దళితులు.. భూమి.. ఒక ఏడాది! | Dalits land for one year! | Sakshi
Sakshi News home page

దళితులు.. భూమి.. ఒక ఏడాది!

Published Thu, Aug 13 2015 1:01 AM | Last Updated on Sun, Sep 3 2017 7:19 AM

దళితులు.. భూమి.. ఒక ఏడాది!

దళితులు.. భూమి.. ఒక ఏడాది!

సాక్షి, హైదరాబాద్:  దళితులకు భూపంపిణీ పథకం అమలు నత్తనడకన సాగుతోంది. మార్గదర్శకాల్లో అస్పష్టత కారణంగా పథకం అమలులో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. లబ్ధిదారులకు కూడా సరైన వసతులు కల్పించడంలేదు. మరోవైపు ఈ పథకం కింద ఆగస్టు 15న మరో 650 మందికి పట్టాలను పంపిణీ చేయడానికి రంగం సిద్ధమైంది. స్వాతంత్య్ర దినోత్సవాల్లో భాగంగా సీఎం కేసీఆర్ సొంత జిల్లా మెదక్‌లో 250 మందికి, మహబూబ్‌నగర్ 200, వరంగల్ 150 , నల్లగొండ 50, ఆదిలాబాద్‌లో 25 మందికి పట్టాలు ఇచ్చేందుకు అధికారులు చర్యలు చేపట్టారు.

ఈ పథకాన్ని చారిత్రక గోల్కొండ కోటలో సీఎం కేసీఆర్ ప్రారంభించి ఆగస్టు 15 నాటికి ఏడాది పూర్తి కానుంది. ఈ ఏడాదిలో 1,349 మంది లబ్ధిదారులకు 3,600 ఎకరాలను పంపిణీ చేశారు. వారిలో 893 మందికి 2,400 ఎకరాల భూమి రిజిస్టర్ చేయగా, వారిలో 743 మందికి పట్టాలు పంపిణీ చేశారు. మిగిలినవారితోపాటు మరో 500 మంది లబ్ధిదారులకు ఆగస్టు 15న పట్టాలు పంపిణీ చేయడానికి అధికారులు కసరత్తు చేస్తున్నారు.

ఇప్పటికే భూమిని పొందిన లబ్ధిదారుల్లో అన్నిరకాల వసతులు అందినవారు తక్కువగా ఉన్నారు. భూపంపిణీ పథకం ఆచరణలో కొన్ని జిల్లాలు మరీ వెనుకబడి ఉన్నాయి. గత ఆగస్టు 15 నుంచి ఇప్పటి వరకు ఖమ్మం జిల్లాలో 22 మందికి 59 ఎకరాలు, రంగారెడ్డిలో 22 మందికి 65 ఎకరాల మేర మాత్రమే పంపిణీ చేశారు. ఇక ఈ ఏడాది అంటే ఏప్రిల్ 1 నుంచి ఇప్పటి వరకు ఖమ్మంలో ఒక్క ఎకరం కూడా పంపిణీ కాలేదు.

ఇక రంగారెడ్డి జిల్లాలో ఆరుగురు లబ్ధిదారులకు 17 ఎకరాలు మాత్రమే పంపిణీ చేశారు. మెదక్‌లో అత్యధికంగా 356 మందికి 864 ఎకరాలు పంపిణీ చేయగా అందులో 217 మందికి భూమి రిజిస్టర్ చేసి, పట్టాలు కూడా పంపిణీ చేశారు. ఇక ఆదిలాబాద్‌లో 244 మందికి 706 ఎకరాలు, మహబూబ్‌నగర్‌లో 174 మందికి 512 ఎకరాలు, కరీంనగర్‌లో 167 మందికి  434 ఎకరాలు, వరంగల్‌లో 137 మందికి 392 ఎకరాలు, నల్లగొండలో 123 మందికి 290 ఎకరాలు, నిజామాబాద్‌లో 104 మందికి 283 ఎకరాలు  పంపిణీ అయ్యాయి.

ఈ పథకం అమలుపై మొత్తంగా రెవెన్యూశాఖపై ఆధారపడాల్సి రావడం, కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు, తహసీల్దార్లు, ఆర్డీవోలు సరైన శ్రద్ధ తీసుకోకపోవడం కూడా ప్రధానసమస్యగా మారింది. ఎన్ని నెలల్లో ఎంత భూమి పంపిణీ చేయాలన్న దానిపై స్పష్టత కరువైంది. భూమి కొనుగోలు నిబంధనలపై స్పష్టత కొరవడడంతో పథకం అమలు నత్తనడకన సాగుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement