సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: జిల్లాలో పారిశ్రామిక పార్క్ ఏర్పాటుకు మార్గం సుగమమైంది. ఇందుకోసం మునగపాక మండలం టి.సిరసపల్లిలో 70.98 ఎకరాలు కేటాయించింది. పార్క్ కోసం 2010 నుంచి కొనసాగుతున్న భూసేకరణ ప్రతిపాదన వివిధ దశల్లో కొనసాగుతోంది. ఎట్టకేలకు సర్వే నంబర్ 139తో ఉన్న ఈ భూమిని ఏపీఐఐసీకి కేటాయిస్తూ రెవెన్యూ శాఖ ముఖ్యకార్యదర్శి జేఎస్ శర్మ శనివారం జీవో జారీ చేశారు.
పారిశ్రామిక పార్క్‌కు భూమి కేటాయించాలని ఏపీఐఐసీ రాష్ట్ర ప్రభుత్వాన్ని 2010లో కోరింది. జిల్లా రెవెన్యూ యంత్రాంగం మునగపాక మండలం టి.సిరసాపల్లిలో సర్వే నంబర్ 139తో ఉన్న 70.89 ఎకరాలను గుర్తించారు. రెండు భాగాలుగా ఉన్న ఈ భూమిలో ఎవరికీ డి.పట్టాలు మంజూరు చేయలేదు. అందులో దాదాపు 66.18 ఎకరాలు ప్రైవేటు వ్యక్తుల సాగుబడిలో ఉన్నాయి. ఈమేరకు ఆ భూమిని పారిశ్రామిక పార్క్‌కు కేటాయించేందుకు జిల్లా యంత్రాంగం 2010, జూన్ 10న నోటిఫికేషన్ జారీ చేసింది.
దీనిపై ఎవరి నుంచి అభ్యంతరాలు రాలేదని ప్రకటించింది. 2010, జూన్ 25న ఆ భూమిని ఏపీఐఐసీకి కేటాయించేందుకు గ్రామసభ తీర్మానం కూడా చేసింది. ఆ భూములను పరిశీలించిన అప్పటి జాయింట్ కలెక్టర్ వాటిలో 66.18 ఎకరాల్లో కొందరు సాగుచేస్తూ జీడిమామిడి తోటలు, ఇతర తోటలు సాగుచేస్తున్నారని నివేదిక ఇచ్చారు.
అనంతరం అప్పటి కలెక్టర్ ఆ భూములను పరిశీలించి వాటిని ఏపీఐఐసీకి కేటాయించేందుకు ప్రభుత్వానికి ప్రతిపాదించారు. ఆ భూములను 33 ఏళ్ల పాటు లీజుకు ఇవ్వాలని సూచించారు. ఎకరాకు ఏడాదికి రూ.లక్ష చొప్పున లీజుగా నిర్ణయించాలని, ప్రతి ఐదేళ్లకు ఓసారి 10శాతం లీజు మొత్తం పెంచాలని ప్రతిపాదించారు. ఆ భూముల్లో సాగు చేసుకుంటున్నవారికి జీవో నంబర్ 571 ప్రకారం పరిహారం చెల్లించాలని కూడా సూచించారు.
ఎకరా రూ.10లక్షల చొప్పున కేటాయింపు
ఆ ప్రతిపాదనను కొన్ని రోజులుగా పరిశీలించిన ప్రభుత్వం ఎట్టకేలకు నిర్ణయం తీసుకుంది. లీజు బదులు ఆ భూములను ఏపీఐఐసీకి శాశ్వత ప్రాతిపాదికన కేటాయించాలని నిర్ణయించింది. ఎకరాకు రూ.10లక్షలుగా ధర నిర్ణయించింది. భూమి కేటాయించిన మూడేళ్లలో పారిశ్రామిక పార్క్ ఏర్పాటు పూర్తికావాలని కూడా షరతు విధించింది. కేటాయించిన భూమిని నిబంధనలకు విరుద్ధంగా ఇతర అవసరాలకు దుర్వినియోగం చేస్తే భూ కేటాయింపు రద్దు చేసే అధికారం ప్రభుత్వానికి ఉందని స్పష్టం చేసింది. దాంతో పారిశ్రామిక పార్క్‌కు భూ కేటాయింపు ప్రక్రియ దాదాపుగా పూర్తి అయ్యింది.
ఇండస్ట్రియల్ పార్క్‌కు లైన్ క్లియర్
Published Mon, Jan 5 2015 4:34 AM | Last Updated on Wed, Apr 3 2019 8:42 PM
Advertisement
Advertisement