Regulation of Lands
-
అనధికార ప్లాట్లలో ఇళ్లకు నో
సాక్షి, హైదరాబాద్ : లేఅవుట్ల క్రమబద్ధీకరణ పథకం (ఎల్ఆర్ఎస్)లో పేర్కొన్నట్టే రాష్ట్ర ప్రభుత్వం అక్రమ, అనధికార ప్లాట్లలో భవన నిర్మాణ అనుమతుల జారీకి చెక్ పెట్టింది. అప్రూవ్డ్ లేఅవుట్లలోని ప్లాట్లు లేదా ఎల్ఆర్ఎస్ కింద క్రమబద్ధీకరించిన ప్లాట్లలో మాత్రమే ఇళ్లు, భవనాల నిర్మాణానికి అనుమతులు జారీ చేసేలా టీఎస్–బీపాస్ పోర్టల్‌ను రూపకల్పన చేసింది. లేఅవుట్ అనుమతి పత్రం/ఎల్ఆర్ఎస్ సర్టిఫికెట్‌ను దరఖాస్తుతో పాటు పోర్టల్‌లో అప్లోడ్ చేస్తేనే ఇంటికి అనుమతులు జారీ కానున్నాయి. లేకుంటే దరఖాస్తు తిరస్కరణకు గురికానుంది. అయితే, 150 చదరపు మీటర్లలోపు ఉన్న ప్లాట్లకు షరతులతో కూడిన మినహాయింపు కల్పించింది. పాత పురపాలికల్లో 2015 అక్టోబర్ 28 కంటే ముందు, కొత్త మున్సిపాలిటీల్లో 2018 మార్చి 28 కంటే ముందు రిజిస్ట్రేషన్ చేయించుకున్న 150 చదరపు మీటర్లలోపు విస్తీర్ణం గల ప్లాట్లకు మాత్రమే ఈ మినహాయింపు వర్తించనుంది. మరోవైపు అనుమతి తీసుకోకుండా చేపట్టే భవన, లేఅవుట్లను నోటీసులు లేకుండా జిల్లా కలెక్టర్ల నేతృత్వంలో జిల్లా స్థాయి టాస్క్‌ఫోర్స్ కమిటీలు కూల్చివేస్తాయని టీఎస్–బీపాస్ చట్టంలో ప్రభుత్వం పొందుపర్చింది. దీంతో అనుమతి లేని, క్రమబద్ధీకరించుకోని ప్లాట్లలో ఇళ్లను నిర్మించడానికి అవకాశం లేకుండా పోయింది. ఒకవేళ నిర్మించినా, ఎవరైనా టీఎస్–బీపాస్ పోర్టల్ ద్వారా ఫిర్యాదు చేస్తే విచారణ జరిపి వారం రోజుల్లో కూల్చివేయనున్నారు. మరి పేదల పరిస్థితేంటి? ఎల్ఆర్ఎస్ గడువు అక్టోబర్ 31తో ముగిసిపోగా, మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలో 4,16,155 దరఖాస్తులు, మున్సిపాలిటీల పరిధిలో 10,60,013, గ్రామ పంచాయతీల పరిధిలో 10,83,394.. మొత్తం 25,59,562 దరఖాస్తులు వచ్చాయి. క్రమబద్ధీకరణ చార్జీలు, ఖాళీ స్థలాలు లేనందుకు చెల్లించాల్సిన జరిమానాలు కలిపి రూ.వేల నుంచి రూ.లక్షల్లో చెల్లించాల్సి ఉండడంతో లక్షల మంది పేద, మధ్య తరగతి ప్రజలు ఎల్ఆర్ఎస్ కింద దరఖాస్తు చేసుకోలేకపోయారు. ఎల్ఆర్ఎస్ కింద అనధికార లేవుట్లు, ప్లాట్లను క్రమబద్ధీకరించుకోని పక్షంలో వాటిలో ఇళ్ల నిర్మాణానికి అనుమతులు జారీ చేయమని, ఆయా ప్లాట్ల క్రయావిక్రయాలకు రిజిస్ట్రేషన్లు జరపబోమని, సాధారణ నల్లా, డ్రైనేజీ కనెక్షన్లు జారీ చేయమని ప్రభుత్వం ఆగస్టు 31న జారీ చేసిన ఎల్ఆర్ఎస్ జీవోలో పేర్కొంది. తాజాగా టీఎస్–బీపాస్ పోర్టల్ ద్వారా అనధికార లేఅవుట్లలో భవన నిర్మాణ అనుమతల జారీపై ప్రభుత్వం నిషేధం విధించడంతో ఎల్ఆర్ఎస్ కింద దరఖాస్తు చేసుకోలేకపోయిన పేద, మధ్య తరగతి ప్రజల పరిస్థితి అగమ్యగోచరంగా మారే అవకాశముంది. ఉచిత క్రమబద్ధీకరణే పరిష్కారం.. ఎల్ఆర్ఎస్ కింద అనూహ్యంగా 25 లక్షలకు పైగా దరఖాస్తులు రావడంతో ప్రభుత్వం అక్టోబర్ 31 తర్వాత గడువు పొడిగించొద్దని నిర్ణయం తీసుకుంది. కొద్దో గొప్పో ఆర్థిక స్తోమత ఉన్న వాళ్లు ఎల్ఆర్ఎస్ కింద దరఖాస్తు చేసుకోగా, ఏ మాత్రం ఫీజులు భరించలేని పేద, మధ్యతరగతి ప్రజలు దరఖాస్తు చేసుకోలేకపోయారు. దీంతో ఆయా వర్గాల ప్రజలకు సంబంధించిన ప్లాట్లను ప్రభుత్వం ఉచితంగా క్రమబద్ధీకరిస్తేనే వారు భవిష్యత్తులో ఇళ్లను నిర్మించుకోవడానికి అవకాశం కలగనుంది. ఈ విషయంపై ఇప్పటికే సీఎం కె.చంద్రశేఖర్‌రావు పరిశీలన జరుపుతున్నారని ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి. పేదలకు ఊరట కలిగే విధంగా నిర్దిష్ట విస్తీర్ణంలోని అనధికార ప్లాట్లను ఉచితంగా క్రమబద్ధీకరించేందుకు ఉన్న సాధ్యాసాధ్యాలను ప్రభుత్వం పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. జీహెచ్ఎంసీ ఎన్నికలు రాబోతుండటంతో అంతకుముందే దీనిపై నిర్ణయాన్ని ప్రకటించే అవకాశముంది. లేకుంటే క్రమబద్ధీకరించుకోలేకపోయిన పేదలు తమ సొంత ఖాళీ స్థలాల్లో ఇళ్లను నిర్మించుకునే హక్కును, అవకాశాన్ని కోల్పోనున్నారు. ఇది మానవ హక్కుల ఉల్లంఘనే.. ‘ఎల్ఆర్ఎస్ కింద క్రమబద్ధీకరించుకోని స్థలాల్లో ఇళ్ల నిర్మాణానికి అనుమతి ఇవ్వకపోవడాన్ని మానవ హక్కుల ఉల్లంఘనగా పరిగణించాల్సి ఉంటుంది. ప్రజా శ్రేయస్సు కోసం కాకుండా ఖజానాను నింపుకోవడానికి ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ తెచ్చింది. క్రమబద్ధీకరించుకోకుంటే ఇళ్ల