comprehensive information
-
మా డేటా మాదే..!
సాక్షి, హైదరాబాద్: విద్యాశాఖకు సంబంధించిన సమగ్ర సమాచారం తమకు ప్రత్యేకంగా ఇవ్వాలని కేంద్రప్రభుత్వం రాష్ట్రాలకు సూచించింది. రాష్ట్రాలు ఇప్పటికే అమలు చేస్తున్న విద్యాలయాలకు సంబంధించిన సమగ్ర సమాచార నిధి(డేటా బేస్) యు–డైస్(డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టం ఫర్ ఎడ్యుకేషన్)తో తమకు సంబంధం లేదని పేర్కొంది. యూడైస్ ప్లస్ పేరుతో కేంద్రం సరికొత్త పోర్టల్‌ను సృష్టించింది. విద్యార్థులు, ఉపాధ్యాయుల సంఖ్య, ఖాళీల వివరాలు ఇందులో నమోదు చేయాల్సి ఉంటుంది. స్కూళ్లలో మౌలిక వసతులు, ఆధార్ అనుసంధానం, మధ్యాహ్న భోజన వివరాలను యూడైస్ ప్లస్‌లో అందించాలి. అందులో అడిగిన మేరకు సమాచారం అందించాలని సూచించింది. కేంద్ర ప్రభుత్వ నిధులతో పాఠశాలల్లో నడిచే కార్యక్రమాలకు ఇదే కీలకమని భావిస్తోంది. ఈ నేపథ్యంలో యూడైస్ ప్లస్ ద్వారా సమాచారం ఇవ్వకపోతే నిధుల విడుదల కష్టమని హెచ్చరించినట్టు తెలిసింది. నేడు, రేపు సదస్సు యూడైస్ ప్లస్‌పై సమగ్ర అవగాహన కల్పించేందుకు శుక్ర, శనివారాల్లో విజయవాడలో ప్రత్యేక సదస్సు ఏర్పాటు చేశారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, అండమాన్ నికోబార్, లక్షద్వీప్ ప్రాంతాలకు చెందిన రాష్ట్రస్థాయి సమన్వయకర్తలు ఈ సదస్సులో పాల్గొనాలని సూచించింది. వీరి ద్వారా జిల్లాస్థాయిలో శిక్షణ ఇవ్వాలని నిర్ణయించారు. జిల్లాస్థాయిలో సమాచారాన్ని నిక్షిప్తం చేసే ఏఎస్వోలకు కొత్త విధానంపై సంపూర్ణ అవగాహన కలిగించి ఏమైనా సందేహాలుంటే శిక్షణ పొందినవారు నివృత్తిచేస్తారు. ’డిప్యూటీ డైరెక్టర్ జనరల్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్, లిటరసీ, న్యూఢిల్లీ వారి ఆధ్వర్యంలో సదస్సు జరుగుతోంది. ‘యు–డైస్ ప్లస్’ కార్యాచరణపై కేంద్రం అన్ని జిల్లాల్లోని డీఈవో కార్యాలయాలకు ఇప్పటికే ఆదేశాలు కూడా జారీ చేసింది. -
ఉద్యోగుల సమగ్ర సమాచారం ఇవ్వండి
వివరాలు సేకరిస్తున్న ప్రభుత్వం సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: ఉద్యోగుల సమగ్ర సమాచారాన్ని రాష్ట్ర ప్రభుత్వం సేకరిస్తోంది. ప్రతి ఉద్యోగికి సంబంధించి న వ్యక్తిగత, వృత్తిగత వివరాలను రాబడు తోంది. ఈ మేరకు పది అంశాలతో కూడిన సమాచారాన్ని ఇవ్వాలని నమూనా పట్టిక ను జారీ చేసింది. ఉమ్మడి రాష్ట్రంలో ఒక సారి డేటా సేకరించిన ప్రభుత్వం.. తాజా గా మరింత లోతుగా సమాచారాన్ని సేకరి స్తోంది. వృత్తిగత, వ్యక్తిగత, విద్యార్హతలు, కుటుంబ సభ్యుల సమాచారం, బ్యాంకు రుణాలు, ఖాతాల సంఖ్యల, సెలవుల వివ రాలను కోరింది. ఏయే పద్దుల కింద ఎంత మేర వేతనాలను అందుకుంటు న్నారనే వివరాలను నమూనా పత్రంలో పొందుపరచాలని సూచించింది. ఈ మేరకు పూరించిన డేటాను సంబంధిత విభాగాధిపతి ధ్రువీకరించిన అనంతరం జిల్లా ట్రెజరీ అధికారికి పంపాలంది. -
విద్యార్థుల కోసం సమాచార యాప్
శ్రీకాకుళం రూరల్: విశ్వవ్యాప్తంగా ఇంజినీరింగ్, మెడిసిన్ కళాశాలల సమగ్ర సమాచారంతో ఒక యాప్ రూపొందింది. గురజాడ విద్యాసంస్ధకు చెందిన పూర్వ విద్యార్ధిని కృషితో ఇది ఆవిష్కృతమయింది. కెరీర్ డెస్టినీటెక్ సొల్యూషన్స్ ఇండియా ప్రయివేట్ లిమిటే డ్ సంస్ధ సీఎండీ ప్రవీన్ జి. తంబి శుక్రవారం ఈ ప్రారంభ కార్యక్రమంలో పాల్గొన్నారు. యాప్‌ను రూపొదించిన గురజాడ కళాశాలలో స్ధానిక పూర్వ విద్యార్ధి కలగ లిజి (శ్రీకాకుళం)ని ఆయన అభినందించారు. ఈసందర్భంగా మాట్లాడుతూ ఇంటర్మీడియట్ విద్య అనంతరం ఏ కళాశాలలో విద్యనభ్యసించాలనుకుంటున్నారో వాటి పూర్తివివరాలతో పాటు విశ్వవ్యాప్త సమాచారం ఈ యాప్‌లో పొందుపరిచారని వివరించారు. యాప్ రూపకర్త కలగ లిజి మాట్లాడుతూ ఇంటర్ అనంతరం విద్యార్ధులు ఇతరులపై ఆధార పడకూడదని అభిప్రాయపడ్డారు. అందుకే విద్యతో పాటు ఉద్యోగ సమాచారం నిక్షిప్తం చేయడం జరిగిందన్నారు. ఇంజినీరింగ్ విద్యలో 40కి పైగా, మెడిసిన్‌లో 150కి పైగా కోర్సులున్నాయన్న విషయం చాలా మందికి తెలియదన్నారు. విశ్వవ్యాప్తంగా 5 లక్షల కళాశాలున్నాయని తెలియజేశారు. యాప్ ద్వారా దరఖాస్తు చేసుకునే అవకాశం ఉందన్నారు. ఫీజు, స్కాలర్షిప్, బ్యాంకు రుణాలు వంటి ఇతర వివరాలు కూడా యాప్‌లో నిక్షిప్తం చేశామన్నారు. ప్రపంచంలో ఏ కళాశాలకైనా ఇంటి నుండే దరఖాస్తు చేసుకోనే అవకాశం ఉందన్నారు. గురజాడ విద్యాసంస్థల అధ్యక్షలు జివి స్వామినాయుడు మాట్లాడుతూ ప్రపంచంలోని విద్యాసంస్ధల పూర్తి సమాచారం ఉండటం వల్ల ఈ యాప్ విద్యార్థులకు దిక్సూచి వంటిందన్నారు. కార్యక్రమంలో గురజాడ కళాశాలల ప్రిన్సిపాల్ పులఖండం శ్రీనివాసరావు, వివిధ కళాశాలల విద్యార్థులు,అధ్యాపకులు పాల్గొన్నారు. -
కొత్త జిల్లాలపై కదలిక..!
* ‘పునర్వ్యవస్థీకరణ’ నివేదిక తయారీలో కలెక్టర్ బిజీ * సమగ్ర సమాచారం సేకరించాలని సర్కారు ఆదేశం * నెలాఖరులోపు వివరాలు పంపే అవకాశం సాక్షి, సిటీబ్యూరో: కొత్త జిల్లాల ఏర్పాటుపై కదలిక మొదలైంది. జిల్లా లు, మండలాల పునర్వ్యవస్థీకరణకుగాను నిర్దేశిత సమాచారాన్ని తక్షణమే పంపాలని ప్రభుత్వం ఆదేశించింది. అధికారంలోకి వస్తే కొత్త జిల్లాలను ఏర్పాటు చేస్తామని ప్రకటించిన కేసీఆర్ సర్కారు.. వీటి ఏర్పాటుపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో ఓ కమిటీని నియమించింది. ఈ కమిటీ నివేదిక ఆధారంగా వచ్చే ఏడాది జూన్ 2వ తేదీలోపు నూతన జిల్లాలను ప్రకటించాలని భావిస్తోంది. దీంతో ఆరు రకాల అంశాలపై నిర్దేశించిన ప్రొఫార్మాలో వివరాలను పంపాలని కలెక్టర్‌ను ఆదేశిస్తూ ఫార్మెట్ (నమూనా)లను పంపింది. కోరిన సమాచారాన్ని సేకరించడంలో యంత్రాంగం తలమునకలైంది. సమగ్ర సమాచారం మండలాల భౌగోళిక స్వరూపం, చారిత్రక, సాంస్కృతిక నేపథ్యం, విద్యాసంస్థలు, భూ వినియోగం, పట్టణ జనాభా, అక్షరాస్యత, లింగ నిష్పత్తి, రవాణా వ్యవస్థ, మండలాలు తదితర అంశాలపై సమగ్ర సమాచారాన్ని నివేదించాలని సూచించింది. దాదాపు 180 అంశాలకు సంబంధించిన వివరాలను సాధ్యమైనంత త్వరగా తమకు పంపాలని ఆదేశించారు. ప్రతి మండలానికి సంబంధించిన నైసర్గిక స్వరూపం, మ్యాపులు, స్కూళ్లు, ఆస్పత్రులు, ప్రభుత్వ కార్యాలయాలు, ఇతర విషయాలను కూడా నివేదికలో పొందుపరచాలని నిర్దేశించారు. దీంతో నూతన జిల్లాల ఏర్పాటుపై జిల్లా స్థాయిలో కదలిక వచ్చింది. నగరీకరణ నేపథ్యంలో జిల్లా జనాభా ఇబ్బడిముబ్బడిగా పెరిగింది. జనసంఖ్య 40 లక్షలు దాటిపోయింది. ఈ నేపథ్యంలో 2009లో నియోజకవర్గాల డీలిమిటేషన్‌తో అసెంబ్లీ స్థానాలు కాస్తా పదిహేనుకు చేరాయి. పరిపాలనా సౌలభ్యం దృష్ట్యా జిల్లాలోని గొల్కోండ, సికింద్రాబాద్, చార్మినార్పేరుతో కొత్త జిల్లాలను ప్రకటిస్తే ...హైదరాబాద్ జిల్లాకు అదనంగా కొత్త ప్రాంతాలను కలపాల్సి ఉంటుందంటున్నారు. ఎందుకంటే ఈ జిల్లాలో హైదరాబాద్, సికింద్రాబాద్ రెవెన్యూ డివిజన్లు, 16 మండలాలు మాత్రమే ఉన్నాయి. ఈ కసరత్తు తర్వాతే.. కొత్త మండలాలు/ రెవెన్యూ డివిజన్లపై కసరత్తు పూర్తయిన తర్వాతే జిల్లాల పునర్వ్యవస్థీకరణపై స్పష్టత రానుంది. ఈ తరుణంలోనే మండలాల సరిహద్దులు, చారిత్రక నేపథ్యం, దర్శనీయ స్థలాలు, రవాణా సౌకర్యం తదితర అంశాలపై జిల్లా యంత్రాంగం ఇచ్చే నివేదిక కీలకం కానుంది. ఈ క్రమంలోనే ప్రజాప్రతినిధుల అభిప్రాయాలను కూడా క్రోడీకరించి ప్రభుత్వానికి తుది నివేదికను పంపనుంది. ఉప్పల్‌లో టీడీపీకి పూర్వ వైభవం ఉప్పల్: ఉప్పల్‌లో టీడీపీకి పూర్వ వైభవం తీసుకు వస్తామని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కందికంటి అశోక్ కుమార్ గౌడ్ అన్నారు. తెలుగుదేశం తెలంగాణ రాష్ర్ట కార్యదర్శిగా ఉప్పల్‌కు చెందిన కందికంటి అశోక్ కుమార్ గౌడ్‌ను నియమించడంతో స్థానిక టీడీపీ నాయకులు ఆయనను ఉప్పల్‌లో ఆదివారం ఘనంగా శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీడీపీ హయాంలోనే ఉప్పల్ నియోజకవర్గం అభివృద్ధి జరిగిందని గుర్తు చేశారు. పార్టీ కార్యకర్తలను సమాయత్తం చేసి పార్టీ పూర్వ వైభవ ం తీసుకు వస్తామన్నారు. వచ్చే బల్దియా ఎన్నికల్లో గ్రేటర్ హైదరాబాద్‌ను టీడీపీ కైవసం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. ఆశోక్‌ను సత్కరించిన వారిలో బొబ్బాల రమణారెడ్డి, తెలుగు యువత రాష్ట్ర కార్యదర్శి అరిటి కాయల భాస్కర్, కొట్టాల బాలరాజు, పబ్బతి శేఖర్‌రెడ్డి, కల్లూరి వేణు టీఎన్ఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి కందికంటి నిఖిల్ గౌడ్, మహేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
భవన గణన
68, 517 చదరపు గజాలలో 18 కార్యాలయాలు సర్కారుకు రెవెన్యూ శాఖ నివేదిక సిటీబ్యూరో:హైదరాబాద్ జిల్లాలో రెవెన్యూ శాఖకు సంబంధించిన కార్యాలయాల లెక్క... వాటి విస్తీర్ణం వివరాలతో కూడిన నివేదికను జిల్లా యంత్రాంగం గురువారం రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించింది. మారేడుపల్లి, సైదాబాద్ మండల కార్యాలయాలు అద్దె భవనాలలో కొనసాగుతుండగా... మిగిలిన 14 మండల కార్యాలయాలు, హైదరాబాద్ కలెక్టరేట్, సికింద్రాబాద్, హైదరాబాద్, రంగారెడ్డి ఈస్ట్ ఆర్డీఓల కార్యాలయాల విస్తీర్ణం వివరాలను నివేదికలో పొందుపరిచారు. జిల్లా రెవెన్యూ శాఖ పరిధిలోని 18 కార్యాలయాల విస్తీర్ణం 68,517 చదరపు గజాలుగా తేల్చారు. వీటి వయసునూ పొందుపరిచారు. హైదరాబాద్ కలెక్టరేట్ భవనం నిర్మించి 50 ఏళ్లు గడుస్తుండగా ... ఆసిఫ్‌నగర్ మండల కార్యాలయ భవనం నిర్మించి 25 ఏళ్లు అవుతోంది. అంబర్‌పేట మండల కార్యాలయానికి 19 ఏళ్లు, ముషీరాబాద్ మండల కార్యాలయానికి 18 ఏళ్లయినట్టు గుర్తించారు. బండ్లగూడ, తిరుమలగిరి,సికింద్రాబాద్, ఖైరతాబాద్, బహుదూరపురా మండల కార్యాలయాలు, సికింద్రాబాద్ ఆర్డీఓ కార్యాలయాలు నిర్మించి 15 ఏళ్లు పూర్తయినట్టు నివేదికలో పేర్కొన్నారు. అమీర్‌పేట, హిమాయత్‌నగర్ మండల కార్యాలయాలు నిర్మించి 12 ఏళ్లు... మిగతా కార్యాలయ భవనాల వయస్సు పదేళ్ల లోపు ఉన్నట్టు అధికారులు వివరించారు. ఉన్నతాధికారులకు వేర్వేరుగా... హైదరాబాద్ జిల్లా పరిధిలోని 1352 ఎకరాల్లో 436 ప్రభుత్వ కార్యాలయాలు ఉన్నట్టు అధికారులు తేల్చారు. ఈ భవ నాలు 255.5 ఎకరాల్లోనే ఉన్నాయని వివరించారు. దీనిపై సమగ్ర సమాచారంతో సంబంధిత శాఖల అధిపతులు నివేదికలు రూపొందించి.. వేర్వేరుగా తమ ఉన్నతాధికారులకు అందించినట్లు తెలుస్తోంది. హైదరాబాద్ జిల్లా పరిధిలోని ఇతర జిల్లాలు, రాష్ట్ర కార్యాలయ భవనాలనూ పరిగణనలోకి తీసుకున్నట్లు సమాచారం. భవనాలు... ఖాళీ స్థలాల విక్రయం? జిల్లాలోని విలువైన ప్రభుత్వ ఖాళీ స్థలాలు... కార్యాలయ భవనాల అమ్మకానికి ప్రభుత్వం కసరత్తు ప్రారంభించినట్లు ప్రచారం జరుగుతోంది. ఏయే ప్రభుత్వ శాఖల పరిధిలో ఎంత భూమి ఉందోనన్న సమగ్ర సమాచారంతో వివరాలు సేకరిస్తున్న తీరు చూస్తుంటే ఇది నిజమేనన్న అనుమానాలు బలపడతున్నాయి. ప్రభుత్వ స్థలాల్లోని ఇళ్లు, భవనాల క్రమబద్ధీకరణతో భారీగా ఆదాయం సమకూర్చుకోవచ్చునన్న ఆశలు అడియాసలు కావడంతో ప్రభుత్వ కార్యాయాలపై కన్నేసినట్లు తెలుస్తోంది. భూముల అమ్మకంతో రూ. 6,500 కోట్లు సమీకరిస్తామని బడ్జెట్లో ప్రస్తావించిన ప్రభుత్వం... ఆ దిశలో నడుస్తున్నట్టు వివిధ వర్గాలు భావిస్తున్నాయి. -
‘యూఎల్సీ’ లెక్క తేలింది!
సర్కారుకు అధికారుల నివేదిక నేడు అఖిలపక్ష సమావేశం కీలక నిర్ణయం తీసుకునే అవకాశం సిటీబ్యూరో: నగరంలో పట్టణ భూ గరిష్ట పరిమితి (యూఎల్సీ) స్థలాలకు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని అధికార యంత్రాంగం సిద్ధం చేసింది. ఈ వివరాలను అఖిల పక్షం ముందు ఉంచాల్సి రావటంతో సత్వరమే ఇవ్వాలని ఉన్నతాధికారులు హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల యం త్రాంగాన్ని ఆదేశించారు. ప్రభుత్వ ఆక్రమిత స్థలాల క్రమబద్ధీకరణకు రంగం సిద్ధం చేస్తున్న సర్కారు... యూఎల్సీ స్థలాలను కూడా రెగ్యులరైజ్ చేయాలని యోచిస్తోంది. నగరంలోని ముఖ్యమైన ప్రదేశాలలో యూఎల్సీ స్థలాలు అధికంగా ఉండటంతో స్పష్టమైన సమాచారం కావాలని విపక్షాలు డిమాండ్ చేయటంతో... సర్వే నంబర్ల వారీగా వివరాలను ప్రభుత్వానికి నివేదించారు. పార్టీలకు కూడా వీటిని అందజేసినట్లు తెలిసింది. యూఎల్సీ, ప్రభుత్వ భూములు, ఇళ్లు, భవనాల క్రమబద్ధీకరణపై మంగళవారం (ఈ నెల 16న) ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన జరుగనున్న అఖిలపక్ష సమావేశంలో కీలక నిర్ణయం తీసుకునే అవకాశముంది. కాసుల పంటపై భారీ ఆశలు హైదరాబాద్ జిల్లాలో యూఎల్సీ భూములు 1736 ఎకరాలు ఉన్నాయి. ఇందులో 1614 ఎకరాలలో 35 వేలకు పైగా భవనాలు, ఇతర నిర్మాణాలు ఉన్నట్లు గుర్తించిన రెవెన్యూ శాఖ, వాటిని క్రమబద్ధీకరించడం ద్వారా రూ. కోట్లలో ఆదాయాన్ని రాబట్టవచ్చునని సూచించినట్లు తెలుస్తోంది. వివాదాలు లేని యూఎల్సీ భూమి 72 ఎకరాలు ఉంటుందని అంచనా వేశారు. వీటి అమ్మకాల ద్వారా రూ.కోట్లలో నిధులు రాగలవని తేల్చినట్లు తెలుస్తోంది. ప్రభుత్వ భూమి 21.10 ఎకరాలు ఉందని, తద్వారా రూ.1500 కోట్లు రాబట్టుకోవచ్చునని పేర్కొన్నట్లు తెలుస్తోంది. రంగారెడ్డి జిల్లాలోని 11 పట్టణ మండలాల్లో 3,452.25 ఎకరాల యూఎల్సీ భూములు ఉండగా, ఇందులో 1369.19 ఎకరాలపై కోర్టు కేసులు ఉన్నాయి. 1482 ఎకరాల్లోని నిర్మాణాలు క్రమబద్ధీకరణకు అనువుగా ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. మిగిలిన 601 ఎకరాల్లో భూములను విక్రయించవచ్చునంటున్నారు. వీటిలో శేరిలింగంపల్లిలోని భూములే ఎక్కువని సమాచారం. ధరపై ఏకాభిప్రాయం కరువు యూఎల్సీ, ప్రభుత్వ స్థలాల క్రమబద్ధీకర ణకు నిర్దేశించాల్సిన ధరపై ఏకాభిప్రాయం కుదరడం లేదని తెలుస్తోంది. ప్రస్తుతం కనీస ధరనే పరిగణనలోకి తీసుకోవాలని ఉన్నతాధికారులు భావిస్తుండగా... అది సరైన యోచన కాదన్న వాదనలూ వినిపిస్తున్నాయి.