Lack of coordination
-
రైతు బజార్ని పట్టించుకునేవారే కరువయ్యారు
సాక్షి, నిజామాబాద్ అగ్రికల్చర్: రైతులు పండించిన కూరగాయలు విక్రయించేందుకు కోసం నిర్మించిన రైతుబజార్లు నిరుపయోగంగా మారాయి. అక్కడ రైతులకు కనీస వసతులు కల్పించకపోవడంతో అసౌకర్యాలకు గురవుతున్నారు. తద్వారా రైతుబజార్లలో కూరగాయలు విక్రయించేందుకు రైతులు నిరాసక్తత చూపుతున్నారు. దీంతో వీక్లీ మార్కెట్ చౌరస్తా, గాంధీగంజ్, వినాయక్‌నగర్‌లోని రాజీవ్‌గాంధీ చౌరస్తా, కంఠేశ్వర్, ఇలా రోడ్లపై కూర్చొని విక్రయిస్తున్నారు. ఇప్పటికైనా జిల్లా మార్కెటింగ్ అధికారులు స్పందించి నగరంలో ఎక్కడా కూరగాయలు విక్రయించకుండా చర్యలు చేపట్టి.. రైతుబజార్లను ఉపయోగంలోకి తేవాలని నగరప్రజలు కోరుతున్నారు. కూరగాయల రైతుల సౌకర్యార్థం నగరంలో 2000 సంవత్సరంలో సుభాష్‌నగర్, పులాంగ్ వద్ద రైతుబజార్లను నిర్మించారు. ప్రతిరోజు వివిధ గ్రామాల నుంచి వచ్చే కూరగాయల రైతులందరూ అక్కడికి వచ్చి విక్రయించుకునే వీలు కల్పించారు. మొదట్లో అన్ని సౌకర్యాలు కల్పించడంతో అక్కడ కూరగాయలు విక్రయించేందుకు రైతులు ఆసక్తి చూపారు. తర్వాత కాలంలో వాటి నిర్వహణను గాలికొదిలేశారు. కనీసం అక్కడ మరుగుదొడ్లు, మూత్రశాలలు, తదితర నిర్వహణ సక్రమంగా చేపట్టలేదు. ఇటీవల కాలంలో రైతుబజార్ల మరమ్మతు పనులకు రూ.10లక్షలు వెచ్చించారు. మరమ్మతులు, బోర్లు, మూత్రశాలలు, మరుగుదొడ్లకు ఖర్చుచేసి కొద్దో.. గొప్పో సౌకర్యాలను మెరుగుపర్చారు. శాఖల మధ్య సమన్వయలోపం.. నిత్యం సుమారు 200మంది రైతులు నిజామాబాద్ రూరల్, మోపాల్, ఇందల్వాయి, గాంధారి, మాక్లూర్, ఆర్మూర్, తదితర మండలాల నుంచి రైతులు వచ్చి నగరంలోని రోడ్లపై కూరగాయలను విక్రయిస్తారు. ఇదే అదనుగా భావించి మున్సిపాలిటీ అధికారులు రూ.20చొప్పున తైబజార్ పేరుతో వసూలు చేస్తున్నారు. రోడ్లపై కూరగాయలు విక్రయించడంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. ఈ విషయంలో శాఖల మధ్య సమన్వయ లోపం కొట్టొచ్చినట్లు కన్పిస్తోంది. మున్సిపాలిటీ వారు తైబజార్ వసూలు చేయడం, ట్రాఫిక్ పోలీసులు మామూళ్ల మత్తులో మునిగిపోవడంతో మార్కెటింగ్‌శాఖ అధికారులు ఏం చేయలేక చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నా రు. ఈక్రమంలో రైతుబజార్లలో ఎన్ని సౌకర్యాలు కల్పించినా ఫలితం లేకుండా పోతోంది. మార్కెటింగ్ అధికారులే చొరవ తీసుకోవాలి.. రైతుబజార్లను వినియోగంలోకి తీసుకొచ్చే విషయంలో మార్కెటింగ్‌శాఖ అధికారులే చొరవ తీసుకోవాలి. మున్సిపాలిటీ, మార్కెటింగ్‌శాఖ, ట్రాఫిక్ పోలీసులు సమన్వయపర్చాలి. నగరంలో ఎక్కడెక్కడ రోడ్లు, ప్రధానచౌరస్తాల్లో కూరగాయలు విక్రయిస్తున్నారో పరిశీలించి వారిని ఫులాంగ్, సుభాష్‌నగర్ వద్ద నిర్మించిన రైతుబజార్లలోకి తరలించాలి. జిల్లా మార్కెటింగ్ అధికారి నిర్లక్ష్యం వల్లే రైతుబజార్లు వృథాగా ఉంటున్నాయనే ఆరోపణలుసైతం వెల్లువెత్తుతున్నాయి. వినియోగంలోకి తేవాలి నగరంలో హోల్‌సేల్ మార్కెట్‌ను గాంధీగంజ్ నుంచి శ్రద్ధానంద్ గంజ్ ప్రాంతానికి తరలించారు. దీంతో నగర ప్రజలకు కొంత దూరభారం పెరిగింది. ఈక్రమంలో నగరంలో నిర్మించిన రైతుబజార్లను వినియోగంలోకి తెస్తే వి నియోగదారులకు మేలు జరుగుతోంది. నేరుగా రైతుల నుంచి తాజా కూరగాయలను కొనుగోలు చేయడంతోపాటు రోడ్లపై ట్రాఫిక్ అంతరాయం కలగకుండా ఉంటుంది. – యాదగిరి, కోటగల్లీ -
వీళ్లిట్టా.. వాళ్లట్టా!
నీటి తీరువా వసూలులో ఇరుశాఖల మధ్య సమన్వయలోపం రెవెన్యూ శాఖ ఖాతాలో రూ. 2 కోట్ల పన్నులు నాలుగేళ్లుగా జల వనరుల శాఖ వాటా ఇవ్వని వైనం భూములకు నీరిచ్చేది జల వనరుల శాఖ అధికారులు, పన్ను వసూలు చేయాల్సింది రెవెన్యూ శాఖ అధికారులు కావడంతో ఆ రెండు శాఖల మధ్య సమన్వయం కొరవడింది. దీంతో కాల్వలు, చెరువులకు చిన్నపాటి గండ్లు పడినా తాత్కాలిక మరమ్మతులు చేయాలన్నా నిధుల కొరత వేధిస్తోంది. కర్నూలు సిటీ: కాల్వల కింద ఆయకట్టు భూముల నుంచి నీటి తీరువా వసూలులో రెవెన్యూ, జలవనరులశాఖాధికారులు తీవ్ర నిర్లక్ష్యం వహిస్తున్నారు. ఈ విషయంలో ఈ రెండు శాఖల మధ్య సమన్వయం లేకపోవడంతో కొన్నేళ్లుగా పన్నులు వసూలు కావడం లేదు. వసూలైన సొమ్ము రెవెన్యూ శాఖ ఖాతాల్లో మూలుగుతున్నా జల వనరుల శాఖకు వాటా రావడం లేదు. ఈ పరిస్థితి దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వం పన్ను వసూలు బాధ్యత నుంచి రెవెన్యూ శాఖను తప్పించే యోచనలో ఉంది. ఇందుకు సంబంధించి గత నెల 30వ తేదీన ఆయకట్టు అభివృద్ధి సంస్థ, అపెక్స్ సభ్యులు అభిప్రాయం కోరగా జల వనరుల శాఖకు చెందిన మెజారీ ఇంజినీర్లు పన్ను వసూలు బాధ్యతను తీసుకునేందుకు సమ్మతించారు. జిల్లాలో ఇదీ పరిస్థితి.. జిల్లాలో ప్రధానంగా కేసీ, తుంగభద్ర దిగువ కాలువ, గాజులదిన్నె ప్రాజెక్టు, శివభాష్యం, ఎస్ఆర్బీసీ, తెలుగుగంగా, చిన్న నీటిపారుదల శాఖ, ఆంధ్రప్రదేశ్ ఆయకట్టు అభివృద్ధి సంస్థ పరిధిలోని ఎత్తిపోతల పథకాల కింద మొత్తం 6.29 లక్షల ఎకరాల ఆయకట్టు సాగవుతోంది. ఈ భూముల నుంచి పన్ను వసూలు బాధ్యతను ప్రభుత్వం రెవెన్యూ శాఖకు అప్పగించింది. అయితే ఈ విషయంలో ఆ శాఖాధికారుల నిర్లక్ష్యం కారణంగా పన్నులు భారీగా పెండింగ్‌లో పడిపోయాయి. ఈ క్రమంలో నిధుల వేట మొదలెట్టిన ప్రభుత్వం నీటి తీరువాపై రెవెన్యూ శాఖ నిర్లక్ష్యాన్ని గుర్తించి ఆ బాధ్యతను జల వనరుల శాఖ ఇంజనీర్లకు అప్పగించాలని సంకల్పించి వారి అభిప్రాయాలు తీసుకుంది. రూ. 21.25 కోట్ల బకాయిలు కర్నూలు, కడప జిల్లాల్లోను, తుంగభద్ర దిగువ కాల్వ, ఎస్ఆర్బీసీ, తెలుగుగంగా, గాజులదిన్నె ప్రాజెక్టు, శివభాష్యం, చెరువులు, ఎత్తిపోతల పథకాల కింద సాగయ్యే ఆయకట్టుకు సంబంధించి గతేడాది మే నెలవరకు తీసుకుంటే రూ. 21.25 కోట్ల బకాయిలున్నాయి. సాధారణంగా కాల్వల కింద సాగయ్యే పంటలకు వేరువేరుగా పన్నులు వసూలు చేస్తారు. ఎకరాకు వరి పంటకు రూ. 200, ఇరిగేటేడ్ డ్రై పంటకు రూ. 100 ప్రకారంవసూలు చేస్తారు. అభిప్రాయం తీసుకున్నారు.. ఆయకట్టుకు సంబంధించి నీటి తీరువా వసూళ్ల బాధ్యతను ఇప్పటి వరకు రెవెన్యూ అధికారులు నిర్వహించారు. ప్రస్తుతం జలవనరుల శాఖకు అప్పగించేందుకు అపెక్స్ సభ్యులు, ఉన్నతాధికారులు అభిప్రాయాన్ని సేకరించారు. అయితే చాలా మంది మన కాల్వలకు సంబంధించి పన్నులు మనమే వసూలు చేసుకుంటే బాగుంటుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. - ఎస్.చంద్రశేఖర్ రావు -
సమన్వయ లోపం.. విద్యార్థులకు శాపం..
మంచిర్యాల సిటీ : ప్రతిష్టాత్మకమైన ఐఐటీ ఇంజినీరింగ్ విద్యాసంస్థల్లో ప్రవేశించడానికి జాతీయస్థాయిలో సీబీఎస్ఈ నిర్వహించే జాయింట్ ఎంట్రెన్స్ పరీక్ష (జేఈఈ)లో సత్తా చాటాలి. జేఈఈ పరీక్షతోపాటు ఇంటర్ (ఎంపీసీ)లో సైతం విద్యార్థి తన ప్రతిభను చూపించాలి. ఈ రెండింటిలో నెగ్గడానికి ఆసక్తి ఉన్న విద్యారిక్థి ఈ సంవత్సరం కూడా తగిన వ్యవధి లేకపోవడంతో విద్యార్థులు ఆవేదన చెందుతున్నారు. ఈసారీ ఇంటర్ పరీక్షలు ముగిసే సమయానికి జేఈఈ పరీక్ష నిర్వహించే సమయానికి కేవలం ఏడు రోజుల వ్యవధి ఉండటంతో విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. 2013 మార్చిలో ఇంటర్ పరీక్షలు 6న ప్రారంభమై 23న ముగిశాయి. 14 రోజుల తేడాతో ఆఫ్‌లైన్ విధానంతో జేఈఈ మెయిన్స్ పరీక్ష ఏప్రిల్ 7న జరిగింది. 2014 మార్చిలో ఇంటర్ పరీక్షలు 12న ప్రారంభమై 26న ముగిశాయి. కేవలం పదిరోజుల తేడాతో ఆఫ్‌లైన్ విధానంతో ఏప్రిల్ 6న ఐఐటి పరీక్షను అధికారులు నిర్వహించారు. 2015 మార్చిలో ఇంటర్ పరీక్షలు తెలంగాణ రాష్ట్రంలో మార్చి 9 నుంచి 27 వరకు జరుగనున్నాయి. ఐఐటీ పరీక్ష ఆఫ్‌లైన విధానంతో ఏప్రిల్ 4న ఏడు రోజుల తేడాతో జరుగనుంది. అన్లైన్ విధానంతో ఏప్రిల్ 10, 11 తేదీల్లో పరీక్ష నిర్వహించనున్నారు. విద్యార్థుల్లో ఆందోళన.. జిల్లా నుంచి జేఈఈ పరీక్షకు ఐదువేల మంది విద్యార్థులు హాజరవుతారని అంచనా. మన విద్యార్థులకు ఆన్లైన్ విధానంపై అవగాహన, సాధన తక్కువ. ఆఫ్‌లైన్ (రాత పరీక్ష) కే విద్యార్థులు ఎక్కువగా మొగ్గు చూపుతారు. నిబంధనల ప్రకారం ఈ ఏడాది ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం పరీక్షల మార్కులను పరిగణలోకి తీసుకుని వెయిటేజీ ఇవ్వనున్నామని సీబీఎస్ఈ బోర్డు ప్రకటించింది. ఇంటర్ పరీక్షలు ముగిసే సమయానికి, జేఈఈ రాత పరీక్షకు వ్యవధి కేవలం ఏడు రోజులే ఉండటంతోపాటు విద్యార్థులు ఆందోళనకు గుర వుతున్నారు. లోపించిన సమన్వయం.. లక్షలాది రూపాయలు వెచ్చించి శిక్షణ కేంద్రాల్లో ఇంటర్‌తోపాటు ఐఐటీ ప్రవేశ పరీక్ష శిక్షణ పొందుతున్న విద్యార్థులు తక్కువ వ్యవధి ఉండటంతో మానసికంగా ఆందోళనకు గురవుతున్నారు. రాష్ట్రస్థాయి అధికారులు సీబీఎస్ఈ అధికారుల మధ్య సమన్వయ లోపంతోనే విద్యార్థులపై భారం పడుతోందనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. జేఈఈ పరీక్ష వివరాలను సీబీఎస్ఈ బోర్డు ముందుగానే ప్రకటిస్తుంది. ఆ తేదీలకు అనుగుణంగానే ఇంటర్ బోర్డు సిలబస్ పూర్తిచేయడంతోపాటు పరీక్షను నిర్వహించడానికి ప్రణాళికను సిద్ధం చేసుకోవాలి.