లంచంలో పైసా తగ్గించని వీఆర్వో
రూ.50 వేలు తీసుకుంటూ పట్టుబడిన వైనం
ఏసీబీ చట్రంలో చిక్కిన రెవెన్యూ ఉద్యోగి
రావికమతం: అవినీతి నిరోధకశాఖ (ఏసీబీ)అధికారుల వలకు వీఆర్వో చిక్కాడు. వంద!, వెయ్యి! కాదు ఏకంగా రూ.50 వేలు లంచం తీసుకుంటూ గురువారం పట్టుబడ్డాడు. మండల రెవెన్యూశాఖలో ఘటికుడుగా గుర్తింపుపొందిన గుడివాడ వీఆర్వో వాలిమరక ముత్యాలు దొరికిపోవడం స్థానికంగా సంచలనమైంది. వివరాలిలా ఉన్నాయి. మునగపాకకు చెందిన సూరిశెట్టి కన్నారావు, పెంటకోట గోవిందరావులు గుడివాడ రెవెన్యూ పరిధిలో గతంలో 4.11ఎకరాల భూమి కొనుగోలు చేశారు. అప్పట్లో వీఆర్వోకు రూ.1.25లక్షలు ముట్టజెప్పి పట్టాదారు పాసుపుస్తకం పొందారు. ఆ భూమిని వారు వేరొకరికి విక్రయించారు. పాసుపుస్తకంలో ప్రస్తుతం కొనుగోలు చేసినవారి పేరు మార్పునకు, ఆన్‌లైన్ చేసేందుకు వీఆర్వోను కలిశారు. అతను రూ.50వేలు డిమాండ్ చేశాడు. గతంలో పెద్ద మొత్తం ఇచ్చామని, ఇప్పుడు ఫ్రీగా చేయాలని కోరారు. కనీసం కొంతయినా తగ్గించాలన్నారు. అయినా వీఆర్వో అంగీకరించకపోవడంతో రూ.50వేలు ఇచ్చేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారు.
ముందుగా నగదు ముట్టజెబితేనే పని అంటూ నెలల తరబడి తిప్పడంతో విసిగిపోయిన గోవిందరావు, కన్నారావులు ఏసీబీ డీఎస్పీ రామకృష్ణప్రసాద్‌ను కలిశారు. ఆయన సూచనమేరకు గురువారం ఉదయం రైతులిద్దరూ పాసుపుస్తకాలు పూర్తయ్యాయా.. డబ్బుతెచ్చామంటూ వీఆర్వోను కలిశారు. పోలీసు స్టేషన్‌కు ఎదురుగా ఉన్న తన ప్రైవేటు కార్యాలయానికి డబ్బు తేవాలని చెప్పాడు. అక్కడ వారిద్దరూ రూ.50వేలు ఇచ్చారు. దానిని లెక్కచూసుకుని సొరుగులో పెడుతుండగా డీఎస్పీ రామకృష్ణప్రసాద్, సీఐలు రామకృష్ణ, గణేష్, రమణమూర్తిలు రెడ్‌హ్యాండెడ్‌గాా వీఆర్వోను పట్టుకున్నారు. కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. ఏసీబీ అధికారుల పక్కా ప్లాన్‌లో వీఆర్వో ఇరుక్కుపోయాడు.
ఏసీబీ డీఎస్పీకి రైతుల మొర..
వీఆర్వో ముత్యాలు ఏసీబీకి చిక్కాడని తెలిసి ఆ గ్రామం నుంచి చాలా మంది రైతులు రావికమతం వచ్చి డీఎస్పీ రామకృష్ణను కలిశారు. పాసుపుస్తకాల కోసం, ఆన్‌లైన్ చేయించడానికి, తప్పొప్పులు సరిచేయడానికి తమ నుంచి చాలా నగదు తీసుకున్నారని, ప్రస్తుతం ఆయన స్సపెండ్ అయితే తమ డబ్బు పోతుందని వాపోయారు. పనులు కావంటూ రైతులు అక్కిరెడ్డి రామారావు, జెర్రిపోతుల రాంబాబు,నక్కా అప్పారావు, కరణం అమ్మాజి,గేదెల పరదేశినాయుడు తదితరులు మొరపెట్టుకున్నారు. తమకు డబ్బులిప్పించాలని కోరారు. ఆ విషయంలో తానేమీ చేయలేనని,డబ్బులు డిమాండ్ చేసినపుడే తమను ఆశ్రయించాల్సిందని డీఎస్పీ బదులిచ్చారు.
అడిగింది ఇవ్వాల్సిందే
Published Thu, Sep 24 2015 11:52 PM | Last Updated on Sun, Sep 3 2017 9:54 AM
Advertisement
Advertisement