ఇప్పటివరకు కలెక్టర్లకే పూర్తి అధికారాలు
కమిటీ సూచన మేరకు అధికారాల మార్పుపై రెవెన్యూశాఖ కసరత్తు
ఆధార్ తప్పుల నుంచి డిజిటల్ సంతకాల వరకు క్లియరెన్స్ తహసీల్దార్లకే
నోషనల్ ఖాతాలు, భూమి వర్గీకరణ,పేరు మార్పు తదితర వ్యవహారాలు కలెక్టర్ల వద్దనే
నోషనల్ ఖాతాల నుంచి పట్టా మార్పు అంశం సీసీఎల్‌ఏ పరిధిలోనికి
కొన్ని దరఖాస్తులు పరిష్కరించే బాధ్యతలు అదనపు కలెక్టర్లకు కూడా
సాక్షి, హైదరాబాద్: ఇప్పటివరకు కలెక్టర్లకు మాత్రమే ‘ధరణి’దరఖాస్తుల పరిష్కార అధికారాలుండగా, వికేంద్రీకరణ ద్వారా తహసీల్దార్లు, ఆర్డీఓలు, అదనపు కలెక్టర్లు (రెవెన్యూ)కు కొన్ని అధికారాలు కట్టబెట్టనున్నారు. ధరణి పోర్టల్ పునర్నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ సూచన మేరకు రైతు సమస్యలకు సంబంధించిన దరఖాస్తులను పరిష్కరించేందుకు అధికారాల బదలాయింపు కసరత్తు చురుగ్గా సాగుతోంది. ఏ అధికారికి ఏ దరఖాస్తు పరిష్కరించే అధికారం ఇవ్వాలన్న దానిపై రెవెన్యూశాఖ ఓ నిర్ణయానికి వచ్చినట్టు తెలిసింది.
♦ ధరణి పోర్టల్ ద్వారా వ్యవసాయ భూముల సమస్యల పరిష్కారానికి ప్రస్తుతం 35 మాడ్యూళ్లు అందుబాటులో ఉన్నాయి.
♦ తాజా లెక్కల ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా 2.45 లక్షల దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. వీటిలో రెండు మాడ్యూళ్లలో మాత్రమే 1.5 లక్షల దరఖాస్తులున్నాయని ధరణి కమిటీ గుర్తించింది.
♦ టీఎం 14 (గ్రీవెన్సెస్ ఆన్ స్పెసిఫిక్ ల్యాండ్ మ్యాటర్స్) మాడ్యూల్‌లో 40,435 దరఖాస్తులు, టీఎం 33 (మాడిఫికేషన్ రిక్వెస్ట్ అప్లికేషన్) మాడ్యూల్‌లో 1.05 లక్షల వరకు దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి.
♦ మిగిలిన 33 మాడ్యూళ్లలో ఉన్న దరఖాస్తులను పరిష్కరించేందుకు అధికారాల బదలాయింపునకు కసరత్తు జరుగుతుండగా, ముఖ్యమైన టీఎం 14, 33 మాడ్యూళ్లలో ఏ దరఖాస్తులు ఎవరు పరిష్కరించాలన్న దానిపై ధరణి కమిటీతో పాటు రెవెన్యూశాఖ ఓ అభిప్రాయానికి వచ్చింది.
అవసరమైతేనే సీసీఎల్‌ఏకు
♦ ధరణి మాడ్యూళ్ల (టీఎం14, టీఎం33)లోని దరఖాస్తులను తహసీల్దార్, ఆర్డీఓ, అదనపు కలెక్టర్, కలెక్టర్‌తో పాటు సీసీఎల్‌ఏలకు అధికారాలు కల్పిస్తూ వికేంద్రీకరణ కసరత్తు జరుగుతోంది.
♦ టీఎం14లో ఆధార్ తప్పులు, ఆధార్ అందుబాటులో లేకపోవడం, తండ్రి, భర్త పేరులో తప్పులు, ఫొటో మిస్ కావడం, జెండర్, కులం తప్పుగా నమోదు కావడం, సర్వే నంబర్ మిస్సింగ్, తహసీల్దార్ల డిజిటల్ సంతకాలు లేకపోవడంలాంటి సమస్యలున్నాయి. వీటిలో సర్వేనంబరు మిస్సింగ్ మినహా ఇతర సమస్యల పరిష్కార అధికారాలు తహసీల్దార్లకు ఇవ్వాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది.
♦ సర్వేనంబరు మిస్సింగ్ దరఖాస్తుల పరి ష్కారం ఆర్డీఓలకు అప్పగించాలని భావిస్తున్నట్టు సమాచారం. ఇక, టీఎం 33లో భాగమైన పాసుపుస్తకాల్లోని తప్పుల సవరణ, నోషనల్ ఖాతా (ప్రభుత్వ భూమి ఉండే ఖాతా) నుంచి పట్టాభూమిగా మార్పు, పాసు పుస్తకంలోని పేరుమార్పు, మిస్సింగ్ సర్వేనంబరు, భూమి వర్గీకరణ, భూమి స్వభావం, భూమి రకం, భూమి అనుభవదారుని పేరు లాంటి సమస్యలను పరిష్కరించే అధికారాన్ని తహసీల్దార్లు, ఆర్డీఓల సి ఫారసులతో కలెక్టర్లకు అప్పగించనున్నారు.
♦ నోషనల్ ఖాతామార్పు అధికారం విషయంలో అవసరమైతే సీసీఎల్‌ఏ అనుమతి తీసు కునేలా మార్పులు చేయనున్నట్టు తెలుస్తోంది. మిగిలిన మాడ్యూళ్లలో కొన్నింటిని అద నపు కలెక్టర్లు (రెవెన్యూ)కు అప్పగించనున్నారు. ఈ మేరకు ధరణి పోర్టల్ ద్వారా వ్యవసాయ భూముల సమస్యలను పరిష్కరించే అధికారాలను వికేంద్రీకరించే ప్రక్రియ త్వరలోనే ఓ కొలిక్కి వస్తుందని రెవెన్యూ వర్గాలంటున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment