వీళ్లిట్టా.. వాళ్లట్టా!
Published Fri, Jul 8 2016 12:42 PM | Last Updated on Mon, Sep 4 2017 4:25 AM
నీటి తీరువా వసూలులో ఇరుశాఖల మధ్య సమన్వయలోపం
రెవెన్యూ శాఖ ఖాతాలో రూ. 2 కోట్ల పన్నులు
నాలుగేళ్లుగా జల వనరుల శాఖ వాటా ఇవ్వని వైనం
భూములకు నీరిచ్చేది జల వనరుల శాఖ అధికారులు, పన్ను వసూలు చేయాల్సింది రెవెన్యూ శాఖ అధికారులు కావడంతో ఆ రెండు శాఖల మధ్య సమన్వయం కొరవడింది. దీంతో కాల్వలు, చెరువులకు చిన్నపాటి గండ్లు పడినా తాత్కాలిక మరమ్మతులు చేయాలన్నా నిధుల కొరత వేధిస్తోంది.
కర్నూలు సిటీ: కాల్వల కింద ఆయకట్టు భూముల నుంచి నీటి తీరువా వసూలులో రెవెన్యూ, జలవనరులశాఖాధికారులు తీవ్ర నిర్లక్ష్యం వహిస్తున్నారు. ఈ విషయంలో ఈ రెండు శాఖల మధ్య సమన్వయం లేకపోవడంతో కొన్నేళ్లుగా పన్నులు వసూలు కావడం లేదు. వసూలైన సొమ్ము రెవెన్యూ శాఖ ఖాతాల్లో మూలుగుతున్నా జల వనరుల శాఖకు వాటా రావడం లేదు. ఈ పరిస్థితి దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వం పన్ను వసూలు బాధ్యత నుంచి రెవెన్యూ శాఖను తప్పించే యోచనలో ఉంది. ఇందుకు సంబంధించి గత నెల 30వ తేదీన ఆయకట్టు అభివృద్ధి సంస్థ, అపెక్స్ సభ్యులు అభిప్రాయం కోరగా జల వనరుల శాఖకు చెందిన మెజారీ ఇంజినీర్లు పన్ను వసూలు బాధ్యతను తీసుకునేందుకు సమ్మతించారు.
జిల్లాలో ఇదీ పరిస్థితి..
జిల్లాలో ప్రధానంగా కేసీ, తుంగభద్ర దిగువ కాలువ, గాజులదిన్నె ప్రాజెక్టు, శివభాష్యం, ఎస్‌ఆర్‌బీసీ, తెలుగుగంగా, చిన్న నీటిపారుదల శాఖ, ఆంధ్రప్రదేశ్ ఆయకట్టు అభివృద్ధి సంస్థ పరిధిలోని ఎత్తిపోతల పథకాల కింద మొత్తం 6.29 లక్షల ఎకరాల ఆయకట్టు సాగవుతోంది. ఈ భూముల నుంచి పన్ను వసూలు బాధ్యతను ప్రభుత్వం రెవెన్యూ శాఖకు అప్పగించింది. అయితే ఈ విషయంలో ఆ శాఖాధికారుల నిర్లక్ష్యం కారణంగా పన్నులు భారీగా పెండింగ్‌లో పడిపోయాయి. ఈ క్రమంలో నిధుల వేట మొదలెట్టిన ప్రభుత్వం నీటి తీరువాపై రెవెన్యూ శాఖ నిర్లక్ష్యాన్ని గుర్తించి ఆ బాధ్యతను జల వనరుల శాఖ ఇంజనీర్లకు అప్పగించాలని సంకల్పించి వారి అభిప్రాయాలు తీసుకుంది.
రూ. 21.25 కోట్ల బకాయిలు
కర్నూలు, కడప జిల్లాల్లోను, తుంగభద్ర దిగువ కాల్వ, ఎస్‌ఆర్‌బీసీ, తెలుగుగంగా, గాజులదిన్నె ప్రాజెక్టు, శివభాష్యం, చెరువులు, ఎత్తిపోతల పథకాల కింద సాగయ్యే ఆయకట్టుకు సంబంధించి గతేడాది మే నెలవరకు తీసుకుంటే రూ. 21.25 కోట్ల బకాయిలున్నాయి. సాధారణంగా కాల్వల కింద సాగయ్యే పంటలకు వేరువేరుగా పన్నులు వసూలు చేస్తారు. ఎకరాకు వరి పంటకు రూ. 200, ఇరిగేటేడ్ డ్రై పంటకు రూ. 100 ప్రకారంవసూలు చేస్తారు.
అభిప్రాయం తీసుకున్నారు..
ఆయకట్టుకు సంబంధించి నీటి తీరువా వసూళ్ల బాధ్యతను ఇప్పటి వరకు రెవెన్యూ అధికారులు నిర్వహించారు. ప్రస్తుతం జలవనరుల శాఖకు అప్పగించేందుకు అపెక్స్ సభ్యులు, ఉన్నతాధికారులు అభిప్రాయాన్ని సేకరించారు. అయితే చాలా మంది మన కాల్వలకు సంబంధించి పన్నులు మనమే వసూలు చేసుకుంటే బాగుంటుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
- ఎస్.చంద్రశేఖర్ రావు
Advertisement