♦ రాష్ట్రంలోని వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ల లావాదేవీల కోసం గత ఏడాది నవంబర్‌లో ప్రారంభమైన ధరణి పోర్టల్ 8 నెలల తర్వాత రైతులకు వీలైనన్ని ఎక్కువ సేవలు అందించే స్థాయికి చేరింది.
♦ గత వారంలో పెండింగ్ మ్యుటేషన్లు, పాస్‌పుస్తకాలు లేని భూములకు నాలా, కోర్టు కేసులున్న సర్వే నంబర్ల నుంచి ఏ కేసులు లేని భూముల తొలగింపు, లాక్‌డౌన్ కాలంలో బుక్ చేసుకున్న స్లాట్ల రీషెడ్యూల్ లాంటి ఆప్షన్లను అందుబాటులోకి తేవడం విశేషం.
♦ భూముల విస్తీర్ణం, పేర్ల నమోదులో తప్పుల సవరణ వినతులకు పరిష్కారం దొరకడంతో లక్షలాది మంది రైతులకు ఊరట కలుగుతుందని రెవెన్యూ అధికారులు చెబుతున్నారు.
♦ పెండింగ్ మ్యుటేషన్ల (ధరణి కంటే ముందు జరిగిన రిజిస్ట్రేషన్లకు సంబంధించి) కింద 1,21,643 దరఖాస్తులు రాగా, 1,21,167 దరఖాస్తులను పరిష్కరించారు. మొత్తం 29 రకాల సేవలు అందిస్తున్న ధరణి పోర్టల్
సాక్షి, హైదరాబాద్: ధరణి బాలారిష్టాలను దాటు తోంది. రాష్ట్రంలోని వ్యవసాయ భూముల రిజి స్ట్రేషన్ల లావాదేవీల కోసం ప్రభుత్వం ప్రతిష్టాత్మ కంగా తెచ్చిన ఈ పోర్టల్ దారిన పడుతోంది. సీసీ ఎల్‌ఏ వర్గాల నిర్లక్ష్యం, సాంకేతిక టీంను సమ కూర్చుకోవడంలో వైఫల్యం లాంటి కారణాలతో ధరణి అంటేనే అటు రైతులకు, ఇటు రెవెన్యూ వర్గా లకు విసుగు పుట్టేది. కనీసం పాస్‌పుస్తకంలో పేరు మార్చుకునేందుకు, భూమి తక్కువ పడితే ఉన్నంత మేరకు భూమిని నమోదు చేసుకునేందుకు తహసీ ల్దార్ కార్యాలయాల చుట్టూ రైతులు ప్రదక్షిణాలు చేయాల్సి వచ్చేది. కానీ, ఇప్పుడు క్రమంగా అందు బాటులోకి వస్తున్న ఆప్షన్లు ధరణి పోర్టల్ ప్రయో జనాన్ని నెరవేరుస్తున్నాయనే అభిప్రాయం రెవెన్యూ వర్గాల్లో వ్యక్తమవుతోంది. అయితే, పూర్తి స్థాయిలో ఈ ఆప్షన్లకు సంబంధించిన సాంకేతిక సహకారం తక్షణమే సమకూరేలా చూడాలని, బ్యాకెండ్ సమాచారాన్ని అటు కలెక్టర్లకు గానీ, ఇటు తమకు గానీ అందుబాటులోకి తెస్తే మరింత ప్రయోజనం ఉంటుందని తహశీల్దార్లు చెబుతున్నారు.
వివాదాల పరిష్కారానికి ఆప్షన్లు
తాజాగా పలు రకాల భూ సమస్యలు, వివాదాల పరిష్కారానికి కూడా కొన్ని ఆప్షన్లు ధరణి పోర్టల్ ద్వారా అందుబాటులోకి వచ్చాయి. ముఖ్యంగా వ్యవసాయ భూములను వ్యవసాయేతర భూము లుగా చూపడం, డూప్లికేట్ పాస్ పుస్తకానికి దర ఖాస్తు చేసినా రాకపోవడం, జీపీఏ రిజిస్ట్రేషన్లలో సాంకేతిక సమస్యలు, పేర్లు, భూవిస్తీర్ణం నమోదులో తప్పుల సవరణ, కొన్ని సర్వే నంబర్లు నమోదు కాకపోవడం, రద్దు చేసుకున్న స్లాట్‌లకు చెల్లించిన రుసుము తిరిగి రైతులకు అందకపోవడం లాంటి సమస్యల పరిష్కారానికి ఆప్షన్లు వచ్చాయి.
8 నెలలు... ఆరు లక్షలు
గత నవంబర్ 2న ధరణి పోర్టల్ ద్వారా వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. అప్పటి నుంచి ఈ ఏడాది జూలై 2 వరకు అంటే 8 నెలల కాలంలో మొత్తం 6 లక్షల లావాదేవీలు జరిగాయి. ఇందులో 4.5 లక్షలు రిజిస్ట్రేషన్లు/మ్యుటేషన్లు కాగా, 36 వేలకు పైగా వారసత్వం, 2,039 భాగపంపకాలు, 16,705 నాలా దరఖాస్తులు పరిష్కారమైనట్లు ధరణి పోర్టల్ గణాంకాలు వెల్లడించాయి.
ఆప్షన్లు వచ్చినా....!
ధరణిలో ఇటీవలి కాలంలో అనేక ఆప్షన్లు అందుబాటులోకి వచ్చినా కొన్నింటి విషయంలో సాంకేతిక సమస్యలు వస్తున్నాయని రెవెన్యూ వర్గాలు చెప్పాయి. ఉదాహరణకు భూవిస్తీర్ణం తప్పు పడితే సరిచేసుకునేందుకు ఆప్షన్ ఇచ్చారు కానీ, ఆ విస్తీర్ణం సరిచేసే అధికారం అటు రెవెన్యూ వర్గాలకు కానీ, ఇటు కలెక్టర్‌కు కానీ ఇవ్వడం లేదన్నాయి. ఇంతవరకు నమోదుకాని సర్వే నంబర్లను ధరణిలో నమోదు చేయడం, ప్రభుత్వ భూములు, భూసేకరణ జరిపిన భూముల సర్వే నంబర్లలో మిగిలిన పట్టా భూములకు లావాదేవీలు లాంటి సమస్యలను బ్యాకెండ్‌లో మార్చాల్సి ఉందని తహశీల్దార్లు చెప్పారు. ఈ నేపథ్యంలో ఆప్షన్లు అందుబాటులోకి తెచ్చిన తర్వాత వెంటనే సంబంధిత సాంకేతిక సమస్యలను కూడా ఓ కొలిక్కి తేవాలని వారన్నారు.
ధరణిలో అందుబాటులో ఉన్న సేవలివీ...
1) స్లాట్ బుకింగ్ 2) అమ్మకం, గిఫ్ట్ రిజిస్ట్రేషన్ 3) మ్యుటేషన్ 4) వారసత్వం 5) భాగపంపకాలు 6) నాలా 7) పాస్‌బుక్ లేకుండా నాలా 8) మార్టిగేజ్ రిజిస్ట్రేషన్ 9) లీజు దరఖాస్తు 10) ధరణి పోర్టల్ కంటే ముందు జరిగిన జీపీఏ లావాదేవీలు 11) ఆ తర్వాతి జీపీఏ లావాదేవీలు 12) జీపీఏ రిజిస్ట్రేషన్ 13) డెవలపర్ జీపీఏ రిజిస్ట్రేషన్ 14) పలు భూసమస్యలపై వినతులు, 15) నిషేధిత భూముల కేటగిరీలో పొరపాటున నమోదైన సర్వే నంబర్ల తొలగింపు 16) భూసేకరణ వినతులు 17) స్లాట్ రద్దు చేసుకునే అవకాశం 18) స్లాట్ రీషెడ్యూల్ 19) రిజిస్టర్డ్ డాక్యుమెంట్ల ధ్రువీకరణ 20) ఎన్‌ఆర్‌ఐ పోర్టల్ 21) ఆధార్ ధ్రువీకరణ కాని భూములకు పాస్‌పుస్తకాలు 22) ఫర్మ్‌లు, కంపెనీల భూములకు పాస్‌పుస్తకాలు 23) సెమీ అర్బన్ భూములకు పాస్ పుస్తకాలు 24) కోర్టు తీర్పుల ఆధారంగా పాస్‌పుస్తకాలు 25) డూప్లికేట్ పాస్‌పుస్తకాలు 26) కోర్టుకేసుల్లోని భూములపై లావాదేవీల నిలిపివేత దరఖాస్తులు 27) పెండింగ్ నాలా దరఖాస్తులు 28) సాంకేతిక సమస్యలకు సంబంధించిన వినతులు, 29) భూవివరాల గోప్యత
(గమనిక: ఈ సేవలకు సంబంధించి పలు ఆప్షన్లు ఉంటాయి. భూవివాదం, అవసరాన్ని బట్టి ఆయా సేవలకు సంబంధించిన ఆప్షన్లను ఎంచుకుని ధరణి పోర్టల్ ద్వారా మీ సేవా కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.)
Comments
Please login to add a commentAdd a comment