అమరావతి, సాక్షి: ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకార కార్యక్రమం అనంతరం ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ రేపటికి వాయిదా పడింది. ఇవాళ అసెంబ్లీలో 172 మంది సభ్యులు ఎమ్మెల్యేలుగా ప్రమాణం చేశారు. మిగిలిన ముగ్గురి ప్రమాణ స్వీకారంతో పాటు రేపు స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఎన్నిక జరగనుంది.
ఏపీ అసెంబ్లీ సమావేశాల కోసం ప్రొటెం స్పీకర్‌గా టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యతో నిన్న గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ప్రమాణం చేయించిన సంగతి తెలిసిందే. ఇవాళ ఆయన అసెంబ్లీ సమావేశాల్లో సభ్యుల చేత ప్రమాణం చేయించారు. తొలుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఆ తర్వాత డిప్యూటీ సీఎం కొణిదల పవన్ కల్యాణ్ ఎమ్మెల్యేలుగా ప్రమాణం చేశారు.
ఆ తర్వాత మంత్రులు ఇంగ్లీష్ అక్షర క్రమంలో ఒక్కొక్కరుగా ఎమ్మెల్యేగా ప్రమాణం చేశారు. మంత్రుల ప్రమాణ కార్యక్రమం ముగిశాక.. వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఎమ్మెల్యేగా ప్రమాణం చేశారు.
గ్యాలరీ కోసం క్లిక్ చేయండి: వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం.. అసెంబ్లీ ఛాంబర్‌లో జగన్‌తో భేటీ (ఫొటోలు)
ఆ తర్వాత ఎమ్మెల్యేలందరూ ప్రమాణం చేశారు. ఈ కార్యక్రమం ముగిశాక.. స్పీకర్‌గా అయ్యన్నపాత్రుడి నామినేషన్ కార్యక్రమం జరిగింది. కూటమి నేతలు నామినేషన్‌కు మద్దతు ఇవ్వగా.. మెజారిటీ ఉండడంతో అయ్యన్నపాత్రుడి స్పీకర్ ఎన్నిక ఏకగ్రీవం అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.
అంతకు ముందు..
ఈ ఉదయం అసెంబ్లీ దగ్గర ఆసక్తికర ఘటనలు చోటు చేసుకున్నాయి. రెండున్నరేళ్ల తర్వాత అసెంబ్లీలోకి అడుగు పెట్టిన సీఎం చంద్రబాబు.. భావోద్వేగానిని లోనయ్యారు. అసెంబ్లీ మెట్లకు మొక్కి లోపలకు వచ్చారాయన. ఇక పవన్ కల్యాణ్ అసెంబ్లీలో అడుగుపెట్టడం చూసేందుకు ఆయన సోదరుడు, జనసేన రాష్ట్రకార్యదర్శి నాగబాబు వచ్చారు.
గ్యాలరీ కోసం క్లిక్ చేయండి: అసెంబ్లీలో ఎమ్మెల్యే ప్రమాణ స్వీకారం
- తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టిన 81 మంది ఎమ్మెల్యేలు
- ఉమ్మడి కృష్ణా జిల్లానుంచి ఆరుగురు కొత్త సభ్యులు
- ఎమ్మెల్యేలలో.. ఇద్దరు మాజీ ఐఏఎస్‌లు
- శ్రీనివాస్ పేరుతో 11 మంది సభ్యులు
Comments
Please login to add a commentAdd a comment