సీఎం వర్సెస్ డిప్యూటీ సీఎం
రెవెన్యూ శాఖలో అవినీతి పెరిగిందని సీఎం వ్యాఖ్యలు
* డిప్యూటీ కలెక్టర్ల బదిలీలను రద్దుచేస్తూ జీవో
* రెవెన్యూశాఖకు సంబంధం లేకుండా భూసేకరణ
* ముఖ్యమంత్రి వైఖరిపై కేఈ అనుమానాలు
* యువనేత ఒత్తిడితోనే పక్కనపెట్టారన్న అభిప్రాయం
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి మధ్య నెలకొన్న రాజకీయ వాతావరణం ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో హాట్ టాపిక్‌గా మారింది.ముఖ్యమంత్రి చంద్రబాబు ఇటీవలి కాలంలో వ్యవహరిస్తున్న తీరుపై రెవెన్యూ శాఖ నిర్వహిస్తున్న ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి శిబిరం అనేక అనుమానాలు వ్యక్తం చేస్తోంది. డిప్యూటీ కలెక్టర్లను బదిలీలు చేస్తూ నిన్న ఇచ్చిన జీవోను రద్దు చేసిన ముఖ్యమంత్రి తాజాగా శుక్రవారం విజయవాడలో జరుగుతున్న కలెక్టర్ల సమావేశంలో రెవెన్యూ శాఖలో అవినీతి డబుల్ డిజిట్ గ్రోత్ సాధించిందని ఒకటికి రెండుసార్లు చెప్పడం రాజకీయంగా చర్చనీయాంశమైంది.
గత కొంతకాలంగా ముఖ్యమంత్రి అనుసరిస్తున్న వైఖరిపై కేఈ కృష్ణమూర్తి శిబిరం తర్జనభర్జన పడుతోంది. చంద్రబాబు అనుసరిస్తున్న వైఖరి, పరిణామాలు దేనికి సంకేతమని సన్నిహితుల మధ్య చర్చలు జరుగుతున్నాయి. గతంలో మంత్రివర్గ సమావేశంలో ఒకసారి, అంతకుముందు కలెక్టర్ల సమావేశంలోనూ రెవెన్యూ శాఖలో అవినీతి పెరిగిపోయిందని ముఖ్యమంత్రి చెప్పిన విషయాన్ని విశ్లేషిస్తున్న కేఈ శిబిరం మొత్తంగా ఆ మాటల్లోని ఆంతర్యం వేరై ఉంటుందన్న నిర్ణయానికి వచ్చారు. కావాలనే తనపట్ల తప్పుడు సంకేతాలు వెళ్లడానికి ఈ ప్రయత్నం జరుగుతుందా? అన్న అనుమానాలు కేఈ సన్నిహితుల వద్ద ప్రస్తావించినట్టు తెలిసింది. డిప్యూటీ కలెక్టర్ల బదిలీలను నిలుపుదల చేయ డం ఇది మూడోసారి కావడం గమనార్హం.
భూసేకరణకు రెవెన్యూశాఖ దూరం
రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుతం అనేక ప్రాజెక్టుల కోసం భూ సేకరణ జరుగుతుండగా, అన్నీ రెవెన్యూ శాఖకు సంబంధం లేకుండా చేస్తున్నారు. అమరావతి రాజధాని భూ సమీకరణ, భోగాపురం ఎయిర్‌పోర్టు భూ సేకరణతోపాటు బందరు పోర్టు వంటి విషయాల్లోనూ కేఈని దూరం పెట్టారు. ఆ ప్రాజెక్టుల భూ సేకరణను మంత్రులు పి.నారాయణ, గంటా శ్రీనివాసరావు, అచ్చెన్నాయుడు, అయ్యన్నపాత్రుడు తదితరులకు అప్పగించారు.
జరుగుతున్న పరిణామాలపై కేఈ ఇటీవల సన్నిహితులతో నిర్వహించిన సమావేశంలో ప్రస్తావించినట్టు సన్నిహితవర్గాలు చెప్పాయి. కొత్తగా పార్టీలో చేరిన శిల్పా చక్రపాణిరెడ్డిని కర్నూలు జిల్లా పార్టీ అధ్యక్షుడిగా నియమించడంతోపాటు ఎమ్మెల్సీ కూడా ఇచ్చారని, ఆ విషయంలో కనీసం తనను సంప్రదించలేదని కేఈ వ్యాఖ్యానించినట్టు తెలిసింది. పార్టీలో సీనియర్‌గా ఉన్న తాను ఇలాంటి విషయాల్లో అడిగిన వారికి సమాధానం చెప్పలేకపోతున్నానని ఆవేదన వ్యక్తంచేశారు.
చంద్రబాబు తన పట్ల అనుసరిస్తున్న విధానాలను ఒక్కొక్కటిగా ప్రస్తావిస్తూ... ఇవన్నీ దేనికి సంకేతమని, వీటన్నింటిపైనా ఆలోచించాల్సి ఉందని అన్నట్టు తెలిసింది. పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తనకు ప్రజాపద్దుల కమిటీ (పీఏసీ) చైర్మన్ పదవి ఇవ్వాలని కోరినా నానా ఇబ్బందుల పాలు చేశారని, ఎన్నికల తర్వాత మంత్రివర్గంలోకి తీసుకున్నప్పటికీ యువనేత ఒత్తిడితోనే పక్కనపెట్టారన్న అభిప్రాయం సన్నిహితుల సమావేశంలో వ్యక్తమైంది.