లింపు కేటగిరీలో క్రమద్ధీకరించేందుకు గత డిసెంబర్‌లో ప్రభుత్వం జీవో నంబరు 59 జారీచేసిన సంగతి తెలిసిందే.
చెల్లింపు కేటగిరీలో మొత్తం 46వేల దరఖాస్తులు ప్రభుత్వం వద్ద ఉండగా, మార్గదర్శకాలపై స్పష్టత లేకపోవడంతో అధికారులు ఇన్నాళ్లూ ఆ దరఖాస్తులను అటకెక్కించారు. ఈ అంశంపై ‘జీవో 59పై కదలికేదీ?’ శీర్షికన గత నెల 20న సాక్షిలో ప్రచురితమైన కథనంతో సర్కారు కదిలింది. దరఖాస్తులను పరిశీలించి, అందులో పేర్కొన్న స్థలాలను క్రమబద్ధీకరించేందుకు స్పష్టమైన మార్గదర్శకాలను రూపొందించాలని రెవెన్యూ యంత్రాంగాన్ని ఆదేశించింది. ప్రభుత్వ ఆదేశాలతో కదలిన అధికారులు తాజాగా మార్గదర్శకాలను సిద్ధం చేశారు. సోమవారం నుంచి దరఖాస్తుల పరిశీలన ప్రారంభించాలని జిల్లాల కలెక్టర్లకు రెవెన్యూశాఖ సర్క్యులర్ పంపించింది.
అన్ని దరఖాస్తులకు మోక్షం..!
ఆక్రమిత భూముల క్ర మబద్ధీకరణ విషయంలో ప్రభుత్వం ఉదారంగా వ్యవహరిస్తున్నందున, చెల్లింపు కేటగిరీలో అన్ని దరఖాస్తులకు మోక్షం లభించనుందని రెవెన్యూ వర్గాలంటున్నాయి. జీవో నంబరు 58 కింద ప్రభుత్వ భూముల్లో నివాసముంటున్న పేదల ఇళ్ల స్థలాలను, వారికి ఉచితంగా క్రమబద్ధీకరించే అంశంలో మార్గదర్శకాలను ప్రభుత్వం పలుమార్లు సడలించింది. చివరికి దరఖాస్తుదారుడు అర్హుడని నిర్ధారించేందుకు పంచనామా ఉన్నా చాలని సర్కారు స్పష్టం చేసింది.
ఈ నేపథ్యంలో.. చెల్లింపు కేటగిరీ కింద క్రమబద్ధీకరణ పట్ల కూడా ప్రభుత్వం ఇదే రకమైన వైఖరి అవలంభించవచ్చని తెలుస్తోంది. అలాగే భూముల క్రమబద్ధీకరణ ప్రక్రియకు మరో మూడు నెలల పాటు గడువును పొడిగించాలని కూడా సర్కారు భావిస్తున్నట్లు సమాచారం. దీనిపై రేపో, మాపో ఉత్తర్వులు వెలువడనున్నట్లు తెలిసింది. చెల్లింపు కేటగిరీలో తొలుత 29,281 దరఖాస్తులు రాగా, ఉచిత కేటగిరీలో దరఖాస్తు చేసుకున్న 16,915 మందిని, అధికారుల పరిశీలన అనంతరం చెల్లింపు కేటగిరీలోకి చేర్చారు. దీంతో చెల్లింపు కేటగిరీలో ప్రభుత్వం వద్దనున్న దరఖాస్తుల సంఖ్య 46,196కు చేరింది.
క్రమబద్ధీకరణ సొమ్ము ఖజానాకు..
చెల్లింపు కేటగిరీలో క్రమబద్ధీకరణకు దరఖాస్తు దారులు చెల్లించిన సొమ్మును వెంటనే ప్రభుత్వ ఖజానాకు జమ చేయాలని భూపరిపాలన విభాగం నుంచి అన్ని మండలాల తహసీల్దార్లకు ఆదేశాలందాయి. దీంతో ఆఘమేగాల మీద శుక్రవారమే అన్ని మండలాల నుంచి అధికారులు సుమారు రూ.300కోట్లను జమచేశారు. ఇంతకు మునుపు దరఖాస్తుతో పాటు చెల్లించిన సొమ్మును తహశీల్దార్ల ఖాతాల్లోనే ఉంచారు.
దరఖాస్తును తిరస్కరించిన పక్షంలో సదరు సొమ్మును తిరిగి ఇవ్వాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అయితే.. చెల్లింపు కేట గిరీ కింద వచ్చిన సొమ్మును ప్రభుత్వ ఖ జానాకు జమ చేయాలని తాజాగా సర్కారు ఆదేశాలివ్వడంతో.. దాదాపుగా అన్ని దరఖాస్తులకు మోక్షం లభించే అవకాశమున్నట్లు ఉన్నతాధికారులు అభిప్రాయపడుతున్నారు.