పట్టాల పంపిణీ మూడు జిల్లాల్లోనే! | The three districts to distribute home documents | Sakshi
Sakshi News home page

పట్టాల పంపిణీ మూడు జిల్లాల్లోనే!

Published Fri, May 22 2015 3:12 AM | Last Updated on Mon, Aug 20 2018 3:21 PM

పట్టాల పంపిణీ మూడు జిల్లాల్లోనే! - Sakshi

పట్టాల పంపిణీ మూడు జిల్లాల్లోనే!

పేదలకు లక్ష ఇళ్ల పట్టాలు పంపిణీ చేయాలని ప్రభుత్వ నిర్ణయం
హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్ జిల్లాలకే పరిమితం
గ్రేటర్ ఎన్నికలే లక్ష్యంగా సర్కారు కసరత్తు

సాక్షి, హైదరాబాద్: పేదలకు ఇళ్ల పట్టాలను పంపిణీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధమైంది. తెలంగాణ రాష్ట్ర అవతరణ రోజును పురస్కరించుకొని జూన్ 2నుంచే ఈ కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు రెవెన్యూ శాఖ ఏర్పాట్లు చేస్తోంది.

గత డిసెంబర్‌లో ప్రభుత్వం ప్రకటించిన ఉచిత క్రమబద్ధీకరణ ప్రక్రియకు రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి మూడున్నర లక్షలమందికి పైగా దరఖాస్తులు చేసుకున్నారు. దరఖాస్తుల పరిశీలన అనంతరం పట్టాలు పొందేందుకు అర్హులైన వారిని (సుమారు లక్షన్నర మందిని) అధికారులు ఎంపిక చేశారు. అర్హుల జాబితాలో పది జిల్లాలకు చెందిన పేదలు ఉండగా, ప్రస్తుతానికి పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని మూడు జిల్లాలకే పరిమితం చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. అందులో రెండు జిల్లాలు గ్రేటర్ పరిధిలోని హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలు కాగా, మూడవదైన మెదక్ జిల్లాలో కేవలం రెండు మండలాల (పటాన్‌చెరు, రామచంద్రాపురం)లో మాత్ర మే పట్టాలను పంపిణీ చేయాలని సర్కారు నిర్ణయించినట్లు సమాచారం.
 
సమస్యాత్మకమైనవే ఎక్కువ..
ప్రభుత్వ భూముల్లోని ఆక్రమణలను క్రమబద్ధీకరించేందుకు గత డి సెంబర్ 30న రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు (58, 59)జారీచేసింది. ఉత్తర్వుల ప్రకారం ప్రభుత్వ, యూఎల్సీ భూము ల్లో ఆక్రమణలకే ఈ సదుపాయం వర్తిస్తుంది. క్రమబద్ధీకరణ ప్రక్రియకు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 3,66,150 దరఖాస్తులు ప్రభుత్వానికి అందాయి. వీటిలో ఉచిత కేటగిరీ కింద 3,36, 869 దరఖాస్తులు రాగా, చెల్లింపు కేటగిరీలో కేవలం 29,281 దరఖాస్తులే వచ్చాయి.

ఉచిత క్రమబద్ధీకరణకు అందిన దరఖాస్తుల్లో అభ్యంతరకర భూములకు చెందినవి అధికం గా ఉన్నట్లు అధికారుల పరిశీలనలో తేలింది. వీటిలో కేంద్ర ప్రభుత్వ, రైల్వే, మిలటరీ.. తదితర సంస్థల భూములకు చెందిన దరఖాస్తులు లక్షకుపైగా ఉన్నట్లు నిర్ధారించారు.  రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోనే.. ఇప్పటికే పట్టా ఉన్నవి,  మున్సిపల్, దేవాలయ/దర్గా భూములు, మురుగు కాలవలు, రహదారుల వెంబడి, శ్మశానవాటికలు, శిఖం భూములు, కోర్టు కేసుల్లో ఉన్నవి, హౌసింగ్‌బోర్డు, జీపీడబ్ల్యుడీ, నిజాం నవాబువి, నాన్ ఐఎస్‌ఎఫ్, విద్యాశాఖ, దేవాదాయశాఖ.. తదితర 21 రకాల అభ్యంతరకరమైన భూములకు సంబం ధించి దరఖాస్తులు సుమారు లక్ష వరకు ఉన్నట్లు తెలిసింది.  
గ్రేటర్ పరిధిలో క్రమబద్ధీకరణ ఇలా..
అందిన దరఖాస్తులు : 2,11,798
కేంద్ర ప్రభుత్వ భూములకు చెందినవి : 84,403
పట్టాలకు ఎంపికైన అర్హులు: 99,580
సిద్ధంగా ఉన్న పట్టాలు: 65,673
 
రాష్ట్రవ్యాప్తంగా...
అందిన దరఖాస్తులు: 3,36,869
కేంద్ర ప్రభుత్వ భూములకు చెందినవి: 1,03,331
పట్టాలకు ఎంపికైన దరఖాస్తులు: 1,43,783
సిద్ధమైన పట్టాలు: 82,024

గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలే లక్ష్యం..!
గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల దృష్ట్యా నగర పరిధిలో కనీసం లక్షమంది పేదలకైనా పట్టాలను పంపిణీ చేయాలని సర్కారు లక్ష్యంగా పెట్టుకుందని తెలుస్తోంది. ఈ మేరకు హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్ కలెక్టర్లకు లక్ష్యా లు విధించినట్లు సమాచారం. గ్రేటర్  పరిధి లో 2.11లక్షల దరఖాస్తులు రాగా, ఇందులో పరిశీలన అనంతరం 99,580 మందిని అర్హులుగా ఎంపిక  చేశారు. ఇప్పటి వరకు 65,673 మందికి మాత్రమే ఇళ్ల పట్టాలను సిద్ధం చేశారు. అయితే.. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం నాటికి ఈ సంఖ్యను కనీసం లక్ష(పట్టాలను)కు చేర్చాలని కలెక ్టర్లకు సచివాలయం నుంచి ఆదేశాలందినట్లు తెలిసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement