వుడాకు భూ బాధ్యతలు!
అర్బన్ భూముల రికార్డులు, అడంగల్ నిర్వహణ ఇక అప్పగింత
రెవెన్యూ శాఖకు తగ్గనున్న భారం
విశాఖపట్నం సిటీ: అనేక దశాబ్దాలుగా భూ వివరాలకు సంబంధించిన రికార్డులను నిర్వహిస్తున్న రెవెన్యూ శాఖ అర్బన్‌లో ఇక ఆ బాధ్యతల నుంచి తప్పుకోనుంది. అర్బన్ భూముల రికార్డుల నిర్వహణను ఇకపై వుడాకు అప్పగించాలని జిల్లా యంత్రాంగం నిర్ణయించింది. ఈ మేరకు రెవెన్యూ అధికారులకు-వుడా అధికారులకు మధ్య కొద్ది రోజులుగా చర్చలు జరుగుతున్నాయి. శనివారం కూడా కలెక్టర్ యువరాజ్, వుడా వైస్ చైర్మన్ బాబూరావు నాయుడుల మధ్య ప్రత్యేక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో భూములకు సంబంధించిన పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్టు తెలిసింది. వుడాలో ప్రస్తుతం 23 అర్బన్ మండలాలున్నాయి. ఇవన్నీ నాలుగు జిల్లాల పరిధిలో విస్తరించి ఉన్నాయి.
ఇప్పుడా 23 మండలాల అడంగల్ రికార్డులను వుడా నిర్వహించడంతో పాటు పర్యవేక్షించే అధికారం కూడా రెవెన్యూ వర్గాలు కల్పిస్తున్నాయి. త్వరలో విశాఖ మెట్రో డెవలప్‌మెంట్ అధారిటీ (వీఎండీఏ)గా మారబోతున్న తరుణంలో ఈ కొత్త అధికారాలను వుడాకు అప్పగించాలని చూస్తున్నారు. వుడాకు అప్పగించి భూ రికార్డులను నిర్వహించేందుకు అనుమతిచ్చినా ప్రస్తుతం చట్టం అనుమతించదనే వాదనలున్నాయి. వుడా సర్వేయర్లు చేసే రికార్డులను ప్రభుత్వం పట్టించుకోదు. ఆ సర్వేను మళ్లీ రెవెన్యూ అధికారుల అధీనంలో చేయిస్తారు. అయితే తాజాగా కొత్త చట్టం రూపొందించి కొన్ని అధికారాలను వుడాకు కల్పించేందుకు సైతం వెనకాడడం లేదని తెలిసింది.
1920 నుంచీ అడంగళ్ (పహాణీ) రికార్డులను రెవెన్యూ అధికారులే నిర్వహిస్తున్నారు. ఈ రికార్డుల్లో ముఖ్యంగా భూమి హక్కుదారు, పట్టాదారు, అనుభవదారు ఎవరనే వివరాలుంటాయి.భూమి స్వభావం తెలుసుకోవాలంటే అడంగళ్‌ను మాత్రమే పరిగణనలోకి తీసుకుంటారు. ఆ భూమి మెట్ట, మాగాణి, పోరంబోకు, గెడ్డ, చెరువు, కొండ, స్మశానం, కొండ పోరంబోకు, గెడ్డ పోరంబోకు, కాలువ, ఇసుక నేల, ఎర్ర నేల, రాళ్ల నేల ఇలాంటి వివరాలన్నీ లభిస్తాయి.
ఆ భూమిలో ఏమేం పండుతాయి. ఎలా పండుతాయి. వర్షాధారమేనా లేక నీరు కాల్వల ద్వారా నీరు వస్తుందా. ఏ ఆయకట్టు కింద సాగవుతోంది. ఇలాంటి వివరాలన్నీ ఉంటాయి.ఆ భూమి పన్నులు ఎలా ఉన్నాయి. ఎవరు చెల్లిస్తున్నారు. ఎవరు అనుభవిస్తున్నారనే వివరాలన్నీ అందులో పొందుపరచబడి ఉంటాయి.
ఆ భూమి తమదంటూ ఎవరైనా న్యాయస్థానాన్ని ఆశ్రయించినా, ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా దాని పూర్వాపరాలు తెలుసుకునేందుకు అడంగళ్ ఒక్కటే మార్గం. ఇంతటి ప్రాముఖ్యం గల ఈ ల్యాండ్ రికార్డులను వుడాకు ఎందుకు అప్పగించనుంది. ల్యాండ్ రికార్డులను సంబంధించి నిర్వహించేందుకు ఎకరాకు రూ. 10 చొప్పున వసూలు చే సుకునేందుకు ప్రభుత్వం అనుమతి ఇవ్వనుంది. ఈ నేపధ్యంలో తదుపరి వివరాలపై చర్చలు జరుగుతున్నాయి.