GO 59
-
భూ బదలాయింపు బాధ్యత తహసీల్దార్లకే..
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ స్థలాల్లో నివాసాలు ఏర్పాటు చేసుకున్న పేదలకు ఆ భూములను క్రమబద్ధీకరించే ప్రక్రియ మొదలైంది. దీనికి సంబంధించి గత ఏడాది ఫిబ్రవరిలో ప్రారంభమైన జీవో 59 అమలు ఓ కొలిక్కి వస్తోంది. క్రమబద్ధీకరణకు ఆమోదం పొంది, ఫీజు పూర్తిగా చెల్లించిన దరఖాస్తుదారుల పేరిట సదరు భూములను బదలాయించేందుకు రంగం సిద్ధమైంది. దీనికి సంబంధించి భూపరిపాలన ప్రధాన కమిషనర్ (సీసీఎల్ఏ) నవీన్ మిత్తల్ మార్గదర్శకాలను జారీ చేశారు. ఈ భూములను బదలాయించే బాధ్యత తహసీల్దార్లకు అప్పగించారు. తహసీల్దార్ల లాగిన్లలో ఈ డీడ్లను అందుబాటులో ఉంచాలని, వాటిపై తహసీల్దార్ల సంతకం తప్పనిసరిగా ఉండాలని పేర్కొన్నారు. ఈ ఉత్తర్వుల మేరకు.. జీవో 59 కింద ఆమోదం పొందిన భూములకు సంబంధించిన కన్వేయన్స్ డీడ్లను సబ్ రిజిస్ట్రార్లు ఉచితంగా రిజిస్ట్రేషన్ చేయాల్సి ఉంటుంది. తద్వారా ఇప్పటివరకు కేవలం ఆక్రమణదారులుగా ఉన్న వేలాది మందికి ఆ స్థలాలపై పూర్తి హక్కులు సంక్రమిస్తాయి. ఆ భూములను అవసరమైతే విక్రయించుకోవడానికి కూడా హక్కు లభించనుంది. సీసీఎల్ఏగా బాధ్యతలు స్వీకరించాక నవీన్ మిత్తల్ తొలిసారి జారీచేసిన అధికారిక ఉత్తర్వులు జీవో 59కి సంబంధించినవే కావడం, ఈ ప్రక్రియ పూర్తి బాధ్యతలను తహసీల్దార్లకే అప్పగించడం గమనార్హం. తక్కువ ధర ఉన్న ప్రాంతాల్లో.. రాష్ట్రంలో ప్రభుత్వ స్థలాలను ఆక్రమించి ఇళ్లుకట్టుకున్న పేదలకు వాటిని క్రమబద్ధీకరించేందుకు ప్రభుత్వం జీవో 58, 59లను జారీ చేసింది. వీటికింద గత ఏడాది ఫిబ్రవరిలో దరఖాస్తులను స్వీకరించారు. జీవో 58 కింద ఉచితంగా, 59 కింద ప్రభుత్వం నిర్ధారించిన ఫీజును కట్టించుకుని.. సదరు స్థలాలను క్రమబద్ధీకరించేలా చర్యలు చేపట్టారు. జీవో 59 కింద క్రమబద్ధీకరణ కోసం లక్షల సంఖ్యలో దరఖాస్తులు వచ్చాయి. ఇందులో ప్రభుత్వ విలువ చదరపు గజానికి రూ.7 వేల కంటే తక్కువగా ఉన్న ప్రాంతాల్లోని దరఖాస్తులను పరిశీలించి ఆమోదం తెలిపారు. ఇవి 25వేల వరకు ఉంటాయని రెవెన్యూ వర్గాలు చెప్తున్నాయి. ఈ దరఖాస్తులకు సంబంధించి కన్వేయన్స్ డీడ్లను జారీ చేసేందుకు సీసీఎల్ఏ తాజాగా మార్గదర్శకాలు జారీ చేశారు. ప్రభుత్వ విలువ రూ.7 వేల కంటే అధికంగా ఉన్న స్థలాల విషయంలో ఏం చేయాలన్న దానిపై ప్రభుత్వం ఉన్నతస్థాయిలో కసరత్తు చేస్తోందని, ఇంకా తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉందని అధికారులు చెప్తున్నారు. సీసీఎల్ఏ జారీ చేసిన మార్గదర్శకాలివీ.. ►జీవో 59 కింద ఆమోదం పొంది, నిబంధనల మేరకు ప్రభుత్వానికి ఫీజు చెల్లించిన దరఖాస్తుదారులకు సంబంధించిన కన్వేయన్స్ డీడ్ (భూబదలాయింపు డాక్యుమెంట్æ) తహసీల్దార్ లాగిన్లోకి వస్తుంది. ►తహసీల్దార్లు మీసేవ వెబ్ పోర్టల్ ద్వారా లాగిన్ కావాల్సి ఉంటుంది. అందులో జీవో 59 కింద కన్వేయన్స్ డీడ్లను ప్రాసెస్ చేసే ఆప్షన్ ఉంటుంది. ►తహసీల్దార్ బయోమెట్రిక్ నమోదు చేసి ఈ ప్రాసెస్‌ను పూర్తి చేయవచ్చు. లాగిన్‌లో దరఖాస్తు నంబర్, గ్రామాల వారీగా కన్వేయన్స్ డీడ్లు అందుబాటులో ఉంటాయి. ఈ కన్వేయన్స్ డీడ్లలో లబ్ధిదారుల పూర్తి వివరాలను నమోదు చేయడంతోపాటు పాటు జారీచేసే పూర్తి బాధ్యతలను తహసీల్దార్ నిర్వర్తించాల్సి ఉంటుంది. ►సదరు దరఖాస్తును ఆమోదించడంతో కన్వేయన్స్ డీడ్ డౌన్లోడ్ అవుతుంది. ఇలా డౌన్లోడ్ చేసుకునే ముందే అన్ని వివరాలను సరిచూసుకోవాల్సి ఉంటుంది. ►డౌన్లోడ్ అయిన డీడ్ (మూడు పేజీలు) ప్రింట్ తీసుకోవాల్సి ఉంటుంది. ఆ ప్రింట్‌పై తహసీల్దార్ సంతకం చేయడంతోపాటు ఆఫీస్ స్టాంప్ వేయాల్సి ఉంటుంది. ►ఇలా తహసీల్దార్ సంతకం చేసిన కన్వేయన్స్ డీడ్లను సంబంధిత సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో రిజిస్ట్రేషన్ చేస్తారు. ఈ రిజిస్ట్రేషన్ ప్రక్రియలో స్టాంపు డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజు, ట్రాన్స్ఫర్ డ్యూటీ వంటివేవీ వసూలు చేయకూడదు. ►ఉచితంగా రిజిస్ట్రేషన్ చేసిన ఈ డాక్యుమెంట్‌ను ప్రజాప్రతినిధుల చేతుల మీదుగా లబ్ధిదారులకు అందజేయాల్సి ఉంటుంది. ఇలా అందజేసే సమయంలో తహసీల్దార్ జారీచేసిన కన్వేయన్స్ డీడ్‌ను, సబ్ రిజిస్ట్రార్ రిజిస్ట్రేషన్ చేసిన డాక్యుమెంట్‌ను లబ్ధిదారుడికి ఇవ్వాలి. ►కన్వేయన్స్ డీడ్ కాపీని మీసేవ పోర్టల్‌లో కూడా అప్లోడ్ చేయడంతో జీవో 59 కింద సదరు భూమిని లబ్ధిదారుడికి బదలాయించే ప్రక్రియ ముగుస్తుంది. -
భూముల క్రమబద్ధీకరణకు గడువు పొడిగింపు!
పెండింగ్ వాయిదాలు చెల్లించేందుకు 4 నెలలు గడువిస్తూ ఉత్తర్వులు జీవో 166 కింద సొమ్ము చెల్లించినవారికి జీవో 59లో సర్దుబాటు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో భూముల క్రమబద్ధీకరణ ప్రక్రియను ప్రభుత్వం మరో సారి పొడిగించింది. 4 నెలల గడువు ఇస్తూ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసిం ది. మూడేళ్లవుతున్నా క్రమబద్ధీకరణ ప్రక్రియ ఇంకా ముగియలేదు. ప్రభుత్వ భూముల్లో నివాసమేర్పర్చుకున్న వారికి వాటిని క్రమ బద్ధీకరించే నిమిత్తం 2014 డిసెంబర్లో రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో దారిద్య్రరేఖకు ఎగువన ఉన్నవారికి నిర్దేశిత రుసుముతో జీవో 59 కింద ఆయా భూము లను క్రమబద్ధీకరించాలని సర్కార్ పేర్కొంది. ఈ ప్రక్రియంతా మూడు నెలల్లోగా పూర్తి చేయాలని ప్రభుత్వం ఆదేశించినా, రెవెన్యూ శాఖ నిర్లక్ష్యం కారణంగా నేటికీ ముగియ లేదు. కీలకమైన భూపరిపాలన ప్ర«ధాన కమిషనర్, రెవెన్యూశాఖ ముఖ్యకార్యదర్శి లేకపోవడమే ఇందుకు ప్రధాన కారణంగా సిబ్బంది చెబుతున్నారు. చెల్లింపు కేటగిరీలో మొత్తం 15 వేల