పూర్తిస్థాయిలో ప్రక్షాళన చేయాల్సిందేనని భావిస్తున్న పునర్నిర్మాణ కమిటీ
మొత్తం 12 సెక్షన్లలో పెద్దఎత్తున సవరణలు
అది జరిగితేనే అధికార వికేంద్రీకరణకు చట్టబద్ధత!
రిజిస్ట్రేషన్లు ఎవరు చేయాలి? భూరికార్డులు ఎవరు నిర్వహించాలన్న దానితో పాటు పలు కీలక సిఫారసుల రూపకల్పనలో నిమగ్నం
తహసీల్దార్లను ఈ అధికారాల నుంచి తప్పించాలనే యోచన
ఎన్‌ఐసీ లేదా సీజీజీలకు పోర్టల్ నిర్వహణ బాధ్యత
పార్ట్–బీలో చేర్చిన భూముల విషయంలోనూ ప్రత్యేక సిఫారసులు
ప్రభుత్వానికి మధ్యంతర నివేదిక ఇచ్చేందుకు సిద్ధమవుతున్న సభ్యులు
చట్టాన్ని సవరిస్తారా? మార్చేస్తారా? నిర్ణయాధికారం ప్రభుత్వానికే..
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని వ్యవసాయ భూముల క్రయవిక్రయాల్లో కీలకమైన ‘ధరణి’పోర్టల్‌ను పునర్నిర్మించే ప్రక్రియలో భాగంగా పలు కీలక సిఫారసులు రూపొందుతున్నాయి. ప్రస్తుతం తెలంగాణలో అమల్లో ఉన్న రికార్డ్ ఆఫ్ రైట్స్ చట్టం–2020ని పూర్తిస్థాయిలో ప్రక్షాళన చేయాల్సిందేనని ధరణి పునర్నిర్మాణ కమిటీ భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ చట్టంలో 12 సెక్షన్లు పొందుపరచగా దాదాపు అన్ని సెక్షన్లలో పెద్ద ఎత్తున సవరణలను ప్రతిపాదించాలని నిర్ణయించినట్లు సమాచారం.
అయితే ఈ మార్పులను ప్రస్తుత చట్టంలోనే చేస్తారా? లేక చట్టాన్నే మారుస్తారా? అనే దానిపై నిర్ణయాధికారం ప్రభుత్వానికే వదిలేయాలని భావిస్తున్నట్లు తెలిసింది. కాంగ్రెస్ సీనియర్ నేత ఎం.కోదండరెడ్డి, భూచట్టాల నిపుణుడు ఎం.సునీల్‌కుమార్, విశ్రాంత ఐఏఎస్ అధికారి రేమండ్ పీటర్, రాష్ట్ర భూపరిపాలన ప్రధాన కమిషనర్ నవీన్ మిత్తల్, విశ్రాంత స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ బి.మధుసూదన్‌ల నేతృత్వంలోని కమిటీ ఈ మేరకు నివేదికను రూపొందించే పనిలో నిమగ్నమైంది.
వాస్తవానికి క్షేత్రస్థాయి పర్యటనలు పూర్తి చేసుకుని కమిటీ ఇప్పటికే ప్రభుత్వానికి నివేదిక సమర్పించాల్సి ఉంది. అయితే భాగస్వామ్య పక్షాలతో చర్చలు ముగిసేలోపే లోక్‌సభ ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన నేపథ్యంలో మధ్యంతర నివేదికను ఇవ్వాలని కమిటీ భావిస్తున్నట్టు తెలుస్తోంది. కోడ్ ముగిసిన వెంటనే ఈ నివేదికలోని సిఫారసుల ఆధారంగా ప్రభుత్వం తాత్కాలిక చర్యలకు పూనుకుంటుందని, అనంతరం ధరణి కమిటీ ఇచ్చే పూర్తి స్థాయి నివేదికలోని సిఫారసుల మేరకు ధరణి పునర్నిర్మాణానికి అడుగులు పడతాయనే చర్చ రెవెన్యూ వర్గాల్లో జరుగుతోంది.
సవరణ లేదా కొత్త చట్టం అనివార్యం!
ధరణి పోర్టల్ పేరు మారాలన్నా, వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లు, రికార్డుల నిర్వహణ, సమస్యల పరిష్కారంలో అధికార వికేంద్రీకరణ జరగాలన్నా చట్ట సవరణలు చేయడం లేదా కొత్త చట్టం అమల్లోకి తేవడం అనివార్యమని కమిటీ సిఫారసు చేయనుంది. అదే విధంగా ప్రస్తుతానికి ధరణి సమస్యల పరిష్కార ప్రక్రియ ఎక్కువగా కలెక్టర్ల చేతిలో ఉంది. తాజాగా జారీ చేసిన సర్క్యులర్ ప్రకారం ఈ అధికారాలు కొన్ని అదనపు కలెక్టర్లు, ఆర్డీవోలు, తహశీల్దార్లకు కట్టబెట్టినా వీటికి చట్టబద్ధత కలగాలంటే మాత్రం ఆర్‌వోఆర్ చట్టంలో మార్పులు తప్పనిసరిగా చేయాలని కమిటీ భావిస్తోంది.
దీంతో పాటు రాష్ట్రంలో భూరికార్డుల నిర్వహణ ఎవరు చేపట్టాలి? రిజిస్ట్రేషన్లను ధరణి చట్టం ప్రకారం చేయాలా? స్టాంపుల చట్టం ప్రకారం చేయాలా? ఈ రిజిస్ట్రేషన్లకు సంబంధించిన అధికారం ఎమ్మార్వోలకే ఉంచాలా? మళ్లీ సబ్ రిజి్రస్టార్లకు అప్పగించాలా? లేదా డిప్యూటీ తహసీల్దార్లకు కట్టబెట్టాలా? అన్న దానిపై కమిటీ నిశితంగా అధ్యయనం చేస్తున్నట్టు సమాచారం.
కాగా తహసీల్దార్ల నుంచి ఈ అధికారాలను తప్పించాలనే యోచనలో కమిటీ ఉన్నట్టు తెలుస్తోంది. ఇక భూ రికార్డుల నిర్వహణ (ధరణి పోర్టల్) బాధ్యతలను ప్రైవేట్ కంపెనీకి కాకుండా నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్ (ఎన్‌ఐసీ) లేదా సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ (సీజీజీ)లకు అప్పగించాలని కూడా కమిటీ సిఫారసు చేయనున్నట్టు సమాచారం.
పార్ట్–బీపై ప్రత్యేకంగా..
భూ రికార్డుల ప్రక్షాళనలో భాగంగా రాష్ట్రంలోని దాదాపు 18 లక్షల ఎకరాల వ్యవసాయ భూములను పార్ట్–బీ (నిషేధిత జాబితా)లో చేర్చారు. వీటికి సంబంధించి ఇప్పటివరకు కొత్త పాసు పుస్తకాలు ఇవ్వలేదు. ఈ పాసు పుస్తకాల కోసం రైతులు కాళ్లరిగేలా రెవెన్యూ కార్యాలయాలు, కలెక్టరేట్ల చుట్టూ తిరుగుతున్నారు.
కాగా ఇందులో 5 లక్షల ఎకరాలకు కనీసం ఎటువంటి కారణాలు చూపెట్టకుండానే పార్ట్–బీ ఆపాదించినట్టు తెలుస్తోంది. మిగిలిన వాటిలో కొన్నిటికి కోర్టు కేసులుండగా, కొన్నింటిని చిన్నచిన్న ఫిర్యాదుల ఆధారంగా పార్ట్–బీలో చేర్చారు. ఈ నేపథ్యంలో పార్ట్–బీ భూముల పరిష్కారానికి సంబంధించి కూడా మధ్యంతర నివేదికలో పలు సిఫారసులు పొందుపర్చనున్నారు.
దరఖాస్తుల పరిష్కారం ఆగిందా?
ధరణి పోర్టల్ ద్వారా వ్యవసాయ భూములకు సంబంధించిన సమస్యల పరిష్కారం ఓ నిరంతర ప్రక్రియ. అయితే అధికార వికేంద్రీకరణ లేని కారణంగా రాష్ట్రంలో 2.45 లక్షల దరఖాస్తులు పెండింగ్‌లో పడిపోయాయి. వీటిని పరిష్కరించేందుకు పునరి్నర్మాణ కమిటీ చొరవతో ప్రభుత్వం స్పెషల్ డ్రైవ్ చేపట్టింది. గడువు ముగిసినా మరోమారు పొడిగించింది. కానీ ఈలోపు ఎన్నికల కోడ్ రావడంతో స్పెషల్ డ్రైవ్‌ను నిలిపివేస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది.
అయితే ఈ సాకుతో ధరణి సాధారణ కార్యకలాపాలను కూడా నిలిపివేశారని, తహసీల్దార్ల స్థాయిలో తప్ప మిగిలిన ఏ స్థాయిలోనూ పెండింగ్ దరఖాస్తులు పరిష్కరించడం లేదని తెలుస్తోంది. ముఖ్యంగా టీఎం–33 కింద పెండింగ్‌లో ఉన్న లక్షకు పైగా దరఖాస్తుల్లో స్పెషల్ డ్రైవ్‌లో 20 వేల వరకు పరిష్కరించినా మిగిలిన వాటి జోలికి వెళ్లడం లేదని సమాచారం. ఇక జిల్లాల కలెక్టర్లు, సీసీఎల్‌ఏ స్థాయిలో ఏ దరఖాస్తును పరిష్కరించడం లేదని తెలుస్తోంది.
ఎన్నికల కోడ్ అమల్లో ఉందని చెప్పి తప్పించుకుంటున్నారని, వాస్తవానికి ధరణి పోర్టల్ ద్వారా దరఖాస్తులు పరిష్కరించడానికి కోడ్ అడ్డంకి కాదని, స్పెషల్ డ్రైవ్ చేపట్టేందుకు మాత్రమే కోడ్ అడ్డంకి అని చెపుతున్నా ఉన్నత స్థాయి అధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలు విని్పస్తున్నాయి.
మొత్తం మీద స్పెషల్ డ్రైవ్ చేపట్టే నాటికి రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న 2.45 లక్షల దరఖాస్తులతో పాటు కొత్తగా వచి్చన మరో 50 వేలకు పైగా దరఖాస్తులు కలిపి మొత్తం 3 లక్షల దరఖాస్తులకు గాను ఇప్పటివరకు లక్షకు పైగా దరఖాస్తులు మాత్రమే పరిష్కారమైనట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment