ఏడాదిగా జీతాల్లేవ్!
పాలకొండ: అవుట్ సోర్సింగ్ సిబ్బందికి చాకిరీ తప్ప చిల్లిగవ్వ అందడంలేదు. రెవెన్యూ శాఖలో కంప్యూటర్ ఆపరేటర్లుగా పని చేస్తున్న తాత్కాలిక సిబ్బందికి గత 12 నెలలుగా వేతనాలు చెల్లించకపోవడంతో వారి అవస్థలు వర్ణనాతీతం. జిల్లావ్యాప్తంగా ఇదే పరిస్థతి కొనసాగుతోంది. పైగా వేతనాలు అడిగితే సాగనంపుతామని అధికారులు భయపెడుతున్నారని వీరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రెవెన్యూ శాఖలో సిబ్బంది కొరత, పని ఒత్తిడిని దృష్టిలో ఉంచుకొని తాత్కాలిక సిబ్బందిని నియమించారు.
2008లో అవుట్ సోర్సింగ్ విధానం ప్రవేశపెట్టి కంప్యూటర్ ఆపరేటర్లను నియమించారు. చీఫ్ కమిషనర్ ఆఫ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్(సీసీఎల్‌ఏ) పరిధిలో వీరిని కొనసాగిస్తున్నారు. ఇలా జిల్లా వ్యాప్తంగా రెవెన్యూ కార్యాలయాల్లో 64మంది అవుట్ సోర్సింగ్ సిబ్బంది పనిచేస్తున్నారు. వెబ్ ల్యాండింగ్, మీ-సేవ, భూ వివరాల నమోదు వంటి కీలక కార్యకలాపాలకు వీరినే వినియోగిస్తున్నారు. ఈ శాఖలోని రెగ్యులర్ సిబ్బందికి కంపూటర్లపై అంతగా అవగాహన లేకపోవడంతో వీరే కీలకంగా మారారు. మీ సేవ ధ్రువపత్రాల జారీలోనే వీరే ప్రధాన పాత్ర పోషిస్తున్నారు.
12 నెలలుగా.....
అన్ని పనులకూ అవుట్ సోర్సింగ్ సిబ్బందినే వినియోగించుకుంటున్న అధికారులు వారికి వేతనాలు చెల్లించడంలో మాత్రం చొరవ తీసుకోవడం లేదు. ప్రతి వేతనాలు అందుతాయని ఆశగా ఎదురు చూడటం, తీరా అవి అందకపోవడంతో ఉసూరుమనడం.. మళ్లీ అదే ఆశతో కాలం వెళ్లదీయడం తమకు నిత్యకృత్యంగా మారిందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అప్పులు చేసి కుటుంబాలను నెట్టుకొస్తున్నామని, 12 నెలలు దాటిపోవడంతో ఇప్పుడు అప్పులు పుట్టే పరిస్థితి కూడా లేదని వాపోతున్నారు. ఇప్పటికే పలుమార్లు అధికారులకు విన్నవించామని తెలిపారు.
బెదిరింపులు మొదలు...
వేతనాలు ఇవ్వకపోగా ప్రస్తుతం వీరికి బెదిరింపులు మొదలయ్యాయి. వేతనాలు చెల్లించనందుకు నిరసనగా ఆందోళన చేపట్టాలని ఇటీవల అవుట్ సోర్సింగ్ సిబ్బంది భావించారు. యూనియన్ ఆధ్వర్యంలో చర్చలు జరిపారు. సమావేశం నిర్వహించి విధులు భహిష్కరించాలని యోచించారు. అయితే ఉన్నతాధికారులు వీరిని హెచ్చరికలతో భయపెట్టారు. ఇప్పటికే పలు శాఖల్లో అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను తొలగిస్తున్న విషయాన్ని గుర్తుచేశారు. ఈ సమయంలో నిరసన తెలియజేస్తే ఉన్న ఉద్యోగాలు ఊడిపోతాయని హెచ్చరించారు. దీంతో దిక్కుతోచని స్థితిలో వీరంతా విధులు నిర్వహిస్తున్నారు.