స్టాంపులు, రిజస్ట్రేషన్ల శాఖలో అవినీతికి చెక్‌ | Check for corruption in the Department of Stamps and Registrations | Sakshi
Sakshi News home page

స్టాంపులు, రిజస్ట్రేషన్ల శాఖలో అవినీతికి చెక్‌

Published Thu, Jul 4 2019 4:11 AM | Last Updated on Tue, Sep 3 2019 8:53 PM

Check for corruption in the Department of Stamps and Registrations - Sakshi

సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పదేపదే నొక్కి చెబుతున్న అవినీతి రహిత, పారదర్శక పాలనకు స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ శ్రీకారం చుట్టింది. ముఖ్యమంత్రి మాటలను స్ఫూర్తిగా తీసుకున్న ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్‌ చంద్రబోస్, రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సాంబశివరావు, స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌ చర్చించుకుని, రిజిస్ట్రార్ల పోస్టింగ్‌లు, బదిలీలకు కొత్త విధానాన్ని రూపొందించి తక్షణమే అమలు చేశారు. అవినీతి కట్టడే లక్ష్యంగా రాష్ట్రంలో అత్యధిక రాబడి ఉన్న 12 రిజిస్ట్రేషన్‌ కార్యాలయాల సబ్‌ రిజిస్ట్రార్లుగా కొత్త వారికి పోస్టింగ్‌లు ఇచ్చారు. కొత్తగా ఉద్యోగంలో అడుగుపెట్టేవారు ఉత్సాహంగా, నిజాయతీగా పనిచేస్తారని, అవినీతికి పాల్పడరనే ఉద్దేశంతో ఈ నియామకాలు జరిపారు. ఇందుకోసం రాష్ట్రంలో అత్యధిక రాబడి ఉన్న 12 సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాలను పరిపాలనా సౌలభ్యం పేరుతో కౌన్సెలింగ్‌ నుంచి మినహాయింపు ఇస్తూ ప్రభుత్వం అంతర్గత ఉత్తర్వులు జారీ చేసింది. 

రాష్ట్ర చరిత్రలో ఇలాంటి దాఖలాల్లేవ్‌ 
ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌(ఏపీపీఎస్సీ) ద్వారా గ్రూప్‌–2కు ఎంపికై, ఇటీవలే శిక్షణ పూర్తి చేసుకుని పోస్టింగ్‌ల కోసం ఎదురు చూస్తున్న 12 మందిని మెరిట్‌ (గ్రూప్‌ –2లో వచ్చిన మార్కులు) ఆధారంగా 12 రిజిస్ట్రేషన్‌ కార్యాలయాల్లో సబ్‌ రిజిస్ట్రార్లుగా బుధవారం ప్రభుత్వం నియమించింది. గ్రూప్‌–2 ద్వారా సబ్‌ రిజిస్ట్రార్లుగా ఎంపికైన వారు మారుమూల చివరి గ్రేడ్‌లో ఉన్న ప్రాంతాల్లో సబ్‌ రిజిస్ట్రార్లుగా నియమితులు కావడం మొదటి నుంచి రివాజుగా వస్తోంది. అయితే ఈ పర్యాయం దీనికి పూర్తి భిన్నంగా రిజిస్ట్రేషన్‌ శాఖ వారికి కీలక స్థానాలను అప్పగించింది. జోన్‌–1లో విశాఖపట్నం, మధురవాడ, భీమిలి, జోన్‌–2లో గాంధీనగర్, విజయవాడ పటమట, గుణదల, రాజమండ్రి, జోన్‌–3లో మంగళగిరి, నెల్లూరు, నల్లపాడు, జోన్‌–4లో అనంతపురం, కర్నూలు ఆదాయపరంగా ముందున్నాయి. అందువల్ల వీటిని అత్యంత ఫోకల్‌ కేంద్రాలుగా ఎంపిక చేసిన రిజిస్ట్రేషన్‌ శాఖ పరిపాలనా సౌలభ్యం పేరుతో (అవినీతి కట్టడి లక్ష్యంగా) ఇక్కడ సబ్‌ రిజిస్ట్రార్లుగా కొత్తవారిని నియమించాలని ఉత్తర్వులు జారీ చేసింది. దీని ప్రకారం 12 మంది కొత్తవారిని ఆయా ప్రాంతాల్లో నియమిస్తూ ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. రాష్ట్ర చరిత్రలో ఇప్పటి వరకూ ఇలా పోస్టింగ్‌లు ఇచ్చిన దాఖలాలు లేవని ఉన్నతాధికారులు పేర్కొన్నారు. ‘‘సాధారణంగా అధిక ఆదాయం ఉన్న రిజిస్ట్రేషన్‌ కార్యాలయాల్లో సబ్‌ రిజిస్ట్రార్‌ పోస్టు ఖాళీ అవుతుందని తెలియగానే పలుకుబడి గల అధికారులు సిఫార్సులు చేయించుకుని, అక్కడికి బదిలీ అయ్యేవారు. కీలకమైన రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో ఖాళీలు ఉండేవి కావు. కొత్తగా సబ్‌ రిజిస్ట్రార్లుగా ఎంపికైన వారు అప్రధానమైన ప్రాంతాల్లోనే నియమితులయ్యేవారు. మొదటినుంచీ ఇదే విధానం అమలవుతోంది. ఈసారి అవినీతికి చరమగీతం పాడాలన్న లక్ష్యంతో కొత్త ఉద్యోగులను కీలకమైన స్థానాల్లో నియమించాం’’ అని స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సాంబశివరావు, ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌ వెంకట్రామిరెడ్డి చెప్పారు. 

