విముక్తి
► వెట్టి నుంచి బయటపడిన 55మంది చెంచుకూలీలు
► నల్లమల టు బీజాపూర్ వలసపనులకు అడవిబిడ్డల
► అక్రమ తరలింపు దాడులుచేసి పట్టుకున్న
► సీఐడీ అధికారులు జిల్లాకేంద్రంలో వలస
► కూలీలకు పునరావాసం గుంపుమేస్త్రీ, డీసీఎం డ్రైవర్ అరెస్ట్
► నిందితుడి ఇంట్లో సోదాలు, కీలకపత్రాలు స్వాధీనం
మహబూబ్‌నగర్ న్యూటౌన్/లింగాల వారి అమాయకత్వం వీరికి అవసరం.. వారి ఆకలిమంట వీరికి సిరులపంట.. నల్లమల అడవిబిడ్డలతో కొన్నిరోజులుగా వెట్టిచాకిరీ చేయిస్తున్న ఓ గుంపుమేస్త్రీని సీఐడీ అధికారులు వలపన్ని పట్టుకున్నారు. 55మంది చెంచులను కర్ణాటకలో రోడ్డు విస్తరణ పనులు చేయించేందుకు తీసుకెళ్తుండగా బుధవారం బీజాపూర్ వద్ద సీఐడీ డీఎస్పీ వసంత్‌కుమార్ నేతృత్వంలో అధికారుల బృందం దాడులు నిర్వహించి వారికి విముక్తి కల్పించింది. వారిలో 25మంది పురుషులు, 18మంది మహిళలు, 12మంది చిన్నారులు ఉన్నారు. లింగాల మండలంలోని చెన్నంపల్లికి చెందిన ఆంజనేయులు గుంపుమేస్త్రీ. కొన్నేళ్లుగా వివిధ గ్రామాలకు చెందిన చెంచులు, ఇతరులతోపాటు బాలకార్మికులను ఇతర రాష్ట్రాల్లో వివిధ పనులు చేయించేందుకు వారికి కొంత అడ్వాన్స్ కింద ఇచ్చి తీసుకెళ్తుంటాడు. అందులో భాగంగానే లింగాల మండలంలోని చెన్నంపల్లి, అప్పాయిపల్లి, పద్మన్నపల్లి, రాయవరం, కొల్లాపూర్ మండలంలోని పలు గ్రామాల నుంచి 55మంది కూలీలను కర్ణాటకలోని బీజాపూర్‌కు తీసుకెళ్తుండగా అధికారులు దాడులుచేసి పట్టుకున్నారు.
గుంపుమేస్త్రీ ఆంజనేయులుతో పాటు వాహనడ్రైవర్‌ను అరెస్ట్‌చేసి బుధవారం మహబూబ్‌నగర్ కోర్టులో హాజరుపరిచారు. కూలీలకు కలెక్టర్ టీకే శ్రీదేవి జిల్లాకేంద్రంలోని రాయల్ ఫంక్షన్ హాలులో తాత్కాలిక పునరావాసం కల్పించారు. ఆమె బుధవారం సాయంత్రం వారితో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. చెంచులకు వారి స్వగ్రామాల్లోనే అవసరమైన పనులు కల్పిస్తామన్నారు. వారికి మూడు రోజులపాటు భోజన వసతి ఏర్పాటుచేస్తామన్నారు. అనారోగ్యం బారినపడిన వారికి తక్షణ వైద్యం అందించి తగిన జాగ్రత్తలు తీసుకుంటామని భరోసాఇచ్చారు.
వెట్టిచాకిరి చేయిస్తే కఠినచర్యలు: కలెక్టర్
వెట్టిచాకిరి ప్రోత్సహించినా, పనులు చేయించినా వారిపై కఠినచర్యలు తీసుకుంటామని కలెక్టర్ టీకే శ్రీదేవి హెచ్చరించారు. ఇలాంటి సంఘటనలు జరగడం దురదష్టకరమన్నారు. వెట్టి చాకిరి చేయించేందుకు కూలీలను తీసుకెళ్తున్న కాంట్రాక్టర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. చెంచులకు విముక్తి కలిగించిన అధికారులను ఆమె ప్రత్యేకంగా అభినందించారు. బడిఈడు పిల్లలను బాలకార్మికులుగా పనిచేయిస్తే టోల్‌ఫ్రీ నెం.1098కు ఫోన్‌చేసి సమాచారం ఇవ్వాలని కలెక్టర్ కోరారు. కలెక్టర్ వెంట నాగర్‌కర్నూల్ ఆర్డీఓ దేవెందర్‌రెడ్డి, డీఎస్పీ కష్ణమూర్తి, సీఐడీ డీఎస్పీ వసంత్‌కుమార్, తహసీల్దార్ అమరేందర్, సెట్మాసీఈఓ హన్మంత్‌రావు, లయన్ నటరాజ్ ఉన్నారు.
గుంపుమేస్త్రీ ఇంట్లో సీఐడీ సోదాలు
లింగాల మండలం చెన్నంపల్లికి చెందిన గుంపుమేస్త్రీ ఆంజనేయులు ఇంట్లో సీఐడీ అధికారులు మంగళవారం రాత్రి సోదాలు నిర్వహించి కీలకమైన పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. కాగా, ఇలాంటి వారు ఎందరో చట్టాలను అతిక్రమించి ఎలాంటి అనుమతులు లేకుండా వలస కూలీలను ఇతర రాష్ట్రాలకు తీసుకెళ్తుంటారు. వాస్తవానికి కూలీల వివరాలను తహసీల్దార్ కార్యాలయంలో కచ్చితంగా తెలియపర్చాలి. కానీ అవేవీ పట్టించుకోకుండా నామమాత్రపు కూలి చెల్లిస్తూ సుదూర ప్రాంతాలకు పనులు చేయించేందుకు తీసుకెళ్తున్నారు. కార్మిక, రెవెన్యూ శాఖల అధికారులకు తెలిసినా పట్టించుకోవడం లేదనే విమర్శలు ఉన్నాయి. ఇకనైనా ప్రత్యేకదృష్టి సారించి వలసల నుంచి విముక్తి కల్పించాలని పలువురు కోరుతున్నారు.