- ఎక్కువ మందికి పట్టాలిచ్చేందుకు పరిశీలన
- రెగ్యులరైజ్ చేసే కోణంలో రెవెన్యూ శాఖ చర్యలు
- ఈ నెల 25 కల్లా తుది నిర్ణయం
సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్ హైదరాబాద్‌లో జీవో 58 ప్రకారం ఉచిత క్రమబద్ధీకరణకు సంబంధించి సాధ్యమైనంత ఎక్కువ మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చేందుకు రెవెన్యూ యంత్రాంగం కసరత్తు చేస్తున్నది. ఈమేరకు గురువారం పలు శాఖల అధికారులతో సమీక్షలు, సమాలోచనలు జరిపింది. తద్వారా ఇళ్ల పట్టాలపై ఒక నిర్ణయానికి రావాలని భావిస్తున్నది. వీలున్నంత మేరకు ఇళ్ల క్రమబద్ధీకరణపై ఉదారంగా వ్యవహారించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేయటంతో....చెరువులు, స్మశానవాటిక, లే అవుట్లలో ఖాళీ స్థలాలు, శిఖం భూములలోని నిర్మాణాలను కూడా రెగ్యులరైజ్ చేసే కోణంలో రెవెన్యూ శాఖ పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. వివిధ సంస్థలకు కేటాయించిన సర్కారీ భూముల్లో వెలిసిన నిర్మాణాల క్రమబద్ధీకరణపై సర్కారు కనికరిస్తే ఇళ్ల పట్టాలు పెంచవచ్చని యంత్రాంగం భావిస్తున్నది. పారిశ్రామిక, అటవీ, విద్య, నీటిపారుదల తదితర శాఖలకు బదలాయించిన స్థలాల్లో చాలా చోట్ల నిర్మాణాలు పుట్టుకొచ్చాయి. ఈ మేరకు క్రమబద్ధీకరణ చేయాలంటూ హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల నుంచి 13,417 మంది దరఖాస్త్తు చేసుకున్నారు. ఈ దరఖాస్తులను పరిశీలించిన యంత్రాంగం ప్రభుత్వానికి నివేదించగా...అక్కడి ఆదేశాలకు అనుగుణంగా వాటికి మోక్షం కలిగించే అంశంపై సీసీఎల్‌ఏ అధ్వర్యంలోని కమిటీ కసరత్తు చేస్తున్నది. ఈ దరఖాస్తుల్లో హైదరాబాద్ జిల్లాకు సంబంధించినవి 6,725, రంగారెడ్డి జిల్లావి 6,692 దరఖాస్తులు ఉన్నాయి. వచ్చే నెల 2 నుంచి ఇళ్ల పట్టాలు పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించటంతో.. ఆగమేఘాలపై వివిధ శాఖల నుంచి క్రమబద్ధీకరణకు సంబంధించి క్లియరెన్స్ కోసం అధికారయంత్రాంగం కుస్తీ పడుతొంది. ఈ మేరకు గురువారం ఆయా శాఖల ఉన్నతాధికారులు, సంబంధిత విభాగాలతో సమీక్షలు, చర్చలు జరిపారు. 25 వ తేదీ కల్లా కసరత్తు పూర్తి చేయాలని నిర్ణయించారు.
క్రమబద్ధీకరణపై కసరత్తు!
Published Fri, May 22 2015 12:56 AM | Last Updated on Sun, Sep 3 2017 2:27 AM
Advertisement
Advertisement