దరఖాస్తులు రెవెన్యూ శాఖకు అందగా, వాటిలో సగానికిపైగా దరఖాస్తు లను పరిష్కరించలేదు. అభ్యంతరం లేని భూములను క్రమబద్ధీకరించడంలో భాగంగా పట్టణ భూపరిమితి చట్టం(యూఎల్సీ) పరిధిలోని భూములను కూడా జీవో 59 కింద క్రమబద్ధీకరించాలని ప్రభుత్వం నిరుడు నవం బర్ 12న ఉత్తర్వులు ఇచ్చింది. ఈ ప్రక్రియను 60 రోజుల్లో పూర్తి చేయాలని నిర్దేశించినా పెద్దనోట్ల రద్దు నేపథ్యంలో దరఖాస్తుదారులు నిర్దేశిత సొమ్ము చెల్లించేందుకు వీలు కాలేదు. దీంతో మరోమారు గడువు పొడిగించాలని ఇన్చార్జ్ సీసీఎల్ఏ గతేడాది జనవరి 9న ప్రభుత్వానికి లేఖ రాశారు. దీంతో ఇప్పటికే కొన్ని వాయిదాలను చెల్లించిన దరఖాస్తు దారులు పూర్తి సొమ్ము చెల్లించేందుకు మరో 4 నెలల గడువు ఇస్తూ ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. జీవో 166 దరఖాస్తులకూ మోక్షం ప్రభుత్వ భూముల్లోని నివాసాలేర్పరచుకున్న వారికి ఆయా స్థలాలను క్రమబద్ధీకరించే నిమిత్తం ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి ప్రభుత్వం 2008లో జీవో నిమిత్తం 166 జారీ చేసింది. న్యాయస్థానంలో కొంతమంది కేసు వేయడంతో ఆ ప్రక్రియ ఏళ్ల తరబడి ముందుకు సాగలేదు. జీవో 166 కింద అప్పటి ప్రభుత్వ నిర్దేశించిన ధర మేరకు దరఖాస్తుదారులు రూ.190 కోట్ల మేర సొమ్ము కూడా చెల్లించారు. జీవో 166 కింద రాష్ట్రవ్యాప్తంగా మూడువేల దాకా దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నట్లు సమాచారం. రాష్ట్రం విడిపోవడంతో రెండు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా జీవో 166ను తాము కొనసాగించబోమని న్యాయస్థానానికి తెలపడం తో ఇటీవల ఆ కేసు ముగిసింది. అయితే, జీవో 166 కింద క్రమబద్ధీకరణకు దరఖాస్తు చేసిన వారిలో జీవో 59 కింద ఉచితంగా పట్టాలు పొందిన వాళ్లున్నారు. వీరంతా గతంలో జీవో 166 కింద చెల్లించిన మొత్తాన్ని వెనక్కివ్వాలని ప్రభుత్వం తాజాగా నిర్ణయించింది. అలాగే, జీవో 59 కింద దరఖాస్తు చేసుకున్న జీవో 166 దరఖాస్తుదారులు, ప్రభుత్వానికి చెల్లించాల్సిన మొత్తంలో ఇంతకు మునుపే(166 కింద) చెల్లించిన సొమ్మును సర్దుబాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు రెవెన్యూ శాఖ గురువారం మరో ఉత్తర్వును జారీ చేసింది. దీంతో పెండింగ్ దరఖాస్తులకు మోక్షం లభించనుంది. -
జీవో 59 పై ఎట్టకేలకు కదలిక
* చెల్లింపు కేటగిరీలో భూముల క్రమబద్ధీకరణకు సర్కారు సన్నద్ధం * క్రమబద్ధీకరణ ప్రక్రియకు గడువు పెంపు! * 46 వేల దరఖాస్తులకు కలగనున్న మోక్షం సాక్షి, హైదరాబాద్ : చెల్లింపు కేటగిరీలో భూముల క్రమబద్ధీకరణ ప్రక్రియను కొనసాగించేందుకు సర్కారు సన్నద్ధమైంది. ప్రభుత్వ భూముల్లో నివాసముంటున్న వారికి ఆయా స్థలాలను చెల్లింపు కేటగిరీలో క్రమద్ధీకరించేందుకు గత డిసెంబర్లో ప్రభుత్వం జీవో నంబరు 59 జారీచేసిన సంగతి తెలిసిందే. చెల్లింపు కేటగిరీలో మొత్తం 46వేల దరఖాస్తులు ప్రభుత్వం వద్ద ఉండగా, మార్గదర్శకాలపై స్పష్టత లేకపోవడంతో అధికారులు ఇన్నాళ్లూ ఆ దరఖాస్తులను అటకెక్కించారు. ఈ అంశంపై ‘జీవో 59పై కదలికేదీ?’ శీర్షికన గత నెల 20న సాక్షిలో ప్రచురితమైన కథనంతో సర్కారు కదిలింది. దరఖాస్తులను పరిశీలించి, అందులో పేర్కొన్న స్థలాలను క్రమబద్ధీకరించేందుకు స్పష్టమైన మార్గదర్శకాలను రూపొందించాలని రెవెన్యూ యంత్రాంగాన్ని ఆదేశించింది. ప్రభుత్వ ఆదేశాలతో కదలిన అధికారులు తాజాగా మార్గదర్శకాలను సిద్ధం చేశారు. సోమవారం నుంచి దరఖాస్తుల పరిశీలన ప్రారంభించాలని జిల్లాల కలెక్టర్లకు రెవెన్యూశాఖ సర్క్యులర్ పంపించింది. అన్ని దరఖాస్తులకు మోక్షం..! ఆక్రమిత భూముల క్ర మబద్ధీకరణ విషయంలో ప్రభుత్వం ఉదారంగా వ్యవహరిస్తున్నందున, చెల్లింపు కేటగిరీలో అన్ని దరఖాస్తులకు మోక్షం లభించనుందని రెవెన్యూ వర్గాలంటున్నాయి. జీవో నంబరు 58 కింద ప్రభుత్వ భూముల్లో నివాసముంటున్న పేదల ఇళ్ల స్థలాలను, వారికి ఉచితంగా క్రమబద్ధీకరించే అంశంలో మార్గదర్శకాలను ప్రభుత్వం పలుమార్లు సడలించింది. చివరికి దరఖాస్తుదారుడు అర్హుడని నిర్ధారించేందుకు పంచనామా ఉన్నా చాలని సర్కారు స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో.. చెల్లింపు కేటగిరీ కింద క్రమబద్ధీకరణ పట్ల కూడా ప్రభుత్వం ఇదే రకమైన వైఖరి అవలంభించవచ్చని తెలుస్తోంది. అలాగే భూముల క్రమబద్ధీకరణ ప్రక్రియకు మరో మూడు నెలల పాటు గడువును పొడిగించాలని కూడా సర్కారు భావిస్తున్నట్లు సమాచారం. దీనిపై రేపో, మాపో ఉత్తర్వులు వెలువడనున్నట్లు తెలిసింది. చెల్లింపు కేటగిరీలో తొలుత 29,281 దరఖాస్తులు రాగా, ఉచిత కేటగిరీలో దరఖాస్తు చేసుకున్న 16,915 మందిని, అధికారుల పరిశీలన అనంతరం చెల్లింపు కేటగిరీలోకి చేర్చారు. దీంతో చెల్లింపు కేటగిరీలో ప్రభుత్వం వద్దనున్న దరఖాస్తుల సంఖ్య 46,196కు చేరింది. క్రమబద్ధీకరణ సొమ్ము ఖజానాకు.. చెల్లింపు కేటగిరీలో క్రమబద్ధీకరణకు దరఖాస్తు దారులు చెల్లించిన సొమ్మును వెంటనే ప్రభుత్వ ఖజానాకు జమ చేయాలని భూపరిపాలన విభాగం నుంచి అన్ని మండలాల తహసీల్దార్లకు ఆదేశాలందాయి. దీంతో ఆఘమేగాల మీద శుక్రవారమే అన్ని మండలాల నుంచి అధికారులు సుమారు రూ.300కోట్లను జమచేశారు. ఇంతకు మునుపు దరఖాస్తుతో పాటు చెల్లించిన సొమ్మును తహశీల్దార్ల ఖాతాల్లోనే ఉంచారు. దరఖాస్తును తిరస్కరించిన పక్షంలో సదరు సొమ్మును తిరిగి ఇవ్వాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అయితే.. చెల్లింపు కేట గిరీ కింద వచ్చిన సొమ్మును ప్రభుత్వ ఖ జానాకు జమ చేయాలని తాజాగా సర్కారు ఆదేశాలివ్వడంతో.. దాదాపుగా అన్ని దరఖాస్తులకు మోక్షం లభించే అవకాశమున్నట్లు ఉన్నతాధికారులు అభిప్రాయపడుతున్నారు.