
పుష్కరాల్లో కనిపించని కేఈ
పక్కనపెట్టిన సీఎం
దేవాదాయ మంత్రి మాణిక్యాలరావుకూ దక్కని ప్రాధాన్యత
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, పుష్కరాల్లో కీలక బాధ్యత నిర్వహించాల్సిన రెవెన్యూ శాఖను పర్యవేక్షించే కేఈ కృష్ణమూర్తి ఈ మహాక్రతువుకు దూరంగా ఉన్నారు. పుష్కరాల విషయంలో ముఖ్యమంత్రి చ ంద్రబాబు ఆయనను పూర్తిగా పక్కన పెట్టినట్లు కనిపిస్తోంది. ఈ నెల 14న పుష్కరాలు ప్రారంభమైనప్పటి నుంచి కనీసం దరిదాపుల్లోకి కూడా కేఈ కృష్ణమూర్తి రాలేదు. పుష్కరాలకు ఆరు నెలల ముందు నుంచే ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి. అప్పటి నుంచి ప్రభుత్వం నిర్వహించిన ఏ సమీక్షా సమావేశంలోనూ ఆయన పాల్గొనలేదు. అదే సమయంలో పుణ్య స్నానాలకు ప్రధాన కేంద్రమైన రాజమండ్రి లో పర్యటించలేదు. మరో నాలుగు రోజుల్లో పుష్కరాలు ముగియనుండగా ఇప్పటివరకు ఉప ముఖ్యమంత్రి అటువైపు వెళ్లకపోవడం అధికార టీడీపీలో చర్చనీయాంశంగా మారింది. బుధవారం రాజమండ్రిలో జరగనున్న మంత్రివర్గ సమావేశానికైనా ఆయన హాజరవుతారా? అనేది అనుమానంగానే ఉంది. ఇన్నిరోజులుగా కేఈ దూరంగా ఉన్నా చంద్రబాబు ఏనాడూ వాకబు చేయకపోగా ఆయన గురించి ఏమాత్రం పట్టించుకోలేదు. పుష్కరాల కోసం ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉపసంఘంతో పాటు ఏ ఒక్క కమిటీలోనూ ఆయనను నియమించలేదు.
ఏపీ రాజధాని భూ సేకరణ విషయంలోనూ కేఈని దూరం పెట్టిన విషయం తెలిసిందే. పుష్కరాల విషయంలో దేవాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావును కూడా మొదటినుంచీ చంద్రబాబు దూరం పెడుతూ వచ్చారు. పుష్కరాల వ్యవహారాలను మంత్రి నారాయణకు అప్పగించారు. కొద్ది రోజుల కిందట మంత్రి మాణిక్యాలరావుకు చిన్నపాటి శస్త్ర చికిత్స జరిగిందని, అందువల్ల విశ్రాంతి తీసుకుంటున్నారని, పుష్కరాలు ముగిసిన తరువాత విధులకు హాజరవుతారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. మరో మంత్రి గంటా శ్రీనివాసరావు కూడా పుష్కరాలకు దూరంగా ఉంటున్నారు. అన్ని జిల్లాల మంత్రులు అక్కడే మకాం వేసినా గంటా అటువైపు వెళ్లడం లేదు. పుష్కరాల విషయంలో మంత్రివర్గంలోని కొందరికి మాత్రమే ప్రాధాన్యత ఇవ్వడంపై అసంతృప్తితో ఉన్న కారణంగానే గంటా దూరంగా ఉంటున్నారని ఆయన అనుచరులు అంటున్నారు.