సాక్షి, హైదరాబాద్: బీఆర్‌ఎస్‌కు రంగారెడ్డి జిల్లా గండిపేట మండలంలోని కోకాపేట గ్రామంలో 11 ఎకరాల భూమిని కేటాయించాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. ఈ మేరకు గురువారం జరిగిన కేబినెట్ భేటీలో భూపరిపాలన శాఖ చేసిన ప్రతిపాదనను మంత్రివర్గం ఆమోదించినట్టు తెలిసింది. ఈ భూమిలో ప్రజా నాయకులు, సామాజిక కార్యకర్తలు, విద్యావేత్తలకు శిక్షణ ఇచ్చేందుకు ‘ఇన్‌స్టిట్యూట్ ఫర్ ఎక్సలెన్స్ అండ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్‌మెంట్’ఏర్పాటు చేస్తామని బీఆర్‌ఎస్ ప్రధాన కార్యదర్శి పేరిట చేసిన ప్రతిపాదన సముచితమేనని భూపరిపాలన శాఖ (రెవెన్యూ) పెట్టిన నోట్‌కు మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
ఈ భూమిని హెచ్‌ఎండీఏ నుంచి స్వాధీనం చేసుకుని బీఆర్‌ఎస్‌కు కేటాయిస్తామని ఆ శాఖ పేర్కొంది. దీంతో సుమారు రూ.500 కోట్ల విలువైన భూమిని బీఆర్‌ఎస్ పేరిట బదలాయించడం లాంఛనమే కానుంది. అయితే, కేబినెట్ నిర్ణయాల ను వెల్లడించేందుకు ఆర్థిక మంత్రి హరీశ్‌రావు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఈ అంశాన్ని గోప్యంగా ఉంచడం, తమకు భూమిని కేటాయించాలని బీఆర్‌ఎస్ ప్రతిపాదించిన వారంరోజుల్లోనే రెవెన్యూశాఖ అంగీకారం తెలిపి మంత్రివర్గ సమావేశం ముందు నోట్ పెట్టడం, కేబినెట్ ఇందుకు ఆమోదం తెలిపిన విషయాన్ని రహస్యంగా ఉంచడం చర్చనీయాంశమవుతోంది.
బీఆర్‌ఎస్ చేసిన ప్రతిపాదన ఇదే
కేబినెట్ ముందు భూపరిపాలన శాఖ పెట్టిన నోట్ ప్రకారం ఈనెల 12న బీఆర్‌ఎస్ ప్రధాన కార్యదర్శి పేరిట భూకేటాయింపు కోసం ప్రతిపాదన వచ్చింది. ఈ భూమిలో ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎక్సలెన్స్ అండ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్‌మెంట్‌ను ఏర్పాటు చేసి నాయకులు, సామాజిక కార్యకర్తలు, విద్యావేత్తలకు వ్యక్తిత్వ వికాస శిక్షణ ఇస్తామని అందులో పేర్కొన్నారు.
ఈ కేంద్రంలో కాన్ఫరెన్స్ హాళ్లు, లైబ్రరీ, శిక్షణ తీసుకునే వారికి వసతి, సెమినార్ రూమ్‌లు, విద్యావేత్తలకు పని ప్రదేశాలను ఏర్పాటు చేస్తామన్నారు. సామాజిక కార్యకర్తలు, ప్రజా నాయకుల అవసరాలను తీర్చేందుకు ఇదో ప్రతిష్టాత్మక కేంద్రంగా రూపుదిద్దుకుంటుందని చెప్పారు. ఇందుకు కోకాపేటలోని 239, 240 సర్వే నంబర్లలో గల 11 ఎకరాల భూమిని కేటాయించాలని కోరారు.
కాంగ్రెస్ పార్టీకి ఇచ్చినట్టుగానే..
బీఆర్‌ఎస్ ప్రతిపాదనను పరిశీలించిన భూపరిపాలన శాఖ కేబినెట్ ముందు సవివరంగా నోట్ పెట్టింది. హైదరాబాద్ జిల్లా తిరుమలగిరి మండలంలోని బోయిన్‌పల్లి గ్రామంలో ఉన్న 502, 503, 502/పీ2 సర్వే నంబర్లలోని 10 ఎకరాల 15 గుంటల భూమిని ఎకరం రూ.2 లక్షల చొప్పున అప్పట్లో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (ఏపీసీసీ)కి కేటాయించినట్టు ఈ నోట్‌లో పేర్కొంది.
జాతీయస్థాయిలో మానవ వనరుల అభివృద్ధి సంస్థను ఏర్పాటు చేసేందుకు ఈ భూమిని కేటాయించినట్టు తెలిపింది. దీనిపై హైకోర్టు ఉత్తర్వుల మేరకు గత ఏప్రిల్ 28న ఆ భూమిని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ)కి పునర్‌కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చిందని చెప్పింది. ఈ పరిస్థితుల్లో ఏపీసీసీకి బోయిన్‌పల్లిలో భూమి ఇచ్చినట్టుగానే కోకాపేటలో బీఆర్‌ఎస్‌కు భూమి ఇవ్వడం సముచితమేనని భూపరిపాలన శాఖ ఆ నోట్‌లో స్పష్టం చేసింది.
రూ.40 కోట్లకు...?
ఈ భూమిని కేబినెట్ నిర్ణయించిన ధరకు బీఆర్‌ఎస్‌కు కేటాయిస్తామని భూపరిపాలన శాఖ నోట్‌లో పేర్కొంది. దీనిప్రకారం ఈ భూమి తమ పేరిట బదలాయించేందుకు బీఆర్‌ఎస్ పార్టీ మొత్తం రూ.40 కోట్లు చెల్లించేలా కేబినెట్ ఆమోదించినట్టు సమాచారం. దాదాపు రూ.500 కోట్ల విలువైన ఈ భూమిని రూ.40 కోట్లకు బీఆర్‌ఎస్‌కు బదలాయించేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపిందన్న విషయంపై ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి.
ఇప్పటికే జిల్లాల్లో పార్టీ కార్యాలయాల కోసం గజానికి రూ.100 చొప్పున మాత్రమే తీసుకుని విలువైన భూములను బీఆర్‌ఎస్ పేరిట బదలాయించుకున్నారని, హైదరాబాద్ జిల్లా కార్యాలయం కోసం బంజారాహిల్స్‌లో 4,935 చదరపు గజాల భూమిని నామమాత్రపు ధరకు సొంతం చేసుకున్నారని, ఇది బీఆర్‌ఎస్ భూదాహానికి నిదర్శనమనే విమర్శలు విపక్షాల నుంచి వస్తున్నాయి.
బీఆర్‌ఎస్‌కు కోకాపేటలో 11 ఎకరాలు
Published Sun, May 21 2023 3:45 AM | Last Updated on Sun, May 21 2023 3:04 PM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment