► అదనపు పనిభారంతో ఉద్యోగులు, సిబ్బంది అందోళన
► నేటి వీడియో కాన్ఫరెన్స్‌లో ప్రస్తావనకు సన్నద్ధం
సాక్షి, సిటీబ్యూరో: ఒక వైపు పనిభారం.. మరోవైపు సిబ్బంది కొరత రెవెన్యూ యంత్రాంగాన్ని భయపెడుతున్నది. కల్యాణ లక్ష్మి, షాదీముబారక్, హరితహారం వంటి అదనపు కార్యకలాపాలు రెవెన్యూ ఉద్యోగులను మరింత ఇబ్బంది పెడుతున్నాయి. దీంతో గురువారం కలెక్టరేట్ నుంచి ‘20 ఎజెండా’ అంశాలపై జిల్లా అధికారయంత్రాంగం నిర్వహించతలపెట్టిన వీడియో కాన్ఫరెన్స్‌లో పని భారంపై తమ అభిప్రాయాలను వ్యక్తపరిచేందుకు తహసీల్దార్లు, రెవెన్యూ ఉద్యోగులు సన్నద్ధమవుతున్నారు. ఇదిలా ఉండగా... ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయకుండా ఫైలును పక్కనపెట్టిన సర్కారు...
రోజుకో కొత్త నిర్ణయంతో ఒత్తిడికి గురిచేస్తోంది. మరోవైపు జిల్లాల పునర్విభజన ముహూర్తం కూడా సమీపిస్తుండడంతో తహసీల్దార్ల నియామకంపై నీలి నీడలు కమ్ముకున్నాయి. జిల్లాలో పనిచేస్తున్న ముగ్గురు తహసీల్దార్లకు జూలైలో డిప్యూటీ కలెక్టర్లుగా పదోన్నతులు లభించాయి. తహసీల్దార్ స్థాయి అధికారులకు ప్రమోషన్లు ఇచ్చిన సర్కారు.. డిప్యూటీ తహసీల్దార్లకు పదోన్నతులు కల్పించలేదు. దీంతో ఈ పోస్టులను ఇప్పటికిప్పుడు భర్తీ చేసే పరిస్థితి కనిపించడంలేదు. అదే సమయంలో అటూ పదోన్నతులు లభించిన తహసీల్దార్ల ఫైలుకు మోక్షం కలగలేదు. వీరికి పోస్టింగ్‌లకు ఇంకా సమయం పట్టే అవకాశం కనిపిస్తోంది.
అదనపు పనులతో ఇబ్బందులు...
వెబ్‌ల్యాండ్ అప్‌డేషన్, అసైన్డ్ భూముల సర్వే, యూఎల్‌సీ భూముల క్రమబద్ధీకరణ, జీఓ 58,59 అమలు, భూముల వేలం తదితర పనులతో రెవెన్యూ అధికారులు సతమతమవుతున్నారు. జిల్లాలో ఒకటి, రెండు మండలాలు మినహాయించి మిగతా మండలాల్లో జనాభా 3 లక్షల నుంచి 4 లక్షల వరకు ఉండటంతో ఇక్కడి సిబ్బందిపై పని భారం రెండింతలు పడుతున్నది. ఇక్కడ ధృవీకరణ పత్రాల జారీ శక్తికి మించిన భారమవుతున్నది. దీనికితోడు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు తదితర ప్రాజెక్టులకు ప్రభుత్వం చేపడుతున్న భూసేకరణ కూడా తహసీల్దార్లకు కత్తిమీద సాములా మారింది. ఏ మాత్రం ఆలసత్వం ప్రదర్శించినా ఉద్యోగానికే ఎసరొచ్చే ప్రమాదం ఉన్న నేపథ్యంలో భూసేకరణ అంటేనే భయపడే పరిస్థితి నెలకొంది.
ఈ క్రమంలోనే కొంతమంది తహసీల్దార్లకు పదోన్నతులు కల్పించిన సర్కారు.. అదేసమయంలో కిందిస్థాయి అధికారులకు కూడా ప్రమోషన్లు ఇవ్వకపోవడం కూడా ప్రస్తుత పరిస్థితికి కారణంగా చెప్పవచ్చు. కేవలం రెవెన్యూ విధులేగాకుండా... కల్యాణలక్ష్మి, షాదీముబారక్, హరితహారం తదితర పథకాల అమలులోనూ తహసీల్దార్లదే కీలకపాత్ర. దీనికితోడు వారానికి నాలుగురోజులు సీసీఎల్‌ఏ, సీఎస్, కలెక్టర్, జేసీలు, ఇతర శాఖాధిపతులు నిర్వహిస్తున్న సమావేశాలు కూడా పనులను ప్రభావితం చేస్తున్నాయి. కొంతమంది తహసీల్దార్లు మాత్రం వీడియో కాన్ఫరెన్స్‌లు, సమీక్షలను సాకుగా చూపి కార్యాలయాలకు ఎగనామం పెడుతుండడంతో అర్జీదారుల బాధలు వర్ణణాతీతంగా మారాయి.