♦ అనుకున్నది చేయడమే ఆయన తత్వం
♦ ఉన్నతాధికారులకు మింగుడుపడని వైనం
♦ కొన్ని నెలలుగా ఖాళీగానే.. పోస్టింగ్ యత్నాలు విఫలం
♦ ఇదీ జిల్లాలోని ఓ తహసీల్దార్ కథ
విధి నిర్వహణలో ఆయన శైలే వేరు.. అనుకున్నది చేస్తారు. ఉన్నతాధికారుల ఆదేశాలకూ వెరవరు. ఈ క్రమంలో విధి నిర్వహణకు దూరమైనా పట్టువదలని విక్రమార్కుడిలా తిరిగి పోస్టింగ్‌కు ప్రయత్నిస్తారు. తాను చేస్తున్నదే నిజమని నమ్ముతారు. దీంతో ఉన్నతాధికారులు ఆయనను విధులకు దూరంగా ఉంచారు. కొన్ని నెలలుగా సెలవుల్లోనే కొనసాగుతున్నారు. ఇటీవల తిరిగి విధుల్లో చేరారు. తనకు పోస్టింగ్ ఇవ్వమని విన్నవించుకున్నారు. ఆయన ప్రయత్నాలు ఫలించలేదు. చివరికి తనకు పనయినా అప్పగించండి.. లేదా ప్రభుత్వానికైనా సరెండర్ చేయమని కలెక్టర్‌కు మొర పెట్టుకున్నారు.
అడిగిందే తడవుగా కలెక్టర్
ఆయనను సరెండర్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇది జిల్లాలోని ఓ తహసీల్దార్ వింత కథ. విచిత్ర మలుపులు తిరిగిన ఈ కథ ఏమిటో మీరే చదవండి. - సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: రామ హరిప్రసాద్.. గతంలో దోమ, ధారూర్, పెద్దేముల్ మండలాల్లో తహసీల్దార్‌గా పనిచేశారు. పెద్దేముల్‌లో పనిచేస్తున్నప్పుడు ఓ కేసులో సస్పెండ్ అయ్యారు. ఆ తర్వాత మళ్లీ విధుల్లో చేరిన హరిప్రసాద్‌ను ప్రభుత్వ భూముల పరిరక్షణ విభాగంలో తహసీల్దార్‌గా నియమించారు. కొంతకాలం సజావుగానే పనిచేసిన ఆయన ఉన్నతాధికారులకు కొరకరానికొయ్యగా మారారు. ఒక ఫైల్ విషయంలో సరిగా స్పందించలేదని భావించిన ఉన్నతాధికారులు ఆయనపై కన్నెర్ర జేశారు. ఈసారి ఆయనను కేఆర్‌సీలో తహసీల్దార్‌గా నియమించారు. దీంతో అసంతృప్తికి లోనైన హరిప్రసాద్ దీర్ఘకాలిక సెలవుపై వెళ్లారు. ఇటీవల మళ్లీ రిపోర్టు చేసిన ఆయన.. తాజాగా జరిగిన తహసీల్దార్ల బదిలీల్లో పోస్టింగ్ లభిస్తుందని ఆశించారు.
అయితే, హరిప్రసాద్ వర్కింగ్ స్టైల్ తెలిసిన ఉన్నతాధికారులు పోస్టింగ్‌లలో ఆయన పేరును పరిగణనలోకి తీసుకోలేదు. దీంతో ఆఖరికి నల్లగొండ జిల్లాకైనా పంపమని అభ్యర్థించారు. ఆ ప్రయత్నాలు కూడా ఫలించలేదు. ఇక లాభంలేదని భావించిన హరిప్రసాద్ తనకు పనయినా అప్పగించండి.. ప్రభుత్వానికైనా సరెండర్ చేయమని వేడుకుంటూ కలెక్టర్‌కు విన్నవించుకున్నారు. అతడు అడిగిన మరుక్షణమే సరెండర్ చేస్తూ ప్రభుత్వానికి సిఫార్సు చేశారు. సాధారణంగా విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించినా, క్రమశిక్షణారహిత్యానికి పాల్పడినట్లు గుర్తించిన సమయంలోనే ఉద్యోగులను ప్రభుత్వానికి సరెండర్ చేస్తారు. ఈ తహసీల్దార్ మాత్రం తదుపరి పోస్టింగ్ కోసం ప్రభుత్వానికి అప్పగించమని లేఖ రాయడం జిల్లా యంత్రాంగాన్ని సైతం ఆశ్చర్యపరచింది.