నవరత్నాల అమలే ప్రధాన అజెండా | AP Govt Main Agenda is to Implement Navaratnalu | Sakshi
Sakshi News home page

నవరత్నాల అమలే ప్రధాన అజెండా

Published Mon, Jun 24 2019 4:20 AM | Last Updated on Mon, Jun 24 2019 8:31 AM

AP Govt Main Agenda is to Implement Navaratnalu - Sakshi

సాక్షి, అమరావతి: ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన నవరత్నాల హామీల అమలు, ప్రధాన సమస్యల పరిష్కారం, అవినీతి రహిత పారదర్శక సుపరిపాలన ముఖ్యమైన అజెండాలుగా నేడు (సోమవారం) కలెక్టర్ల సదస్సు జరగనుంది. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నేతృత్వంలో తొలి కలెక్టర్ల సమావేశం ఉండవల్లిలోని ప్రజావేదికలో నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఎన్నికల మేనిఫెస్టోను బైబిల్, ఖురాన్, భగవద్గీతలా పవిత్రంగా భావిస్తామని, ఇచ్చిన ప్రతి హామీ అమలు చేసి తీరుతామని వైఎస్‌ జగన్‌ గత నెల 30న ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పుడే ప్రకటించిన విషయం తెలిసిందే. అదే రోజు వృద్ధులు, వితంతువులు, తదితరులకు పింఛన్‌ను రూ.2,000 నుంచి రూ.2,250కి పెంచుతూ సంతకం చేశారు. ఇలా ఆరంభమైన హామీల అమలు ప్రక్రియ తొలి కేబినెట్‌ సమావేశంతో వేగం పుంజుకుంది.

ఆశా కార్యకర్తల గౌరవ వేతనాన్ని రూ.3 వేల నుంచి రూ.10 వేలకు, పారిశుధ్య కార్మికులకు వేతనాన్ని రూ.18 వేలకు పెంచడంతోపాటు ప్రభుత్వ ఉద్యోగులకు మధ్యంతర భృతిని జూలై నుంచి 27 శాతం పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. రైతు భరోసా కింద ప్రతి రైతు కుటుంబానికి సాగు ఖర్చులకు రూ.12,500 వచ్చే ఏడాది మే నుంచి ఇస్తామని మేనిఫెస్టోలో పేర్కొనగా ఈ ఏడాది రబీ నుంచే ఇవ్వాలని నిర్ణయించారు. ఇలా ప్రతి అంశంపై స్పష్టతతో ముందుకెళుతున్న సీఎం వైఎస్‌ జగన్‌ తన ప్రభుత్వ ప్రాధామ్యాలు వివరించడంతోపాటు పాలన ఎలా ఉండాలో నేడు జరిగే కలెక్టర్ల సమావేశంలో వారికి మార్గనిర్దేశం చేయనున్నారు. 

సుస్పష్టమైన అజెండా..
గతానికి పూర్తి భిన్నంగా కలెక్టర్ల సదస్సును సత్ఫలితాలనిచ్చే చర్చా కేంద్రంగా వినియోగించుకోవాలని సీఎం వైఎస్‌ జగన్‌ నిర్ణయించుకున్నారు. కలెక్టర్ల సదస్సుకు ఖరారు చేసిన అజెండానే దీనికి నిదర్శనమని సీనియర్‌ ఐఏఎస్‌ అధికారులు చెబుతున్నారు. ‘గత ఐదేళ్లలో ఐదు మిషన్లు, ఎనిమిది గ్రిడ్లు, కన్వర్జెన్స్, సంతులిత వృద్ధి, సంతృప్త స్థాయి అంటూ కేవలం గణాంకాలు, టేబుళ్లు, గ్రాఫిక్స్‌తో ఎవరికీ ఏమీ అర్థం కాని విధంగా, నిర్దేశిత లక్ష్యం లేకుండా కలెక్టర్ల సదస్సులు జరుగుతూ వచ్చాయి. క్షేత్ర స్థాయిలో సమస్యలను ప్రస్తావించడానికి అధికారులు, ఒకరిద్దరు మంత్రులు ప్రయత్నించినా మీరు అర్థం చేసుకోవడం లేదు. మనం లక్షలాది మందికి ఫోన్‌ చేస్తే వారు ఇలా చెప్పారంటూ బుకాయిస్తూ, నోరు మూయిస్తూ వచ్చారు. దీంతో సమస్యలను చెప్పడమే మానేసిన మంత్రులు, కొందరు అధికారులు సీఎం చంద్రబాబును పొగడటం, ఆయన తాను హైదరాబాద్‌ను అభివృద్ధి చేశానని, హైటెక్‌ సిటీని కట్టానంటూ స్వోత్కర్షగా సాగుతూ వచ్చాయి. కానీ వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం తొలి కలెక్టర్ల సదస్సుకే స్పష్టమైన అజెండా ఖరారు చేసింది.

ప్రజలకు ఇచ్చిన నవరత్నాల అమలు సీఎం తన తొలి ప్రాధాన్యమని చెబుతున్నారు. వీటి అమలే లక్ష్యంగా చర్యలు తీసుకుంటున్నారు. సదస్సు అజెండాలో కూడా నవరత్నాల అమలుకు తీసుకోవాల్సిన చర్యలను చేర్చారు. అత్యంత ముఖ్యమైన వ్యవసాయం, విద్య, వైద్య రంగాల్లో తేవాల్సిన మార్పులు, తీసుకోవాల్సిన చర్యలకు ప్రాధాన్యం ఇచ్చారు. వచ్చే ఉగాది నాటికి 25 లక్షల మంది మహిళలకు ఇంటి స్థల పట్టాలివ్వాలని లక్ష్యంగా పెట్టుకున్న సీఎం ఇందుకు ఏమి చేయాలో దిశానిర్దేశం చేయాలని రెవెన్యూ శాఖను ఆదేశించారు. ఇందులో భాగంగానే రెవెన్యూ శాఖ అధికారులు ఇళ్ల స్థల పట్టాల జారీకి అర్హుల ఎంపిక, విధివిధానాలను ప్రధాన అజెండాగా చేర్చారు.

భూ యజమానులకు నష్టం జరగకుండా కౌలు రైతులకు న్యాయం చేస్తామని ఎన్నికల ముందు ఇచ్చిన హామీ అమల్లో భాగంగా వారికి రుణ అర్హత కార్డుల జారీ, ఇతర చర్యలకు ప్రాధాన్యం ఇవ్వాలని రెవెన్యూ శాఖను ఆదేశించారు. దీంతో ఈ దిశగా కలెక్టర్లకు దిశానిర్దేశం చేయాలని రెవెన్యూ, వ్యవసాయ శాఖలు ఈ అంశాన్ని ప్రాధాన్య అంశంగా చేర్చాయి. 108, 104 అంబులెన్సుల సేవలను మెరుగుపరుస్తామని ఇచ్చిన హామీ అమలు దిశగా ఇప్పటికే వైద్య రంగంలో సంస్కరణల కోసం నిపుణుల కమిటీని వేసిన సీఎం.. కలెక్టర్లకు దిశానిర్దేశం కోసం అజెండాలో ప్రాధాన్యం కల్పించారు. తొలి కలెక్టర్ల సదస్సు అజెండా చాలా సుస్పష్టంగా, ప్రాధామ్యాల ప్రకారం ఉంది. ఇది కొత్త సీఎంకు ఉన్న విజన్‌కు నిదర్శనం’ అని పలువురు సీనియర్‌ ఐఏఎస్‌ అధికారులు పేర్కొన్నారు. 

తొలి చర్చ గ్రామ సచివాలయాలపైనే..
గ్రామ సచివాలయాల ఏర్పాటు ద్వారా గ్రామ పంచాయతీల్లో పారదర్శక పాలన అందించాలని ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో ఇందుకు తీసుకోవాల్సిన చర్యలపై దిశానిర్దేశంతోనే కలెక్టర్ల సదస్సులో తొలి చర్చకు శ్రీకారం చుడుతుండటం గమనార్హం. తెల్ల రేషన్‌కార్డు ఉండి, వైద్య ఖర్చులు రూ.1,000 దాటితే వారిని ఆరోగ్యశ్రీలోకి తీసుకురావడంతోపాటు 104, 108 అంబులెన్సు సేవలను మెరుగుపర్చాలని సీఎం కీలక నిర్ణయం తీసుకున్నందున కలెక్టర్ల సదస్సులో దీన్ని రెండో అంశంగా చేర్చారు. కరవు నేపథ్యంలో వ్యవసాయ, పశుసంవర్థక శాఖల్లో తీసుకోవాల్సిన చర్యలు, పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి పరిస్థితి, తదితర అన్ని అంశాలను ఆయా శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు/ ముఖ్య కార్యదర్శులు పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన్‌ ద్వారా సదస్సులో వివరించనున్నారు.

వర్షాలు ఆరంభమైన నేపథ్యంలో పంటల సాగుకు ప్రభుత్వం అందించాల్సిన సహకారం, సబ్సిడీ విత్తనాలు, ఎరువుల సరఫరా చర్యలను తెలియజేస్తారు. సోమవారం ఉదయం 10 గంటలకు రాష్ట్ర భూపరిపాలన ప్రధాన కమిషనర్, రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ మన్మోహన్‌ సింగ్‌ స్వాగతోపన్యాసంతో కలెక్టర్ల సదస్సు ప్రారంభమవుతుంది. తర్వాత సీఎస్‌ ఎల్వీ సుబ్రహ్మణ్యం కొత్త ప్రభుత్వ ప్రధాన లక్ష్యాలు, అధికారులు అనుసరించాల్సిన విధివిధానాలపై దిశానిర్దేశం చేస్తారు. ఆ తర్వాత డిప్యూటీ సీఎం, రెవెన్యూ శాఖ మంత్రి పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌ ప్రారంభోపన్యాసం, ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ ప్రసంగం ఉంటాయి. అనంతరం సీఎం వైఎస్‌ జగన్‌ కీలకోపన్యాసం ద్వారా ప్రభుత్వ ప్రాధాన్యాలు, అధికారులు ఎలా వ్యవహరించాలనే అంశాలపై దిశానిర్దేశం చేస్తారు. తర్వాత పరిపాలనలో గ్రామ సచివాయాలు, గ్రామ వలంటీర్ల వ్యవస్థ ఎలా ఉండాలన్న అంశంపై పంచాయతీరాజ్, పురపాలక పట్టణాభివృద్ధి శాఖల ముఖ్య కార్యదర్శులు గోపాలకృష్ణ ద్వివేది, శ్యామలరావు పవర్‌పాయింట్‌ ప్రజంటేషన్‌ ఇస్తారు.

వైద్య రంగంపై వైద్య, ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి కేఎస్‌ జవహర్‌రెడ్డి, నిత్యావసర సరుకుల డోర్‌ డెలివరీపై ఆ శాఖ కార్యదర్శి కోన శశిధర్, పాఠశాల విద్యపై ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌ దాస్, కరవు నేపథ్యంలో తీసుకుంటున్న, తీసుకోవాల్సిన చర్యలపై లైన్‌ డిపార్టుమెంట్ల అధికారులు పవర్‌పాయింట్‌ ప్రజంటేషన్‌ ద్వారా వివరిస్తారు. వీటిపై చర్చ ముగిసిన తర్వాత శాంతిభద్రతలపై కలెక్టర్లు, ఎస్పీల సంయుక్త సమావేశం ఉంటుంది. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement