AP Assembly 2022: AP CM YS Jagan Speech In Assembly - Sakshi
Sakshi News home page

శాసనసభలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి స్పష్టీకరణ

Published Tue, Sep 20 2022 4:35 AM | Last Updated on Tue, Sep 20 2022 10:25 AM

AP CM YS Jagan Speech In Assembly - Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పారిశ్రామిక, ఆర్థికాభివృద్ధి శరవేగంగా జరుగుతోందని, కోవిడ్‌ వల్ల ప్రపంచ వ్యాప్తంగా విదేశీ పెట్టుబడుల ప్రవాహం తగ్గినప్పటికీ.. మన రాష్ట్రంలోకి భారీ పెట్టుబడులు వస్తున్నాయని సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్రంలో పారిశ్రామిక విధానాలు పారదర్శకంగా అమలుచేస్తుండటంతో పారిశ్రామికవేత్తల్లో ప్రభుత్వంపై నమ్మకం ఏర్పడిందని చెప్పారు. తద్వారా 100 శాతం పారిశ్రామికవేత్తల సర్వే ద్వారా నిర్వహించిన సులభతర వాణిజ్య ర్యాంకుల్లో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం 97.89 శాతంతో మొదటి స్థానంలో నిలిచిందన్నారు.

రాష్ట్ర ప్రభుత్వంపై నమ్మకం పెరగడంతో భజాంకా (సెంచూరీ ప్లైవుడ్స్‌), భంగర్‌ (శ్రీసిమెంట్‌), సింఘ్వీ (సన్‌ ఫార్మా), అదానీ, ఆదిత్య మిట్టల్, టాటా, బిర్లా వంటి పారిశ్రామిక దిగ్గజాలు రాష్ట్రంలో పెట్టుబడులు పెడుతున్నాయని చెప్పారు. చంద్రబాబు నాయుడు ఐదేళ్ల పరిపాలనతో పోలిస్తే రాష్ట్రంలో పెట్టుబడులు అధికంగా వస్తున్నాయని, గత ప్రభుత్వ ఐదేళ్ల కాలంలో ఏటా సగటున రూ.11,994 కోట్ల పెట్టుబడులు వాస్తవరూపం దాలిస్తే.. ఇప్పుడది రూ.12,702 కోట్లుగా ఉందన్నారు.  సోమవారం ఆయన శాసనసభలో ‘పారిశ్రామికాభివృద్ధి, పెట్టుబడులు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి’ అంశంపై స్వల్పకాలిక చర్చకు సమాధానమిచ్చారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడిన వివరాలు ఇలా ఉన్నాయి.

ఇప్పుడే ఎక్కువ పెట్టుబడులు

  • 2021–22కు సంబంధించి దాదాపు 19 రాష్ట్రాలకు చెందిన జీఎస్‌డీపీ వివరాలు ఇప్పటికే విడుదల చేశారు. అందులో 11.43 గ్రోత్‌ రేట్‌తో దేశంలోనే నంబర్‌ వన్‌ రాష్ట్రంగా మనం నిలబడ్డాం. ఇది ప్రస్తుత ధరలుగా కాకుండా 2011–12 స్థిర ధరల ప్రకారం. అంటే ధరలు స్థిరంగా ఉన్నా, ఉత్పత్తి పెరగడం ద్వారా ఈ వృద్ధి నమోదు చేయడం గొప్ప విషయం. 
  • గత ప్రభుత్వం అయిదేళ్ల కాలంతో పోలిస్తే, మన మూడేళ్ల మూడు నెలల పాలనలో ఏటా సగటున మెరుగైన పెట్టుబడులు సమకూరాయి. భారీ పరిశ్రమలనే తీసుకుంటే, పెట్టుబడుల విలువ రూ.41,280.53 కోట్లు. అంటే ఈ మూడేళ్లలో రాష్ట్రంలో ఏటా సగటున రూ.12,702 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. ఇదే చంద్రబాబు హయాంలో 2014 నుంచి 2019 వరకు చూస్తే ఐదేళ్లకు కలిపి.. రూ.59,968.37 కోట్ల పెట్టుబడితో 215 పరిశ్రమలు ఏర్పాటయ్యాయి. అంటే అప్పట్లో ఏటా సగటున రూ.11,994 కోట్ల పెట్టుబడులు సమకూరాయి. ఈ లెక్కన చంద్రబాబు పాలన కన్నా మనం ముందున్నాం. 
  • 2019 జూన్‌ నుంచి ఈ ఏడాది ఆగస్టు వరకు రూ.46,280.53 కోట్ల పెట్టుబడుల ద్వారా 99 భారీ పరిశ్రమలు ఉత్పత్తి ప్రారంభించడం వల్ల 62,541 మందికి ఉద్యోగావకాశాలు లభించాయి. ఇదే సమయంలో 35,181 ఎంఎస్‌ఎంఈలు రూ.9,742.51 కోట్ల పెట్టుబడితో 2,11,374 ఉద్యోగావకాశాలు వచ్చాయి. ఇవి కాకుండా రూ.39,655 కోట్ల పెట్టుబడులతో మరో 55 భారీ ప్రాజెక్టులు నిర్మాణ దశలో ఉన్నాయి. వీటి ద్వారా 78,792 ఉద్యోగావకాశాలు లభిస్తాయి. మరో రూ.91,129.24 కోట్ల పెట్టుబడితో మరో 10 ప్రాజెక్టులకు సంబధించి, ప్రభుత్వంతో చర్చలు కొనసాగుతున్నాయి. ఇవి పూర్తయితే మరో 40,500 మందికి ఉద్యోగావకాశాలు దక్కనున్నాయి. 
  • ఇవి కాకుండా కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల విషయానికి వస్తే విశాఖ, కాకినాడ, కృష్ణా, శ్రీసత్యసాయి జిల్లాలలో నాలుగు భారీ ప్రభుత్వ రంగ సంస్థలు.. హెచ్‌పీసీఎల్, ఓఎన్జీసీ, బీఈఎల్‌ కంపెనీల పనులు జరుగుతున్నాయి. మొత్తంగా రూ.1,06,800 కోట్ల పెట్టుబడితో ఈ కంపెనీల కార్యకలాపాలు ప్రారంభం కాబోతున్నాయి. తద్వారా 72,900 మందికి ఉపాధి, ఉద్యోగావకాశాలు లభిస్తాయి. 
  • మూడేళ్లుగా కోవిడ్‌.. ప్రపంచాన్ని ఎంతగా వణికించిందో మన అందరం దానికి సాకు‡్ష్యలమే. ప్రపంచ వ్యాప్తంగా ప్రతి రంగం మీదా కోవిడ్‌ ప్రభావం చూపించింది. ప్రత్యేకించి పారిశ్రామిక, సేవా రంగాల మీద కోవిడ్‌ దెబ్బ భారీగా పడింది. అయితే ఇంతటి సంక్షోభంలో కూడా మన దగ్గర ఈ రంగంలో పెట్టుబడుల్లో  పెరుగుదల నమోదైంది. 
  • వీటన్నింటితో పాటు మనందరి ప్రభుత్వం ప్రారంభించిన వైఎస్సార్‌ చేయూత, ఆసరా తదితర పథకాల ద్వారా అందిన సొమ్ముతో 55 లక్షల మంది అక్కచెల్లెమ్మలు స్వయం ఉపాధి యూనిట్లు పెట్టుకుని, సొంత కాళ్లపై నిలబడ్డారు.

పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వంపై విశ్వాసం 

  • ప్రపంచాన్నే కుదిపేసిన కోవిడ్‌ సంక్షోభంతో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు తగ్గిపోయిన పరిస్థితిలో కూడా రాష్ట్రంలో మాత్రం పారిశ్రామిక రంగంలో పెట్టుబడులు బాగున్నాయి. ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌లో వరుసగా మూడో ఏడాది కూడా నంబర్‌ 1గా ఉన్నాం. 
  • ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌లో గతంలో పారిశ్రామిక వేత్తల అభిప్రాయాలకు కేవలం 10 శాతం మార్కులే ఉండేవి. ఈ రోజు 100కు 100 మార్కులు వారి అభిప్రాయాల మేరకే వేస్తున్నారు. పారిశ్రామిక వేత్తలు సంతోషంగా ఉన్నారనడానికి ఇదే నిదర్శనం.
  • 2020 ర్యాంకింగ్స్‌లో 97.89 పర్సెంటేజీతో మనం తొలి స్థానం సంపాదించాం. కరోనా మహమ్మారితో పారిశ్రామిక రంగం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న సమయంలో ఆ సర్వే నిర్వహించారు. 15 రంగాల్లో 301 సంస్కరణలు, మొట్టమొదటిసారిగా 100 శాతం పారిశ్రామిక వేత్తల మార్కుల ఆధారంగా ర్యాంకులను ప్రకటించారు. 
  • సర్వేలో 92 శాతం మార్కులు దాటిన ఏడు రాష్ట్రాలను టాప్‌ అచీవర్స్‌గా ప్రకటించారు. ఇందులో ఏపీ 97.89 శాతంతో మొదటి స్థానంలో నిలవగా, ఆ తర్వాతి స్థానాల్లో వరుసగా గుజరాత్‌ (97.77%), తమిళనాడు(96.67%), తెలంగాణ (94.86%), హరియాణా (93.42%), పంజాబ్‌ (93.23%), కర్ణాటక (92.16%) ఉన్నాయి. ఇది మన రాష్ట్రానికి గర్వ కారణం.

రూ.2,200 కోట్ల బాబు బకాయిలు చెల్లించాం 

  • రాష్ట్రంలో అత్యధికంగా ఉపాధి కల్పించే సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల (ఎంఎస్‌ఎంఈ)పై ప్రత్యేక దృష్టి పెట్టి ప్రోత్సహిస్తున్నాం. ఈ రంగం ద్వారా మూడేళ్లలో దాదాపు 12 లక్షల మందికి ఉపాధి కల్పిస్తున్నాం. 
  • పారిశ్రామిక రంగానికి రూ.2,858 కోట్లకు పైగా ఇన్‌సెంటివ్స్‌ (ప్రోత్సాహకాలు) ఇస్తే.. ఇందులో ఒక్క ఎంఎస్‌ఎంఈ రంగానికి మాత్రమే రూ.2,500 కోట్లు ఇచ్చాం. ఇందులో రూ.2,200 కోట్లు చంద్రబాబు నాయుడు హయాంలో బకాయిలున్నాయి. 
  • చిన్న చిన్న వాళ్లు పరిశ్రమలు పెడుతున్నారు. వీళ్లకు ప్రభుత్వం నుంచి రావాల్సిన ఇన్సెంటివ్‌లు రాకపోతే వీళ్లు ఎలా పరిశ్రమలు నడపగలగుతారు? అప్పుడు వాటిలో పని చేస్తున్న ఉద్యోగుల పరిస్థితి ఏమిటి? అనే ధ్యాస కూడా గత ప్రభుత్వానికి లేదు. ఏకంగా రూ.2,200 కోట్లు బకాయిలంటే ఎంఎంస్‌ఎంఈ రంగాన్ని చంద్రబాబు ఖూనీ చేశారని అర్థం చేసుకోవచ్చు.
  • ఇవాళ అటువంటి ఈ సెక్టార్‌ నిలదొక్కుకుంది. ఎరియర్స్‌ క్లియర్‌ చేశాం. ఏటా క్రమం తప్పకుండా ఇన్సెంటివ్‌లు ఇచ్చే కార్యక్రమం జరుగుతోంది. ఒక గొప్ప విప్లవాత్మక మార్పు వల్ల పారిశ్రామిక రంగం నిలబడగలుగుతోంది. 
  • కొద్ది రోజుల క్రితమే గ్రానైట్‌ పరిశ్రమకూ ప్రోత్సాహకాలు ప్రకటించాం. పరిశ్రమలకు కావాల్సిన స్కిల్డ్‌ మ్యాన్‌ పవర్‌ విషయంలో ఏ రాష్ట్రం పెట్టని విధంగా దృష్టి సారించాం. 75 శాతం ఉద్యోగాలు స్థానికులకు రిజర్వ్‌ చేయాలని చట్టం చేశాం. పారిశ్రామిక విధానానాన్ని పారదర్శకంగా అమలు చేస్తున్నాం. నీళ్లు, విద్యుత్, రోడ్లు, రైల్వే లైన్లకు సంబం«ధించిన మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నాం. ఏది చేయగలుగుతామో అదే చెబుతున్నాం. చెప్పింది చేస్తున్నాం. వీటన్నింటి వల్ల రాష్ట్ర ప్రభుత్వంపై పారిశ్రామిక వేత్తలకు నమ్మకం పెరిగింది.

రాష్ట్రం వైపు పారిశ్రామిక దిగ్గజాల చూపు 

  • రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా పారిశ్రామిక దిగ్గజాలు, వారి సంస్థలు ఇక్కడ కార్యకలాపాలు ప్రారంభిస్తున్నాయి. సెంచురీ ప్లైవుడ్, భజాంకాలు, శ్రీసిమెంట్స్‌ బంగర్లు, సన్‌ ఫార్మా సింఘ్వీలు, బిర్లాలు లాంటి వారంతా రాష్ట్రానికి వస్తున్నారు. కుమార మంగళం బిర్లా తన ప్లాంట్‌ కోసం ఇక్కడికి వచ్చారు. ముఖ్యమంత్రితో ప్రయాణం చేసి ప్లాంట్‌ను ప్రారంభించారు. 
  • ఇలాంటి పారిశ్రామిక వేత్తలందరికీ పూర్తి స్థాయిలో మద్దతుగా నిలుస్తున్నాం. చంద్రబాబు నాయుడు హయాంలో ఏం కావాలన్నా నా కెంత? అన్నదే ముఖ్యం. అందువల్లే పారిశ్రామిక వేత్తలు అప్పట్లో ముందుకు రాలేదు. ఇప్పుడు వస్తున్న వారంతా పార్ట్‌నర్‌ షిప్‌ సమిట్‌లో చంద్రబాబు మేకప్‌ చేయించి, అద్దె కోట్లు వేసి సంతకాలు చేయించిన నకిలీ పారిశ్రామిక వేత్తలు కారు. దేశంలోనే ప్రఖ్యాతిగాంచిన సంస్థలు, యాజమాన్యాలు.
  • ఏ ప్రభుత్వంలోనైనా పరిశ్రమలు వస్తే.. స్థానికంగా ఉపాధి, ఉద్యోగావకాశాలు పెరుగుతాయి. రాష్ట్ర జీఎస్‌డీపీ ఆదాయాల్లో కూడా పెరుగుదల రిజిష్టర్‌ అవుతుంది. ప్రజల జీవన ప్రమాణాలు మెరుగవుతాయి. ఈ అంశాలను గమనించే.. సూక్ష్మ, చిన్న–మధ్య తరహా పరిశ్రమల రంగం మీద.. అంటే ఎంఎస్‌ఎంఈలపై మన ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది.

వీళ్లు చరిత్రహీనులు..

  • రాష్ట్రానికి రూ.1,000 కోట్లతో బల్క్‌ డ్రగ్‌ పార్క్‌ ఇస్తాం అని కేంద్ర ప్రభుత్వం ముందుకొచ్చింది. 17 రాష్ట్రాలతో పోటీ పడీ 30,000 మందికి ఉపాధి కల్పించే ఈ పార్క్‌ను మనం సాధించుకుంటే, దీన్ని రద్దు చేయాలంటూ ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ లేఖలు రాయడం దారుణం. వీళ్లు చరిత్రహీనులు. దేశ వ్యాప్తంగా మూడు పార్కులు మాత్రమే ఇచ్చారు. ఒకటి గుజరాత్, ఇంకొకటి ఆంధ్రప్రదేశ్, మరొకటి హిమాచల్‌ప్రదేశ్‌కు వచ్చింది.
  • ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు, ఆ పార్టీ నాయకుడు యనమల రామకృష్ణుడు ఈ పార్క్‌ వద్దంటూ అధికారికంగా లేఖ రాశారు. దుష్టచతుష్టం, ఎల్లోమీడియా దుష్ప్రచారం చేస్తోంది. దీన్ని బట్టి వారు ఏ స్థాయికి దిగజారిపోయారో తెలుస్తోంది. వీళ్లు మనుషులేనా.. అని అడగాలనిపిస్తుంది. 
  • చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దివీస్‌ అనే ఫార్మాస్యూటికల్‌ కంపెనీ ఏర్పాటుకు దగ్గరుండి సహకరించారు. ఆ రోజు ఫార్మా రంగం ఇక్కడకి వస్తే పొల్యూషన్‌ అనిపించ లేదా? 
  • పూర్తిగా ట్రీట్‌మెంట్‌ ప్లాంట్‌ పెట్టడమే కాకుండా.. అన్ని రకాలుగా దీన్ని శుద్ధి చేసి, జీరో డిశ్చార్జ్‌ కింద కన్వర్ట్‌ చేసి.. దీన్నుంచి ఎటువంటి ఇబ్బంది లేకుండా 40 – 50 కిలోమీటర్ల పొడవైన పైప్‌లైన్‌ వేస్తున్నాం. ఎక్కడా ఎవరికీ ఇబ్బంది లేకుండా ఏర్పాటవుతుంది. రూ.1,000 కోట్లతో పార్కు పనులు జరుగుతుంటే అడ్డుకునే కార్యక్రమం చేస్తున్నారు.

భారీ పరిశ్రమలు, పార్కుల ఏర్పాటులో కీలక మైలు రాళ్లు

  • కాకినాడ జిల్లాలో బల్క్‌ డ్రగ్‌ పార్క్‌ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది. ఈ పార్క్‌లో మౌలిక వసతుల కల్పన కోసం ఏకంగా రూ.1000 కోట్లు గ్రాంట్‌ ఇస్తున్నారు. ఇక్కడ ఏర్పాటయ్యే పరిశ్రమలకు  రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు కలిపి రకరకాల ఇన్సెంటివ్‌లు ఇస్తున్నాయి. వీటివల్ల దాదాపు 30 వేల మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉద్యోగాలు రానున్నాయి. 
  • వైఎస్సార్‌ జిల్లా కొప్పర్తిలో 800 ఎకరాల్లో వైఎస్సార్‌ ఈఎంసీ ఏర్పాటువుతోంది. అక్కడే మెగా ఇండస్ట్రియల్‌ హబ్‌ కూడా వస్తోంది. ఈ రెండింటిని 6,800 ఎకరాల్లో అభివృద్ధి చేస్తున్నాం. వైఎస్సార్‌ ఈఎంసీని కేంద్ర ప్రభుత్వం ప్రొడక్షన్‌ లింక్డ్‌ ఇన్సెంటివ్‌ స్కీమ్స్‌(పీఎల్‌ఐ)లో చేర్చింది. తద్వారా ఆ బెనిఫిట్స్‌ కూడా మనకు వస్తున్నాయి. ఈఎంసీ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం నుంచి రూ.730.50 కోట్ల గ్రాంట్‌ కోసం వేగంగా అడుగులు వేస్తున్నాం. వైఎస్సార్‌ ఈఎంసీ ద్వారా 28,500 ఉద్యోగాలు, మెగా ఇండస్ట్రియల్‌ హబ్‌ వల్ల మరో 75 వేల ఉద్యోగాలు రానున్నాయి. ఇదే జిల్లాలోని జమ్మలమడుగులో స్టీల్‌ ప్లాంట్‌ పెట్టే దిశగా అడుగులు ముందుకు పడుతున్నాయి.
  • దేశ వ్యాప్తంగా 35 మల్టీ మోడల్‌ లాజిస్టిక్స్‌ పార్క్‌లు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి అభివృద్ధి చేస్తున్నాయి. ఇందులో మన రాష్ట్రానికి మూడు వచ్చాయి. విశాఖపట్నం, విజయవాడ, అనంతపురంలో ఈ పార్క్‌లు ఏర్పాటు చేసేలా అడుగులు వేగంగా పడుతున్నాయి. వీటి వల్ల రవాణా రంగంలో స్టోరేజీ, గోదాములు, రకరకాల ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ అభివృద్ధి చెందడం వల్ల అవకాశాలు మెరుగు పడతాయి.
  • రాష్ట్రంలో మూడు పారిశ్రామిక కారిడార్ల అభివృద్ధి జరుగుతోంది. ఒకే రాష్ట్రంలో మూడు పారిశ్రామిక కారిడార్లు అభివృద్ధి అన్నది ఎక్కడా లేదు. విశాఖపట్నం–చెన్నై పారిశ్రామిక కారిడార్, చెన్నై–బెంగళూరు పారిశ్రామిక కారిడార్, హైదరాబాద్‌–బెంగళూరు పారిశ్రామిక కారిడార్‌. వీటిని సా«ధ్యమైనంత వేగంగా పూర్తి చేసే లక్ష్యంతో ప్రభుత్వం పని చేస్తోంది.
  • పరిశ్రమల అవసరాలు తీర్చడంతో పాటు, యువతకు మెరుగైన ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మరింత మెరుగుపర్చే లక్ష్యంతో స్కిల్‌ డెవలప్‌మెంట్‌పై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. ఈ దిశలో 2 స్కిల్‌ యూనివర్సిటీలతో పాటు, 30 స్కిల్‌ కాలేజీలు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ప్రతి జిల్లాకు ఒకటి ఉంటుంది. ఇవి కాక ఐటీఐ, పాలిటెక్నిక్‌ చదువు మానేసిన వారి కోసం ఓకేషనల్‌ కోర్సుల్లో శిక్షణ ఇచ్చే విధంగా 175 నియోజకవర్గాల్లో స్కిల్‌ హబ్స్‌ను తీసుకువస్తాం. కరిక్యులమ్‌ పూర్తిగా డిజైన్‌ చేయడానికి వీటిని కూడా స్కిల్‌ యూనివర్సిటీకి అనుసంధానం చేస్తున్నాం. ఇవన్నీ రాబోయే రోజుల్లో కార్యరూపం దాల్చేలా చర్యలు తీసుకుంటున్నాం.  
  • ఆంధ్రప్రదేశ్‌కు దేశంలో రెండో అతి పెద్ద సువిశాల 974 కిలోమీటర్ల తీర ప్రాంతం ఉంది. విశాఖపట్నం, కాకినాడలో ఇప్పటికే ప్రధాన పోర్టులు పని చేస్తుండగా, మరో రెండు చోట్ల.. గంగవరం, కృష్ణపట్నం వద్ద కూడా పోర్టులను అభివృద్ధి చేశాం. వాటితో పాటు నెల్లూరు జిల్లా రామాయపట్నం, శ్రీకాకుళం జిల్లా భావనపాడు, కృష్ణా జిల్లా మచిలీపట్నం, కాకినాడ జిల్లాలో కాకినాడ సెజ్‌ పోర్టు (ప్రైవేట్‌ రంగంలో)ను గ్రీన్‌ ఫీల్డ్‌ పోర్టులుగా అభివృద్ధి చేస్తున్నాం.
  • వీటి వల్ల పోర్ట్స్‌ బేస్డ్‌ డెవలప్‌మెంట్‌ కార్యకలాపాలు ఊపందుకుంటాయి. వీటితోపాటు రాష్ట్రంలో మత్స్యకారులకు మరింత మేలు చేసేలా అన్ని హంగులతో కూడిన 9 ఫిషింగ్‌ హార్బర్లను ప్రభుత్వం అభివృద్ధి చేస్తోంది. రాష్ట్రంలో తీర ప్రాంతాల్లో 555 మత్స్యకార గ్రామాల్లో దాదాపు 6.3 లక్షల మంది మత్స్యకారులు చేపల వేట ప్రధాన వృత్తిగా జీవిస్తుండగా, 28,500 ఫిషింగ్‌ బోట్లు పని చేస్తున్నాయి.
  • ఈ పరిస్థితుల్లో మత్స్యకారుల జీవన ప్రమాణాలు మెరుగు పరిచేందుకు తీర ప్రాంతాల్లో ప్రతి 50 కిలోమీటర్లకు ఒక ఫిషింగ్‌ హార్బర్‌ లేదా ఒక పోర్టు ఉండేలా అడుగులు వేస్తున్నాం. ఆ మేరకు రూ.3500 కోట్ల వ్యయంతో 9 ఫిషింగ్‌ హార్బర్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టాం. వాటిలో తొలి దశలో నెల్లూరు జిల్లా జువ్వలదిన్నె, గుంటూరు జిల్లా నిజాంపట్నం, కృష్ణా జిల్లా మచిలీపట్నం, కాకినాడ జిల్లాలోని ఉప్పాడలో నాలుగు ఫిషింగ్‌ హార్బర్లను వచ్చే ఏడాది ఏప్రిల్‌ నాటికి రూ.1,550 కోట్లతో పూర్తి చేసి జాతికి అంకితం చేస్తాం. మిగతా ఫిషింగ్‌ హార్బర్లను కూడా దశల వారీగా పూర్తి చేస్తాం. రెండో దశ కింద బియ్యపుతిప్ప, కొత్తపట్నం, పూడిమడక, బుడగట్లపాలెం, ఓడరేవులో పనులు ప్రారంభిస్తాం.
  • విజయవాడ, విశాఖపట్నం, తిరుపతిలో అంతర్జాతీయ విమానాశ్రయాలు ఉండగా.. కడప, రాజమండ్రి, కర్నూలులో మూడు దేశీయ విమానాశ్రయాలు పని చేస్తున్నాయి. ప్రైవేట్‌ భాగస్వామ్యంతో విజయనగరం జిల్లా భోగాపురంలో గ్రీన్‌ఫీల్డ్‌ ఎయిర్‌పోర్టు ప్రాజెక్టు అంశం 34 ఎకరాలకు సంబంధించిన వివాదం కోర్టులో ఫైనల్‌ స్టేజ్‌లో ఉంది. అది త్వరగా పరిష్కారమై.. వచ్చే నెలలో దీనికి శంకుస్థాపన జరుపుకుంటామని ఆశిస్తున్నాను.
  • నెల్లూరు జిల్లాలో మరో గ్రీన్‌ ఫీల్డ్‌ విమానాశ్రయం నిర్మించాల్సి ఉంది. దగదర్తి బదులుగా మరొక ప్రాంతంలో అభివృద్ధి చేస్తాం. ఆయా విమానాశ్రయాలకు రోడ్, రైల్‌ కనెక్టివిటీ అభివృద్ధి చేయడానికి కావాల్సిన అన్ని రకాల చర్యలపై ప్రత్యేక దృష్టి పెట్టాం. విశాఖలో భోగాపురం విమానాశ్రయం పూర్తయ్యే నాటికి రోడ్డు పూర్తి చేయాలన్న లక్ష్యంతో ఇప్పటికే డీపీఆర్‌ దాదాపు పూర్తయ్యింది. దాన్ని నెల రోజుల్లో సబ్మిట్‌ చేస్తాం. 

చంద్రబాబు హయాంలో దావోస్‌ నుంచి వచ్చిన పెట్టుబడుల కంటే మనం దావోస్‌ నుంచి తెచ్చిన పెట్టుబడులు చాలా ఎక్కువ. కేబినెట్‌లో ఆమోదం తెలిపిన పెట్టుబడి వివరాలు చూస్తే ఈ విషయం అర్థమవుతుంది. ఈ రాష్ట్రంలో ప్రజలంతా నా వాళ్లే.. మనకు ఓటు వేయని వారికి కూడా అన్ని పథకాలూ సంతృప్తికర స్థాయిలో అందాలి అన్నది మన ఆలోచన. పరిశ్రమల విషయంలోనూ అంతే. అయితే పారిశ్రామిక వేత్తల్ని కూడా నా వాళ్లు.. నా వాళ్లు కాని వాళ్లు.. అని చంద్రబాబు చూస్తారు. ఈ దుస్థితి ఒక్క మన రాష్ట్రంలోనే.

బల్క్‌ డ్రగ్‌ పార్క్‌ మన రాష్ట్రానికి వచ్చినందుకు సంతోషించాల్సింది పోయి టీడీపీ దుష్ప్రచారం చేస్తోంది. మాకెందుకు ఆ బల్క్‌ డ్రగ్‌ పార్క్‌ ఇవ్వలేదని పక్కనే ఉన్న తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్, మహారాష్ట్ర ముఖ్యమంత్రి కేంద్రాన్ని ప్రశ్నిస్తున్నారు. దీనివల్ల ప్రత్యక్షంగా, పరోక్షంగా 30 వేల మందికి ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇటువంటి ప్రాజెక్టును అడ్డుకోవడమంటే.. ఇంత కన్నా చరిత్రహీనులు ఎవరైనా ఉంటారా? వీళ్లను ఏమనాలి? -ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement