రెవెన్యూ పనులకూ కాలపరిమితి!
♦ 12 అంశాలతో రెవెన్యూ పాలసీకి కసరత్తు
♦ డిప్యూటీ సీఎం మహమూద్ అలీ వెల్లడి
సాక్షి, హైదరాబాద్: పారిశ్రామిక విధానం, ఐటీ విధానం మాదిరిగానే రెవెన్యూశాఖకు సంబంధించి కూడా కొత్త విధానాన్ని (పాలసీ) తెచ్చేందుకు కసరత్తు చేస్తున్నట్లు ఉప ముఖ్యమంత్రి (రెవెన్యూ) మహమూద్ అలీ తెలిపారు. మొత్తం 12 అంశాలతో పాలసీకి త్వరలో రూపకల్పన చేయనున్నట్లు చెప్పారు. పారిశ్రామిక, ఐటీశాఖల తరహాలోనే రెవెన్యూశాఖలోనూ ప్రతి పనికీ నిర్దేశిత కాలపరిమితిని విధించాలని యోచిస్తున్నామని...గడువులోగా పనులు చేయకుంటే బాధ్యులైన అధికారులపై కఠిన చర్యలు తీసుకునే అంశాన్ని ఇందులో పొందుపరచాలనుకుంటున్నామన్నారు. రెవెన్యూ పాలసీ రూపకల్పన, విధానాల అమలుపై చర్చించేందుకు నెలాఖరులోగా అన్ని జిల్లాల కలెక్టర్లతో సమావేశ మవుతున్నట్లు మహమూద్ అలీ వివరించారు.
నూతన పాలసీ ద్వారా రెవెన్యూ వ్యవస్థలో తీసుకురానున్న సంస్కరణల గురించి ఆదివారం ఆయన విలేకరులకు వివరించారు. ఇతర ప్రభుత్వ విభాగాలతో పోల్చితే రెవెన్యూ వ్యవస్థ పనితీరు మెరుగ్గానే ఉందన్నారు. ముఖ్యంగా సమగ్ర కుటుంబ సర్వే, ఆసరా పెన్షన్లు, భూముల క్రమబద్ధీకరణ, కల్యాణలక్ష్మి, షాదీముబారక్.. తదితర ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను విజయవంతం చేయడంలో రెవెన్యూ సిబ్బంది కీలకపాత్ర పోషించారని కితాబిచ్చారు.
గత రెండేళ్లుగా తమ ప్రభుత్వం చేపట్టిన చర్యల ఫలితంగా ఈ శాఖలో ఉన్నత(అధికారుల) స్థాయిలో అవినీతిని పూర్తిగా అరికట్టగలిగామని...కానీ క్షేత్రస్థాయిలో అవినీతి పెరిగిందని ఫిర్యాదులు వస్తున్నాయని మహమూద్ అలీ పేర్కొన్నారు. కొత్త రాష్ట్రంలో ఉద్యోగులు పనితీరును మార్చుకునేందుకు కొంత గడువు ఇచ్చామని, ఇకపై ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తే ఉపేక్షించబోమని హెచ్చరించారు. కాగా, భూ వివాదాలు, కుటుంబాల్లో ఆస్తుల విభజన సమస్యలను పరిష్కరించేందుకు ప్రతి జిల్లాకు ఒక ట్రిబ్యునల్‌ను ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలిస్తున్నామని మహమూద్ అలీ చెప్పారు. అలాగే తహ సీల్దార్లు, రెవెన్యూ డివిజన్ అధికారులకు సొంత వాహనాలు సమకూర్చే అంశం పరిశీలనలో ఉందని... వీఆర్‌ఏలకు కనీస వేతనం, ఇతర సదుపాయాలు కల్పించాలనుకుంటున్నామన్నారు.