రెవెన్యూ వర్సెస్‌ విద్యుత్‌ శాఖ | Revenue v/s power Department | Sakshi
Sakshi News home page

రెవెన్యూ వర్సెస్‌ విద్యుత్‌ శాఖ

Published Thu, Aug 18 2016 12:05 AM | Last Updated on Wed, Sep 5 2018 2:25 PM

రెవెన్యూ వర్సెస్‌ విద్యుత్‌ శాఖ - Sakshi

రెవెన్యూ వర్సెస్‌ విద్యుత్‌ శాఖ

 
  • వరంగల్‌ తహసీల్దార్‌ఆఫీస్‌కు కరెంట్‌ కట్‌
  • ఎన్‌పీడీసీఎల్‌పై రెవెన్యూ శాఖ ప్రతిచర్య
  • దేశాయిపేట సబ్‌స్టేషన్‌ నిర్మాణంపై నోటీస్‌
  • సీజ్‌ చేసేందుకు వెళ్లిన రెవెన్యూ అధికారులు
 
హన్మకొండ : రెవెన్యూ, విద్యుత్‌(ఎన్‌పీడీసీఎల్‌) శాఖల మధ్య ప్రచ్ఛన్న యుద్ధం కొనసాగుతోంది. కొన్ని నెలలుగా రెండు శాఖల మధ్య పోరు జరుగుతోంది. వరంగల్‌ మండల తహసీల్దార్‌ కార్యాలయం కరెంటు బిల్లు రూ.8 లక్షలకుపైగా బకాయి ఉంది. దీంతో ఎన్‌పీడీసీఎల్‌ అధికారులు తహసీల్‌ కార్యాలయానికి కరెంటు సరఫరా నిలిపివేశారు. ఈ చర్యతో రెవెన్యూ శాఖ అధికారులు అదే తీరుగా స్పందిస్తూ దేశాయిపేట సబ్‌స్టేషన్‌ను సీజ్‌ చేసేందుకు సన్నద్ధమయ్యారు. దేశాయిపేట 308 సర్వే నంబర్‌లోని 1.20 ఎకరాల ప్రభుత్వ భూమిలో ఎన్‌పీడీసీఎల్‌ 2009లో సబ్‌స్టేషన్‌ నిర్మించింది. సబ్‌స్టేషన్‌ భూమి విషయంలో ఎలాంటి కేటాయిం పులు జరపలేదని, చెల్లింపులు జరగలేదని 2016 ఫిబ్రవరిలో రెవెన్యూ శాఖ, ఎన్‌పీడీసీఎల్‌ అధికారులకు నోటీసులు జారీ చేసింది. ఆ నోటీసులకు ఎన్‌పీడీసీఎల్‌ అధికారులు స్పందించలేదు. తహసీల్దార్‌ కార్యాలయానికి కరెంటు సరఫరా నిలిపివేయడంతో గతంలో జారీ చేసిన నోటీసు విషయాన్ని పైకి తెచ్చారు. నోటీసులకు ఎన్‌పీడీసీఎల్‌ నుంచి స్పందన లేకపోవడంతో సబ్‌స్టేషన్‌ను సీజ్‌ చేసేందుకు రెవెన్యూ అధికారులు అక్కడికి వెళ్లారు. సబ్‌స్టేషన్‌ సిబ్బంది ఈ విషయాన్ని ఎన్‌పీడీసీఎల్‌ ఉన్నతాధికారులకు తెలిపారు. ఎన్‌పీడీసీఎల్‌ ఉన్నతాధికారులు వెంటనే రెవెన్యూ శాఖ అధికారులతో సంప్రదింపులు జరిపారు. వరంగల్‌ తహసీల్దార్‌ కార్యాలయానికి కరెంటు సరఫరా పునరుద్ధరించారు. దీంతో రెవెన్యూ అధికారులు సబ్‌స్టేçÙన్‌ నుంచి వెనక్కి వచ్చారు.
 
వీడియోల చిత్రీకరణ
సబ్‌స్టేషన్‌ సీజ్‌ విషయం... ఎన్‌పీడీసీఎల్, రెవెన్యూ అధికారుల మధ్య స్వల్ప వాగ్వాదానికి దారితీసింది. ‘మీ కార్యాలయానికి కరెంటు సరఫరా నిలిపివేసిన విషయం మాకు తెలియదు. రెండు ప్రభుత్వ విభాగాలే కదా... ఒక రోజు ముందు వెనుక బిల్లులు చెల్లిస్తాం. ఆగవచ్చు కదా’ అని రెవెన్యూ అధికారులు అన్నారు. ‘ప్రభుత్వ భూమి కేటాయింపులకు సంబంధించిన డబ్బులను ఎన్‌పీడీసీఎల్‌ చెల్లించలేదు. అయి నా మా శాఖ అడగడం లేదు’ అని రెవెన్యూ అధికారులు సమాధానమిచ్చారు. రెండు శాఖల అధికారులు మాట్లాడుతుండగా ఇరు శాఖల సిబ్బంది పోటీపడి వీడియో చిత్రీకరించారు. కరెంటు సరఫరా పునరుద్ధరించారని తహసీల్దార్‌ కార్యాలయం నుంచి ఫోన్‌ రాగానే వరంగల్‌ మండల రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌ శర్మ, వీఆర్వో స్రవంతి, ఇతర సిబ్బంది అక్కడి నుంచి వెళ్లిపోయారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement