68, 517 చదరపు గజాలలో 18 కార్యాలయాలు
సర్కారుకు రెవెన్యూ శాఖ నివేదిక
సిటీబ్యూరో:హైదరాబాద్ జిల్లాలో రెవెన్యూ శాఖకు సంబంధించిన కార్యాలయాల లెక్క... వాటి విస్తీర్ణం వివరాలతో కూడిన నివేదికను జిల్లా యంత్రాంగం గురువారం రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించింది. మారేడుపల్లి, సైదాబాద్ మండల కార్యాలయాలు అద్దె భవనాలలో కొనసాగుతుండగా... మిగిలిన 14 మండల కార్యాలయాలు, హైదరాబాద్ కలెక్టరేట్, సికింద్రాబాద్, హైదరాబాద్, రంగారెడ్డి ఈస్ట్ ఆర్డీఓల కార్యాలయాల విస్తీర్ణం వివరాలను నివేదికలో పొందుపరిచారు. జిల్లా రెవెన్యూ శాఖ పరిధిలోని 18 కార్యాలయాల విస్తీర్ణం 68,517 చదరపు గజాలుగా తేల్చారు. వీటి వయసునూ పొందుపరిచారు. హైదరాబాద్ కలెక్టరేట్ భవనం నిర్మించి 50 ఏళ్లు గడుస్తుండగా ... ఆసిఫ్‌నగర్ మండల కార్యాలయ భవనం నిర్మించి 25 ఏళ్లు అవుతోంది. అంబర్‌పేట మండల కార్యాలయానికి 19 ఏళ్లు, ముషీరాబాద్ మండల కార్యాలయానికి 18 ఏళ్లయినట్టు గుర్తించారు. బండ్లగూడ, తిరుమలగిరి,సికింద్రాబాద్, ఖైరతాబాద్, బహుదూరపురా మండల కార్యాలయాలు, సికింద్రాబాద్ ఆర్డీఓ కార్యాలయాలు నిర్మించి 15 ఏళ్లు పూర్తయినట్టు నివేదికలో పేర్కొన్నారు. అమీర్‌పేట, హిమాయత్‌నగర్ మండల కార్యాలయాలు నిర్మించి 12 ఏళ్లు... మిగతా కార్యాలయ భవనాల వయస్సు పదేళ్ల లోపు ఉన్నట్టు అధికారులు వివరించారు.
ఉన్నతాధికారులకు వేర్వేరుగా...
హైదరాబాద్ జిల్లా పరిధిలోని 1352 ఎకరాల్లో 436 ప్రభుత్వ కార్యాలయాలు ఉన్నట్టు అధికారులు తేల్చారు. ఈ భవ నాలు 255.5 ఎకరాల్లోనే ఉన్నాయని వివరించారు. దీనిపై సమగ్ర సమాచారంతో సంబంధిత శాఖల అధిపతులు నివేదికలు రూపొందించి.. వేర్వేరుగా తమ ఉన్నతాధికారులకు అందించినట్లు తెలుస్తోంది. హైదరాబాద్ జిల్లా పరిధిలోని ఇతర జిల్లాలు, రాష్ట్ర కార్యాలయ భవనాలనూ పరిగణనలోకి తీసుకున్నట్లు సమాచారం.
భవనాలు... ఖాళీ స్థలాల విక్రయం?
జిల్లాలోని విలువైన ప్రభుత్వ ఖాళీ స్థలాలు... కార్యాలయ భవనాల అమ్మకానికి ప్రభుత్వం కసరత్తు ప్రారంభించినట్లు ప్రచారం జరుగుతోంది. ఏయే ప్రభుత్వ శాఖల పరిధిలో ఎంత భూమి ఉందోనన్న సమగ్ర సమాచారంతో వివరాలు సేకరిస్తున్న తీరు చూస్తుంటే ఇది నిజమేనన్న అనుమానాలు బలపడతున్నాయి. ప్రభుత్వ స్థలాల్లోని ఇళ్లు, భవనాల క్రమబద్ధీకరణతో భారీగా ఆదాయం సమకూర్చుకోవచ్చునన్న ఆశలు అడియాసలు కావడంతో ప్రభుత్వ కార్యాయాలపై కన్నేసినట్లు తెలుస్తోంది. భూముల అమ్మకంతో రూ. 6,500 కోట్లు సమీకరిస్తామని బడ్జెట్‌లో ప్రస్తావించిన ప్రభుత్వం... ఆ దిశలో నడుస్తున్నట్టు వివిధ వర్గాలు భావిస్తున్నాయి.
భవన గణన
Published Fri, Feb 6 2015 12:39 AM | Last Updated on Sat, Sep 2 2017 8:50 PM
Advertisement
Advertisement