నిర్మాణానికి అనుమతులు ఇవ్వబోమని, రిజిస్ట్రేషన్లు జరపమని ఎల్ఆర్ఎస్ జీవోలో పెట్టిన కఠిన నిబంధనలు పూర్తిగా పేద, మధ్య తరగతి ప్రజలకు వ్యతిరేకంగా ఉన్నాయి. ప్రభుత్వం తమకు తోచినప్పుడు ఎల్ఆర్ఎస్ను తెచ్చి తాము చెప్పిన గడువులోగా క్రమబద్ధీకరించుకోవాలంటే అందరికీ సాధ్యమవుతుందా..? ఆ సమయంలో అందరి వద్ద డబ్బులుంటాయా..? ఇప్పటికే లాక్డౌన్, కరోనాతో ఉద్యోగాలు, వ్యాపారాలు దెబ్బతిని ప్రజలు తీవ్రంగా నష్టపోయారు. ఎల్ఆర్ఎస్, టీఎస్–బీపాస్ పేరుతో ఇలాంటి ఆంక్షలు విధిస్తే ప్రభుత్వం ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత చూడక తప్పదు. తక్షణమే పేద, మధ్య తరగతి ప్రజల స్థలాలను ఎలాంటి షరతులు లేకుండా ఉచితంగా క్రమబద్ధీకరించి ఇళ్లను నిర్మించుకోవడానికి అవకాశం కల్పించాలి..' – సంజీవ్, పేదల గృహ నిర్మాణ రంగ కార్యకర్త, మానవ హక్కుల వేదిక (హెచ్ఆర్ఎఫ్) -
ఆక్రమిత ప్రభుత్వ స్థలాల క్రమబద్ధీకరణకు ఓకే!
సాక్షి, హైదరాబాద్: సుదీర్ఘ నిరీక్షణకు తెరపడింది. 2013 నుంచి పెండింగ్‌లో ఉన్న జీవో నం.166 ప్రకారం వచ్చిన దరఖాస్తుల క్లియరెన్స్‌కు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. దీంతో ఆరేళ్లుగా స్థలాల క్రమబద్ధీకరణ కోసం ఎదురుచూస్తున్న దరఖాస్తుదారులకు ఊరట కలగనుంది. కోర్టు కేసు నేపథ్యంలో పక్కనపెట్టిన ఈ దరఖాస్తులను పరిశీలించేందుకు రాష్ట్ర ప్రభుత్వం గతేడాది 179 జీవోను జారీ చేసిన సంగతి తెలిసిందే. కాగా, వరుస ఎన్నికలతో రెవెన్యూ యంత్రాంగం బిజీగా ఉండటంతో ఇన్నాళ్లు పెండింగ్‌లో పెట్టిన దరఖాస్తులను తక్షణమే పరిష్కరించాలని ఆదేశిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా సర్క్యులర్ జారీ చేసింది. ఆక్రమిత ప్రభుత్వ స్థలాలను క్రమబద్ధీకరించుకునేందుకు 2008లో అప్పటి ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి 166 జీవోను విడుదల చేశారు. అయితే, క్రమబద్ధీకరణ ముసుగులో అక్రమార్కులకు స్థలాలను కారుచౌకగా కట్టబెడుతున్నారని పౌరసంఘాలు కొన్ని న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో 2013లో జీవో అమలుపై ‘స్టే’విధించింది. అప్పటి నుంచి యథాతథా స్థితిని కొనసాగించిన న్యాయస్థానం.. నిర్దేశిత రుసుం చెల్లించినవారికి/అర్హమైనవిగా తేల్చిన వాటిని క్రమబద్ధీకరించుకునేందుకు వెసులుబాటు కల్పించింది. పెండింగ్.. పెండింగ్! ఇటు 166 జీవో వ్యవహారం కోర్టులో నడుస్తుండగానే రాష్ట్ర ప్రభుత్వం స్థలాల క్రమబద్ధీకరణకు మరో జీవోను విడుదల చేసింది. 2014లో కొలువుదీరిన కేసీఆర్ సర్కార్.. నివాసాలున్న ప్రభుత్వ స్థలాలను రెగ్యులరైజ్ చేయించుకునేందుకు అవకాశం కల్పిస్తూ జీవో 58, 59లు జారీ చేసింది. మార్గదర్శకాలకు అనుగుణంగా ఉన్న దరఖాస్తులను ప్రభుత్వం పరిష్కరించింది. ఈ క్రమంలోనే 166 కింద పెండింగ్‌లో ఉన్నవాటికి కూడా మోక్షం కలిగించాలని దరఖాస్తుదారులు చేసిన విజ్ఞప్తికి సానుకూలంగా స్పందించిన సర్కార్ 179 జీవోను విడుదల చేసింది. జీవో 59 నిబంధనలకు లోబడి పెండింగ్‌లో ఉన్న 166 జీవో దరఖాస్తులను పరిశీలించాలని నిర్దేశించింది. అయితే, ఎన్నికల విధుల్లో బిజీగా ఉన్న నేపథ్యంలో రెవెన్యూ యంత్రాంగం వీటికి జోలికి వెళ్లలేదు. ఈ జీవో కింద రాష్ట్రవ్యాప్తంగా 2,584 దరఖాస్తులు పెండింగ్‌లో ఉండగా.. ఇందులో ఇప్పటివరకు కేవలం 45 దరఖాస్తులు మాత్రమే అప్లోడ్ చేసి చేతులు దులుపుకున్నారు. ఇందులో 40 రంగారెడ్డి జిల్లావే కావడం విశేషం. వీటిలోను కేవలం 19 దరఖాస్తులను మాత్రమే అప్డేట్ చేయడం గమనార్హం. వాస్తవానికి దరఖాస్తుదారులు.. స్థలాల క్రమబద్ధీకరణకు కీలకమైన ధ్రువపత్రాలను పోర్టల్‌లో నమోదు చేయాల్సి ఉంటుంది. ఇప్పటివరకు పోర్టల్ సమాచారం కూడా జిల్లాల అధికారులకు పంపకపోవడంతో వీటి పరిస్థితేంటో తెలియకుండా పోయింది. కాగా, తాజాగా భూ పరిపాలన ప్రధాన కమిషనర్.. జీవో 166 దరఖాస్తులను 179 జీవో మార్గదర్శకాలకు అనుగుణంగా క్లియర్ చేయమని ఆదేశిస్తూ కలెక్టర్లకు లేఖ రాశారు. అయితే, ల్యాండ్ రెవెన్యూ మేనేజ్మెంట్ సిస్టమ్ (ఎల్ఆర్ఎంస్) పోర్టల్‌లో అప్డేట్ చేసినవి కేవలం 19 దరఖాస్తులే కావడంతో.. వీటికే మోక్షం లభిస్తుందా? తహసీల్దార్లు, ఆర్డీవో, కలెక్టరేట్లలో పెండింగ్‌లో ఉన్నవాటిని కూడా పరిగణనలోకి తీసుకుంటారా అనేది తేలాల్సి ఉంది. -
భూముల క్రమబద్ధీకరణ షురూ!
* చెల్లింపు కేటగిరీ మార్గదర్శకాలకు సవరణ * ఆగస్టు 15న పట్టాల పంపిణీ! సాక్షి, హైదరాబాద్: భూముల క్రమబద్ధీకరణ ప్రక్రియ ఇక ఊపందుకోనుంది. చెల్లింపు కేటగిరీలో ప్రభుత్వం ఇంతకుముందు ఇచ్చిన మార్గదర్శకాలను తాజాగా సవరించింది. ఈ మేరకు రెవెన్యూ శాఖ తాజాగా చెక్ మెమోను జారీ చేసింది. దీంతో చెల్లింపు కేటగిరీ దరఖాస్తులను మండలస్థాయి అధికారులు దుమ్ముదులిపే పనిలో పడ్డారు. నెలాఖరులోగా దరఖాస్తుల పరిశీలనను పూర్తి చేసి ఆగస్టు 15న పట్టాల పంపిణీని లాంఛనంగా చేపట్టాలని సర్కారు సన్నాహాలు చేస్తోంది. సర్కారు సూచనల మేరకు జీవో 59 కింద క్రమబద్ధీకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని భూపరిపాలన విభాగం నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలందాయి. ప్రస్తుతానికి పాత దరఖాస్తులకే.. చెల్లింపు కేటగిరీలో తొలుత 29,281 దరఖాస్తులు రాగా, ఉచితకేటగిరీలో దరఖాస్తు చేసుకున్న 16,915 మందిని పరిశీలన అనంతరం చెల్లింపు కేటగిరీలోకి చేర్చారు. దీంతో చెల్లింపు కేటగిరీలో ప్రభుత్వం వద్దనున్న దరఖాస్తుల సంఖ్య 46,196 చేరింది. ఉచిత కేటగిరీ నుంచి చెల్లింపు కేటగిరీకి మార్చిన దరఖాస్తుదారుల నుంచి సొమ్ము వసూలుపై సర్కారు ఆదేశాలివ్వకపోవడంతో ప్రస్తుతానికి పాత దరఖాస్తులను మాత్రమే పరిశీలించాలని అధికారులు నిర్ణయించారు. చెక్ మెమోలో ప్రధానంగా దరఖాస్తుదారుడు, కుటుంబ సభ్యుల వివరాలతోపాటు భూమి, నిర్మాణంపై ఎక్కువ అంశాలను పొందుపర్చారు. క్రమబద్ధీకరణ కోరుతున్న భూమి నలువైపులా ఫొటోలు, అందులోని నిర్మాణానికి సంబంధించిన ఫొటోను అధికారులు సేకరించాలి. ఏవైనా కోర్టు కేసులు ఉన్నట్లయితే పూర్తి వివరాలను సేకరించాలి. ప్రభుత్వం నిర్దేశించిన గడువులోగా ఒకేసారి సొమ్ము చెల్లించినవారికి 5 శా తం రాయితీ ఇవ్వనున్నారు. పరిశీలన అనంతరం చెల్లించినవారికి రిజిస్ట్రేషన్ చేసి కన్వీనియన్స్ డీడ్లను అందజేస్తారు. వాయిదాల పద్ధతిన చెల్లిస్తున్నవారికి ఎండార్స్మెంట్ పత్రాలను ఇవ్వనున్నారు. -
జీవో 59 పై ఎట్టకేలకు కదలిక
* చెల్లింపు కేటగిరీలో భూముల క్రమబద్ధీకరణకు సర్కారు సన్నద్ధం * క్రమబద్ధీకరణ ప్రక్రియకు గడువు పెంపు! * 46 వేల దరఖాస్తులకు కలగనున్న మోక్షం సాక్షి, హైదరాబాద్ : చెల్లింపు కేటగిరీలో భూముల క్రమబద్ధీకరణ ప్రక్రియను కొనసాగించేందుకు సర్కారు సన్నద్ధమైంది. ప్రభుత్వ భూముల్లో నివాసముంటున్న వారికి ఆయా స్థలాలను చెల్లింపు కేటగిరీలో క్రమద్ధీకరించేందుకు గత డిసెంబర్లో ప్రభుత్వం జీవో నంబరు 59 జారీచేసిన సంగతి తెలిసిందే. చెల్లింపు కేటగిరీలో మొత్తం 46వేల దరఖాస్తులు ప్రభుత్వం వద్ద ఉండగా, మార్గదర్శకాలపై స్పష్టత లేకపోవడంతో అధికారులు ఇన్నాళ్లూ ఆ దరఖాస్తులను అటకెక్కించారు. ఈ అంశంపై ‘జీవో 59పై కదలికేదీ?’ శీర్షికన గత నెల 20న సాక్షిలో ప్రచురితమైన కథనంతో సర్కారు కదిలింది. దరఖాస్తులను పరిశీలించి, అందులో పేర్కొన్న స్థలాలను క్రమబద్ధీకరించేందుకు స్పష్టమైన మార్గదర్శకాలను రూపొందించాలని రెవెన్యూ యంత్రాంగాన్ని ఆదేశించింది. ప్రభుత్వ ఆదేశాలతో కదలిన అధికారులు తాజాగా మార్గదర్శకాలను సిద్ధం చేశారు. సోమవారం నుంచి దరఖాస్తుల పరిశీలన ప్రారంభించాలని జిల్లాల కలెక్టర్లకు రెవెన్యూశాఖ సర్క్యులర్ పంపించింది. అన్ని దరఖాస్తులకు మోక్షం..! ఆక్రమిత భూముల క్ర మబద్ధీకరణ విషయంలో ప్రభుత్వం ఉదారంగా వ్యవహరిస్తున్నందున, చెల్లింపు కేటగిరీలో అన్ని దరఖాస్తులకు మోక్షం లభించనుందని రెవెన్యూ వర్గాలంటున్నాయి. జీవో నంబరు 58 కింద ప్రభుత్వ భూముల్లో నివాసముంటున్న పేదల ఇళ్ల స్థలాలను, వారికి ఉచితంగా క్రమబద్ధీకరించే అంశంలో మార్గదర్శకాలను ప్రభుత్వం పలుమార్లు సడలించింది. చివరికి దరఖాస్తుదారుడు అర్హుడని నిర్ధారించేందుకు పంచనామా ఉన్నా చాలని సర్కారు స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో.. చెల్లింపు కేటగిరీ కింద క్రమబద్ధీకరణ పట్ల కూడా ప్రభుత్వం ఇదే రకమైన వైఖరి అవలంభించవచ్చని తెలుస్తోంది. అలాగే భూముల క్రమబద్ధీకరణ ప్రక్రియకు మరో మూడు నెలల పాటు గడువును పొడిగించాలని కూడా సర్కారు భావిస్తున్నట్లు సమాచారం. దీనిపై రేపో, మాపో ఉత్తర్వులు వెలువడనున్నట్లు తెలిసింది. చెల్లింపు కేటగిరీలో తొలుత 29,281 దరఖాస్తులు రాగా, ఉచిత కేటగిరీలో దరఖాస్తు చేసుకున్న 16,915 మందిని, అధికారుల పరిశీలన అనంతరం చెల్లింపు కేటగిరీలోకి చేర్చారు. దీంతో చెల్లింపు కేటగిరీలో ప్రభుత్వం వద్దనున్న దరఖాస్తుల సంఖ్య 46,196కు చేరింది. క్రమబద్ధీకరణ సొమ్ము ఖజానాకు.. చెల్లింపు కేటగిరీలో క్రమబద్ధీకరణకు దరఖాస్తు దారులు చెల్లించిన సొమ్మును వెంటనే ప్రభుత్వ ఖజానాకు జమ చేయాలని భూపరిపాలన విభాగం నుంచి అన్ని మండలాల తహసీల్దార్లకు ఆదేశాలందాయి. దీంతో ఆఘమేగాల మీద శుక్రవారమే అన్ని మండలాల నుంచి అధికారులు సుమారు రూ.300కోట్లను జమచేశారు. ఇంతకు మునుపు దరఖాస్తుతో పాటు చెల్లించిన సొమ్మును తహశీల్దార్ల ఖాతాల్లోనే ఉంచారు. దరఖాస్తును తిరస్కరించిన పక్షంలో సదరు సొమ్మును తిరిగి ఇవ్వాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అయితే.. చెల్లింపు కేట గిరీ కింద వచ్చిన సొమ్మును ప్రభుత్వ ఖ జానాకు జమ చేయాలని తాజాగా సర్కారు ఆదేశాలివ్వడంతో.. దాదాపుగా అన్ని దరఖాస్తులకు మోక్షం లభించే అవకాశమున్నట్లు ఉన్నతాధికారులు అభిప్రాయపడుతున్నారు.