సాక్షి, అమరావతి: రాష్ట్ర 15వ శాసనసభ రెండవ సెషన్ సమావేశాలు పలు చరిత్రాత్మక బిల్లులకు వేదికగా నిలిచాయి. రాష్ట్ర చరిత్రనే తిరగరాసే అనేక కీలక బిల్లులు ఈ సమావేశాల్లో ఆమోదం పొందాయి. 14 రోజుల పాటు జరిగిన సమావేశాల్లో ప్రభుత్వం 20 బిల్లులను ప్రవేశపెట్టింది. ఇన్ని బిల్లులు ఒకేసారి సభలో ప్రవేశ పెట్టడం, వాటిపై సుదీర్ఘంగా చర్చించడం విశేషం. వీటిలో ఒకదాన్ని ఉపసంహరించుకోగా 19 బిల్లులకు అసెంబ్లీ ఆమోదం తెలిపింది. ఈ బిల్లుల ద్వారా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, మహిళలకు మేలు చేకూర్చే చట్టాలు అమల్లోకి రానున్నాయి. ప్రైవేట్ విద్యా సంస్థల్లో అడ్డూ అదుపు లేకుండా ఉన్న ఫీజులకు అడ్డుకట్ట వేయడంతో పాటు తూతూమంత్రపు చదువులు కాకుండా అత్యున్నత ప్రమాణాలతో విద్యా రంగాన్ని పరిపుష్టం చేసే బిల్లులూ వీటిలో ఉన్నాయి. రాష్ట్ర శాసనసభ చరిత్రలో గత కొన్నేళ్లలో ఎన్నడూ లేని విధంగా బిల్లులపై అర్థవంతమైన చర్చ జరగడం ఈ అసెంబ్లీ ప్రత్యేకతగా నిలిచింది. బడ్జెట్ సమావేశాల్లో బడ్జెట్ ప్రవేశ పెట్టాక దానిపై చర్చ గత కొన్నేళ్లుగా తూతూమంత్రంగా సాగేది. ఇక పద్దులపై చర్చలు ఏనాడూ పెద్దగా జరగ లేదు. చివర్లో అన్ని పద్దులను ఏకవాక్యంతో గిలెటిన్ చేసిన సందర్భాలే అధికం. ఇలాంటి తరుణంలో ఈ శాసనసభ సమావేశాల్లో బిల్లులపైనే కాకుండా అన్ని పద్దులపైనా చర్చ జరిపించారు. ఈ చర్చల్లో అటు అధికార పక్ష సభ్యులే కాకుండా ప్రతిపక్ష సభ్యులూ భాగస్వాములయ్యే విధంగా సభాపతి తమ్మినేని సీతారాం, సభానాయకుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చర్యలు తీసుకున్నారు.
అందరికీ మాట్లాడే అవకాశం
గతంలో సభలో కొత్త సభ్యులకు మాట్లాడే అవకాశాలు తక్కువగా ఉండేవి. రికార్డులో ఎక్కడానికి వీలుగా అయిదేళ్లలో ఏదో ఒకరోజు అందరితోనూ మాట్లాడించి మమ అనిపించే వారు. ఈసారి అలా కాకుండా కొత్త సభ్యులను చర్చలో భాగస్వాములను చేయడంతో పాటు వివిధ సందర్భాల్లో అందరికీ ఏదో ఒక రూపేణా మాట్లాడే అవకాశం కల్పించారు. బిల్లులపై చర్చ, ఆమోదం పొందే చివరి నిముషం వరకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సభలో తనసీటులోనే కూర్చున్నారు. ఆయా సందర్భాల్లో ఆయన కూడా స్పందిస్తూ ఆయా అంశాలను విడమరిచి చెప్పారు. అనేక మంది కొత్త సభ్యులు ఈ బిల్లులపై చర్చలో ఉత్సాహంగా పాల్గొంటూ ప్రభుత్వానికి సలహాలు, సూచనలు ఇవ్వడంతోపాటు తమ అభిప్రాయాలను వెలిబుచ్చారు. ఇక పద్దులపై కూడా గతంలో ఎన్నడూలేని రీతిలో ఈ సభలో చర్చలు సాగాయి. ప్రతి పద్దుపైనా మంత్రులు, ఇద్దరు ముగ్గురు సభ్యులు మాట్లాడేలా అవకాశం కల్పించారు. ప్రశ్నోత్తరాల సమయంలోనూ సీఎం తన సీట్లోనే ఉంటూ ఆయా సభ్యుల ప్రశ్నలకు మంత్రులతో పాటు తాను కూడా ప్రత్యుత్తరమిచ్చారు.
చర్చకు బాబు బృందం దూరం
అసెంబ్లీలో అనేక చరిత్రాత్మక బిల్లులను ప్రభుత్వం ప్రవేశపెడుతూ వాటిపై అందరూ చర్చలో పాల్గొనే విధంగా అవకాశం కల్పిస్తే ప్రతిపక్ష తెలుగుదేశం ముఖం చాటేసింది. తన పాలనలో ఏనాడూ ఇలాంటి బిల్లులపై ఆలోచనలు చేయని చంద్రబాబునాయుడు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, మహిళలకు మేలు చేసే, రైతులకు లబ్ధి చేకూర్చే, ప్రయివేటు విద్యా సంస్థల ఫీజుల దోపిడీకి అడ్డుకట్ట వేసే అనేక విప్లవాత్మక బిల్లులను ప్రభుత్వం ప్రవేశపెట్టగా చంద్రబాబు వాటిని అడ్డుకొనేందుకు శతథా ప్రయత్నించారు. ఈ బిల్లులపై చర్చ జరిగితే తన పాలనలోని అరాచకాలు ప్రస్తావనకు వస్తాయన్న భయంతో చర్చకు ముందే ఏదో ఒక వంకతో సభలో గందరగోళం సృష్టించే ప్రయత్నం చేశారు. చివరకు సభాపతి, సభా నాయకుడు పలుమార్లు ప్రతిపక్ష నేతకు ఎంతసేపైనా మాట్లాడేందుకు అవకాశం కల్పించినా వాటిని సద్వినియోగానికి కాకుండా గందరగోళానికి చంద్రబాబు వినియోగించారు. ఆ సాకుతో సభ నుంచి వాకౌట్ చేస్తూ వెళ్లిపోవడాన్ని రాష్ట్ర ప్రజలందరూ గమనించారు. పైగా అసెంబ్లీలో కాకుండా చిట్‌చాట్ అంటూ, ప్రైవేట్ రిసార్టులలో ప్రెస్‌మీట్లు పెడుతూ ప్రభుత్వంపై, సభాపతిపై బురద చల్లేలా వ్యవహరించారు.
నవరత్నాలకు తొలి సభలోనే కార్యరూపం
నవరత్నాల మేనిఫెస్టో తమకు భగవద్గీత, ఖురాన్, బైబిల్ అని, వాటిని తూ.చ తప్పక అమలు చేస్తామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించడమే కాకుండా తొలి బడ్జెట్ సమావేశాల్లోనే వాటికి కార్యరూపం ఇవ్వడం విశేషం. ఈ బిల్లుల రూపేణా నవరత్న హామీల్లోని 85 శాతం హామీల అమలుకు వీలుగా ముఖ్యమంత్రి కార్యాచరణ ప్రారంభించారు. ఎన్నికల ముందు తాను చేపట్టిన సుదీర్ఘ పాదయాత్రలో ప్రజల కష్టనష్టాలను ప్రత్యక్షంగా చూసిన ఆయన.. వాటికి పరిష్కారంగా ఈ బిల్లులను రూపొందింప చేశారు. గత ప్రభుత్వం ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి మళ్లీ ఎన్నికల ముందు మాయచేసే చర్యలకు దిగగా అందుకు భిన్నంగా అధకారంలోకి వచ్చిన వెను వెంటనే హామీలను నెరవేర్చే చర్యలను ముఖ్యమంత్రి చేపట్టారు. రాష్ట్ర బడ్జెట్ సమావేశాల్లో ప్రవేశపెట్టిన బిల్లులన్నీ చరిత్రాత్మకమైనవే కాకుండా సామాజికంగా విప్లవాత్మకమైనవని పలువురి ప్రశంసలందుకుంటున్నాయి. ఇప్పటి వరకు దేశంలోని ఏ రాష్ట్రంలో లేని విధంగా బడుగు బలహీన వర్గాలకు రాజకీయ, సామాజిక, ఆర్థిక పరిపుష్టి కల్పిస్తూ చారిత్రక చట్టాలను చేయడంలో ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి చరిత్ర సృష్టించారు.
Comments
Please login to add a commentAdd a comment