రెవెన్యూ ప్రక్షాళన
♦ పలు మండలాలకు కొత్త తహసీల్దార్లు
♦ జిల్లాకు కేటాయించిన 9 మందికి పోస్టింగ్‌లు
♦ ఈసీ గ్రీన్‌సిగ్నల్‌తో ఉత్తర్వులు జారీచేసిన కలెక్టర్
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి : తహసీల్దార్ల బదిలీలకు ఎన్నికల సంఘం ఆమోదముద్ర వేసింది. దీంతో జిల్లావ్యాప్తంగా 24 మందికి స్థానచలనం కలిగిస్తూ కలెక్టర్ రఘునందన్‌రావు బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇటీవల తహసీల్దార్లుగా పదోన్నతులు (ఇతర జిల్లాల నుంచి జిల్లాకు కేటాయించిన) పొందిన తొమ్మిది మందికి కొత్తగా పోస్టింగ్‌లు ఇవ్వగా.. పరిపాలనా సౌలభ్యంలో భాగంగా మరికొందరిని మార్చారు. ప్రస్తుతం ఓటర్ల నమోదు ముసాయిదా ప్రక్రియ జరుగుతుండడంతో ఉద్యోగుల బదిలీలపై నిషేధం అమలులో ఉంది. ఈ నేపథ్యంలో బదిలీలకు అనుమతి కోరుతూ జాబితాను ఈసీకి పంపారు.
ఈ మేరకు జాబితాకు ఈసీ క్లియరెన్స్ ఇవ్వడంతో ఉత్తర్వులు జారీ అయ్యాయి. సమర్థత, పనితీరు ప్రామాణికంగా పోస్టింగ్‌లు కట్టబెట్టిన కలెక్టర్.. ఫార్మా భూముల సేకరణ లో నిక్కచ్చిగా వ్యవహరించిన యాచారం తహసీల్దార్ వసంతకుమారిపై బదిలీ వేటు వేశారు. కుర్మిద్ద భూముల గుర్తింపు వ్యవహారం జిల్లా యంత్రాంగానికి తలనొప్పిగా మారింది. స్థానిక ప్రజాప్రతినిధులు కూడా ఆమె వ్యవహారశైలిపై ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలోనే ఆమెను తప్పించినట్లు తెలుస్తోంది. అదేసమయంలో ప్రభుత్వ భూముల ఆక్రమణలను నిరోధించడంలో విఫలమయ్యారని భావించిన ఉన్నతాధికారులు.. శామీర్‌పేట తహసీల్దార్ దే వుజాకు స్థానచలనం కలిగించారు.
పాత హోదాలోకి డిప్యూటీ తహసీల్దార్లు తహసీల్దార్ హోదాలో పనిచేస్తున్న డిప్యూటీ తహసీల్దార్లకు పాత హోదాను కట్టబెడుతూ బదిలీ చేశారు. డీటీ హోదాలో కలెక్టరేట్‌లో ‘డి’ సెక్షన్ సూపరింటెండెంట్‌గా పనిచేస్తున్న జి.రాములును యాలాల మండల డిప్యూటీ తహసీల్దార్‌గా నియమించారు. అలాగే యాలాల తహసీల్దార్‌గా వ్యవహరిస్తున్న ఒగ్గు రాజును డీఆర్‌ఓకు రిపోర్టు చేయమని ఆదేశించారు. ఇక రాజేంద్రనగర్ డీఏఓగా పనిచేస్తున్న గౌరీవత్సలను అక్కడే డీటీ కేడర్‌లో పనిచేయాలని నిర్దేశించారు. కలెక్టరేట్‌లో పాలనాధికారిగా వ్యవహరిస్తున్న జనార్దన్ ను దేవాదాయశాఖకు రిలీవ్ చేశారు. ఇక చాలాకాలంగా పోస్టింగ్ కోసం ఎదురుచూస్తున్న రాజేశ్వరిని రిపోర్టు చేయమని కలెక్టర్ ఆదేశించారు.