జోగిపేట : కౌలు రౌతులకు ఇక మంచి రోజులే.. పట్టాదారులకు తప్ప ఆ భూమిలో కౌలు వ్యవసాయం చేస్తున్న రైతులకు పంట రుణాలు అందడం లేదని గుర్తించిన ప్రభుత్వం భూ యజమానుల హక్కులకు భంగం కలగకుండా... వారి అనుమతి పొందిన కౌలు రైతులకు ప్రయోజనం చేకూర్చేలా రుణ అర్హత కార్డులను జారీ చేయనుంది. జిల్లాలో రెండేళ్ల క్రితం 2070 మంది కౌలు రైతులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు.
మీ సేవ ద్వారా...
కౌలు రైతులకు కార్డులను మీ సేవ కేంద్రాల ద్వారా అందించాలని రెవెన్యూ శాఖ నిర్ణయించింది. ఈ మేరకు ఏర్పాట్లు పూర్తి చేసింది. వీటిని పొందాలనుకునే వారు, పునరుద్ధరణ చేసుకునే వారి కోసం దరఖాస్తులను సమీపంలోని మీ సేవ, గ్రామ మండల రెవెన్యూ కేంద్రాల్లో అందుబాటులో ఉంచారు. దరఖాస్తులో కౌలుకు తీసుకున్న భూమి వివరాలతో పాటు ఆధార్ కార్డు, రేషన్ కార్డు, ఓటరు గుర్తింపు కార్డు, పాన్ కార్డు నంబర్లలో ఏదో ఒకటి తప్పనిసరిగా నమోదు చేయా ల్సి ఉంటుంది.
ఆన్‌లైన్‌లో వచ్చిన దరఖాస్తులను పరిశీ లించి గ్రామ సభ ద్వారా అధికారులు విచారణ చేస్తారు. నిర్ధారణ తర్వాత 15 రోజుల్లో కార్డులు పొందే అవకాశం ఉంటుంది. గత ఏడాది రుణ అర్హత కార్డులు పొందిన వారు కూడా రెన్యూవల్ చేసుకోవాలి. లేకుంటే అవి చెల్లుబాటు కావు. కార్డు పొందిన నాటి నుంచి మే 31 వరకు మాత్రమే చెల్లు బాటులో ఉంటుంది. ఈసారి కౌలు రైతుల సంఖ్య పెరగవచ్చని అధికారుల అంచనా.
గ్రామ సభలతో అవగాహన
రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది కౌలు రైతులకు రుణాలను అందించే విషయాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుంది. దీనిలో భాగంగా గ్రామ గ్రామాన రైతులతో సమావేశాలు నిర్వహించి ప్రభుత్వం కల్పించే సౌకర్యాలపై వివరిస్తారు. గ్రామాల్లో ఆర్‌ఐ, వీఆర్‌ఓలు గ్రామ సభలు నిర్వహిస్తారు. అర్హత పొందిన ఎల్‌ఈసీల వివరాలు ఇంకా తెలియలేదు.
- డీఆర్‌ఓ దయానంద్
రుణాలు అందేలా చూస్తాం
2013-14 సంవత్సరంలో జిల్లా లో 2070 మంది కౌలు రైతులకు అర్హత కార్డులను పంపిణీ చేశాం. అందులో 935 మంది బ్యాంకుల ద్వారా రూ.447 లక్షల రూపాయల రుణాలను పొందారు. 2015-16కు మీసేవ ద్వారా కార్డులు పొందిన తరువాత బ్యాంకుల ద్వారా రుణాలను అందించేందుకు చర్యలు తీసుకుంటాం. ప్రభుత్వం సూచించిన విధంగా కౌలు రైతులు రుణ అర్హత కార్డులను పొందాలి.
- హుక్యానాయక్, వ్యవసాయశాఖ జేడీఏ
రుణాలు కల్పిస్తే మంచిది
ప్రభుత్వం కౌలు రైతులకు రుణాలు కల్పిస్తే మంచిది. పట్టా రైతులతో సమానంగా విత్తనాలు, ఎరువులను అందజేయాలని నిర్ణయించడం ఊరట కలిగించే అంశం. రెండు సంవత్సరాల క్రితం బ్యాంకులు రుణాలను అందజేశారు. కానీ ఇప్పుడు మాకు ఎలాంటి సౌకర్యాలూ లేవు. బ్యాంకులు కూడా అర్హులందరికీ రుణాలిచ్చేలా అధికారులు చర్యలు తీసుకోవాలి. - మల్లయ్య, కౌలు రైతు
కౌలు.. ఇక మేలు
Published Wed, Jul 22 2015 1:56 AM | Last Updated on Mon, Oct 1 2018 2:00 PM
Advertisement
Advertisement