పకడ్బందీగా నిబంధనల అమలు 
కొత్తవారికి పోస్టింగ్‌లు ఇచ్చిన 12 సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాలు మినహా మిగిలిన చోట్ల పోస్టింగులకు  ప్రభుత్వం కౌన్సెలింగ్‌ విధానం పాటించింది. అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) కేసుల్లో ఉన్న వారికి ప్రధానమైన చోట్ల (ఫోకల్‌) పోస్టింగులు ఇవ్వరాదని, ప్రధానమైన ప్రాంతాల్లో పనిచేస్తున్న వారికి అప్రధాన ప్రాంతాల్లో, అప్రధాన ప్రాంతాల్లో ఉన్న వారికి ప్రధాన ప్రాంతాల్లో పోస్టింగులు ఇవ్వాలని స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ పేర్కొంది. ఈ మేరకు పకడ్బందీ నిబంధనలు రూపొందించింది. ఎక్కడ ఎలాంటి అతిక్రమణలకు పాల్పడినా కఠిన చర్యలు తప్పవని స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌ హెచ్చరికలు జారీ చేశారు. దీంతో నోడల్‌ అధికారులుగా ఉన్న డిప్యూటీ ఇన్‌స్పెక్టర్‌ జనరల్స్‌/ జిల్లా రిజిస్ట్రార్లు పక్కాగా నిబంధనల ప్రకారమే బదిలీల కౌన్సెలింగ్‌ను బుధవారం నిర్వహించారు. 

కొత్త రక్తానికి ప్రాధాన్యం  
ఏపీపీఎస్సీ ద్వారా గ్రూప్‌–1కు ఎంపికై జిల్లా రిజిస్ట్రార్లుగా నియామకం కోసం ఎదురుచూస్తున్న వారిని ఆరు రిజిస్ట్రేషన్‌ కార్యాలయాల్లో సబ్‌ రిజిస్ట్రార్లుగా నియమించాలని ఉపముఖ్యమంత్రి పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌ రెండు రోజుల క్రితమే ఆదేశాలు కూడా జారీ చేశారు. అయితే జిల్లా రిజిస్ట్రార్‌ కేడర్‌లోని వారిని సబ్‌ రిజిస్ట్రార్లుగా నియమించడం సాంకేతికంగా తప్పవుతుంది. అందువల్ల స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సాంబశివరావు, ఐజీ వెంకట్రామిరెడ్డి వెళ్లి ఉప ముఖ్యమంత్రిని కలిసి ఈ విషయాన్ని వివరించారు. కొత్తగా ఎంపికైన 12 మంది సబ్‌ రిజిస్ట్రార్లను అధిక రాబడి ఉన్న 12 రిజిస్ట్రేషన్‌ కార్యాలయాల్లో  సబ్‌ రిజిస్ట్రార్లుగా నియమిస్తే బాగుంటుందని వారు విన్నవించారు. అలాగే పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ద్వారా గ్రూప్‌–1కు ఎంపికైన ఆరుగురిని కూడా ఇదే తరహాలో అతి ముఖ్యమైన రిజిస్ట్రేషన్‌ కార్యాలయాల్లో జిల్లాల రిజిస్ట్రార్లుగా నియమిద్దామని తెలిపారు. దీనికి సమ్మతించిన ఉప ముఖ్యమంత్రి ఇందుకు అనుగుణంగా అప్పటికప్పుడు ఆదేశాలు జారీ చేశారు. దీంతో గ్రూప్‌–2లో మెరిట్‌ ఆధారంగా 12 మంది కొత్త వారిని కీలక ప్రాంతాల్లో సబ్‌ రిజిస్ట్రార్లుగా నియమించారు. ఆరు ముఖ్యమైన జిల్లాల్లో జిల్లా రిజిస్ట్రార్లుగా త్వరలో కొత్త వారికి పోస్టింగులు ఇవ్వనున్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement