పోస్టింగ్‌ల కోసం పోటాపోటీ
హైదరాబాద్ ఆర్డీవో స్థానంపై కన్ను..
నాలుగు మండలాలకు భలే గిరాకీ
సిటీ బ్యూరో: జిల్లా రెవెన్యూ శాఖలో పోస్టింగ్‌ల కోసం జోరుగా పైరవీలు సాగుతున్నట్లు తెలుస్తోంది. తాజాగా ఎనిమిది మంది తహశీల్దార్లకు డిప్యూటీ కలెక్టర్లుగా, పన్నెండు మంది డిప్యూటీ తహశీల్దార్లకు తహశీల్దార్లుగా పదోన్నతులు లభించాయి. ప్రస్తుతం ఖాళీగా ఉన్న హైదరాబాద్ రెవెన్యూ డివిజన్ అధికారి (ఆర్డీవో) పోస్టుతో సహా, పదోన్నతులతో ఖాళీ అవుతున్న నాలుగు మండల తహశీల్దార్ల పోస్టుల కోసం తీవ్ర స్థాయిలో లాబీయింగ్ జరుగుతున్నట్లు సమాచారం. మూడు యూఎల్‌ఎసీ తహశీల్దార్ల స్థానాలు కూడా ఖాళీ అవుతున్నా పెద్దగా డిమాండ్ లేకుండా పోయింది. కీలకమైన స్థానాల్లో పోస్టింగ్ కోసం పెద్ద మొత్తంలో ముడుపులు సమర్పించేందుకు సైతం అధికారులు సిద్దమవుత్నున్నారు. జిల్లాలో సుమారు 12 మంది డిప్యూటీ తహశీల్దార్లకు పదోన్నతి లభించగా అందులో నలుగురు వివిధ ఆరోపణలతో డిఫర్ అయ్యారు. ఒకరికి మాత్రం రూల్ 16( హెచ్) ప్రకారం రిలాక్సేషన్ ఇచ్చినట్లు సమాచారం. దీంతో మిగిలిన వారికి కొత్త పోస్టింగ్ లభించే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగ సంఘాల నాయకులు పైరవీల్లో కీలక పాత్ర పోషిస్తున్నట్లు తెలుస్తోంది.
హైదరాబాద్ ఆర్డీవో పోస్టుకు పోటా పోటీ
హైదరాబాద్ రెవెన్యూ డివిజన్ అధికారి పోస్టు కోసం తాజాగా పదోన్నతి పొందిన ఇద్దరు డిప్యూటీ కలెక్టర్లు తీవ్రంగా పోటీ పడుతున్నట్లు సమాచారం. అందులో సంఘం బాధ్యుడితో పాటు మరొకరు ఉన్నత స్థాయిలో లాబీయింగ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. మరో వైపు కలెక్టరేట్‌లో ఖాళీగా ఉన్న యూఎల్‌సీ విభాగం డిప్యూటీ కలెక్టర్ పోస్టుకు సైతం మరో ముగ్గురు పోటీ పడుతున్నారు. మొత్తం మీద తాజాగా పదోన్నతి పొందినవారిలో ఇద్దరికి మాత్రమే జిల్లాలో పోస్టింగ్ లభించే అవకాశాలు ఉండటంతో మిగిలిన ఆరుగురు బయటకు వెళ్లాల్సిందే
లాబీయింగ్..
జిల్లా రెవెన్యూ యంత్రాంగంలో కీల మండలమైన షేక్‌పేట్‌పై అందరి దృష్టి పడింది. ప్రభుత్వ, అసైన్డ్, మిగులు, శిఖం భూములు అధికంగా ఉన్నందున షేక్‌పేట తహశీల్దార్ పోస్టుకు అధిక డిమాండ్ ఉంటుంది. ప్రస్తుతం అక్కడి తహశీల్దారు చంద్రకళకు డిప్యూటీ కలెక్టర్‌గా పదోన్నతి లభించడంతో ఆ స్థానం ఖాళీ అవుతోంది. ఆ పోస్టు దక్కించుకునేందుకు ఇటీవల పదోన్నతులు పొందిన కొత్తవారితో పాటు పాత యూఎల్‌సీ, కలెక్టరేట్‌లో పనిచేస్తున్న తహశీల్దార్లు సైతం తీవ్ర ప్రయత్నాలు చేస్తునట్లు తెలుస్తోంది. మరోవైపు సైదాబాద్, నాంపల్లి, హిమాయత్ నగర్ మండల తహాశీల్దార్ల పోస్టులకు సైతం తీవ్ర పోటీ నెలకొన్నట్లు సమాచారం.