భూముల క్రమబద్ధీకరణకు గడువు పొడిగింపు!
పెండింగ్ వాయిదాలు చెల్లించేందుకు 4 నెలలు గడువిస్తూ ఉత్తర్వులు
జీవో 166 కింద సొమ్ము చెల్లించినవారికి జీవో 59లో సర్దుబాటు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో భూముల క్రమబద్ధీకరణ ప్రక్రియను ప్రభుత్వం మరో సారి పొడిగించింది. 4 నెలల గడువు ఇస్తూ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసిం ది. మూడేళ్లవుతున్నా క్రమబద్ధీకరణ ప్రక్రియ ఇంకా ముగియలేదు. ప్రభుత్వ భూముల్లో నివాసమేర్పర్చుకున్న వారికి వాటిని క్రమ బద్ధీకరించే నిమిత్తం 2014 డిసెంబర్‌లో రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో దారిద్య్రరేఖకు ఎగువన ఉన్నవారికి నిర్దేశిత రుసుముతో జీవో 59 కింద ఆయా భూము లను క్రమబద్ధీకరించాలని సర్కార్ పేర్కొంది.
ఈ ప్రక్రియంతా మూడు నెలల్లోగా పూర్తి చేయాలని ప్రభుత్వం ఆదేశించినా, రెవెన్యూ శాఖ నిర్లక్ష్యం కారణంగా నేటికీ ముగియ లేదు. కీలకమైన భూపరిపాలన ప్ర«ధాన కమిషనర్, రెవెన్యూశాఖ ముఖ్యకార్యదర్శి లేకపోవడమే ఇందుకు ప్రధాన కారణంగా సిబ్బంది చెబుతున్నారు. చెల్లింపు కేటగిరీలో మొత్తం 15 వేల దరఖాస్తులు రెవెన్యూ శాఖకు అందగా, వాటిలో సగానికిపైగా దరఖాస్తు లను పరిష్కరించలేదు. అభ్యంతరం లేని భూములను క్రమబద్ధీకరించడంలో భాగంగా పట్టణ భూపరిమితి చట్టం(యూఎల్సీ) పరిధిలోని భూములను కూడా జీవో 59 కింద క్రమబద్ధీకరించాలని ప్రభుత్వం నిరుడు నవం బర్ 12న ఉత్తర్వులు ఇచ్చింది.
ఈ ప్రక్రియను 60 రోజుల్లో పూర్తి చేయాలని నిర్దేశించినా పెద్దనోట్ల రద్దు నేపథ్యంలో దరఖాస్తుదారులు నిర్దేశిత సొమ్ము చెల్లించేందుకు వీలు కాలేదు. దీంతో మరోమారు గడువు పొడిగించాలని ఇన్‌చార్జ్ సీసీఎల్‌ఏ గతేడాది జనవరి 9న ప్రభుత్వానికి లేఖ రాశారు. దీంతో ఇప్పటికే కొన్ని వాయిదాలను చెల్లించిన దరఖాస్తు దారులు పూర్తి సొమ్ము చెల్లించేందుకు మరో 4 నెలల గడువు ఇస్తూ ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది.
జీవో 166 దరఖాస్తులకూ మోక్షం
ప్రభుత్వ భూముల్లోని నివాసాలేర్పరచుకున్న వారికి ఆయా స్థలాలను క్రమబద్ధీకరించే నిమిత్తం ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి ప్రభుత్వం 2008లో జీవో నిమిత్తం 166 జారీ చేసింది. న్యాయస్థానంలో కొంతమంది కేసు వేయడంతో ఆ ప్రక్రియ ఏళ్ల తరబడి ముందుకు సాగలేదు. జీవో 166 కింద అప్పటి ప్రభుత్వ నిర్దేశించిన ధర మేరకు దరఖాస్తుదారులు రూ.190 కోట్ల మేర సొమ్ము కూడా చెల్లించారు. జీవో 166 కింద రాష్ట్రవ్యాప్తంగా మూడువేల దాకా దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నట్లు సమాచారం. రాష్ట్రం విడిపోవడంతో రెండు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా జీవో 166ను తాము కొనసాగించబోమని న్యాయస్థానానికి తెలపడం తో ఇటీవల ఆ కేసు ముగిసింది.
అయితే, జీవో 166 కింద క్రమబద్ధీకరణకు దరఖాస్తు చేసిన వారిలో జీవో 59 కింద ఉచితంగా పట్టాలు పొందిన వాళ్లున్నారు. వీరంతా గతంలో జీవో 166 కింద చెల్లించిన మొత్తాన్ని వెనక్కివ్వాలని ప్రభుత్వం తాజాగా నిర్ణయించింది. అలాగే, జీవో 59 కింద దరఖాస్తు చేసుకున్న జీవో 166 దరఖాస్తుదారులు, ప్రభుత్వానికి చెల్లించాల్సిన మొత్తంలో ఇంతకు మునుపే(166 కింద) చెల్లించిన సొమ్మును సర్దుబాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు రెవెన్యూ శాఖ గురువారం మరో ఉత్తర్వును జారీ చేసింది. దీంతో పెండింగ్ దరఖాస్తులకు మోక్షం లభించనుంది.